సూర్యవంశం (సినిమా)

వికీపీడియా నుండి
(సూర్య వంశం (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సూర్య వంశం
దర్శకత్వంభీమనేని శ్రీనివాసరావు
రచనమరుధూరి రాజా (మాటలు), విక్రమన్ (కథ)
స్క్రీన్ ప్లేభీమనేని శ్రీనివాసరావు
నిర్మాతఆర్. బి. చౌదరి
తారాగణంవెంకటేష్,
మీనా ,
రాధిక
ఛాయాగ్రహణంవై. మహేంద్ర
కూర్పుగౌతంరాజు
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
ఫిబ్రవరి 25, 1998 (1998-02-25)
సినిమా నిడివి
163 ని.
భాషతెలుగు

సూర్యవంశం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 1998 లో విడుదలైన సినిమా.[1] ఇందులో వెంకటేశ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు.[2] ఈ చిత్రాన్ని ఆర్. బి. చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించాడు. ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీత దర్శకత్వం వహించాడు. చిత్రానికి విక్రమన్ మూలకథ అందించగా, దర్శకుడు భీమనేని చిత్రానువాదం తయారు చేసాడు. మరుధూరి రాజా సంభాషణలు అందించాడు. వై. మహేంద్ర కెమెరా, గౌతంరాజు కూర్పు బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.[3] ఈ చిత్రానికి 1997 లో తమిళంలో ఇదే పేరుతో వచ్చిన సినిమా ఆధారం. ఇదే సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ కథానాయకుడిగా పునర్నిర్మించారు.

హరిశ్చంద్ర ప్రసాద్ గ్రామానికి పెద్ద. ఆయన తన గ్రామంలో అందరి బాగోగులు చూసుకుంటూ అందరి గౌరవాన్ని చూరగొంటూ ఉంటాడు. అదే గ్రామంలో ఉండే సింగరాజు లింగరాజు (ఆనందరాజ్) కి హరిశ్చంద్ర ప్రసాద్ కి మధ్య వైరం ఉంటుంది. గ్రామంలో హరిశ్చంద్రప్రసాదుకి అతనొక్కడే విరోధి. హరిశ్చంద్ర ప్రసాదుది పెద్ద కుటుంబం. భార్య వసుంధర, కొడుకులు రవి ప్రసాద్, దివాకర్ ప్రసాద్, భాను ప్రసాద్, కూతురు శాంతి, ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు మనవరాళ్ళు ఆ కుటుంబంలో సభ్యులు. హరిశ్చంద్ర ప్రసాద్ అందరిమీదా అభిమానంతో ఉన్నా చివరి కొడుకైన భానుప్రసాద్ అంటే మాత్రం అయిష్టంగా ఉంటాడు. అందుకు కారణం అతను పెద్దగా చదువుకోకపోవడం. కానీ భానుప్రసాద్ మాత్రం తండ్రిని మనసులోనే ఆరాధిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మతో తప్ప ఎవ్వరితో పెద్ద సంబంధాలు లేకపోయినా ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటాడు.

స్వప్న తన అన్న పెళ్ళి భానుప్రసాద్ చెల్లెలితో జరగుతుండటంతో కుటుంబ సమేతంగా వాళ్ళ ఊరు వస్తుంది. మొదట్లో భాను వేష భాషలు చూసి అతన్ని ఓ పనివాడిగా భావించి చిన్నచూపు చూస్తుంది. కానీ తరువాత తన తప్పును తెలుసుకుని, భాను స్నేహితుడు నూకరాజు ద్వారా అతని గతం గురించి తెలుసుకుంటుంది. భాను చిన్నప్పటి నుంచి తన మరదలైన మాధవిని ప్రేమిస్తుంటాడు. పెద్దలు వారిద్దరికీ వివాహం నిశ్చయిస్తారు. కానీ మాధవి అందుకు అంగీకరించక ఆత్మహత్య చేసుకోబోతుంది. భాను ఆమెను వారించి నిందను తన మీద వేసుకుని తనకా పెళ్ళి ఇష్టం లేదని తండ్రికి చెబుతాడు. అప్పటి నుంచి తండ్రి అతన్ని అందరికీ దూరంగా పెడతాడు. భాను కథ విన్న స్వప్న అతని ప్రేమలో పడుతుంది. భాను మొదట్లో ఒప్పుకోక పోయినా స్వప్న ప్రేమలోని నిజాయితీని గుర్తించి ఆమె ప్రేమను అంగీకరిస్తాడు.

