పొట్టి శ్రీరాములు

వికీపీడియా నుండి
(పొట్టి శ్రీ రాములు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పొట్టి శ్రీరాములు
Potti Sreeramulu 2000 stamp of India.jpg
అమరజీవి పొట్టి శ్రీరాములు
జననం(1901-03-16)1901 మార్చి 16 [1]
India అణ్ణాపిళ్ళె, జార్జిటౌను, మద్రాసు.
మరణం1952 డిసెంబరు 15 [1]
మద్రాసు
మరణ కారణముఆమరణ నిరాహారదీక్ష
నివాస ప్రాంతంనెల్లూరు / మద్రాసు
ఇతర పేర్లుఅమరజీవి
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు
రాజకీయ నాయకుడు
మతంహిందూ
తండ్రిగురవయ్య
తల్లిమహాలక్ష్మమ్మ
కవిత

అది గొప్ప యౌకొకో! యపుడు వెన్నెముకను
దాన మిచ్చె ధధీచి మౌని యతడు!
యది యేమిఘనత! కాయము కోసి ఇచ్చెను
శిబి చక్రవర్తి ప్రసిద్దుడతడు!
అది యొక లెక్కయా? యడుగులు మూడుగా
ధరనిచ్చె బలియు వదాన్యుడతడు!
యది లెస్సయా? మేన ననఘళించిన సొమ్ము
లడుగ నిచ్చెను కర్ణు డగునె దాత
యనుచు స్వర్గపురీ రధ్యలందు సురలు
పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి
యక్కజంపడి తలయూచి యాడుభాష
లందగించెను మేఘగర్జాంతముల

~ సామవేదం జానకిరామ శర్మ

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.

జీవిత విశేషాలు[మార్చు]

పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం నెలకు 250 రూపాయలు.

1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.

స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర[మార్చు]

పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ (Committee for History of Andhra Movement) అధ్యయనంలో పొట్టి శ్రీరాములు - మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది. - "సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. అతని గురువు ప్రపంచానికే గురువు, సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. దరిద్ర నారాయణుల ఉద్ధతికి అంకితమైన మహానుభావుడు..... శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ, కులపతి (గాంధీ) ఆదరాన్నీ చూరగొన్నాడు." [1]

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొమరవోలులో యెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.

గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు. 1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు. అప్పుడు మహాత్మా గాంధీ టంగుటూరి ప్రకాశంకు ఇలా వ్రాశాడు - "హమ్మయ్య. శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లు విరమించుకోవడం నాకు సంతోషం. దీక్షను మానుకొన్నాక నాకు అతను టెలిగ్రామ్ పంపాడు. అతను ఎంతో దీక్షాపరుడైన ఉద్యమకారుడైనా గాని కాస్త తిక్కమనిషి (eccentric)". - 1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేడు. ఉన్నాగాని ఆంధ్రోద్యమంపై అతనికున్న దృఢత్వం అచంచలమైనది.[2]

జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు.

ఆంధ్ర రాష్ట్రసాధన దీక్ష[మార్చు]

ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
ఆంధ్రప్రదేశ్ చరిత్ర
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
ఉమ్మడిఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ
ఇటీవలి చరిత్ర
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014

మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు.[3] చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించారు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు, చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం, రాజధాని రాయలసీమలోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు.

మరణం[మార్చు]

రోజురోజుకూ ఆరోగ్యం క్షీణస్తూ ఉన్నా, శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకాలేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబరు 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దికొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తా పత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాకర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిష నిమిషానికి చొంగ కారుతుండేది. తరచూ వాంతులు అయ్యేవి. ఎక్కిళ్ళు, తుమ్ములు వచ్చేవి. అప్పటికే ఆయన అలసిపోవడం... పైగా వాంతులు, తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. డిసెంబరు 5వ తేదీనాటికి ఎక్కిళ్లు, తుమ్ములు తగ్గినా శీతవిరోచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరాపడ్డారు. నిరాహారదీక్షకు కూర్చునేముందే ఆయన రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయరసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయేవి. కొన్నికొన్ని సందర్భాల్లో నెత్తురు పడ్డది. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబరు నెల కావడంతో విపరీతంగా చలి. దాంతో, ఆయన వణుకుతుంటే ఎప్పుడూ చొక్కా వేసుకోని శ్రీరాములుకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాకర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావడం; ప్రభుత్వం స్పందించకపోవడం; ఆయన రోజురోజుకూ నీరసం కావడంతో ఓరోజు బులుసు సాంబమూర్తి, నరసింహలతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును ఆయన వ్యతిరేకించారు.

ఆఖరు రోజు

డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు!! ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్లు తెరిచారు. అంతలోనే మూతలు పడపోయేవి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 54 పౌనుల (24.5 కేజీలు) బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాసతీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించింది. నోటిమాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. సందర్శకులను నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా... చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నాడు.

ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువుల బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు. యేర్నేని సాధు సుబ్రహ్మణ్యం గారే అమరజీవి శ్రీరాములకు దహనక్రియలు కర్మకాండ జరిపారు.

పొట్టి శ్రీరాములు ప్రశంస[మార్చు]

సచివాలయం ఎదురుగా పొట్టి శ్రీరాములు విగ్రహం

మూలాలు, వనరులు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "హిందూ పత్రికలో వ్యాసం". Archived from the original on 2003-06-28. Retrieved 2008-07-25.
  2. హిందూ పత్రికలో ఈ వ్యాసం Archived 2003-07-01 at the Wayback Machine --11/11/2002 - The martyr of Telugu statehood
  3. తుర్లపాటి, కుటుంబరావు (2012). "Wikisource link to ఆత్మకథ విషయపేజీలు". Wikisource link to నా కలం - నా గళం. సుందర శేషమాంబ పబ్లికేషన్స్. వికీసోర్స్. 
  4. "అమరజీవి పొట్టి శ్రీరాములు". STAMPS OF ANDHRA. 20 October 2013. Retrieved 24 July 2021.

వెలుపలి లంకెలు[మార్చు]