తెరచీరల పటం కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెరచీరల పటం కథ యాదవ పురాణాన్ని చెప్పేందుకు ఏర్పడిన జానపద కళా ప్రక్రియ. వృత్తి పురాణాల్లో ఉన్న 15 పటం కథల్లో తెరచీరల పటం కథ ప్రత్యేకమైనది. ఇది యాదవ వంశంలో పుట్టిన చారిత్రక వీరుడు కాటమరాజు గురించి తెలిపే కథ. యాదవ కళాకారులు యాదవ వంశాన్ని కీర్తిస్తూ కృష్ణలీలలు ఇతివృత్తంతో గానం చేస్తారు. ఈ కళాకారూపం 19వ శతాబ్ది నాటికి ఏర్పడినదని తెలుస్తుంది. ఈ కళకారులని తెరచీర భక్తులని, యాదవపటం కథాకారులని పిలుస్తుంటారు.[1]

తెరచీరల పటం కథ

తెరచీరల చరిత్ర[మార్చు]

తెరచీరల కళాకారులు స్థిరమందుల వంశానికి చెందిన వారని తెలుస్తుంది. చారిత్రక ఆధారాలను బట్టి వీరు యయాతి, దేవయానికి కలిగిన సంతానం అని చెప్పవచ్చు. పల్లవ రాజులకు ప్రధానులుగా పనిచేసిన వీరు, కాటమరాజు కాలం వచ్చేసరికి పల్లవుల వారసులుగానే ప్రసిద్ధిపొందారు. పూజా గొల్లల్నే తెరచీరల కథాగానం చేసే స్థిరమందుల వంశం వారుగా పేర్కొంటారు.

తెరచీరల కళాప్రదర్శన[మార్చు]

కాటమరాజు కథా వృత్తాంతాల్ని పెద్ద గుడ్డ మీద బొమ్మల రూపంలో అతికించి చిత్రపటం తయారు చేస్తారు. యాదవుల కథ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ తెర చీరల పటంను గోడకు కట్టి కథను చెపుతారు. దానికనుగుణంగా వేప చెక్కతో, ఇత్తడితో చేసిన వీరణములు, ఇత్తడితో వంకరగా పొడుగు గొట్టాల కొమ్ములు, తాళాలు, డోలక్ లను దీనికి సహకార వాయిద్యాలుగా ఉపయోగిస్తారు. ఆరుగురు కళాకారులు ఒక బృందంగా ఏర్పడి ఊరురా తిరుగుతూ తెరచీరల పటాల ద్వారా పురాణాన్ని చెపుతారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ తెరచీరల కళాకారులు ఉన్నారు. వీరంతా యాదవుల కుల దైవమైన గంగాదేవి కథ, కృష్ణలీలలతో సహ కాటమరాజు కథను గానం చేస్తుంటారు.

కథాంశం[మార్చు]

జానపద కళారూపాల్లో ఎక్కువశాతం కృష్ణలీలలు కథాంశంతోనే ఉంటాయి. ద్వాపరయుగములో కృష్ణావతారం తరువాత, 16వ అవతారంగా కాటమరాజుగా జన్మించాడని యాదవుల ప్రగాఢ విశ్వాసం. ఈ తెరచీరల కథలో అవతార తత్వాన్ని వివరిస్తూ కృష్ణలీలలను, చిలిపి చేష్ఠలను కళ్ళకు కట్టినట్టు చెబుతారు.

మూలాలు[మార్చు]

  1. తెరచీరల పటం కత, పటం కథలు, నేతి మాధవి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, డిసెంబర్ 2017, పుట. 139.