పిట్టమండలం వెంకటాచలపతి
పి.వి.పతి గా ప్రసిద్దుడైన పిట్టమండలం వెంకటాచలపతి భారతదేశపు తొలి డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత.సీతాపతి తండ్రి గారి కాలంలో నెల్లూరు నుండి మద్రాసుకు వెళ్లారు. ఆయన తాతగారు నెల్లూరు లో ఒక ఫాటోస్టూడియో నిర్వహించారని నెల్లూరులో సుప్రసిద్ధ స్థానిక చరిత్ర కారులు, బహుగ్రంథకర్త నేలనూతల శ్రీ కృష్ణమూర్తి గారు తెలియజేశారు.[1]
బాల్యం
[మార్చు]ఇతడు మద్రాసులో 1906, జూన్ నెలలో 1వ తేదీన ఒక సంపన్న తెలుగు కుటుంబంలో జన్మించాడు[2]. తండ్రి కృష్ణశర్మ గ్రామఫోన్ కంపెనీలో పనిచేసేవాడు. తల్లి సుబ్బాయమ్మ చిత్రకళా నిపుణురాలు. ఆమె అనేక లలితకళ ప్రదర్శనలు ఏర్పాటు చేసి తనయుని కూడా ఆయా ప్రదర్శనలకు వెంట తీసుకుని పోయేది. ఆమె చిత్ర ప్రదర్శనం పి.వి.పతి లేత మనసులో లలితకళా బీజాలు నాటింది. ఆమె తన కుమారునికి కాళిదాసు శాకుంతలం మొదలయిన నాటకాలను చిత్రాలుగా మలచి బోధించేది. చిన్నతనం నుండి ఇతడు పెరిగిన వాతావరణం ఇతడిని కళారాధకుడిగా మార్చివేసింది. లలిత కళలను ధ్యానం చేస్తూ ఇతడు స్కూలు ఫైనలు గట్టెక్కాడు. ఇంటర్మీడియట్ కొరకు పచ్చయప్ప కళాశాలలో చేరాడు. కాని ఇతనికి మామూలు చదువు మీద విరక్తి పరాకాష్ఠకు చేరి ఒక ఏడాది మాత్రం ఆ కళాశాలలో చదువగలిగాడు. ఇతని తండ్రి ఇతని అభిరుచిని కనిపెట్టి వెంటనే చలన చిత్ర కళలో శిక్షణ పొందడానికి బొంబాయికి పంపాడు.
శిక్షణ
[మార్చు]1929, జూలైలో బొంబాయికి వెళ్లిన ఇతడు తిన్నగా పారిస్ చేరుకుని అక్కడ స్కూల్ ఆఫ్ సినిమాటోగ్రఫీలో చేరాడు. అక్కడ సినిమాటోగ్రఫీలో పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం లేబరేటరీ టెక్నిక్, ఫిలిమ్ ప్రాసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్ విభాగాలలో శిక్షణ పూర్తి చేశాడు. వెస్టరన్ ఎలెక్ట్రిక్ రికార్డింగ్ సిస్టమ్‌లో ఒక సంవత్సరం శిక్షణ పొందాడు. ఈ శిక్షణా సమయంలో తరచూ డాక్యుమెంటరీ చిత్రాలు, విద్యాప్రబోధక చిత్రాలు ప్రదర్శింపబడుతూ ఉండేవి. వాటి ప్రభావం ఇతని భావనాసరణిపై బాగా ప్రసరించింది. వాస్తవిక జగత్తును సెల్యులాయిడ్‌లో శాశ్వతరూపమిచ్చినట్టయితే ఇప్పటి వారికి అది విజ్ఞానదాయకం, భావితరాలవారికి అది చారిత్రక ఆధారం కాగలదని క్రమంగా విశ్వసించాడు. సర్బోన్ యూనివర్సిటీనుండి డాక్టర్ ఆఫ్ లెటర్స్ పట్టాను పొందాడు.
వివాహం
[మార్చు]ఇతడు 1934లో తన సహవిద్యార్థిని ఫేనీ అలాంచిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మార్క్, ఫ్రాంకోయిస్ అనే ఇద్దరు కుమారులు కలిగారు.
