Jump to content

కాత్యాయని విద్మహే

వికీపీడియా నుండి
(కాత్యాయనీ విద్మహే నుండి దారిమార్పు చెందింది)
కేతవరపు కాత్యాయనీ విద్మహే
దస్త్రం:Katyani.jpg
కాత్యాయని విద్మహే
జననంకాత్యాయని విద్మహే
1955 నవంబర్ 3
ప్రకాశం జిల్లా మైలవరం (అద్దంకి)
నివాస ప్రాంతంవరంగల్లు
ఇతర పేర్లుకాత్యాయని విద్మహే
వృత్తికాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌
ప్రసిద్ధిఅభ్యుదయ రచయిత్రి.
మతంహిందూ
భార్య / భర్తవెంకటేశ్వర్లు
తండ్రిరామకోటిశాస్త్రి
తల్లిఇందిరాదేవి,
Notes
కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత

కేతవరపు కాత్యాయనీ విద్మహే అభ్యుదయ రచయిత్రి. ఈమె కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె 1955 నవంబర్ 3ప్రకాశం జిల్లా మైలవరం (అద్దంకి) గ్రామంలో కేతవరపు ఇందిరాదేవి, రామకోటిశాస్త్రి దంపతులకు జన్మించారు. ప్రముఖ సాహితీ విమర్శకులు కీ.శే. కేతవరపు రామకోటి శాస్త్రి పెద్ద కూతురు. ఆమె తండ్రి దివంగత ప్రొఫెసర్ రామకోటిశాస్త్రి ఉద్యోగరీత్యా కాకతీయ యూనివర్సిటీలోనే తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాత్యాయనీ పుట్టింది మైలవరంలోనైనా పెరిగింది.. విద్యాభ్యాసం అంతా వరంగల్‌లోనే. ఆమె మొగిలిచెర్ల (గీసుకొండ) గ్రామానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లును వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. తండ్రి మాదిరిగానే కాత్యాయని కూడా తెలుగు సాహిత్యం అభివృద్ధి చేయాలన్న దృక్పథం కలిగి ఉండేది. అందుకు అనుగునంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్ డి డిగ్రీ పొందారు. వారికి ఒక కూతురు ఉంది. 12 ఏళ్ల వయసు నుంచే సాహిత్యంపై ఆసక్తి కనబర్చారు. ప్రాథమిక విద్య వరంగల్‌లోని సుజాతరెడ్డి హైస్కూల్‌లో, ఇంటర్ పింగిళి కళాశాల, డిగ్రీ యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల, ఎం.ఏ తెలుగు కేయూలో చదువుకున్నారు. ‘చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా మిమర్శ’ అనే అంశంపై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందారు.

సాహిత్యం, ఉద్యమాలు

[మార్చు]

కేతవరపు కాత్యాయనీ విద్మహే అభ్యుదయ రచయిత్రి.కాకతీయ . ఆమె రాసిన ‘సాహిత్యాకాశంలో సగం-స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం, కథ’ అనే కథా కవిత్వం విమర్శనా గ్రంథానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు.ఈ పుస్తకాన్ని తొలి మహిళా ఉద్యమ రచయిత్రి బండారు అచ్చమాంబ, తొలి అభ్యుదయ సాహిత్యోద్యమ రచయిత్రి వట్టికొండ విశాలాక్షి, విప్లవోద్యమ కార్యచరణలో భాగమైన రంగవల్లికి అంకితం చేశారు.

