Jump to content

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా?

వికీపీడియా నుండి
వెనక్కి తీసుకున్నారు

చర్చ ఆగిపోయి చాన్నాళ్ళైంది, నిర్ణయాన్ని ప్రకటించలేదు. అంచేత చర్చను ముగించాను

కింది చర్చ ముగిసింది. ఇక దానిలో మార్పుచేర్పులు చెయ్యకండి. ఇకపై చెయ్యదలచిన వ్యాఖ్యానాలను సముచితమైన చర్చ పేజీలో చెయ్యాలి.

తెలుగు రాష్ట్రాలకు చెందని - మనుషులు గానీ, స్థలాలు గానీ, వస్తువులు గానీ, శాస్త్రీయ నామాలు గానీ - పేర్లను ఎలా రాయాలి అనేది తెవికీలో స్పష్టంగా నిర్వచించి లేదు. దీని గురించి ఒక మార్గదర్శకాన్ని రూపొందించుకుని వికీపీడియా:శైలిలో చేర్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై చర్చించి ఒక మార్గదర్శకాన్ని రూపొందించడమే ఈ పేజీ ఉద్దేశం. చర్చ ప్రారంభం కోసం కొన్ని పాయింట్లను ఇక్కడ చేరుస్తున్నాం. అందరూ ఈ చర్చలో పాల్గొని, కొత్త అంశాలను చేర్చడం, ఒక్కో పాయింటుపై అభిప్రాయాలు చెప్పడం చెయ్యాల్సిందిగా అభ్యర్ధన. ఈ చర్చానుసారం, ఒక మార్గదర్శకాన్ని తయారు చేసుకుని దాన్ని వికీపీడియా:శైలి పేజీలో చేర్చుకుందాం.

చర్చ మొదలు పెట్టేందుకు కొన్ని సూచనలు:

  1. పేరును సాంప్రదాయికంగా ఎలా పలుకుతూ ఉన్నామో అలాగే రాయాలి. పత్రికల్లోనూ, పాఠ్య పుస్తకాల్లోనూ, ఇతర ప్రచురణల్లోనూ ఎక్కువగా ఎలా రాస్తూంటారో అలాగే రాయాలి. ఇంగ్లీషు లేదా ఇతర భాషల్లో ఎలా పలుకుతారో అలా రాయకూడదు. ఉదాహరణకు, ఇంగ్లీషు స్పెల్లింగు ప్రకారం పాలస్టైన్ అని పలకాలి. కానీ తెలుగులో పాలస్తీనా అని రాస్తూంటాం (గూగుల్ ఫలితాల్లో పాలస్తీనాకు 23,60,00,000, పాలస్టైన్‌కు 46 ఫలితాలూ వచ్చాయి). తెవికీలో కూడా పాలస్తీనా అనే రాయాలి. ఇది అన్నిటికంటే ప్రధానమైన సూత్రం. ఈ సూత్రాన్ని పాటించలేని, పాటించేందుకు అవసరమైన డేటా లేని పక్షంలో..
  2. ఇంగ్లీషు వ్యాసంలో ఆ పదాన్ని ఎలా పలకాలో బ్రాకెట్లో సూచిస్తారు. దాన్నిబట్టి రాయాలి. ఉదాహరణ:
  3. ఇంగ్లీషు వ్యాసంలో స్పెల్లింగు వివరం లేకపోతే, హిందీ, తమిళం వంటి భారతీయ భాషల్లో ఎలా రాసారో చూడాలి. పేజీలోని ఇతర భాషల లింకుల్లో భాష మీద కర్సరు పెడితే ఆయా భాషల్లో ఆ పేజీ పేరు ఏమిటో తెలుస్తుంది. తమిళ మలయాళ భాషల వంటివి తెలియకపోయినా, కన్నడ, హిందీ, మరాఠీ వంటి భాషల్లో పేరు ఏమి రాసారో తెలుస్తుంది. ముఖ్యంగా భారత దేశం లోని తెలుగేతర రాష్ట్రాల్లోని పేర్ల కోసం ఈ పద్ధతి పాటించడం మేలు.
  4. అజంతం చెయ్యకూడని సందర్భాలు:
    1. మొదటి నిబంధన లోకి రాని వ్యక్తుల, స్థలాల, సంస్థల, సినిమాల, పుస్తకాల, టీవీ కార్యక్రమాల, దేశాల, రాష్ట్రాల,.. పేర్లను సాధారణంగా అజంతం చెయ్యం.
    2. వృక్ష, జంతు జాలాల ద్వినామీకరణ పద్ధతిలో ఉండే శాస్త్రీయ నామాలను యథాతథంగా రాయాలి. "హైబిస్కస్ రోజా సైనెన్సిస్" ను అలాగే రాయాలి, హైబిస్కసు రోజా సైనెన్సిసు అని అజంతం చెయ్యకూడదు.
    3. అజంతం చెయ్యకూడని పేర్లకు తో, లో, కు, పై వంటి ప్రత్యయాలను చేర్చేటపుడు "^" అనే ZWNJ (జీరో విడ్త్ నాన్-జాయినరు) ను వాడి చేర్చాలి. ఉదా: హైబిస్కస్ రోజా సైనెన్సిస్‌ను అని రాయాలి. నేరుగా హైబిస్కస్ రోజా సైనెన్సిస్ను అని గానీ, హైబిస్కస్ రోజా సైనెన్సిస్ ను అని విడిగా గానీ రాయకూడదు. ప్రత్యేకంగా ఆ పేరు గురించే ప్రత్యేకంగా ప్రస్తావించే సందర్భంలో మాత్రం "హైబిస్కస్ రోజా సైనెన్సిస్" ను అని రాయవచ్చు.
  5. అజంతం చెయ్యాల్సిన సందర్భాలు:
    1. బస్, కార్, కోర్ట్, హైకోర్ట్ వంటి పదాలు ఎప్పుడో తెలుగులోకి చేరి తెలుగు పదాలై పోయాయి. వీటిని అజంతం చెయ్యాలి.
    2. రెండు లేదా అంతకంటే హలంత పదాలున్న పదబంధంలో సాధారణంగా చివరి పదాన్ని మాత్రమే అజంతం చేస్తారు. ఉదాహరణకు సుప్రీమ్‌కోర్టు, బస్‌స్టేషను (సుప్రీముకోర్టు, బస్సుస్టేషను అని అనం)

సందేహం ఉన్నపుడు

[మార్చు]

సూత్రాలు ఎన్ని ఉన్నా, అవి అన్ని సందేహాలనూ తీర్చలేవు. మరింత్ అచర్చ అవసరమౌతూనే ఉంటుంది. అలాంటి సదర్భాల్లో, సందేహ నివృత్తి కోసం కింది మార్గాలను అనుసరించవచ్చు:

  • గూగుల్ చెయ్యడం
  • ఈనాడు వంటి తెలుగు పత్రికల్లో ఎలా రాస్తున్నారో చూడ్డం
  • రచ్చబండలో లేదా ఈ పేజీకి చెందిన చర్చాపేజీలో చర్చకు పెట్టడం

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఇంగ్లీషు నెలల పేర్లు ఎలా రాయాలనే దానిపై జరిగిన చర్చ, దానిపై తీసుకున్న నిర్ణయాన్ని చూడండి.

చర్చ

[మార్చు]