వృత్తి
[మార్చు]1935లో హోరెన్ ఆస్టన్ అనే ఫ్రెంచి దర్శకుడు సహారా ఎడారిపై గొప్ప డాక్యుమెంటరీ చిత్రం నిర్మించ సంకల్పించి పి.వి.పతిని అసిస్టెంటు కెమెరామాన్‌గా నియమించుకున్నాడు. ఇద్దరూ ఉత్తర ఆఫ్రికాలోని అల్జీరియాకు పయనమయ్యారు. సహారా ఎడారిలో ఎండలను, సుడిగాడ్పులను, ధూళి దుమారాన్ని లెక్కచేయక ఉభయులూ ప్రకృతి శోభను సెల్యులాయిడ్‌లో బంధించారు. ఒక సంసారానికి సరిపోయే సరంజామాతో గాడిదలపై అప్పుడు చేసిన విహారం ఇతని జీవితంలో మరపురానిదయ్యింది. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే తన జీవితాన్ని డాక్యుమెంటరీ చిత్రాలకు అంకితం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
అమెరికాలోని యూనివర్సల్ న్యూస్ కార్పొరేషన్ వారు ఇతడిని క్వెట్టా భూకంప దృశ్యాలను ఫిల్ముగా తీయవలసిందిగా ఇతడిని కోరారు. ఇతడు క్వెట్టాకు విమానంలో వెళ్ళి ఆ దృశ్యాలను చిత్రించాడు. యూనివర్సల్ న్యూస్‌లో భాగంగా ప్రపంచమంతా ఆ దృశ్యాలు ప్రదర్శించబడ్డాయి. ఇతడి కెమరాయే దేశవిదేశాలకు క్వెట్టా ఆర్తనాదం వినిపింప చేసింది.
తొలి భారతీయ డాక్యుమెంటరీ చిత్రం
[మార్చు]1936లో భారతీయ చలనచిత్ర చరిత్రలో నూతనశకానికి ఇతడు నాందీవాచకం పలికాడు.ఇతడు ఆ సంవత్సరం “ది ఇండియన్ కాటన్” అనే చిత్రాన్ని నిర్మించాడు. పత్తివిత్తు నాటింది మొదలు బట్టలబేళ్లు బిగించేవరకుగల వందలాది ఘట్టాలను అక్కడక్కడ గ్రాఫులతో, పటాలతో మరింత ఆకర్షణీయం చేస్తూ పొందికగా 1,000 అడుగులతో ఈ చిత్రాన్ని పూర్తిచేశాడు. ఫ్రాన్సుకు రైలు మార్గాలు, బ్రిటన్‌కు మత్స్య పరిశ్రమ, అమెరికాకు విజ్ఞాన పరిశోధన, సోవియట్ రష్యాకు అక్టోబర్ విప్లవం తొలి డాక్యుమెంటరీలయితే భారతదేశానికి ప్రత్తిపంట మొట్టమొదటి విద్యాప్రభోదక చిత్రం అయ్యింది.
మొట్టమొదటి భారతీయ టాకీ డాక్యుమెంటరీ చిత్రం
[మార్చు]1938లో ఇతడు భారతదేశపు మొట్టమొదటి టాకీ వార్తా చిత్రాన్ని నిర్మించాడు. “హరిపుర కాంగ్రెస్” అనే చిత్రానికి ఈ ఘనత లభించింది. 52 ఎడ్ల జతల రథంపై రాష్ట్రపతి ఊరేగింపు దృశ్యాన్ని, లక్షలాది ప్రేక్షకులు పాల్గొన్న మహాసభ దృశ్యాలను టాప్ షాట్స్, లాంగ్ షాట్స్‌లలో మనోజ్ఞంగా చిత్రించాడు. అంతటి సమూహంలోను ఇతడి కెమెరా సుభాష్ చంద్రబోస్ను క్లోజప్‌లో క్యాచ్ చేసింది. మహాసభలో సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధి ఉపన్యాసాలను రికార్డు చేశాడు. ఈ చిత్రం విడుదల అనంతరం తెరపై నాయకులు ప్రసంగించడం మొదటిసారిగా విన్న ప్రజానీకం ఆనందానికి అవధులు లేకపోయింది.
మహాత్మాగాంధీ
[మార్చు]పి.వి.పతి దేశానికే కాక సమస్త ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక “గాంధీజీ జీవితచరిత్ర”. ఇతడు 1937 నుండి మహాత్మా గాంధీకి సన్నిహిత సహచరుడైనాడు. గాంధీ పూర్వ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను, వస్తు విశేషాలను సేకరిస్తూ వచ్చాడు. బాపూజీ నడిపిన మహోద్యమాలనే కాకుండా, ఆయన పాల్గొన్న ప్రతికార్యక్రమాన్నీ ఫిల్ము తీయడం ప్రారంభించాడు. ఈ విధంగా ఐదేండ్లు నిర్విరామంగా పరిశ్రమించి సేకరించిన భాగాలను పొందికగా 12 రీళ్లలో కూర్చి మహాత్మాగాంధీ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేశాడు. రెండింటికీ ఇతడే దర్శకుడు. 1948లో ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేశాడు.
