Jump to content

ఆస్తానయె మగ్దూమె ఇలాహి

వికీపీడియా నుండి
(పెద్ద దర్గా నుండి దారిమార్పు చెందింది)
అమీన్ పీర్ దర్గా, కడప
ఆస్తానయె మగ్హూమ్ ఇలాహి, కడప

ఆస్తానయె మగ్దూమె ఇలాహి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్‌ఆర్ జిల్లా, కడప నగరంలో నకాష్ వీధి సమీపంలో గల దర్గా. దీనిని పెద్ద దర్గా లేక అమీన్ పీర్ దర్గా అంటారు. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన దర్గా కావున దీనిని దక్షిణ భారతదేశపు ఆజ్మీర్ (Ajmer of South India) అనికూడా అంటారు.

చరిత్ర

[మార్చు]
కడప పెద్ద దర్గా ముషాయిరా

ఈ పెద్ద దర్గా మొదటి సూఫీ (మూలపురుషుడు) హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్తీవుల్ ఖాద్రీ నాయబ్-ఎ-రసూల్. ఈయన ప్రవక్త మహమ్మద్ వంశీయుడు. నిరాడంబరుడు, దైవాంశ సంభూతుడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణం నుంచి 1683లో కడపకు చేరుకున్నాడు. 1716లో అమీన్ పీర్ దర్గాలో జీవసమాధి అయ్యాడు. ఇతని సూఫీ తత్వాలు, బోధనలు ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందాడు. ఈయన శిష్యుడు నేక్ నామ్ ఖాన్. ఇతను కడపను పాలించాడు. నేక్ నామ్ ఖాన్ అతని గురువుకు జీవసమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్దదర్గా.అప్పట్లోనే దర్గా నిర్మాణం జరిగింది.ఇతని ఇరువురు కుమారుల్లో పెద్ద కుమారుడు ఆరీఫుల్లా హుసేనీ కడప పీఠాధిపతి కాగా, మరో కుమారుడు అహమ్మద్‌ హుసేనీ నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యాడు. కడప పీఠాధిపతుల మరణానంతరం పెద్ద కుమారుడు పీఠాధిపతిగా కొన సాగుతూ వస్తున్నారు. ఈ పరంపరలో ప్రస్తుతం 11వ పీఠాధిపతిగా అరీఫుల్లా హుసేనీ కొనసాగుతున్నాడు.

కఠోర తపస్సు చేసిన మూడవ పీఠాధిపతి: ఆరీపుల్లా హుసేనీ వారసుడైన హజ్రత్‌ సూఫీ సర్మస్‌సానీ చిల్లకష్‌ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీపుల్లా మహమ్మద్‌ మహమ్ముదుల్‌ హుసేనీసానీ 11వ ఏట ఇంటి నుంచి వెళ్ళి తాడిపత్రి సమీపంలో గుహల్లో 50 సంవత్సరాలు తపస్సు చేసాడు. అటు తర్వాత కడప సమీపంలోని గండి వాటర్‌వర్క్స్‌ గుహల్లో 13 సంవత్సరాలు తపస్సు చేపట్టాడు. గండివాటర్‌ వర్క్స్‌ కొండల్లో ఇతని తపస్సు చేస్తున్నట్లు మేకలకాపరి గుర్తించాడు. నిత్యం ఒక మేక, కొండల్లోకి వెళ్ళి వస్తుండడం కాపరి గమనించాడు. ఒకరోజు దానిని వెంబడించగా తపస్సులో నిమగ్నమై పెద్ద ఎత్తున జడలున్న వ్యక్తి కనిపించాడు. అంతలోనే అతను ఈ విషయం బయట చెప్పవద్దని, చెబితే నీకే అరిష్టమని అన్నాడట. అయితే మేక నిత్యం గుహలోకి వచ్చి ఏమి చేస్తుందని సందేహం వెలిబుచ్చగా, ప్రక్కనే వున్న పెద్ద పామును చూపించి దీనికి పాలు ఇస్తున్నట్లు స్వామి వివరించారట.ఈ మహత్తును గమనించిన మేకల కాపరి తన తల్లికి కళ్ళు కనిపించవని, ఎలాగైనా కళ్ళు తెప్పించాల్సిందిగా స్వామిని ప్రార్థించారు. స్వామి మేకతో పాటు మీ తల్లిని ఈ ప్రాంతానికి తీసుక రావాల్సిందిగా ఆదేశించాడు. ఆ మేరకు స్వామి దరికి తల్లి, మేకతో పాటు కాపరి చేరుకుంటాడు. మేక పాలతో ఆయన కాపరి తల్లి కళ్ళు శుద్ధి చేసి చూపు తెప్పించాడు. అటు తర్వాత కడప దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవానికి ఆమె వస్తుందని, ఉత్సవంలో స్వామి పోలికలు వున్న ఓ మహిళ కనిపించడంతో తదేకంగా ఆమె వంక కాపరి తల్లి చూస్తుందని, విషయం ఏమిటని ప్రశ్నించగా కొండ గుహల్లో మీలాగే ఓ స్వామి ఉన్నారంటూ కాపరి తల్లి వివరిస్తుంది.అందరూ ఆ గుహల్లోకి వెళ్ళి చూడగా అక్కడ తపస్సు చేస్తున్నది తన తమ్ముడుగా స్వామి పోలికలతో ఉన్న ఆ మహిళ గుర్తించింది. పెద్ద దర్గాకు రావాల్సిందిగా పీరుల్లా హుస్సేనీ (స్వామి) వంశీయులు కోరుతారు.10 రోజుల అనంతరం వస్తానని చెప్పడంతో అక్కడ నుంచి ఊరేగింపుగా స్వామిని తీసుకు వస్తారు. అదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది.

