అశ్వఘోషుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశ్వఘోషుడు
చైనీయ ఊహాచిత్రణలో అశ్వఘోషుడు
జననంసా.శ. 80
సాకేతపురం (అయోధ్య)
మరణంసా.శ. 150
పెషావర్ (ప్రస్తుత పాకిస్తాన్)
వృత్తిబౌద్ధ దార్శనికుడు, సంస్కృత పండితుడు, మహాకవి, నాటకకర్త
ప్రసిద్ధిసంస్కృత వాజ్మయమున తొలి నాటకకర్త
ముఖ్యమైన సేవలునాల్గవ బౌద్ధ సంగీతికి ఉపాధ్యక్షుడు
మతంబౌద్ధమతం
తల్లిసువర్ణాక్షి
రచనలు: బుద్ధచరితం, సౌందరనందం, సారిపుత్ర ప్రకరణం, వజ్రసూచి

ఆశ్వఘోషుడు క్రీ. శ. 80–150 కాలానికి చెందిన బౌద్ధ దార్శనికుడు. సంస్కృత పండితుడు. మహాకవి. నాటకకర్త. ఇతనిని సంస్కృత వాజ్మయమున తొలి నాటకకర్తగా భావిస్తారు. అశ్వఘోషుడు కాళిదాసు కన్నా పూర్వుడని, కాళిదాసుని కవిత్వంపై అశ్వఘోషుని ప్రభావం వుందని పాశ్చాత్య సంస్కృత సాహిత్యకారులందరూ తేల్చి చెప్పారు.[1] [2] బౌద్ధ దార్శనికుడైన ఆశ్వఘోషుడు బౌద్ధ ధర్మాన్ని ప్రజలలో ప్రచారం చేయడానికి తన కవిత్వాన్ని ఒక సాధనంగా చేసుకొన్నాడు. అయితే దార్శనికుడుగా కంటే మహాకవిగా ఎక్కువ గుర్తింపు పొందాడు. సమకాలీన రామాయణానికి పోటీగా కావ్యాలను రచించిన బౌద్ధ కవులలో అత్యంత ప్రాచుర్యం పొందాడు.[3] ఇతను రచించిన సంస్కృత గ్రంథాలలో బుద్ధచరితం, సౌందరనందం అనే రెండు మహా కావ్యాలు, సారిపుత్ర ప్రకరణం అనే నాటకం, వజ్రసూచి అనే బౌద్ధ ధర్మ సంబందమైన గ్రంథం ముఖ్యమైనవి.

అశ్వఘోషుని కాల నిర్ణయం

[మార్చు]

అశ్వఘోషుని బుద్ధచరితం క్రీ. శ. 5 వ శతాబ్దంలో 'ధర్మరక్షక' అనే భారతీయ బౌద్ధ పండితునిచే చైనా భాషలోనికి అనువదించబడింది. దీనిని బట్టి అశ్వఘోషుడు సా.శ. 5 వ శతాబ్దానికి పూర్వమే వున్నవాడని తెలుస్తుంది. చైనా సంప్రదాయం ప్రకారం అశ్వఘోషుడు కుషాణుల రాజైన కనిష్కుని ( క్రీ. శ. 75–150) సమకాలికుడు. చారిత్రిక స్పృహా గల చైనీయుల సంప్రదాయం సత్యమే అని పాశ్చాత్యులు అంగీకరిస్తున్నారు.[4] ఇ. హెచ్. జాన్సన్ ప్రకారం అశ్వఘోషుని కాలం క్రీ. పూ. 50 నుండి క్రీ. శ. 150 మధ్య ఉండవచ్చని భావించాడు. మధ్య ఆసియాలో లభించిన అశ్వఘోషుని సారిపుత్ర ప్రకరణం నాటకపు మూల సంస్కృత ప్రతి కుషాణుల కాలానికి (కనిష్కుడు లేదా హావిష్కుడు) చెందినదని ప్రముఖ జర్మన్ ప్రాచ్య పరిశోధకుడు, ఇండాలజిస్ట్ అయిన లూడర్స్ (Heinrich Lüders) పండితుడు నిర్ణయించాడు. దీన్ని బట్టి అశ్వఘోషుడిని క్రీ. శ. 80-150 మధ్య కాలంలో జీవించిన కవిగా, కుషాణుల చక్రవర్తి కనిష్కుని సమకాలికునిగా నిర్ణయించారు.