డాక్యుమెంటరీ దిగ్గజం
[మార్చు]పి.వి.పతి ఖాతాలోనికి అనేక రికార్డులు చేరతాయి. విదేశాలలో డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించిన తొలి తెలుగు వ్యక్తి ఇతడు. తొలి భారతీయుడు కూడా ఇతడే. కామెడీ ఇన్ ప్యారిస్ అనే 1000 అడుగుల డాక్యుమెంటరీ చిత్రానికి ఈ ఘనత లభించింది. ఇతడు తీసిన అన్ని డాక్యుమెంటరీ సినిమాలకు ఇతడే కథ, స్క్రిప్టులను సమకూర్చుకుంటాడు. యమునా నదీతీరం, కుర్వాండ్ రోడ్, బికనీర్ స్వర్ణోత్సవాలు మొదలైన అనేక డాక్యుమెంటరీ చిత్రాలు ఇతని ప్రతిభకు తార్కాణాలు. తన చిత్రాలకే కాక బొంబాయిలోని ఒక డాక్యుమెంటరీ యూనిట్‌కు భారతీయ నృత్యాలు, పానపిశాచి అనే చిత్రాలకు స్క్రిప్టును అందించాడు. గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన రైతుబిడ్డ చిత్రంలోని కొన్ని ప్రకృతి దృశ్యాలనూ, సూర్యకుమారి పాల్గొన్న ఘట్టాలనూ ఇతడు రంగుల్లో చిత్రించాడు.డూఫే కలర్‌లో ఆ దృశ్యాలను తీశాడు. ఆ విధంగా తెలుగులో రంగుల్లో సినిమాను తొలిసారిగా చిత్రీకరించిన ఘనత కూడా పి.వి.పతికే దక్కుతుంది[3].
ప్రవృత్తి
[మార్చు]సినిమా రంగంలోనే కాక సాహితీ రంగంలో కూడా ఇతనిది అందె వేసిన చెయ్యి. పత్రికా రచనలో ముఖ్యంగా పిక్టోరియల్ జర్నలిజంలో ఇతడు ప్రతిభావంతుడు. పిక్చర్స్ అండ్ పెన్ పిక్చర్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల ఉద్గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం తమిళంలోనికి అనువదించబడింది. ఆంధ్రుల సమగ్ర చరిత్రను కూడా వర్ణచిత్రాలతో ఒక గ్రంథ రూపంలో తీసుకువచ్చాడు. భారతదేశంలోని ప్రముఖ పత్రికలే కాక లండన్ టైమ్స్ వంటి పత్రికలలోను, అనేక ఫ్రెంచి పత్రికలలోను ఇతడు వ్రాసిన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఇతడు వ్రాసిన చిత్రపటాధార చరిత్రలు బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, మద్రాసు, అలహాబాదు నగరాలనుండి వెలువడే ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]డాక్యుమెంటరీ | సంవత్సరం | నిర్మాత | దర్శకుడు | కెమెరామాన్ | ఎడిటర్ | స్క్రిప్ట్ రైటర్ | వ్యాఖ్యాత | సాంకేతిక సలహాదారుడు |
---|---|---|---|---|---|---|---|---|
ప్యారిస్ బై నైట్ | 1934 | |||||||
కలోనియల్ ఎక్స్‌పొజిషన్, ప్యారిస్ | 1934 | |||||||
హోమ్ ఫ్రంట్ | 1943 | |||||||
ద గోల్డన్ గ్రెయిన్ ఆఫ్ భరత్‌ఖండ్ | 1942 | |||||||
అలాంగ్ ద జమున | 1946 | |||||||
ద గోల్డన్ రివర్ | 1954 | |||||||
బేసస్ ఆఫ్ ప్రోగ్రెస్ | 1958 | |||||||
అర్త్ అండ్ వాటర్ | 1956 | |||||||
షిప్ యార్డ్స్ టు సీ వేస్ | 1957 | |||||||
పెన్ టు పీపుల్ | 1960 | |||||||
ఇండియన్ స్క్రీన్ గెజిట్ - 6 భాగాలు | ||||||||
హి ఈజ్ ఇన్ ద నేవీ | 1940 | |||||||
ది ప్లేన్స్ ఆఫ్ హిందుస్తాన్ | 1940 | |||||||
ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ | 1941 | |||||||
ది ఇటావా స్టోరీ | 1956 | |||||||
సహారా ఎడారిపై తీసిన డాక్యుమెంటరీ | 1935 | |||||||
క్వెట్టా భాకంపంపై తీసిన డాక్యుమెంటరీ | 1935 | |||||||
మైసూరు యువరాజు జయచామరాజ ఒడయార్ వివాహం | 1937 | |||||||