ఇంతలోపే సింగరాజు స్వప్నను తన కోడలుగా చేసుకుంటే హరిశ్చంద్ర ప్రసాద్ తో సమానంగా గౌరవం దక్కుతుందని భావించి ఆ ప్రయత్నాలు మొదలుపెడతాడు. కానీ భాను ఆ ప్రయత్నాల్నంటినీ తిప్పికొట్టి స్వప్నని పెళ్ళి చేసుకుని వచ్చి తండ్రి ముందుకు వస్తాడు. హరిశ్చంద్ర ప్రసాద్ తన మాటను కాదన్నందుకు కొడుకును ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు. భాను భార్యతో కలిసి వేరు కాపురం పెడతాడు. ఒకసారి మాధవి అనుకోకుండా స్వప్నకు తారసపడి ఆమెను అవమానిస్తుంది. దాంతో భాను తన భార్యను ఐఏయస్ శిక్షణకు పంపిస్తాడు. భాను కూడా నెమ్మదిగా చదవడం, రాయడం, లెక్కలు నేర్చుకుని వ్యాపారం చేసి అభివృద్ధి లోకి వస్తాడు. స్వప్న కలెక్టరవుతుంది. వారిద్దరికీ ఒక కొడుకు పుడితే, భాను తండ్రి గౌరవార్థం ఆ బిడ్డకి హరిశ్చంద్ర ప్రసాద్ అని పేరు పెడతారు. భర్త ఉద్యోగం పోతే మాధవి తన భర్తను వాళ్ళ ఫ్యాక్టరీలో చేర్చుకొమ్మని వారిని అభ్యర్థిస్తుంది.

ఒకసారి హరిశ్చంద్ర ప్రసాద్ బడిలో ఏదో పనిమీద వెళ్ళి వస్తుండగా మనవడు తారసపడతాడు. తన గుమాస్తా ద్వారా అతను భాను కొడుకని తెలుసుకుని రోజూ ఇంట్లో ఎవరికీ తెలియకుండా అతనితో సమయం గడుపుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న భాను, స్వప్న కూడా సంతోషించి ఆయన్ని గౌరవంగా చూడమని పిల్లవాడికి చెబుతారు. ఒకసారి భాను తన తండ్రికిష్టమైన పాయసం చేసి కొడుకు ద్వారా తండ్రికి పంపిస్తాడు. కానీ దారి మధ్యలో సింగరాజు అందులో విషం కలుపుతాడు. అది తాగిన హరిశ్చంద్ర ప్రసాద్ ఆస్పత్రి పాలవుతాడు. సింగరాజు ఆ నేరం భాను మీద వేస్తాడు. అందరూ కలిసి భాను మీద దాడి చేస్తుంటే ఆస్పత్రిలో కోలుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ వచ్చి అందరికీ జరిగిన నిజాన్ని చెప్పి కొడుకుని రక్షిస్తాడు. కుటుంబం అంతా కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

నటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీత దర్శకత్వం వహించాడు. ఆడియో ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో మొత్తం ఎనిమిది పాటలున్నాయి. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, చిత్ర, సుజాత, మనో పాటలు పాడారు. పాటలు మంచి ప్రజాదరణ పొందాయి.

పాట పాడినవారు రాసినవారు
అడుగో మహారాజు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెల
రోజావే చిన్ని రోజావే హరిహరన్ సామవేదం షణ్ముఖ శర్మ
రోజావే చిన్ని రోజావే చిత్ర సామవేదం షణ్ముఖ శర్మ
చుక్కలన్నీ ముగ్గులై బాలు, సుజాత సిరివెన్నెల
కిల కిల నవ్వే కోయిల కోసం బాలు, చిత్ర ఇ.ఎస్. మూర్తి
ఝలకు ఝలకు సిలుకు చీర మనో, చిత్ర భువన చంద్ర

మూలాలు

[మార్చు]
  1. "Suryavamsam Full Movie". youtube.com. Telugu Movies. Retrieved 1 September 2016.
  2. "Venkatesh in 'Suryavamsam' - Tollywood stars who played dual roles on-screen". The Times of India. Retrieved 2020-08-28.
  3. "టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సూర్యవంశం..ఏ సినిమా రీమేక్ తెలుసా..? - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-08-28.

బయటి లింకులు

[మార్చు]