జీవిత విశేషాలు

[మార్చు]

క్రీ. శ. 1, 2 శతాబ్దాలకు చెందిన మహాకవి అశ్వఘోషుని జీవిత విశేషాలు కొద్దిగా మాత్రమే తెలుస్తున్నాయి. ఇతని సౌందరనందం కావ్యం చివర 18 వ సర్గలో " ఆర్య సువర్ణాక్షీపుత్రస్య సాకేతకస్య భిక్షోరాచార్యస్య భదంతాశ్వఘోషస్య మహాకవేర్మహా వాదినః కృతిరియమ్ " అన్న వాక్యాన్ని బట్టి ఇతను సాకేత (అయోధ్య) పురవాసి. తల్లి సువర్ణాక్షి. బౌద్ధ ఆచార్యుడు. మహాకవి అని తెలుస్తుంది.[4] శుద్ధ శ్రోత్రియ వైదిక బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అశ్వఘోషుడు వేద ధర్మ శాస్త్రాలను అధ్యయనం చేసాడు. తరువాత బ్రాహ్మణమతం నుండి బౌద్ధంలోకి మారాడు. చైనీయుల సంప్రదాయం ప్రకారం అశ్వఘోషుడు తొలుత బౌద్ధంలోని సర్వాస్తి వాద శాఖకు చెందినవాడుగా ఉన్నాడు. తరువాత తన జీవితంలో వివిధ దశల్లో బౌద్ధంలోని వివిధ శాఖలను అభిమానించి చివరకు అశ్వఘోషుడు మహాసాంఘికానికి సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తుంది. సౌందరానందం రచించే నాటికి అతను బౌద్ధంలోని యోగాచార లేదా సౌత్రాంతిక ప్రభావానికి లోనైనాదని తెలుస్తుంది. గతంలో అశ్వఘోషుడిని మహాయానకాలానికి చెందినవాడిగా భావించినప్పటికీ నేడు అతనిని మహాసాంఘిక శాఖకు చెందినవానిగా విశ్వసిస్తున్నారు.

క్రీ. శ. 5 వ శతాబ్దికి చెందిన కుమారజీవుడు ఇతని జీవిత చరిత్రను చైనా భాషలోనికి అనువాదం చేసాడు.[5][6] దీని ప్రకారం ఆశ్వఘోషుడు బౌద్ధం స్వీకరించిన విధానం క్రింది విధంగా ఉంది. అశ్వఘోషుడు మొదటినుండి ఒక సన్యాసిగా సంచరించేవాడు. వాదనలో ప్రతీవారిని ఓడించగలవాడని ప్రతీతి. ఒకసారి బౌద్ధ్ధ బిక్షువులకు సవాల్ విసిరాడు. తనతో వాదనలో గెలిచినవారు తప్ప అన్య బిక్షువులెవరూ భిక్షకోసం గృహస్థుల ఇళ్ళ ముందు కొయ్యతో చేయబడ్డ తమ బిక్షాపాత్రలను మోగించకూడదని సవాల్ చేసాడు. అయితే బౌద్ధ భిక్షువులు అతనితో వాదనకు దిగలేక భిక్షకోసం తమ తమ భిక్షాపాత్రలను మోగించడం మానుకోవడం జరిగింది. ఇతని ప్రతిభ తెలిసిన పార్శ్వుడు (Parsa) అనే వృద్ధ బౌద్ధ గురువు ఇతను బౌద్ధ ధర్మ వ్యాప్తికి తోడ్పడగల సమర్ధుడవుతాడని భావించాడు. అందువలన సదూర ఉత్తర భారతదేశం నుండి వచ్చి అతనితో వాదనకు సిద్ధపడతాడు. రాజాస్థానంలో బ్రాహ్మణులు, సాధువుల సమక్షంలో వాదన ప్రారంభమైనది. ఓడినవారు గెలిచిన వారికి శిష్యునిగా మారవలెనని ఉభయులూ అంగీకరించారు. వాదనలో మొదటగా పార్శ్వుడు “ఈ ప్రపంచంలో శాంతి, సుస్థిరం, సుభిక్షితం నెలకొనాలంటే, ప్రజలందరూ దుఖానికి గురికాకండా వుండాలంటే ఏం చేయాలి?” అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నిరిత్తురుడైన అశ్వఘోషుడు మారుమాట్లాడకుండా పార్శ్వునకు శిష్యునిగా మారిపోతాడు. అతని ప్రభావంతో పార్స్వునకు శిష్యుడైన పూర్ణ యశుని వద్ద బౌద్ధ ధర్మ దీక్షను స్వీకరించి బిక్షువుగా మారాడు. ఈ విధంగా అశ్వఘోషుడు బౌద్ధ ధర్మంలో నిష్ణాతుడైనట్లు, కుసుమపురంలో (పాట్నా) బుద్ధ ధర్మాన్ని ప్రచారం చేసాడని చైనీయుల ఇతిహ్యం.

