సురేఖ
మట్టెగుంట వెంకట అప్పారావు | |
---|---|
జననం | మట్టెగుంట వెంకట అప్పారావు 1941 మే 28 ఒంగోలు,ప్రకాశం జిల్లా |
నివాస ప్రాంతం | రాజమండ్రి(రాజమహేంద్రవరం) |
ఇతర పేర్లు | సురేఖ, జూబిలీ బాయ్ |
వృత్తి | రిటైర్డు బాంకు డిప్యూటీ మేనేజరు |
భార్య / భర్త | పద్మ |
పిల్లలు | మాధురి, మాధవి, కృష్ణసాయి |
తండ్రి | మట్టెగుంట వెంకటసుబ్బారావు |
తల్లి | మట్టెగుంట సీతాలక్ష్మి |
సంతకం | |
Notes వీరి నినాదం నవ్వే జనా సుఖినోభవంతు |
సురేఖ అని చూడగానే/వినగానే మహిళ అనిపించే పేరుతో 1958 నుండి వ్యంగ్య చిత్రాలు గీస్తున్న ఇతని అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు. "సురేఖ" అన్నపేరు పెట్టుకోవటానికి వెనుక కథ, ఇతనికి మంచి గీతల మీద ఉన్న మమకారం, అప్పటికే పేరు తెచ్చుకున్న బాపు మీద గౌరవం. బాపుకు ఉన్న మరొక కలం పేరు రేఖ. ఆ రేఖను తీసుకుని ఆ పదానికి "సు" తగిలించి, సు + రేఖ = సురేఖగా సంధించి పాఠకుల మీదకు తన వ్యంగ్య చిత్రాలను వదలటం మొదలు పెట్టాడు. సురేఖ అంటే మంచి గీత లేదా శుభ్రమైన గీత అని అర్ధం. తన "కుంచె" పేరును సార్థకం చేసుకుంటూ, మరొక పక్క ఒక పెద్ద బ్యాంకులో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ తనవంతు సాహిత్య సేవ దశాబ్దాలపాటు కొనసాగించాడు. పదవీ విరమణ తరువాత తనకున్న అనేక అభిరుచులతో పాటు వ్యంగ్య చిత్ర రచనను కూడా కొనసాగిస్తున్నాడు.
వ్యక్తిగతం
[మార్చు]ఇతను ఒంగోలు పట్టణంలో 1941 మే 28 న జన్మించాడు. ఇతని తల్లితండ్రులు మట్టెగుంట వెంకట సుబ్బారావు, మట్టెగుంట సీతాలక్ష్మి. చదువు బి ఏ వరకు జరిగింది. ఆ తరువాత భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేశాడు. బాపు అంటే ఉన్న అభిమానం కార్టూనింగ్ నేర్చుకోవటానికి కారణమైంది. బొమ్మలు గీస్తూ, వాటికి మంచి సంభాషణలను అతికిస్తూ ఉండేవాడు. 1958 లో పదిహేడు సంవత్సరాల వయస్సులో ఇతని మొట్టమొదటి వ్యంగ్య చిత్రం ప్రచురితమయ్యింది. ఇతని వివాహం 1963 లో పద్మతో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు -మాధురి, మాధవి. కుమారుడు సాయికృష్ణ. ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, డిప్యూటీ మేనేజరుగా పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో నివసిస్తున్నాడు. ఇతని అభిరుచులు గ్రామఫోను రికార్డులు సేకరించటం, పాత చందమామలు చదవటం (ఇతని దగ్గర 1959 నుండి ప్రచురితమైన చందమామలు ఉన్నాయట). స్టాంపులు, పాత నాణాలు కూడా సేకరిస్తూ ఉంటాడు. 2004 సంవత్సరం నుండి రాజమండ్రిలో హాసం క్లబ్ నిర్వహిస్తున్నాడు. స్వయంగా వ్యంగ్య చిత్రకారుడయిన ఇతనికి అభిమాన కార్టూనిస్టులు బాపు, బాబు, జయదేవ్, శ్రీధర్, సరసి.
మొదటి ప్రచురణ
[మార్చు]ఇతని మొట్టమొదటి వ్యంగ్య చిత్రం 1958లో ఆంధ్రపత్రికలో ప్రచురితమయ్యింది. ఆ తరువాత అసంఖ్యాకంగా కార్టూన్లు వేస్తూ ఆంధ్ర పాఠక లోకాన్ని ఉర్రూతలూగిస్తున్నాడు. మొదటి కార్టూన్ చూస్తే సంతకం అప్పారావు అని ఆంగ్లంలో చేసినట్లు కనబడుతుంది. తరువాతి కాలంలో కార్టూన్ల ప్రచురణ పెరిగిన తరువాత, కలం/కుంచె పేరును "సురేఖ"గా మార్చుకున్నాడు.