కాకతీయ యూనివర్సిటీలో 1977లో అధ్యాపకురాలుగా ప్రవేశించి 1998 సంవత్సరంలో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో 1977నుంచి పరిశోధనలు మొదలుపెట్టారు.1982 నుంచి మహిళా జనజీవన దృక్పథంతో సాహిత్య విమర్శనా వ్యాసాలు రాశారు. అలంకార శాస్త్రం సాహిత్య విమర్శ నిరంతర చింతనా విషయాలు, మార్క్సిజం, స్త్రీవాద దృక్పథం, సామాజిక సిద్ధాంతాలు తదితర 285 వరకు వ్యాసాలు రాశారు. 275 పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆమె మూడున్నర దశాబ్దాలుగా కాకతీయ వర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. కాత్యాయని వద్ద 11మంది పీహెచ్‌డీ డిగ్రీలు పొందారు. ఆమె ‘తెలంగాణ సాహిత్యం-ప్రాంతీయత’, ‘తెలుగు నవలాకథానిక విమర్శ పరిణామం’, ‘ఆధునిక తెలుగుసాహిత్యం స్త్రీవాద భూమిక’ వంటి ఎన్నో రచనలు చేశారు. పులికంటి కృష్ణారెడ్డి అవార్డు, రంగవల్లి స్మారక పురస్కార తదితర అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ర్ట కార్యదర్శిగా, మానవహక్కుల వేదిక సభ్యురాలిగా ఉన్నారు. తన తండ్రి రామకోటిశాస్త్రి రాసిన సాహిత్య వ్యాసాలను 22వరకు పుస్తకాలుగా ప్రచురింపచేశారు. 1992నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది అక్టోబరు 28న తనతండ్రి వర్థంతిరోజు తప్పనిసరిగా ఒక పుస్తకాన్ని విడుదల చేస్తారు.తెలంగాణ సాహిత్యానికి సంబంధించి కాళోజీ, అల్లం రాజయ్య, పాల్కంపెల్లి శాంతాదేవి రచనలపై ఎంఫిల్ స్థాయి పరిశోధనలు, తెలంగాణ పోరాట నాటకంపై పీహెచ్‌డీ స్థాయి పరిశోధనలు కూడా చేయించారు. విప్లవ పోరాటాల ప్రభావంతో గళమెత్తిన స్త్రీల గురించి, సంప్రదాయాలను, కట్టుబాట్లను, మూఢవిశ్వాసాలను ప్రశ్నిస్తూ వివిధ రచయిత్రుల రచనలను పరిచయం చేశారు.

కాత్యాయని ఇప్పటి వరకూ 20 పుస్తకాలు రాశారు. వాటిల్లో సాహిత్యాకాశంలో సగం, స్త్రీల కవిత్వం, కథ, అస్తిత్వ చైతన్యం, తదితర పుస్తకాలు అవార్డు పొందడానికి కారణమయ్యాయి. సాహిత్యాకాశంలో సగం పుస్తకంలో సుమారు 28 మంది మహిళా రచయితల వ్యాసాలను చేర్చారు. వీటితోపాటు వివిధ పుస్తకాలు, సాహితీ ధోరణులపై వెల్లడించిన సమీక్షలు, వివిధ కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాలను ఈ పుస్తకంలో పొందు పరిచారు.

ఆమె లింగ వివక్షకు వ్యతిరేకిస్తూ రచనలు చేయడం వల్లే అందరినీ ఆకర్షించగలిగారు. కాత్యాయని ఇంకా మహిళా సాధికారత - సవాల్, ఆధునిక తెలుగు సాహిత్యం - స్త్రీల భూమిక, లింగ సమానత్వం దిశగా సమాజ సాహిత్యం, కన్యాశుల్కం - సామాజిక సంబంధాలు, జెండర్ స్పృహ తదితర పుస్తకాలు ఆమె రాశారు.

సొసైటీ ఫర్ ఉమెన్ స్టడీస్ అండ్ డెవలప్ మెంట్, ప్రజాస్వామ్య రచయితల వేదిక (మహిళా రచయిత సంఘం) ఏర్పాటు చేశారు. ఆమెకు నేషనల్ బుక్ ట్రస్ట్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.[1]

‘సాహిత్యాకాశంలో సగం’ విశిష్టత

[మార్చు]

కేంద్ర సాహిత్య అకాడమీ గెలుచుకున్న కాత్యాయని ‘సాహిత్యాకాశంలో సగం’లో 28 వ్యాసాలు ఉన్నాయి. ఇది 2010లో వెలువడింది. ‘రాజకీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో స్త్రీల సాహిత్య అధ్యయనం’, ‘ప్రాచీన సాహిత్యం- మరోచూపు’ తదితర వ్యాసాలు ఉన్నాయి. కట్టుబాట్లను ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ, విమల తదితరులు చేసిన రచనలను కాత్యాయని విశ్లేషించారు. పుస్తకాలను అర్థం చేసుకోవడానికి, పఠనానుభూతిని ఇతరులతో పంచుకోవడానికి తాను రచనలు చేశానని ఆమె బుధవారం విలేకర్లతో అన్నారు. వరంగల్ జిల్లా నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్న వారిలో కాత్యాయని రెండోవారు. జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత ‘అంపశయ్య’ నవీన్‌కు 2004లో ఈ అవార్డు వచ్చింది. [2]