తరువాత కుషాణుల రాజు కనిష్కుడు పాఠలీపుత్రంపై దండెత్తి మగధను జయించడం జరిగింది. యుద్ధంలో గెలిచిన కనిష్కుడు, యుద్ధ పరిహారంగా మూడు లక్షల సువర్ణ నాణేలను చెల్లించవలసినదిగా ఓడిన మధ్య భారత రాజును (వారణాసి రాజు కావచ్చు) కోరాడు. అయితే ఆ రాజు ఒక లక్ష సువర్ణ నాణేలను మాత్రమే ఇచ్చుకోగలనన్నాడు. కనిష్కుడు మిగిలిన రెండు లక్షల నాణేలకు బదులుగా బుద్ధుని బిక్షాపాత్రను, ఒక బౌద్ధ బిక్షువును తనతో పంపించవలసిందిగా కోరాడు. మధ్య భారత రాజు చింతాక్రాంతుడైనప్పుడు అశ్వఘోషుడు అతనికి నచ్చచెప్పి తనను కనిష్కునితో పంపించమని, ఇది బౌద్ధ ధర్మాన్ని నాలుగు ఖండాలలోనూ వ్యాపితం చేయడానికి వచ్చిన ఒక సదవకాశంగా భావిస్తానని తెలిపాడు. ఆ విధంగా మధ్య భారత రాజు నుండి అశ్వఘోషుడిని స్వీకరించి కనిష్కుడు తన రాజధాని పెషావర్ (పుష్కలావతి నగరం) కు తోడ్కొని పోయాడు.

మరో ఇతిహ్యం ప్రకారం ఒక లక్ష సువర్ణ నాణేల విలువకు ప్రతిగా పొందిన అశ్వఘోషుడు నిజంగా అంతటి విలువ గలవాడేనా అని కనిష్కుని మంత్రులకు సందేహం వచ్చింది. అశ్వఘోషుని విశిష్టతను తెలిసిన చక్రవర్తి కనిష్కుడు అది తెలియ చెప్పడం కోసం ఒక సమావేశం ఏర్పాటు చేసి అశ్వఘోషుని బౌద్ధ ధర్మ పఠనం చేయమన్నాడు. సభలో అశ్వఘోషుడు ధర్మోచ్చారణకు సిద్ధం అయినప్పుడు, అంతకు ముందే ఆహారం ఇవ్వకుండా ఆరు రోజులు పాటు మాడ్చిన గుర్రాలను అశ్వశాల నుండి సభకు తెప్పించి ఆకలితో నకనకలాడుతున్న ఆ గుర్రాల ముందు మంచి ఆహారం వుంచడం జరిగింది. అయితే అశ్వఘోషుడు ధర్మ పఠనానికి మంత్రం ముగ్ధులైన ఆ అశ్వాలు తమ ముందు ఆహారం సిద్ధంగా ఉన్నప్పటికీ ముట్టకుండా ఘోషిస్తూ ఉన్నాయి. ఆ నాటి నుండి అతని పేరు ఆశ్వఘోషుడిగా స్థిరపడింది.

కుమారజీవుడు అనువదించిన అశ్వఘోషుని జీవిత చరిత్రలో చారిత్రకాంశాల కంటే కట్టుకథలే ఎక్కువమంది పండితులు అభిప్రాయపడుతున్నారు.[7] ఏది ఏమైనా కనిష్కుని ఆస్థానంలో ప్రవేశించిన అశ్వఘోషుడు సమున్నతంగా గౌరవించబడ్డాడు. కాశ్మీర్‌లో జరిగిన నాల్గవ బౌద్ధ సంగీతికి అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించబడ్డాడు. అశ్వఘోషుని ప్రేరణచే కనిష్కుడు సైతం బౌద్ధమతాన్ని స్వీకరించి మధ్య ఆసియా, చైనా, టిబెట్, జపాన్ తదితర దేశాలలో బౌద్ధధర్మవేత్తలను (Buddhist Missions) పంపి బౌద్ధమత వ్యాప్తికి పాటుపట్టాడు.

అశ్వఘోషుడు రచనలు

[మార్చు]

అశ్వఘోషుడు తొలుత బౌద్ధ దార్శనికుడు. తరువాతనే కవి, నాటకకర్త. తన బౌద్ధ ధర్మాన్ని ప్రజలలో ప్రచారం చేయడానికి కవిత్వాన్ని ఒక ఆలంబనగా చేసుకొన్నాడు. అయితే బౌద్ధ తత్వవేత్త కన్నా బౌద్ధ మహాకవి గానే ప్రఖ్యాతి పొందాడు. ఇతను రచించిన కృతులన్నీ బౌద్ధధర్మావలంబనాలుగా ఉన్నాయి. ఇతనికి ముందు కాలంలో రచించబడిన బౌద్ధ సాహిత్యంలో అత్యధిక భాగం బౌద్ధంతో మిళితమైన సంస్కృతంలో వుండగా అశ్వఘోషుడు శాస్త్రీయమైన సంస్కృత భాషలో, కావ్యశైలిలో తన గ్రంథాలను రాసాడు.[8] ఇతడు అనేక గ్రంథాలను రచించాడని ప్రతీతి ఉంది. ఇతని పేరుమీదుగా అనేక బౌద్ధ దార్శనిక గ్రంథాలు చైనా, జపాన్ దేశాలలో ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఇతని రచనలుగా గుర్తించబడిన వాటిలో ముఖ్యమైనవి.