వైస్రాయ్ ఆఫ్ ఇండియా కుమార్తె వివాహం | 1938 | |||||||
హరిపుర కాంగ్రెస్ మహాసభలు | 1938 | |||||||
మహారాజా ఆఫ్ బికనీర్ స్వర్ణోత్సవాలు | 1937 | |||||||
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జయపూర్ మహాసభలు | ||||||||
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (ఆగస్టు 14-15, 1947 న్యూఢిల్లీ) | 1947 | |||||||
ఇండియాస్ స్ట్రగుల్ ఫల్ నేషనల్ షిప్పింగ్ | 1947 | |||||||
మదర్ | 1947 | |||||||
ఛైల్డ్ | 1948 | |||||||
కమ్యూనిటీ | 1948 | |||||||
కుర్వాండీరోడ్ | 1949 | |||||||
రిథమ్ ఆఫ్ ఇండియా | 1956 | |||||||
బుర్రకథ (ఈస్ట్‌మన్ కలర్‌లో) | 1958 | |||||||
లుక్ టు ద స్కై | 1958 | |||||||
ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీ పై డాక్యుమెంటరీ | 1961 | |||||||
ది సాగా ఆఫ్ బెలాపూర్ షుగర్ | 1938 | |||||||
రోడ్ టు అంబత్తూర్ (డన్‌లప్ టైర్ ఫ్యాక్టరీ గురించి) | ||||||||
హాస్యమాల (తమిళ సినిమా) | ||||||||
ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మాగాంధీ | 1941 | |||||||
అరబిందో ఆశ్రమ్ | ||||||||
దిస్ వే ద వాటర్ కమ్స్ | ||||||||
మారనర్ నంబి | ||||||||
నాన్ ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీ | ||||||||
ది ఇండియన్ కాటన్ | 1936 | |||||||
రైతుబిడ్డ | 1939 |
చిత్రమాలిక
[మార్చు]మరణం
[మార్చు]ఇతడు 1961, జూన్ 4వ తేదీ మరణించాడు.
ఇవి కూడా చదవండి
[మార్చు]- ఆంధ్రప్రభ దినపత్రిక 15-10-1950 సంచికలో పి.వి.పతి వ్రాసిన భరతావనిని సస్యశ్యామలం చేస్తున్న నదీనదాలు సచిత్ర వ్యాసం[4]
- ఆంధ్రప్రభ దినపత్రిక 22-10-1950 సంచికలో పి.వి.పతి వ్రాసిన ఖగోళ శాస్త్ర పరిశోధనలో జయసింగ్ పొందిన క్రియాసిద్ధులు సచిత్ర వ్యాసం[5]
- ఆంధ్రప్రభ దినపత్రిక 29-10-1950 సంచికలో పి.వి.పతి వ్రాసిన చరిత్రగర్భంలో మరుగునపడుతున్న తోలుబొమ్మలాటల వైచిత్ర్యం సచిత్రవ్యాసం[6]
మూలాలు
[మార్చు]- ↑ Jag Mohan (1972). Dr.P.V.Pathy (1 ed.). Pune: National Film Archive of India.
- ↑ సుబ్బారావు (1950-11-01). "డాక్టర్ పి.వి.పతి ఇండియాలో "డాక్యుమెంటరీ" నిర్మాత". కిన్నెర. 2 (10): 77–80. Archived from the original on 2016-03-05. Retrieved 20 March 2015.
- ↑ రెంటాల, జయదేవ (2014-08-24). "రైతుబిడ్డకు 75ఏళ్లు.. అభ్యుదయ శంఖారావం". సాక్షి ఫన్‌డే. Retrieved 20 March 2015.
- ↑ పి.వి.పతి (1950-10-15). "భరతావనిని సస్యశ్యామలం చేస్తున్న నదీనదాలు". ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధం. 12 (41): 3, 12. Archived from the original on 2016-03-05. Retrieved 20 March 2015.
- ↑ పి.వి.పతి (1950-10-22). "ఖగోళ శాస్త్ర పరిశోధనలో జయసింగ్ పొందిన క్రియాసిద్ధులు". ఆంధ్రప్రభ దినపత్రిక. No. 42 సంపుటి 12. Retrieved 20 March 2015.[permanent dead link]
- ↑ పి.వి.పతి (1950-10-29). "చరిత్రగర్భంలో మరుగునపడుతున్న తోలుబొమ్మలాటల వైచిత్ర్యం". ఆంధ్రప్రభ దినపత్రిక. No. 43, సంపుటి -12. Retrieved 20 March 2015.[permanent dead link]