Jump to content

తులసీరాం

వికీపీడియా నుండి
షరాబు తులసీ రామాచారి
తులసీరాం
జననంషరాబు తులసీ రామాచారి
ఏప్రిల్ 24, 1941
అలువకొండ గ్రామం, కర్నూలు జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లుతులసీరాం
వృత్తిప్రభుత్వ ఉద్యోగి, వ్యంగ్య చిత్రకారుడు
తండ్రిపుల్లయ్య ఆచారి
తల్లిసుబ్బమ్మ
సంతకం

తెలుగు వ్యంగ్యచిత్ర రంగంలో 1960, 1970 దశకాలలో పేరెన్నికగని, వేల కార్టూన్లను అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురించినవాడు తులసీరాం‌. ఇతని అసలు పేరు షరాఫ్ తులసీ రామాచారి. తన పేరులోని "తులసి" "రామ" కలిపి 'తులసీరాం' తన కలంపేరును చేసుకుని ఆ పేరుతోనే ప్రఖ్యాతిగాంచాడు.

వ్యక్తిగతం

[మార్చు]

ఇతను 1941, ఏప్రిల్ 24న కర్నూలు జిల్లా, సంజామల మండలంలోని అలువకొండ గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి షరాబు పుల్లయ్య ఆచారి, తల్లి షరాబు సుబ్బమ్మ. ఇద్దరూ కీర్తిశేషులయ్యారు. 1958-59లో ఎస్సెసెల్సీ (Secondary School Leaving Certificate[SSLC]), 1959-60 ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం నుండి పి.యు.సి. (Pre University Course[P.U.C.]) పూర్తి చేశాడు. 1968లో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ (Andhra Pradesh State Electricity Board [APSEB])లో ఎల్డిసీగా చేరి, విజయవాడ, నరసారావుపేట, గుంటూరు ప్రాంతాలలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి జూనియర్ అక్కౌంట్స్ ఆధికారిగా 1998వ సంవత్సరంలో పదవీ విరమణ చేశాడు. ఇతను ప్రస్తుతం విశాఖ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఇతని భార్య షరాబు సత్యవతి. ఇతణ్ణి ఎంతగానో ప్రోత్సహిస్తూ, ఉన్నత స్థానాల్లో చూడాలని ఆకాక్షిస్తుంటుంది. వీరికి ఇద్దరు కుమారులు-రవీంద్రీశ్వర్‌, సుధాకర్, కుమార్తె-నాగమణి. ఇతని పెద్ద కుమారుడు రవీంద్రీశ్వర్ దురదృష్టవశాత్తూ చిన్న వయసులోనే స్వర్గస్తులయ్యాడు. ఇతని చిన్న కుమారుడు, సుధాకర్ కూడా మంచి కళాకారుడు. ఏనిమేషన్ లో ప్రవేశం ఉన్నది, స్వంతంగా చక్కటి బొమ్మలు గీస్తూ ఉంటాడు.ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంతున్న వీరి సంప్రదించాలంటే +919553358224 నంబరులో సంప్రదించవచ్చు.

కార్టూన్ రంగ ప్రవేశం

[మార్చు]

చిన్నతనం నుండి బొమ్మలు గీయటం మీద ఆసక్తి. ఈ ఆసక్తి మూలంగానే, ప్ర్రాధమిక విద్యాభ్యాసం జరుగుతుండగానే, 1958వ సంవత్సరంలో అంటే 17 సంవత్సరముల వయస్సులో, లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్షలు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. ప్రకృతి చిత్రాలు, కార్టూన్లు, నలుపు-తెలుపు చిత్రాలు గీయటం, వ్యంగ్య చిత్రాలు, ఛాక్‌పీసులతో, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో రకరకాల బొమ్మలు చెయ్యటం, చెక్కటం చేశేవాడు. ఇతని మొట్టమొదటి కార్టూన్ 1964వ సంవత్సరంలో ఆంధ్రపత్రికలో ప్రచురితమయ్యింది. ఆ తరువాత ఇతని వ్యంగ్య చిత్రాలు అన్ని ప్రముఖ దిన/వార/మాస పత్రికలలోనూ ప్రచురితమయ్యి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఒక్క తెలుగు పత్రికలలోనే కాక, ఇతని కార్టూన్లు, ఆంగ్ల పత్రికలయిన శంకర్స్ వీక్లీ (Shankar's Weekly), న్యూస్ టైమ్ (News Time)లలో కూడా ప్రచురితమయ్యాయి. స్వాతి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల వారు నిర్వహించిన కార్టూన్ల పోటీలలో ప్రథమ, ద్వితీయ బహుమతులు లభించాయి.

రచనా వ్యాసంగం

[మార్చు]

ఇతను కార్టూన్లు వెయ్యటమేకాక, అనేక కథలు, చిన్న కథలు, రకరకాల జోకులు, వ్యాసాలు, కవితలు, హైకూలు, పాటలు, చిన్న పిల్లల కథలు వ్రాశాడు. ఇతను వ్రాసిన కవితలలో కొన్ని, ఆకాశవాణి విజయవాడ కేద్రం వారు వివిధ భారతిలో ప్రసారం చేశారు. పదశృతి శీర్షికన వ్రాసిన వ్యాసాలు ఆంధ్ర ప్రభలో ప్రచురితమవుతున్నాయి. ఇతను వ్రాసిన కథలు దాదాపు 30 దాకా ఉంటాయి 1960లో వ్రాసిన "ప్రేమ ఫలితం" అనే నాటకం హైదరాబాదులో నిర్వహించబడిన పోటీలలో బహుమతి అందుకున్నది.

వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు

[మార్చు]
  • ఇతని కార్టూన్‌లు చక్కటి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తాయి.
  • మనకు సామాన్యంగా ప్రతిరోజూ తారసపడే సంఘటనల నుండి హాస్యాన్ని అందిస్తారు
  • బొమ్మలు తక్కువ గీతలతో పరిపూర్ణంగా ఉంటాయి.
  • కార్టూన్‌లో ఇతర వివరాలు ఎంతవరకూ అవసరమో అంతే ఉంటాయి. మోతాదుకు మించిన వివరాలు, బొమ్మలమీద గీతలు, పిచ్చి జుట్లు వంటివి వీరి కార్టూన్లలో కనపడవు.

ప్రదర్శనలు

[మార్చు]
  • ఇతను వేసిన కార్టూనులు, చిత్రాలు, చెక్కిన ఛాక్‌పీసు బొమ్మలు, లియో క్లబ్, రోటరీ క్లబ్, చిరంజీవి కల్చరల్ అసొసియేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలు తెనాలి, నరసారావుపేట లలో ప్రదర్శనలు నిర్వహించాయి.
  • అంతేకాక, జిల్లా గ్రంథాలయ సంస్థలు, ప్రెస్ క్లబ్‌లు కూడా వీరి ప్రదర్శనలను ఏర్పరిచి, ప్రజలకు ఇతని చిత్రకళా నైపుణ్యాన్ని చూపించారు.

వ్యంగ్య చిత్ర మాలిక

[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తులసీరాం&oldid=3251937" నుండి వెలికితీశారు