ఈ పెద్ద దర్గాకు కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాన్యాలున్నాయి. ఆ గురువు సంతతికి చెందినవారు వారసత్వంగా దర్గా పీఠాధిపత్యం చేస్తున్నారు. 8వ గురు పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్తివుల్ ఖాద్రీ హిందీ, అరబ్బీ, సంస్కృత భాషల్లో గొప్ప పండితుడు. 9వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ దర్గాను బాగా అభివృద్ధి చేశాడు. ముఖ ద్వారం నిర్మించాడు. పూర్వసమాధులను పునర్నిర్మించాడు. ముషాయిరా గదిని నిర్మించాడు. ప్రవక్త చిహ్నాలను ప్రదర్శించే భవనాన్ని నిర్మించాడు.

ఉరుసుఉత్సవం

[మార్చు]

అమీన్‌పీర్‌ దర్గాలో పెద్ద, చిన్న కలిపి మొత్తం 18 దర్గాలు ఉన్నాయి. ప్రతి నెల గంథం, ఉరుసు ఇక్కడ జరుగుతోంది.వాటిలో పీరుల్లా మాలిక్‌ హుసేనీ ఉరుసు ఉత్సవం ఉర్దూ నెల ప్రకారం మొహర్రం నెలలో జరుగుతోంది. ఆరీపుల్లా హుస్సేనీ ఉరుసు ఏడు రోజుల పాటు ‘మదార్‌’ నెలలో నిర్వహిస్తారు. దాదా ముర్షాద్‌ అమీనుల్లా హుసేనీ ఉరుసును ఖాదర్‌ నెలలో, హేదుల్లా హుసేనీ ఉరుసు రంజాన్‌ మాసంలో నిర్వహిస్తారు. అలాగే అమీనుల్లా హుస్సేనీ ఉరుసు తేరాతేజీ నెలలో భారీ ఎత్తున నిర్వహిస్తారు.ఈ దర్గాను సందర్శించడానికి వేలాది మంది భక్తులు ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర సుదూర రాష్ట్రాల నుంచీ వస్తుంటారు.ఈ పీఠానికి దేశమంతటా 27 లక్షల మంది శిష్యులున్నట్లు ఇక్కడి ప్రతినిధులు చెబుతారు. మన దేశం నుంచేగాక గల్ఫ్‌ దేశాల నుంచి కూడా భక్తులు దర్గాను దర్శించుకుంటారు. ఏటా దర్గా ఉరుసు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుంది. కుల, మత, వర్గ, భేదాలు లేకుండా ఆనందోత్సాహాల మధ్య ఉరుసు జరుగుతుంది. ఈ ఉరుసును ప్రతి సంవత్సరం ఉర్దూ మాసం 'మదార్' లో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. భక్తులకు సూఫీతత్వ ఉపదేశాలిస్తారు. ఈ ఉరుసులో హిందువులు, మహమ్మదీయులు అనే భేద భావం లేకుండా సర్వులూ పాల్గొంటారు. దైవం మీద నమ్మకం, మానవులందరూ ఒకటే అన్న భావం ఇక్కడ గుబాళిస్తుంది. ఉరుసు సందర్భంగా పెద్ద ఎత్తున ముషాయెరా (కవి సమ్మేళనం) జరుగుతుంది. ఈ కవిసమ్మేళనానికి దేశం నలుమూలల నుంచి కవులు వస్తారు. ఈ పెద్ద దర్గాకు రెండు శాఖలున్నాయి. నందలూరులో ఒకటి, రెండోది చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలోని కలిచెర్ల గ్రామంలో ఉంది.

