హైదరాబాదు చెరువులు
హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్ర రాజధాని. ఈ హైదరాబాదులో 185కు పైగా చెరువులు ఉన్నాయి. వీటిలో చాలా చెరువులు పర్యాటక ప్రాంతాలుగా రూపుదిద్దుకున్నాయి.[1]
చెరువుల వివరాలు
[మార్చు]హుస్సేన్ సాగర్
[మార్చు]హజ్రత్ హుస్సేన్ షా వాలి 1562లో మూసీనదికి అనుబంధంగా హుస్సేన్ సాగర్ (మానవనిర్మిత) చెరువుని నిర్మించాడు. చెరువు ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండి సికింద్రాబాదు, హైదరాబాదు జంట నగరాలను కలుపుతూ ట్యాంక్‌బండ్ ఉంటుంది. 1992లో ఏక శిలతో రూపొందిన బుద్ధుని విగ్రహం ఈ హుస్సేన్ సాగర్ మధ్యలో ప్రతిష్ఠించబడింది.
దుర్గం చెరువు
[మార్చు]జూబ్లీ హిల్స్, మాదాపూర్ ప్రాంతానికి మధ్యలో ఈ దుర్గం చెరువు ఉంటుంది. ఇది మహమ్మద్ కులీ కుతుబ్ షా సామ్రాజ్యంలో, గోల్కొండ కోటలో, కోట సమీపంలో ఉన్న ప్రజలకి మంచి నీటి సదుపాయం కల్పించింది. రైతులు వ్యవసాయంలో నీటి పారుదల కోసం ఈ చెరువును ఉపయోగించేవారు.
ఉస్మాన్ సాగర్
[మార్చు]ఉస్మాన్ సాగర్ను గండిపేట చెరువు అనికూడా పిలుస్తారు. 1920 లో నిర్మితమైన ఈ చెరువు అప్పటినుంచి హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల గ్రామాలకు మంచి నీటి అవసరాలని తీరుస్తున్నది. మూసీ నదికి 1908నాటి హైదరాబాదు వరదలు వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించి మూసీనదిపై ఈ చెరువు నిర్మించారు. ఆఖరి నిజాం అయిన ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ చెరువు నిర్మితమైనందువల్ల అయన పేరుమీద ఈ చెరువుని ఉస్మాన్ సాగర్ లేక్ అని పిలుస్తారు. ఈ చెరువు చుట్టూ 46 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, జలాశయం 29 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది. జలాశయం 1,790 అడుగుల లోతు, 3.9 టిఎంసి అడుగుల సామర్థ్యం కలిగివుంది.[2]
హిమాయత్ సాగర్
[మార్చు]మూసీ నది యొక్క ఉపనది అయిన "ఈసి" పై ఈ హిమాయత్‌సాగర్ యొక్క నిర్మాణం 1927 లో పూర్తయినది. ఈ రిజర్వాయరును హైదరాబాదు ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చుటకు, 1908 లో హైదరాబాదుకు వరదలు వచ్చినందువల్ల వాటి బారి నుండి రక్షించుటకు నిర్మించారు. ఈ నిర్మాణం హైదరాబాదు చివరి నిజాం అయిన ఒస్మాన్ అలీ ఖాన్ ద్వారా జరిగింది. ఆయన కుమారుడు అయిన "హిమాయత్ అలీ ఖాన్" పేరుతో ఈ జలాశయానికి "హిమాయత్ సాగర్" అని నామకరణం జరిగింది.
సఫిల్‌గూడ చెరువు
[మార్చు]నడిమి చెరువుగా కూడా పిలవబడే సఫిల్‌గూడ చెరువు ఓల్డ్ నేరేడ్‌మెట్‌లో ఉంది. ఈ చెరువులో చిన్న ఐస్‌ల్యాండ్ ఉండడంతో దీన్ని నడిమి పక్షి ఐస్‌ల్యాండ్‌గా పిలుస్తున్నారు. దీన్ని దట్టమైన వృక్షాలు కప్పి ఉంటాయి. ఈ చెట్లమీదా వేలాది రకరకాల పక్షులు సేదతీరుతుంటాయి. ప్రత్యేకంగా వలస పక్షులు అలరిస్తుంటాయి. చెరువు కట్టమీద కట్టమైసమ్మ దేవాలయం ఉంది.