తెలుగు సాహిత్యంలో విశేష కృషిచేసిన కాత్యాయని విద్మహేకి ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. తెలుగులో స్త్రీల కవిత్వం- కథ-అస్తిత్వ చైతన్యంపై కాత్యాయని రచించిన 'సాహిత్యాకాశంలో సగం' అనే వ్యాస సంకలనానికి ఈ పురస్కారం లభించింది. ఆమె వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు డిపార్ట్‌మెం ట్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. దేశంలోని 22 భాషల నుంచి రచయితలను ఈ పురస్కారానికి సాహిత్య అకాడమి డిసెంబరు 18న ఎంపిక చేసింది. ఈ సంవత్సరం ఈ పురస్కారానికి ఎంపికైనవారిలో 55 ఉర్దూ కవితల సంకలనం 'లావా' రాసిన బాలీవుడ్‌కు రచయిత జావేద్ అక్తర్, 'మిల్‌జుల్ మన్' రాసిన హిందీ నవలా రచయిత్రి మృదులా గార్గ్ ఉన్నారు. 2014 మార్చి 11న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కార గ్రహీతలను లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరిస్తారు.[3]

అవార్డులు

[మార్చు]
  • వట్టికొండ విశాలాక్షి అవార్డు
  • ఏటుకూరు బలరామమూర్తి అవార్డు
  • పులికంటి కృష్ణారెడ్డి అవార్డు
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం
  • రంగవల్లి స్మారక విశిష్టమహిళా పురస్కారం
  • ఆంధ్రప్రభుత్వ సాంస్కృతికమండలి గురుజాడ స్మారక పురస్కారం
  • రంగవల్లిస్మారక విశిష్ట మహిళా పురస్కారం.
  • 2015లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2012 (సాహిత్యాకాశంలో సగం పుస్తకానికి)[4]

రచనలు

[మార్చు]
  1. రాయప్రోలు వాఙ్మయ జీవిత సూచిక ( 1980)
  2. పంచాయితీ రాజ్యరాజకీయ నవల,
  3. వాసిరెడ్డి సీతాదేవి రాబందులు-రామచిలకలు ఒక పరిశీలన 1981
  4. బుచ్చిబాబు వాఙ్మయ జీవిత సూచిక 1983
  5. కొడవటిగంటి కుటుంబరావు వాఙ్మయ జీవిత సూచిక 1986
  6. చివరకు మిగిలేది -మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా విమర్శ 1987
  7. మహిళా జీవన సమస్యలు మూలాల అన్వేషణ 1994
  8. తెలుగు నవలా కథానికా విమర్శ పరిణామం 1995
  9. రావిశాస్త్రి శాస్త్రీయ దృక్పథం1996
  10. సంప్రదాయ సాహిత్యం స్త్రీవాద దృక్పథం 1998
  11. కన్యాశుల్కం సామాజిక సంబంధాలు 2005
  12. స్వాతంత్య్రనంతర భారతదేశం స్త్రీల స్థితిగతులు 2005
  13. ప్రాచీన భారత రాజకీయ ఆర్థిక, ప్రతిబింబించిన రచనలు మహిళా జీవితం 2005,
  14. ఆధునిక తెలుగుసాహిత్యం స్త్రీవాద భూమిక 2006
  15. జెండర్ సమానతదిశగా సమాజం సాహిత్యం 2007
  16. ప్రపంచీకరణ పరిణామాలు ప్రభావాలు మహిళల జీవితం 2007
  17. ప్రాచీణ సాహిత్యం మరోచూపు 2008
  18. సాహిత్య ఆకాశంలో సగం-స్త్రీల అస్థిత్వ సాహిత్యం కవిత్వం కథ 2010
  19. స్త్రీవాదం 2012
  20. తెలంగాణ సాహిత్యం- ప్రాంతీయత 2013[5]
  21. తెలుగునాట మహిళలు ఉద్యమం-విమర్శనాత్మక అంచనా
  22. మహిళా సాధికారత-సవాళ్ళు సమాజ సాహిత్య స్వభావాలు

మూలములు

[మార్చు]
  1. ఆంధ్రప్రభలో వ్యాసం[permanent dead link]
  2. http://www.sakshi.com/news/national/literary-award-to-kathyam-89784
  3. "కరెంట్ అఫైర్స్ | ఆంధ్రజ్యోతి". web.archive.org. Retrieved 2020-10-13.
  4. నవ తెలంగాణ, స్టోరి (16 June 2015). "ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". NavaTelangana. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.
  5. సాక్షి 19.12.2013[permanent dead link]