సి.చంద్రకాంతరావు అభిప్రాయాలు

[మార్చు]
  • సందేహానికి గూగుల్ సెర్చ్ చేయడం సరికాదని నా అభిప్రాయం. తెలుగులో ప్రామాణిక పుస్తకాలు, ప్రామాణిక పత్రికలే ముఖ్యం. వాటినే అనుసరించడం బాగుంటుంది. గూగుల్ సెర్చ్ చేస్తే పనికిరాని చెత్త కూడా వడపోతకు గురౌతుంది. అధికచోట్ల లేదా అధికమంది పొరపాట్లు చేసే మనమూ పొరపాటు చేయాలనీ లేదుకదా! నిజం చెప్పాలంటే మనమే ఇతరులకు (పత్రికలకు, మాధ్యమాలకు, రచయితలకు) మార్గదర్శకంగా ఉండాలి. ఫలితంలో తేడా భారీగా ఉంటే ఫర్వాలేదు కాని స్వల్పతేడా వచ్చినప్పుడు దేన్ని అనుసరించాలనేది కూడా ఇబ్బందే.
  • ఇంగ్లీష్ స్పెల్లింగ్ వివరాలు లేనప్పుడు తర్వాతి ప్రాధాన్యత హిందీకి ఇవ్వడం సరికాదనుకుంటాను. ఎందుకంటే తెలుగుకు, హిందీకి ఉచ్చారణలో చాలా తేడా ఉంటుంది. ఉదా:కు రష్యాను రూస్ అనీ, చైనాను చీన్ అనీ, అలహాబాద్‌ను ఇలాహాబాద్ అనీ ... ఇలా అంటారు. అంతెందుకు తెలంగాణను తెలంగానా అనే రాస్తారు. ఈ విషయంలో మన పొరుగురాష్ట్ర భాష అయిన కన్నడను అనుసరించడం ఉత్తమం. (తమిళ, మలయాళ భాషల గురించి నాకు అంతగా తెలియదు)
  • సంస్థల పేర్లు ఆంగ్లంలో ఉన్నప్పుడు దాన్ని అలాగే రాయాలా తెలుగీకరణ చేయాలా అనేది కూడా నిర్ణయించాలి. ఉదా:కు ప్రస్తుతం తెవికీలో "ఇన్‌స్టిట్యూట్" అనే పదం రాయడం మామూలైపోయింది కాని వాడుకలో ఈ పదం "సంస్థ" గానే ఉంది.
  • దేశాలకు, ప్రదేశాలకు తదితరాలకు నార్త్, సౌత్ ... ఇలా ఉన్నచోట్ల తెవికీలో వ్రాయడానికి ఒక నిర్ణయం అవసరం. వాడుకలో నార్త్ కొరియాను ఉత్తర కొరియా అంటాం, నార్త్‌సీ కి మాత్రం నార్త్ సముద్రమనీ, ఉత్తర సముద్రమనీ, నార్త్ సీ అనీ ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంది (ఇది ఒక ఉదా: మాత్రమే). తెవికీలో దిక్కుల పేర్లతో ఉన్న కొన్ని వ్యాసాలకు ఉదా:లు నిజామాబాద్ సౌత్ మండలం, సౌత్ జోన్ క్రికెట్ జట్టు, సౌత్ బట్టన్ జాతీయ ఉద్యానవనం, నార్త్ వల్లూరు, ఇంఫాల్ ఈస్ట్ జిల్లా, ఈస్ట్ కోస్ట్ రైల్వే రైళ్లు (భారతదేశం), ఈస్ట్ కాశీ హిల్స్, వెస్ట్ ఇంఫాల్, వెస్ట్ కాశీ హిల్స్ ... ఇలాంటి వాటిపై ఒక నిర్ణయం తీసుకోవాలి.
  • వ్యక్తుల పేర్లు ఇంటిపేర్లు ఉన్నదున్నట్లుగా రాయాలి, కాని చరిత్రకు సంబంధించి ఈ పేర్లు అజంతంలోకి మారిపోయాయి. ఇదే విషయంపై సుమారు పదేళ్ళ క్రితమే పెద్ద చర్చ జరిగింది (చూడండి) (మొత్తం చర్చ ఇక్కడ లేదు కాని ఆ సభ్యుడు ప్రవర్తన తెవికీలోనే పెద్ద దుమారం లేపి చివరికి ఒక యాక్టివ్ నిర్వాహకుడిని కోల్పోయాము) ఈ విషయంపై కొత్తగా చర్చ జరగాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:52, 30 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యక్తుల పేర్ల గురించి మనం పూర్తి స్థాయిలో ఒక విధానం రూపొందించుకోవాలి చంద్రకాంతరావు గారూ. ఆంగ్ల వికీపీడియాలో కామన్ నేమ్ (సాధారణ నామం) అన్నది ప్రాతిపదిక. ఆ ప్రకారం ఒక వ్యక్తి గురించి బాగా ప్రాచుర్యంలో ఉన్న పేరు ఏదైతే అదే వ్యాసం పేరుగా వాడాలి. అలా కాకుండా మనకి తెలుసు కదాని వారి పూర్తిపేర్లతో వ్యాసాలు సృష్టించిన సందర్భాలు చూశాను. అలాగే, త్రిపురనేని రామస్వామి చర్చా పేజీలోని ఈ చర్చ చూడండి. రామస్వామి జీవితంలోని మలిదశలో చౌదరి అన్న కులసూచకాన్ని విడిచిపెట్టారు. ఇప్పటికీ చాలామంది చౌదరి కలిపి వాడతారు. ఈ విషయంలో వ్యక్తి స్వంత అభిప్రాయం ప్రాతిపదికా, సాధారణ నామమే ప్రాతిపదికా అన్నదీ చూడాలి. ఇక, మీరు చెప్పిన విషయానికి వస్తే, మౌర్య అన్న వంశనామాన్ని మౌర్యుడు చేయడం వ్యాకరణ ఉల్లంఘన కావచ్చు, కాకనూ పోవచ్చు. కానీ, చరిత్రకారులు, పాఠ్యపుస్తకాలు, సాధారణ రచనలు మౌర్యుడు అన్న రూపాన్ని స్వీకరించారు కాబట్టి కామన్ నేమ్ పాలసీని బట్టి అదే మనం స్వీకరిస్తాం. జన వ్యవహారంలో వ్యాకరణం నుంచి బయటకు జరిగిన వాడుకలు అనేకం ఉంటాయి. వాటన్నిటినీ వ్యాకర్తలే దిద్దరు, శుభ్రంగా అదొక నియమంగా స్వీకరించేస్తారు. (డిస్క్రిప్టివ్ లింగ్విస్టిక్స్ అంటారు దీన్ని) ఇక ఇలాంటి విషయాలపై స్వంత పరిశోధనలు చేయడం తగని మనకు ఆ పని అస్సలు కూడదు. (ఏ సభ్యుడు వెళ్ళిపోయారో తెలియదు, కానీ ఒక చర్చలో దుమారం రేగడం వల్లనే వెళ్ళిపోయారు అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వికీపీడియా అన్నదే ఒక చర్చా యంత్రం అన్నారొక పరిశోధకులు.) --పవన్ సంతోష్ (చర్చ) 03:38, 3 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్‌ అభిప్రాయాలు