  • బుద్ధచరితం
  • సౌందరానందం
  • సారిపుత్ర ప్రకరణం
  • వజ్రసూచి

ఇవే గాక గండీస్తోత్రం, మహాయాన శ్రద్ధోత్పాదం, సూత్రాలంకారం, రాష్ట్రపాల అనే గేయనాటకం రచనలు అశ్వఘోషునికి అపాదించబడుతున్నాయి.

బుద్ధచరితం

[మార్చు]

బుద్ధుని జననం నుంచి నిర్వాణం వరకు గల జీవిత చరిత్రను 28 సర్గలలో సమగ్రంగా వర్ణించే ఈ గ్రంథం సంస్కృతంలో మహాకావ్యంగా గుర్తింపు పొందింది. క్రీ. శ. 10-12 శతాబ్దాలలో కొనసాగిన ముస్లిం దండయాత్రలలో మూల సంస్కృత ప్రతిలోని సగ భాగం ధ్వంసమైపోయింది.[9] సంస్కృత భాషలో కేవలం 14 సర్గలతో మాత్రమే లభ్యమైంది. క్రీ. శ. 5 వ శతాబ్దంలో 'ధర్మరక్షిత' బౌద్ధ పండితునిచే చైనా భాషలోనికి 28 సర్గలతో పూర్తిగా అనువదించబడింది. ఈ కావ్యంలో బుద్ధుని మహాభిష్క్రమణం, తపస్సు, మారుని ప్రలోభాలు, మారునిపై విజయం మొదలైన ఘట్టాలు ఉజ్వలమైన, లలితమైన కావ్య శైలిలో రచించబడ్డాయి.

సౌందరానందం

[మార్చు]

బుద్ధుని సోదరుడు నందుడు. భార్యానురక్తుడై, సుఖకాంక్షా పరుడైన నందుని బుద్ధుడు మనస్సు మార్చి బౌద్ధధర్మంలోనికి మళ్ళింప చేయడం దీని ఇతివృత్తం. సుందరీ-నందుల ప్రణయం, బౌద్ధ ధర్మ ఉపదేశాలతో సందేశాత్మకంగా ఉంది. ఇందలి ప్రథమార్ధ భాగం నందుని జీవితంను, ద్వితీయార్ధ భాగం బౌద్ధ సిద్ధాంతాలను, సన్యాసి ఆచరించవలసిన పద్ధతులను వివరిస్తుంది.[10][11] 18 సర్గలతో వున్న ఈ మహా కావ్యం సంస్కృత భాషలో పూర్తిగా లభించింది.

సారిపుత్ర ప్రకరణం

[మార్చు]

బుద్ధుడు సారిపుత్ర, మౌద్గలాయనుడు అనే ఇద్దరు బ్రాహ్మణ పండితులకు బౌద్ధ ధర్మ దీక్షను ఇవ్వడం దీనిలోని ప్రధాన ఇతివృత్తం. బౌద్ధ తాత్విక చర్చలతో ముడిపడి వున్న ఈ రూపకం అశ్వఘోషుని దార్శనికత్వ ప్రతిభను వెల్లడిస్తుంది. 9 అంకాలతో వున్న ఈ సంస్కృత నాటక మూల ప్రతి తొలిసారిగా క్రీ. శ. 1910 లో మధ్య ఆసియాలోని తుర్ఫాన్ లోయలో లభించింది. దీనితో అప్పటివరకూ కావ్యకర్తగానే పరిచితుడైన అశ్వఘోషుడు నాటకకర్తగా కూడా సంస్కృత సాహిత్యలోకంలో ప్రసిద్ధుడయ్యాడు. సంస్కృత వాజ్మయమున అశ్వఘోషుడినే తొలి నాటకకర్తగా భావిస్తారు. అంతేకాక ఇతను బౌద్ధ ధర్మానికి సంబంధించి తొలి నాటకకర్తగా కూడా గుర్తించబడ్డాడు.