అల్వాల్ చెరువు
[మార్చు]అల్వాల్ చెరువు సికింద్రాబాదుకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెరువు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ చెరువు అల్వాల్ ముఖ్యప్రాంతంలో సికింద్రాబాద్-ముంబై రైల్వే ట్రాక్ దగ్గరలో ఉంది. ఈ రైల్వే ట్రాక్ నుండిగానీ, అల్వాల్ రైల్వే స్టేషన్ నుండిగానీ చూస్తే అందమైన అల్వాల్ చెరువు కనిపిస్తుంది. ఈ చెరువు పక్కన రహదారి కూడా ఉంది. ఈ చెరువు వివిధ రకాలుగా ఉపయోగించబడుతుంది. దీని సమీపంలో చాలా పక్షులు, జంతువులు నివసిస్తుంటాయి. సాయంత్రం సమయంలో చాలామంది ఈ చెరువు దగ్గరికి వచ్చి ఆహ్లాదంగా గడిపి వెలుతుంటారు.
రామాంతపూర్ చెరువు
[మార్చు]రామాంతపూర్ చెరువును పెద్ద చెరువు అని కూడా పిలుస్తున్నారు. రామాంతపూర్‌లో ఉన్న ఈ చెరువు నగరంలోని పెద్ద చెరువులలో ఒకటి. ప్రతిరోజు ఇక్కడికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
షామీర్‌పేట్ చెరువు
[మార్చు]షామీర్‌పేట్ చెరువును పెద్ద చెరువు అని పిలుస్తారు. దీనిని ఇది ఒక విహారస్థలంగా కూడా అభివృద్ధి చెందినది. సెలవు దినాలలో పరిసర ప్రాంతవాసులచే ఈ చెరువు పర్యాటక ప్రాంతంగా కనిపిస్తుంది. రాజీవ్ రహదారి ఈ చెరువు కట్టపై నుంచే వెళుతుంది. అంతేకాకుండా ఈ చెరువు పరిసరాలలో జవహర్ దుప్పుల పార్కు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం కూడా ఉన్నాయి.
సరూర్‌నగర్ చెరువు
[మార్చు]16వ శతాబ్దం 1626లో కులీ కుతుబ్‌షా పాలనాకాలంలో, పంటపొలాలకు నీరందించేందుకు సరూర్‌నగర్ చెరువు కట్టించబడింది. ఈ చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా విస్తరించడంతో పాటు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. దాంతో పర్యాటకుల సంఖ్య పెరిగి, ఇక్కడికి ప్రతిరోజు సాయంత్రం వందలాది మంది విహారానికి వస్తుంటారు.
అమీనాపూర్ చెరువు
[మార్చు]అమీనాపూర్ చెరువును తెలంగాణ ప్రభుత్వం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ప్రతి చలికాలంలో ప్లెమింగో వంటి అరుదైన పలు రకాల పక్షులు, అందమైన కొంగలు, వివిధ దేశాల పక్షులు ఇక్కడికి వలస వస్తాయి.
జీడిమెట్ల చెరువు
[మార్చు]నగరంలో ఐదవ పెద్దచెరువుగా పేరున్న జీడిమెట్ల చెరువును నక్కసాగర్ చెరువు, కొల్లచెరువు అనికూడా పిలుస్తారు. 1897లో నిజాం నవాబులు ఈ చెరువును నిర్మించారు. రెండు కిలోమీటర్లకు పొడవు వెడల్పుతో ఉండే ఈ చెరువు కొంపల్లికి సమీపంలోని జీడీమెట్లలో ఉంది. ఇది చేపల వేట, పిక్నిక్‌లకు అనువైన చెరువు.
ఐడీఎల్ చెరువు
[మార్చు]ఐడీఎల్ చెరువు కూకట్‌పల్లి లో ఉంది. ఈ చెరువు కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
బంజారా చెరువు
[మార్చు]హైదరాబాదులోని బంజారా హిల్స్ ప్రాంతంలో ఈ బంజారా చెరువు ఉంది.
ఇతర చెరువులు
[మార్చు]మంత్రాల చెరువు, కొత్త చెరువు, ఐడీపీఎల్ చెరువు, హస్మత్‌పుర చెరువు, బాలాజీనగర్ చెరువు, కౌకూర్ చెరువు, సూరారం చెరువు, లింగంచెరువు, వెన్నెలగడ్డ చెరువు, ప్రగతినగర్ చెరువు, కాప్రా చెరువు, కీసర చెరువు, పూడురు చెరువు, ఎల్లమ్మపేట చెరువు, మేకంపూర్ చెరువు, నల్లచెరువు, కాటేదాన్ దగ్గర పల్లె చెరువు మొదలైన చెరువులు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Retrieved 12 December 2017.
- ↑ "Hyderabadis can bid goodbye to water woes". The Hindu. 10 October 2016. Retrieved 12 December 2017.