[మార్చు]
  • గూగుల్ చెయ్యడం అన్నది ప్రయోజనకరమైన విషయం. ఇందుకు గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి, చర్చలు కూడా దీని అనుగుణంగా ముగించాం. మరీ ముఖ్యంగా రెండు సరైన పదాల్లో ఏ పదం ఎక్కువ జనంలో ఉంది అని తెలుసుకోవాలంటే ఇది ఉపయోపగుతుంది. అయితే, కనీసం ఇన్ని సెర్చ్ రిజల్ట్‌ల కన్నా ఎక్కువ ఉంటేనే పరిగణించాలని అనుకుంటే మేలు. ఎందుకంటే- ఎక్కువ రిజల్ట్స్ ఉన్నప్పుడు అది ఖచ్చితం కావడానికి, కనీసం జనంలో ఉన్న పదం అని నిర్ధారణ కావడానికి, ఎక్కువ అవకాశం ఉంది. ఏ ఆఫ్రికా రాజకీయ నాయకుడి విషయమో ఐతే ఇలా నిర్ధారణ కాదు. దానికి పైన చెప్పినవాటిలో వేరే పద్ధతులు వాడవలసిందే.
  • యూట్యూబ్‌లో పేర్లు ఎలా పలుకుతారన్నదానిపై ఆడియో ఫైల్స్ సృష్టించే ఛానళ్ళు ఉన్నాయి. ఆ పేరు, pronunciation అన్న పదమూ, ఆడియో అన్న పదమూ కలిపి గూగుల్లో వెతికితే దొరికే అవకాశాలు ఎక్కువే. ఇది కూడా పై హ్యాక్స్‌లో చేరిస్తే బావుంటుంది.
  • దేనికైనా ప్రజల పలుకుబడిలోనూ, ప్రామాణిక వాడకంలోనూ ఉండడమే పెద్ద ప్రమాణం. అది లేనప్పుడే మన పరిశోధన తప్పనిసరి అవుతుంది. కాబట్టి, ఒక పేరు ప్రామాణిక వాడకంలో ఒకలా ఉంటే అదే కొనసాగించాలి. ఉదాహరణకు, మోడీకి, మోదీకి మధ్య పోటీ వస్తే ప్రస్తుతానికి మోడీ అన్నదే మనం పేరులో వాడాలి. ఈనాడు వంటి ప్రామాణిక పత్రికలో మోదీ అని పెట్టారు, ఇది జనాలకు పూర్తిగా అలవాటయ్యేదాకా (చదవడం అలవాటు అయితే చాలదు, వాడకం కూడా అలవాటు కావాలి) పాలస్టైన్ వంటిదే అవుతుంది.
  • ఆంగ్ల అక్షరాల్లో zhగా రాసే తమిళ, మలయాళ అక్షరాలు కొందరు ఝ అనీ, జ అనీ రాస్తూ ఉంటారు. ఉదాహరణకు కోజిక్కోడ్ వంటివి. దీని విషయమై కూడా మార్గదర్శకంలో స్పష్టత ఉండాలి.