మత సామరస్యం

[మార్చు]

మతాలకతీతంగా హిందు, ముస్లిం, క్రైస్తవులు నిత్యం పెద్ద దర్గాను సందర్శించుకొని ప్రార్థనలు నిర్వహిస్తుండడం వల్ల ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీ కగా నిలిచింది. సాహెబ్‌ (స్వామి) ను నమ్ముకొని ప్రార్థించి దర్గా విబూది తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు హరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఈ దర్గాకు ఎందరో ప్రసిద్ధులు, సినీ ప్రముఖులు వస్తుంటారు. ఇందిరాగాంధీ, పి.వి. నరసింహారావు, సుశీల్ కుమార్ షిండే, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, నందమూరి తారకరామారావు, మజ్జి తులసీ దాస్‌, గాయకుడు మహమ్మద్ రఫీ, పంకజ్ ఉధాస్, నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రాష్ట్ర, కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఇక్కడి పీఠాధిపతుల ఆశీస్సులు పొంది ఇక్కడి ప్రశాంతతకు ముగ్ధులయ్యారు. అంతర్జాతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ సమయం చిక్కినప్పడల్లా కుటుంబ సభ్యులతో తరచూ వస్తుంటాడు.ప్రముఖ కవులు షకీల్‌ బదాయూని, అర్షద్‌ జైపూర్‌, గవర్నర్‌ మోహన్‌లాల్‌ సుకాడీయా తదితరులు స్వామి సేవలో పాలుపంచుకున్నారు. ప్రముఖ హిందీ నటుడు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వరరాయ్‌, జయాబచ్చన్‌, సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్‌ దంపతులు పీఠాధిపతుల ఆశీస్సులు పొంది ఇక్కడి ప్రశాంతతకు ముగ్దులయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నితిన్‌, రామ్‌చరణ్‌తేజ, లారెన్స్‌, ఆర్‌.పి. పట్నాయక్‌, అలీ, బెల్లంకొండ సురేష్‌, చంద్రమహేష్‌, శంకర్‌, ప్రభాకర్‌, దేవిశ్రీప్రసాద్‌, నాగబాబు, గజల్ శ్రీనివాస్, నటుడు ఆమిర్ ఖాన్‌ లాంటి వారు దర్గాను సందర్శించారు.తరచూ సినీ ప్రముఖుల సందర్శనలు సర్వసాధారణం.[1]

ముషాయిరాల సంస్కృతి

[మార్చు]

ఈ ఖాన్ఖాహ్ ఉర్దూ భాషాభివృద్ధికి, ఉర్దూ సాహితీ, కవితా సంస్కృతికీ పోషణాస్థలి గాను, సాహితీ కేంద్రంగానూ విరాజిల్లుతూ ఉంది.

మూలాలు, వనరులు

[మార్చు]
  1. "కడప పెద్దదర్గాలో అభిషేక దంపతుల ప్రార్ధనలు". 2007-11-16. Archived from the original on 2008-01-19.
  • వై.ఎస్.ఆర్. జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, విద్వాన్ కట్టా నరసింహులు