వజ్రసూచి

[మార్చు]

అశ్వఘోషుడు రచించిన వజ్రసూచి 37 సూత్రాలతో కూడిన చిన్న గ్రంథం. ఈ గ్రంథం బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థకు ఆధారమైన వర్ణవ్యవస్థను తీవ్రంగా ఖండించింది.[12] ఇది దార్శనిక గ్రంథమూ కాదు. కావ్యం కాదు. సామాజిక దర్శనం (Social Philosophy) పై వెలువడిన తొలి గ్రంథం.[13] వజ్రసూచిని అశ్వఘోషుడి రచనగా ఇప్పుడు పరిశోధకులందరూ అంగీకరిస్తున్నా, గతంలో ఇది అశ్వఘోషుడి రచనా, కాదా అనే చర్చ జరిగింది.[14] వజ్రసూచిలో “సర్వవర్ణ ప్రధానం బ్రాహ్మణ వర్ణం” అనే విషయాన్ని చర్చిస్తూ అశ్వఘోషుడు బ్రాహ్మణుడంటే ఎవరు? అనే ప్రశ్నతో విశ్లేషించి అది ఎంత అహేతుక భావనో నిరూపిస్తాడు. వజ్రసూచిని అనుకరిస్తూ 9 సూత్రాలతో సంగ్రహ రూపంలో వెలువడినదే వజ్రసూచికోపనిషత్తు. [15]

గండీస్తోత్రం

[మార్చు]

బుద్ధుని స్తుతిస్తూ 20 శ్లోకాలతో సంగ్రహంగా నున్న గండీస్తోత్రం అశ్వఘోషుని రచనగా వ్యవహరించబడుతుంది.[16] హోల్‌స్టెన్ అనే విమర్శకుడు చైనా లిపి నుంచి దీని ప్రతిలిపిని ముద్రించాడు.[16] సంస్కృతంలో ప్రప్రథమంగా స్తోత్ర రచన చేసిన ప్రతిభ గండీస్తోత్ర కర్త అశ్వఘోషునికే దక్కుతుంది.[17]

సిల్వైన్ లెవి (Sylvain Levi) పండితుని ప్రకారం 'రాష్ట్రపాల' అనే గేయ నాటకం అశ్వఘోషుని రచన.[16] దీని కొద్ది అవశేషం మాత్రమే లభ్యమైంది. 'సూత్రాలంకారం' రచన కూడా అశ్వఘోషునిదిగా భావిస్తున్నారు.

మహాయానానికి మూల గ్రంథం లాంటి 'మహాయాన శ్రద్ధోత్పాదం' (Awakening of Faith in the Mahayana) అనే గ్రంథాన్ని అశ్వఘోషుడు తన జీవిత చివరి దశలో మహాయానానికి సన్నిహితంగా మెలిగినపుడు రచించి వుండవచ్చని గతంలో భావించారు. అయితే ఆధునిక పరిశోధకులు ఈ గ్రంథం చైనాలో కూర్చబడినదని (composed) అంగీకరిస్తున్నారు.[18][19] ఈ కారణంగానే అశ్వఘోషుడు మహాయాన కాలానికి చెందినవాడు కాదని, మహాసాంఘిక శాఖకు చెందినవానిగా ప్రస్తుతం విశ్వసిస్తున్నారు.[20]

ఇటీవల అశ్వఘోషుని కావ్య శ్లోకాలపై చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం అవి యోగాచార భూమి సాంప్రదాయకతకు అనుగుణంగావున్నాయని, ముఖ్యంగా అతని సౌందరానందం లోని శ్లోకాలను బట్టి అశ్వఘోషుడు బౌద్ధంలోని యోగాచార శాఖ లేదా సౌత్రాంతిక శాఖకు చెందినవాడు కావడానికి ఆస్కారం వుందని కూడా వెల్లడయ్యింది.[21]

సంస్కృత సాహిత్యంలో తొలి నాటకకర్త

[మార్చు]

