సాందీప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాందీప్
జననం
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
వృత్తిగాయకుడు, నటుడు, నాట్యకళాకారుడు, చిత్రకారుడు, దర్శకుడు
జీవిత భాగస్వామిపద్మజ
పిల్లలుసాయి సహస్ర
తల్లిదండ్రులు
  • స్వామినాథ్ (తండ్రి)
  • జానకీనాథ్ (తల్లి)

సాందీప్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన గాయకుడు, నటుడు.[1]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

సాందీప్ విజయవాడలో జన్మించాడు. తండ్రి రైల్వే ఉద్యోగి. ఆయన ఉద్యోగ రీత్యా కొద్ది రోజులు మహారాష్ట్రలోని షోలాపూర్లో ఉన్నారు. సాందీప్ మధ్యప్రదేశ్, భోపాల్ లోని కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నాడు. అన్న స్ఫూర్తితో హిందీ పాటల మీద ఆసక్తి కలిగింది. అలా కిషోర్ కుమార్ పాటలంటే అభిమానం ఏర్పడింది. ముహమ్మద్ రఫీ, మన్నా డే లాంటి వారి పాటలు కూడా పాడుకునే వాడు. వేసవి సెలవులకు విజయవాడకు వచ్చినప్పుడల్లా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పాటల క్యాసెట్లు తీసుకుని వెళ్ళి వాటిని విని సాధన చేసేవాడు.

చిన్నప్పుడు పాటలు, చిత్రలేఖనం, నాట్యం మొదలైన వాటి మీద ఆసక్తి ఉన్నా రాను రాను సంగీతం మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. 1991లో హైదరాబాదుకు వచ్చారు. అక్కడే గోల్కొండ, ఉప్పల్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయలో చదివాడు. అప్పుడే తండ్రి సలహాతో గాయని శోభారాజు దగ్గర సంగీత శిక్షణ కోసం చేరాడు. 1995లో అఖిల భారత అన్నమాచార్య కీర్తనల గానం పోటీలో అతనికి బంగారు పతకం లభించింది. తరువాత కే.సెట్ లో మంచి ర్యాంకు రావడంతో బెంగుళూరుకు వచ్చి అక్కడ బెంగుళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదివాడు. కళాశాలలో చదివేటపుడు కూడా ఒక బ్యాండు ఏర్పాటు చేసి అందులో పాడుతూ ఉండేవాడు.

కెరీర్[మార్చు]

గాయకుడిగా[మార్చు]

1999 లో బి.టెక్ మూడో సంవత్సరంలో ఉండగా పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇందులో ఫైనలిస్టులలో ఒకడిగా నిలిచాడు. ఈ కార్యక్రమం ద్వారా అతనికి గాయకుడిగా మంచి గుర్తింపు లభించింది. హిందీ జాతీయ చానల్ అయిన జీ టీవీలో వచ్చిన సరిగమప కార్యక్రమంలో దక్షిణ భారతదేశం నుంచి పాల్గొన్న మగవారిలో మొదటి గాయకుడు సాందీప్. ఈ కార్యక్రమంలో అతను ఏడు స్థాయిలు దాటి బాలీవుడ్ సంగీత పరిశ్రమలో గొప్పవారి ఎదుట తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఒకానొక ఎపిసోడ్ లో బ్రహ్మమొక్కటే అనే అన్నమాచార్య కీర్తనను పాడి అక్కడివారిని అలరించాడు. తరువాత ఇండియన్ ఐడల్ మొదటి సంచికలో పాల్గొని మొదటి ముప్ఫై మందిలో స్థానం సంపాదించాడు.

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం జీ తెలుగు చానల్ లో నిర్వహించిన ఎందరో మహానుభావులు అనే కార్యక్రమంలో ఇతని చేత సుమారు 17 పాటలు పాడించాడు. గాయకుడు జి. ఆనంద్ నిర్వహించే స్వరమాధురి ఆర్కెస్ట్రా తరపున కూడా అనేక పాటలు పాడాడు. తరువాత చిత్రం సినిమా కోసం ఆర్. పి. పట్నాయక్ నుంచి పిలుపు వచ్చింది. ఇందులో సాందీప్ రెండు పాటలు పాడాడు. చదువైపోగానే అతనికి ఓ బహుళ జాతి సంస్థలో ఉద్యోగం వచ్చింది. కానీ వాళ్ళు రెండేళ్ళు అమెరికాలో పనిచేయాలని బాండు కోరడంతో సంగీతానికి దూరం అవుతాననే ఉద్దేశంతో అది తిరస్కరించి హైదరాబాదుకు వచ్చేశాడు. ఒక ఆరు నెలలు సమయం సినిమాల కోసం ప్రయత్నించి రామ్మా చిలకమ్మా, ఫ్యామిలీ సర్కస్ అనే చిత్రాల్లో పాడాడు కానీ అందులో పెద్దగా గుర్తింపు రాలేదు. మళ్ళీ ఉద్యోగంలో చేరాడు. తరువాత నువ్వు నేను చిత్రంలో అతను పాడిన నా గుండెలో నీవుండి పోవా అనే పాట అతనికి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత అతనికి చాలామంది సంగీత దర్శకుల దగ్గర పాడే అవకాశం వచ్చింది.

నటుడిగా[మార్చు]

ఒక టీవీ కార్యక్రమంలో ఇతను చూసి ప్రేమాయనమః అనే చిత్రంలో కథానాయకుడిగా అవకాశం వచ్చింది. ఇందులో అతను అమెరికాకు వెళ్ళి పౌరోహిత్యం చేసే పురోహితుడి పాత్ర. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ నెలరోజుల పాటు నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా విజయవంతం కాకపోయినా కొత్త నటుడిగా అతనికి కొద్దిగా గుర్తింపు లభించింది. 2009 లో ఇంకోసారి అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. మళ్ళీ ఓరి దేవుడోయ్ అనే సినిమాలో రాముడిగా నటించాడు. తర్వాత కైసే మారే ఇస్ జాంబీ కో అనే హైదరాబాదీ కామెడీ చిత్రంలో నటించాడు. తరువాత టైగర్ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటించాడు.

డబ్బింగ్ కళాకారుడిగా[మార్చు]

సాందీప్ నందనవనం 120 కి.మీ., అమృతవర్షం, అరుంధతి, మనసు పలికే మౌనరాగం, గగనం, లవ్ ఇన్ లండన్ లాంటి తొమ్మిది సినిమాల్లో కథానాయకులకు డబ్బింగ్ చెప్పాడు.

మూలాలు[మార్చు]

  1. స్వాతి శ్రీరామ్. "ఫోకస్ లైట్: సాందీప్". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 16 December 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=సాందీప్&oldid=2989042" నుండి వెలికితీశారు