వ్యంగ్య చిత్ర ప్రత్యేకత
[మార్చు]ఒకే మాట, వ్రాసే పద్ధతిలో, పలికే పద్ధతిలో రకరకాల అర్థాలను స్ఫురిస్తాయి. ఒకలాగే కనబడే మాటలు, సందర్భాన్ని బట్టి వేరువేరుగా అర్ధం చేసుకోవాలి. లేకపోతే సమాచార అంతరం (Communication Gap) ఏర్పడి గందరగోళం అవుతుంది. అటువంటి పరిస్థితులను నిశితంగా పరిశీలించి, నిజ జీవితంలోనుండి పెకలించి వ్యంగ్య చిత్రాలలో జొప్పించటం ఇతడి ప్రత్యేకత. మాటలలోని శ్లేషను ప్రధానాంశంగా తీసుకొని,కార్టూన్లు వెయ్యటం అంత సులభంకాదు. ఇతడి కార్టూన్లు చూస్తే మటుకు సులభమనిపిస్తుంది. కాని, మరొక అటువంటి సంఘటన ఉందా అని పరికిస్తే, ఏమీ తట్టదు. ఇతని వ్యంగ్య చిత్రాలు చక్కగా పేరుకు తగ్గట్టుగా శుభ్రంగా ఉంటాయి. బొమ్మలోని మిగిలిన వివరాలకు, పాత్రలకు సరిగ్గా సరిపోయే నిష్పత్తి ఉంటుంది. ఇతని కార్టూన్లు, తెలుగులోని అన్ని ప్రముఖ వార/మాస పత్రికలలోను ప్రచురింబడినాయి. ఆంగ్ల పత్రిక కారవాన్‌లో కూడా ప్రచురించబడినాయి. వ్యంగ్య చిత్రాల సంపుటి "సురేఖార్టూన్లు" అన్న పేరుతో వెలువడింది.
ప్రముఖుల అభిప్రాయాలు
[మార్చు]- ముళ్ళపూడి వెంకటరమణ: "ఆయన రాతా గీతా మిళాయించారు. రాత మీద జొరబడిన గీత - రాత లేకుండా గీతా...ఎన్నో నవ్వులు గుబాళించాయి. బాంకాఫీసరుగా డబ్బుని అప్పులిచ్చి పుచ్చుకున్న అప్పారావుగారు-ఇవి మాత్రం ఎక్కడా అప్పు చేయకుండానే లా-గీయించేశారు......"
- జయదేవ్: "సురేఖ కార్టూన్లు ఎప్పట్నించో చూస్తూ ఆనందిస్తున్న అనేక వేల తెలుగు పాఠకుల్లో నేనొకణ్ణి. నాకు ఆయన కార్టూన్లలో నచ్చిన అద్భుతమైన వ్యాఖ్య మా అల్లుళ్ళు మా అమ్మాయిల మాటలు చక్కగా వింటారు! మా వెధవే వాళ్ళావిడ ఎంత చెబితే అంత!! ఇంత చక్కని వ్యాఖ్య కార్టూనిస్ట్ బాబు మాత్రమే వ్రాయగలడు."
- సరసి-కార్టూనిస్ట్: "కార్టూనుకు ఐడియా ప్రాణం. ఐడియా వస్తే దాన్ని గీతల్లోకి తర్జుమా చేయడం సులభమే. ఐడియా బాగుంటే 90 శాతం మార్కులు పడిపోతాయి. అలాంటి ఫుల్ మార్కులు కొట్టేసే అద్భుతమైన ఐడియాలు, కార్టూన్లు చూడగానే, ఇంటలెక్చ్యువల్ కార్టూన్స్ అని తెలిసిపోతాయి. ఇది వాస్తవం"
- కర్రి రామారెడ్డి, ప్రముఖ వైద్యులు, రాజమండ్రి: "కలం, కుంచే కలిస్తేనే గానీ కార్టూన్ రాదు. కుంచెతో బొమ్మ గీస్తేనే సరిపోదు. దానికి కలంతో ప్రాణం పొయ్యాల్సిందే! మళ్ళీ అందులో 'పంచ్' ఉండాలి. అప్పుడే అది పెదవుల మీద నవ్వులు పూయించే మంచి కార్టూనవుతుంది........ఆయన కార్టూన్‌లంటే చిరునవ్వుకి చిరునామా ప్రతి కార్టూన్‌లోనూ ఏదో ఒక చమక్కుంటుంది. అంతర్లీనంగా ఎవరికో చిన్న చురక లాంటిది పడుతూనే ఉంటుంది. తను నమ్మిన 'పంచ్'ని అయనెప్పుడూ వదిలిపెట్టడు. అందుకే సంవత్సరాలు గడిచినా, తరాలు మారినా ఆయన కార్టూన్లు జీవంతో విరాజిల్లుతున్నాయి. ముళ్ళపూడి వారి చేత, బాపు గారి చేత మన అప్పారావుగారు శభాషనిపించుకున్నారంటే, ఇక దానికి మించిన సర్టిఫికెట్ లేనేలేదు. మరి కార్టూనిస్టుగా ఆయన 'గోల్డ్‌మెడల్" సాధించినట్లే."
వ్యంగ్య చిత్రమాలిక
[మార్చు]-
రాయటం, వ్రాయటం మాటల మధ్య జరిగే తకరారుతో హాస్యం
-
మన జీవితాల్లో, మన అలోచనలలో ద్వంద్వ నీతికి దర్పణం
-
మాటల్లో ధ్వనించే శ్లేషకు వ్యంగ్య చిత్రీకరణ
-
సెల్ ఫోను పిచ్చలో పడిన ఒక వ్యక్తి అసంకల్పిత చర్య
-
అన్నిచోట్లా వ్రాసిందే చేస్తే కుదరదు!!
-
వంటరాక టివిలో చూసి చేద్దామనుకున్న మహిళ పడే తంటాలు
-
నవలకు యధాతధ చిత్రీకరణ?
-
మరీ ఇంత వెనుకబాటా!!
మూలాలు
[మార్చు]- సురేఖార్టూన్స్ - ప్రచురణ 2008 - ప్రచురణకర్త శ్రీమతి ఎమ్.పద్మ, రాజమండ్రి
- హిందూ పత్రిక, A cartoonist with a difference, BVS BHASKAR, RAJAHMUNDRY, February 11, 2013