మొత్తంగా ఇది చాలా అవసరమైన పాలసీ. దీన్ని సమర్థిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 03:01, 3 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది చాలా క్లిష్టమైన సమశ్య. ఒక్క పెట్టున ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కడో ఒకచోట పప్పులో కాలేసే ప్రమాదం ఉంది. మనం ప్రపంచాన్ని ఇంగ్లీషు పట్టకం ద్వారా చూస్తున్నాం కనుక ఇంగ్లీషు వాడకం మనని బాగా ప్రభావితం చేసింది. రష్యాలో Tolstoy ని ఎలా పలుకుతారో అదే విధంగా తెలుగులో రాస్తే అది తప్పని భ్రమ పడేవారు ఉన్నారు. Guy De de maupassant పేరు నిజంగా ఎలా పలకాలో ఎంతమందికి తెలుసు? అంతవరకు ఎందుకు? మనవాళ్ళు కంప్యూటరు రంగంలో నిష్ణాతులు కదా! ఇండియాలో abc@gmail.com లో @ ని "at the rate of" అని అనేవాళ్ళు కొల్లలు. అది తప్పు అని చెబితే "ఇండియాలో ఇలానే అంటాం. ఇలా అంటేనే అర్థం అవుతుంది" అని సమాధానం చెప్పేరు. కనుక ఇది తొందరపడి చెయ్యవద్దని నా మనవి. వికీపీడియా లో చెయ్యవలసిన పనులు, నలుగురికీ ఉపయోగపడేవి ఇంకా చాలా ఉన్నాయి. ఏదో నాకు తోచినది, నా అనుభవంలోకి వచ్చినది చెప్పేను. నమస్కారం Vemurione (చర్చ) 23:03, 25 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కశ్యప్ అభిప్రాయాలు

[మార్చు]

సాంకేత ముఖ్యంగా టెక్నాలజీ వంటి రంగాలలో ఎక్కువగా ఆంగ్లపేరు వాడుకలో ఉన్నాయి , ఈ మధ్య నేను ఎక్కువగా టెక్స్ట్ తో టైపింగ్ మీద ఆధార పడుతున్నాడు , ముఖ్యంగా చాలా మంది వాడే గూగుల్ ఉపకరణాలలో వాయిస్ ఇన్పుట్ విషయం లో ఆ పద ఫోనోటిక్ కు దగ్గర ఉన్న తెలుగు స్పెల్లింగ్ ను లో శీర్షికలో వాడటమే మంచిది అంది నా అభిప్రాయం Kasyap (చర్చ) 16:53, 2 నవంబర్ 2020 (UTC)