పకిడె అరవింద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పకిడె అరవింద్
FB IMG 1552590341004.jpg
పకిడె అరవింద్ చిత్రం
జననంమార్చి 15, 1995
కంచ‌న‌ప‌ల్లి, రఘునాథపల్లి మండలం, జనగామ జిల్లా, తెలంగాణ
ప్రసిద్ధులుయువ చరిత్రకారుడు
మతంహిందూ
తల్లిదండ్రులు
 • సత్యనారాయణ (తండ్రి)
 • లీల (తల్లి)
బంధువులుఆదిత్య పకిడే (సోదరుడు)

ప‌కిడే అర‌వింద్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ యువ చరిత్రకారుడు.[1][2][3]

బాల్యం మరియు విద్యాభ్యాసం[మార్చు]

అరవింద్ స్వస్థలం జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలానికి చెందిన కంచ‌న‌ప‌ల్లి అనే మారుమూల గ్రామం.[4] మార్చి 15, 1995లో లీల, సత్యనారాయణ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయదారులు. అరవింద్ కు ఒక తమ్ముడున్నాడు. వారిది సాధారణ మధ్య తరగతి కుటుంబం.

అర‌వింద్ బాల్యమంతా కంచనపల్లిలోనే గడిచింది. కంచనపల్లిలోని జేసుతిరు హృదయ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి దాకా చదివాడు. ఐదవ తరగతి చదువుతున్న కాలంలో పద్మ మేడం, అల్లం అనిల్ రెడ్డి సార్ ల సోషల్ స్టడీస్ బోధన వల్ల అరవింద్ కు సోషల్ సబ్జెక్ట్ మీద ఇష్టం, ఆసక్తి ఏర్పడ్డాయి. ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పటి నుండి గ్రంథాలయానికి వెళ్ళడం, పుస్తకాలు బాగా చదవటం అతనికి అలవాటయ్యింది. 2005 నుండి పత్రికా పఠనం కూడా అలవడింది.

పదవ తరగతి తర్వాత హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కాలేజిలో ఎం. పి.సి. కోర్సులో చేరాడు. అరవింద్ కు చిన్న‌ప్ప‌టి నుంచి పురాత‌న క‌ట్ట‌డాలు, చారిత్ర‌క ప్ర‌దేశాలు అంటే ఎంత‌గానో ఇష్టం. ఈ క్ర‌మంలోనే అర‌వింద్ ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతున్న‌ కాలంలో వరంగల్ జిల్లాలోని చారిత్రక ప్రాంతాల‌కు తరచుగా వెళ్తూ ఉండేవాడు. దీంతో వాటిపై అత‌నికి ఇంకా ఆస‌క్తి క‌లిగింది. ఆ ఆసక్తే తర్వాత తర్వాత పరిశోధనగా మారింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పురాత‌న క‌ట్ట‌డాలు, చారిత్ర‌క ప్ర‌దేశాల గురించి తెలుసుకోవ‌డం మొద‌లు పెట్టాడు.

ఇంటర్మీడియట్ తర్వాత అరవింద్ డిగ్రీ చేయదలచి హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బి.ఎ. (జర్నలిజం) కోర్సులో చేరాడు. ఆ కోర్సులో జర్నలిజం మెళకువలు నేర్చుకుని తన పరిశోధనలను ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా జనప్రాచుర్యంలోకి తీసురావడం మొదలుపెట్టాడు.

చరిత్రకారుడిగా చేసిన కృషి[మార్చు]

వ‌రంగల్‌లో ఉన్న అత్యంత పురాత‌న చారిత్రక ప్రదేశాల గురించి తెలిసిన అతి త‌క్కువ మందిలో అర‌వింద్ ఒక‌డు. ప్రాచీన దేవాలయాలు, చెరువులను సందర్శించి అక్కడ లభించిన శాసనాలను గమనించాడు, విలువైన సమాచారాన్ని సేకరించాడు. అప్పటి నుండే పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు అరవింద్‌కు పరిచయమయ్యారు. తన పరిశోధనా క్రమంలోనే క్రమక్రమంగా అర‌వింద్ జనప్రాచుర్యంలో లేని100కు పైగా పురాతన క‌ట్ట‌డాల‌ను, చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను గుర్తించాడు.[5] అర‌వింద్ అలా చారిత్ర‌క క‌ట్ట‌డాలు, ప్ర‌దేశాల‌ను గుర్తించేందుకు ఎన్నోపుస్తకాల, కొంత మంది ఆర్కియాల‌జిస్టుల మరియు ఇంటర్నెట్ సహాయం తీసుకునేవాడు.