అశ్వఘోషుడు, భాసుడు ఇద్దరూ సంస్కృత నాటకకర్తలు. వీరిరువురి కవిత్వంలో అనేక పోలికలు కనిపిస్తాయి. అశ్వఘోషుని కాలం క్రీ. శ. 80–150 మధ్య ఉంటుందని పాశ్చాత్యులు నిర్ణయించారు. మహాకవి, సంస్కృత నాటకకర్త అయిన భాసుని కాలంపై అనిశ్చితి నెలకొనినప్పటికి నేడు అత్యధికులు భాసుని క్రీ. శ. 3 లేదా 4 శతాబ్దాలకు చెందిన కవిగా పరిగణిస్తున్నారు.[22][23] అయినప్పటికీ భాసుడు ఇంకనూ ఆర్వాచీనుడే నని భారతీయ సంస్కృత పండితులు విశ్వసిస్తారు. భారతీయ సంస్కృత సాహిత్యంలో తులనాత్మక అధ్యయనం చేసిన పాశ్చాత్య సంస్కృత పండితుడు, షెల్డన్ పొల్లాక్ (Sheldon Pollock) భాసుడు క్రీ. పూ. 4 వ శతాబ్దానికి లేదా అంతకన్నా పూర్వ కాలానికి చెందిన వాడన్న అభిప్రాయాలను కేవలం ఊహాజనితమైన అభిప్రాయాలుగా కొట్టిపారేశారు.[24] అశ్వఘోషుని కవితా ప్రభావం కాళిదాసు మీదనే కాకుండా భాసుని మీద కూడా వుందని ఇ. హెచ్. జాన్సన్ అభిప్రాయపడ్డాడు.[1] [7] అదే విధంగా సాహిత్య పరిశోధకుడు, విమర్శకుడు దివాకర్ల వేంకటావధాని కూడా భాస, కాళిదాసు లిరువురును ఆశ్వ ఘోషుని కావ్యాలను, రూపకాలను చదివి ప్రభావితమైనారని పేర్కొన్నారు.[25]

దీనిని బట్టి బౌద్ధ అశ్వఘోషుడు క్రీ. శ. 1, 2 శతాబ్దాలకు చెందినవాడని, భాసుడు క్రీ. శ. 3 లేదా 4 శతాబ్దాలకు చెందిన కవి అని తెలుస్తుంది. కనుకనే భాసుడి కన్నా ప్రాచీనుడైన మహాకవి ఆశ్వఘోషుడినే సంస్కృత వాజ్మయమున తొలి నాటకకర్తగా పరిగణిస్తారు. బౌద్ధ ధర్మ సంబందమైన ప్రథమ నాటకం సారిపుత్ర ప్రకరణం రచించిన ఆశ్వఘోషుడిని తొలి బౌద్ధ నాటకకర్తగా కూడా గుర్తించారు.

కాళిదాసు కవిత్వంపై అశ్వఘోషుని ప్రభావం

[మార్చు]

అశ్వఘోషుడు, కాళిదాసు లిరువురూ సంస్కృత సాహిత్యంలో మహాకవులు. ఒకరు బౌద్ధధర్మానికి అంకితమైన కవి. మరొకరు వైదికమతానురక్తుడైన కవి. వీరిరువురి కవిత్వంలో కూడా అనేక పోలికలు కనిపిస్తాయి. భావాలంకారాలు, సన్నివేశాలు సైతం ఉన్నదున్నట్లుగా అనుకరించబడ్డాయి. కవిత్వంలో ఎవరి ప్రభావం ఎవరిపై వుంది అనేది తెలియాలంటే ముందుగా ఈ ఇద్దరు మహా కవుల జీవితకాలాలు ఇతమిద్ధంగా తేల్చవలసిన అవసరం వుంటుంది. అశ్వఘోషుని కాలం క్రీ. శ. 80–150 ల మధ్య ఉంటుందని పాశ్చాత్యులు నిర్ణయించారు. ఇకపోతే మహాకవి కాళిదాసు కాలగణనలో కూడా ఎంతో అనిశ్చితి ఉంది. అత్యధికులు క్రీ. శ. 5 వ శతాబ్దంలో కాళిదాసు జీవించి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు.[26]

ప్రాచీన, మధ్యయుగ సాహిత్యలోకం కాళిదాసుని విక్రమాదిత్యుని ఆస్థాన కవిగా గుర్తించింది. విక్రమాదిత్య అనే పేరుగల ఒక పౌరాణిక రాజు, ఉజ్జయినిని క్రీ. పూ. 1 వ శతాబ్దంలో పాలించినట్లు చెబుతారు. చారిత్రకంగా మాత్రం చూస్తే ఈ విక్రమాదిత్య బిరుదును స్వీకరించిన రాజులు రెండవ చంద్రగుప్తుడు (క్రీ. శ. 380–415) లేదా యశోధర్ముడు ( (క్రీ. శ. 6 వ శతాబ్దం) గా ఉన్నారు.[27] అయితే అత్యంత ప్రాచుర్యం పొందిన సిద్ధాంతం ప్రకారం, గుప్తుల కాలానికి చెందిన కాళిదాసు, విక్రమాదిత్య బిరుదాంకితుడైన రెండవ చంద్రగుప్తుని (క్రీ. శ. 380–415) ఆస్థానంలో విలసిల్లాడని తెలుస్తుంది. విలియం జోన్స్, ఎ. బి. కీత్ [27] ల కాలం నుండి నేటి వరకు అనేక మంది పాశ్చాత్య పండితులు ఈ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చారు. వాసుదేవ్ విష్ణు మిరాశి, రామ్ గుప్త వంటి అనేకమంది భారతీయ విద్వాంసులు కూడా కాళిదాసుని ఈ కాలానికి చెందినవాడుగానే నిర్ణయించారు.[28][29] ఈ సిద్ధాంతం ప్రకారం, కాళిదాసు విలసిల్లిన కాలం రెండవ చంద్రగుప్తుని (క్రీ. శ. 380–415) చివరికాలం నుండి మొదటి కుమాగుప్తుడు (క్రీ. శ. 414–455),, స్కందగుప్తుడు (క్రీ. శ. 455–467) వరకు బహుశా విస్తరించి వుండవచ్చు.[30][31] కాళిదాసు గురించి పేర్కొన్న అతి పురాతన శిలా శాసనం మాండసార్ లోని సూర్య దేవాలయంలో లభించింది. ఇది కూడా క్రీ. శ. 473 కాలానికి చెందినదిగా నిర్ధారించబడింది.[32]