జ‌య‌శంక‌ర్ జిల్లా మంగ‌పేట మండ‌లం మ‌ల్లూరు కొండ‌ప్రాంతంలో అర‌వింద్ 8 కిలోమీట‌ర్ల పొడవున్న ఓ పురాత‌న గోడ‌ను కూడా క‌నుగొన్నాడు. 2016లో వరంగల్ అర్బన్ జిల్లాలోని శివనగర్ ప్రాంతంలో మరుగున పడిపోయిన ఓ కాకతీయుల కాలంనాటి అంతస్తుల మెట్లబావిని గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చాడు. అరవింద్‌ కృషిని చూసి జిల్లా కలెక్టర్‌ కాట ఆమ్రపాలి సహకారాన్ని అందించారు. ఆ సహకారంతో ఆ బావిని పునరుద్ధరించి, పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడంలో విశేష కృషిచేసాడు. వరంగల్‌ ప్రాంతంలో ఏడు కోటలు ఉన్నాయనే విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాడు.ఇలాంటి క‌ట్ట‌డాలు, ప్ర‌దేశాలు ఇంకా ఎన్నింటినో అర‌వింద్ గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చాడు.[6]

తన పరిశోధనల నిమిత్తం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 573 ప్రదేశాల్లో అనేక పర్యాయాలు పర్యటించాడు అరవింద్. ముఖ్యంగా వరంగల్ గ్రామీణ జిల్లా, వరంగల్ (పట్టణ) జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జనగామ జిల్లా , మహబూబాబాదు జిల్లా, కరీంనగర్ జిల్లా , నల్లగొండ జిల్లా, యాదాద్రి జిల్లా , ఖమ్మం జిల్లా మొదలగు జిల్లాల్లో అతని పరిశోధనలు విరివిగా కొనసాగాయి. వరంగల్ ప్రాంత వాసి కావడం, ఎక్కువగా కాకతీయులకు సంబంధించిన చరిత్రను అధ్యయనం చేసిన వ్యక్తి కావడం మూలంగా ఎక్కువగా కాకతీయులు ఏలిన ప్రాంతాల్లో పర్యటించి కాకతీయుల కట్టడాలను, చారిత్రక విశేషాలను వెలుగులోకి తీసుకొచ్చాడు అరవింద్.[7]

పాల్గొన్న ప్రముఖ కార్యక్రమాలు[మార్చు]

వరంగల్ సందర్శిని అనే శీర్షికతో వరంగల్ ఆకాశవాణి కేంద్రం నుండి 15 కి పైగా రేడియో ప్రసంగాలు చేసాడు అరవింద్. అలాగే 93.5 RED F.M. వరంగల్ కేంద్రం వారు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తన అనుభవాలతో పాటు చారిత్రక అంశాలను వెల్లడిస్తూ ఇంటర్వ్యూ ఇచ్చాడు. 2017లో T-SAT టీవీ ఛానల్ Interaction With Young Historian శీర్షికతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని చారిత్రక అంశాలను వెల్లడిస్తూ, తన పరిశోధనా యాత్రలోని అనుభవాలను, అనుభూతులను పంచుకుంటూ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

అనేకచోట్ల తెలంగాణ పురావస్తు శాఖ, పర్యాటక శాఖలు నిర్వహించిన సెమినార్ లలో వక్తగా పాల్గొన్నాడు. అంతేకాకుండా అనేక స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరాలు, వన సంరక్షణ, బుక్ ఫెయిర్, ఉచిత పుస్తకాల పంపిణీ మొదలగు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు.

రాసి ప్రచురించిన ప్రధాన వ్యాసాలు[మార్చు]

వివిధ పత్రికలలో కూడా అతను రాసిన పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వాటిలో నమస్తే తెలంగాణ బతుకమ్మ సంచికలో ప్రచురితమైన కొండపర్తి గ్రామ చారిత్రక కథనం, సాక్షి దినపత్రికలో ప్రచురితమైన భూపాలపల్లి జిల్లా ప్రాంతాల్లోని డాల్మన్ సమాధుల గురించిన కథనం ప్రముఖుల ప్రశంసలందుకున్నాయి. అంతేకాకుండా అతను 'వరంగల్ ముచ్చట' పేరుతో స్వీయ వెబ్సైట్ ను నిర్వహిస్తూ ఇప్పటివరకు దాదాపు 220కి పైగా కథనాలను ప్రచురించాడు. వాటిలో మహనీయులు, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం మొదలగు అంశాలకు సంబంధించిన 300 కథనాలున్నాయి.

నిర్వహించిన ప్రముఖ ప్రాజెక్టులు[మార్చు]

 1. వరంగల్ అంటే 'ఆలయాల నగరం (City of Temples)' అని, కాకతీయులంటే 'నీళ్ళకు నడకలు నేర్పినవారు' అని భావించే అరవింద్ వరంగల్ అర్బన్ జిల్లాలో మరుగున పడిపోయిన కాకతీయుల కాలంనాటి 50 ఆలయాలు/మెట్లబావులను గుర్తించి, అనేక పర్యాయాలు ఆయా ప్రదేశాలను సందర్శించి వాటి పునరుద్ధరణకు అయ్యే ఖర్చులు, అవసరమైన పర్యాటక సౌకర్యాల వివరాలతో ఒక నివేదిక రూపొందించి అధికారులకు అందజేశాడు.
 2. 2019 ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ రవింద్రభారతిలోని ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ రాష్ట్రంలోని మరుగున పడిపోయిన చారిత్రక కట్టడాల , ప్రాంతాల ఛాయాచిత్రాలతో The Untold Telangana అనే ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాడు.[8][9]
 3. మార్చి నెలలో వరంగల్ హరిత కాకతీయ హోటల్ లో 3 రోజుల పాటు జరిగిన తెలంగాణ ఫోటోగ్రఫీ అకాడమీ కన్వెన్షన్ లో ఛాయాచిత్రప్రదర్శన నిర్వహించాడు.