దీనిని బట్టి కనిష్కుని సమకాలికుడైన బౌద్ధ అశ్వఘోషుడు క్రీ. శ. 1 లేదా 2 శతాబ్దాలకు చెందినవాడని, కాళిదాసు సా.శ. 5 వ శతాబ్దంలో గుప్తుల కాలంలో విలసిల్లిన కవి అని తెలుస్తుంది. వీరిద్దరి సాహిత్యాన్ని తులనాత్మకంగా పరిశోధించిన సాహిత్య విమర్శకులు అశ్వఘోషుని కవిత్వ ప్రభావం కాళిదాసు మీద వున్నట్లు తేల్చారు.[7] కవిగా అశ్వఘోషుని ప్రభావం గురించి వివరించిన సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు దివాకర్ల వేంకటావధాని మాటలలో చెప్పాలంటే “ సంస్కృత వాజ్మయమున కవిగా అశ్వఘోషునికి విశిష్టస్థానముంది. పలువురు లాక్షణికులు తమ గ్రంధాలలో అతని శ్లోకాలను ఉద్ధరించి వున్నారు. భాస, కాళిదాసు లిరువురూ అతని కావ్యములను, రూపకాలను చదివి ప్రభావితులైనారని విమర్శకుల తలంపు”.[25] కనుకనే బౌద్ధ కవి అశ్వఘోషుని తరువాత కాలానికి చెందిన బ్రాహ్మణ మత కవి కాళిదాసు అని చెప్పడంలో ఎటువంటి ఇబ్బందిలేదు. కాని కొంతమంది వైదికమత ప్రభావం గల విమర్శకులు అశ్వఘోషుని కాళిదాసు అనుకరించాడని ఆమోదించలేక, కాళిదాసునే అశ్వఘోషుడు అనుకరించాడని సిద్ధాంతీకరించారు.[7] అయితే సంస్కృత సాహిత్య చరిత్రను తమ ఇష్టాయిష్టాలను ప్రక్కన బెట్టి రాగ ద్వేషాలకు అతీతంగా పరిశోధించిన పాశ్చాత్య విమర్శకులందరూ కాళిదాసు సాహిత్యంపై అశ్వఘోషుని ప్రభావం వుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.[33] కోవెల్ లాంటి పాశ్చాత్య సంస్కృత పండితులు కాళిదాసు అశ్వఘోషుని అనుకరించాడని నిరూపించారు. అశ్వఘోషుని బుద్ధచరితం ప్రభావం కాళిదాసు రఘువంశంపై ఉన్నదని శ్లోకాల ఆధారంతో కోవెల్ నిరూపించాడు.[34]

అశ్వఘోషుని కవితా శైలి

[మార్చు]

అశ్వఘోషుని కావ్యాల్లో శాంతం అంగీ రసం (ప్రధాన రసం) కాగా కరుణ, శృంగార రసాలు అంగ రసాలుగా ఉన్నాయి. కవిత్వం వైదర్భీ రీతి ప్రధానమైంది. కృత్తిమత్వం ఏమాత్రం కనిపించని ఇతని కవిత్వం సహజ సౌందర్యంతో అలరారుతుంది. కవిత్వంలో అడుగడుగునా ప్రసాద మాధుర్య అర్ధ వ్యక్తి గుణాలు కనిపిస్తాయి.[35] అయితే ఇతని కవిత్వంలో పాండిత్య కౌశల ప్రదర్శన కన్నా సర్వ మానవ హితవాదానికి ప్రాధాన్యం కనిపిస్తుంది. తాత్విక జీవనానికి ఉపకరించే సందేశాలను, పారమార్ధిక జీవనానికి తోడ్పడే అనేకానేక ఉపదేశాలను సందర్భోచితంగా సరళ శైలిలో కవిత్వంలో పొదిగి చెప్పడంలో అశ్వఘోషుడు చక్కని కౌశలం ప్రదర్శిస్తాడు.