రాసిన పుస్తకాలు[మార్చు]

మనకు తెలియని తెలంగాణ పుస్తక ముఖపత్రం
మనకు తెలియని తెలంగాణ పుస్తక ఆవిష్కరణ దృశ్యం

ఇప్పటివరకు తెలంగాణలో వెలుగుచూడని శాసనాలు, వేల ఏండ్లనాటి సాంప్రదాయాలను మొదలగు వినూత్న అంశాలను తెలుపుతూ "మనకు తెలియని తెలంగాణ" పేరుతో ఒక పుస్తకం రాసాడు.[10] మామిడి హరికృష్ణ ప్రోత్సాహసహకారాలతో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ఈ పుస్తకం 2019, మే 20న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి (ఐఏఎస్) చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.[11][12]

రాణిస్తున్న రంగాలు[మార్చు]

 • చరిత్ర పరిశోధనా రంగం
 • పాత్రికేయ రంగం
 • ఛాయాచిత్రగ్రాహణ రంగం
 • పర్యావరణ పరిరక్షణా రంగం
 • సామాజిక సేవా రంగం

నిర్వహిస్తున్న పదవులు[మార్చు]

 • సేవా టూరిజం కల్చరల్ సొసైటీ కన్వీనర్ 
 • వనసేవ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు
 • కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు
 • జన విజ్ఞాన వేదిక సభ్యుడు
 • Negetive Blood Donar Association సభ్యుడు

అందుకున్నపురస్కారాలు/ పొందిన సన్మానాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. వెబ్ ఆర్కైవ్, ఈనాడు, వరంగల్ (27 September 2018). "ఆసక్తి చూపిన మార్గం". మూలం నుండి 27 September 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 27 September 2018. Cite news requires |newspaper= (help)
 2. ఆంధ్రజ్యోతి, యువ (28 February 2018). "చదువుతూ.. చరిత్రను అన్వేషిస్తూ." Retrieved 28 February 2018. Cite news requires |newspaper= (help)
 3. ఇండియన్ ఎక్స్ ప్రెస్. "Digging into Warangal's Past". Retrieved 19 August 2017. Cite news requires |newspaper= (help)
 4. ప్రజాశక్తి. "ఈ సంచారి చరిత్రకారుడే!". Retrieved 19 August 2017. Cite news requires |newspaper= (help)
 5. telugu.ap2tg.com. "ఆ యువ‌కుడు తెలంగాణ రాష్ట్రంలో 100కు పైగా పురాత‌న క‌ట్ట‌డాలు, చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను గుర్తించాడు తెలుసా..?". Retrieved 19 August 2017. Cite web requires |website= (help)
 6. ఈనాడు, వరంగల్ అర్బన్ (5 February 2019). "చరిత్ర తిరగరాస్తున్నాడు". www.eenadu.net (ఆంగ్లం లో). మూలం నుండి 10 November 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 10 November 2019.
 7. తెలంగాణ టుడే. "A protector of the monuments". Retrieved 19 August 2017. Cite news requires |newspaper= (help)
 8. సాక్షి, ఫ్యామిలీ (3 April 2019). "ఈ గైడ్‌ ఫీజ్‌ అడగడు". గజవెల్లి షణ్ముఖరాజు (సాక్షి, వరంగల్‌ రూరల్‌). మూలం నుండి 3 April 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 3 April 2019. Cite news requires |newspaper= (help)
 9. వి6 వెలుగు, తెలంగాణం (6 February 2019). "తెలంగాణ చారిత్రక సంపద: ఆకట్టుకుంటున్న ఫొటో ఎగ్జిబిషన్". V6 Velugu. మూలం నుండి 8 February 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 10 November 2019.
 10. తెలుగు వెలుగు, ముఖాముఖి. "అందుకే ఆ పుస్తకం రాశా!". www.teluguvelugu.in. గుండు పాండురంగ‌శ‌ర్మ‌. మూలం నుండి 10 November 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 10 November 2019.
 11. ఆంధ్రజ్యోతి, సాహిత్యవార్తలు (20 May 2019). "'మనకు తెలియని తెలంగాణ' ఆవిష్కరణ". lit.andhrajyothy.com. మూలం నుండి 10 November 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 10 November 2019.
 12. Telangana Today, Telangana (21 May 2019). "Exploring the obscure Telangana". Telangana Today. Madhuri Dasagrandhi. మూలం నుండి 10 November 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 10 November 2019.

ఇతర లింకులు[మార్చు]