అశ్వఘోషుని కవిత్వంలో దృశ్య వర్ణనలు అత్యంత సహజంగా వుంటాయి. ముఖ్యంగా ప్రకృతిని అత్యంత రమణీయంగా, మనోహరంగా వర్ణించడంలో అతనికతనే సాటి అనిపిస్తాడు. భావ చిత్రణలో అందులోను సహజ మానవ హృదయ చిత్రణ[36]లో అతనిది అందెవేసిన చేయి. ఎక్కడా కృత్తిమత్వానికి తావులేని అతని భావుకత, వర్ణనలు పఠితుల హృదయాలపై చిత్రాలవలె నిలిచిపోతాయి.

అశ్వఘోషుడు తను చెప్పదలుచుకొన్న భావానికి అనుగుణంగా సరైన ఉపమానాన్ని సందర్భోచితంగా ప్రయోగిస్తాడు. ఇతని ఉపమానాలు అత్యంత స్వాభావికంగా, లలితంగా మనస్సుకు ఆకట్టుకొనేటట్లు వుంటాయి. తన సాటిలేని ఉపమాలంకార ప్రయోగాల ద్వారా గంబీరమైన ధర్మార్ధాలను, సునిశితమైన తాత్విక విషయాలను కూడా అత్యంత సరళ శైలిలో, మనోరంజకంగాను, సులభగ్రాహ్యంగాను, సూటిగా హత్తుకొనేటట్లు చెప్పడం అశ్వఘోషుడికి కొట్టినపిండి. ఇతని కావ్యాలలోని వర్ణించబడిన అలంకారాలు, సన్నివేశాల కల్పనలు ఇతని తరువాత రెండున్నర శతాబ్దాల కాలాంతరానికి చెందిన మహాకవి కాళిదాసు కృతులలో ఉన్నదున్నట్లుగా అనుకరించబడటం సంస్కృత సాహిత్యలోకంలో విస్తృతమైన చర్చను రేకెత్తించింది.

అశ్వఘోషుని వ్యక్తిత్వం, ప్రాచుర్యం-అంచనా

[మార్చు]

అశ్వఘోషుడు తను నమ్మిన బౌద్ధధర్మం ప్రజానీకానికి చేరువ అయ్యేందుకు రచనా మార్గాన్ని ఎంచుకొన్నాడు. సర్వ మానవహితమైన బౌద్ధ ధర్మాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడానికి దార్శనికుడైన ఈ కవికి కవిత్వం చక్కగా ఉపకరించింది. అందుకే అతని కవిత్వంలో కావ్య సౌందర్యం కన్నా బౌద్ధ ధర్మోపదేశానికే ఎక్కువ ప్రాధాన్యత నీయబడింది. బుద్ధచరితంలో తన కావ్య పరమావధి మానవహితం, సౌఖ్యమేనని స్వయంగా అతనే వెల్లడించాడు.

అశ్వఘోషుని రచనలన్నీ అతనిని గొప్ప మానవతావాదిగా నిరూపిస్తాయి. అశ్వఘోషుడు జన్మతః బ్రాహ్మణుడు. ప్రగతిశీల దృక్పధం గల ఇతను వజ్రసూచిలో వైదిక భావజాలానికి ప్రతీకయైన వర్ణధర్మాన్ని తీవ్రంగా ఖండించడమే కాక మానవజాతి సమానతా సూత్రాన్ని ప్రతిపాదిస్తాడు. “సర్వవర్ణ ప్రధానం బ్రాహ్మణవర్ణం” అనే భావాన్ని శాస్త్రబద్ధంగా ప్రశ్నించిన తొలి బ్రాహ్మణుడు ఆశ్వఘోషుడే.[13] అలాగని వైదికమతం పట్ల అశ్వఘోషునికి ద్వేషమున్నట్లు లేదు.[37] రాహుల్ సాంకృత్యాయన్ పండితుడి చారిత్రిక కల్పన ప్రకారం బ్రాహ్మణుడైన అశ్వఘోషుడు ఒక గ్రీకు వనితను ప్రేమించాడు. ఆమె పేరు ప్రభ. అయితే ఆమెను వివాహమాడటానికి సాంప్రదాయవాదులైన తల్లిదండ్రులు అంగీకరించలేదు. తన ప్రేమ వివాహానికి తల్లిని ఒప్పించే క్రమంలో భాగంగా ప్రసిద్ధమైన ఋషుల తల్లులు అబ్రాహ్మణ స్త్రీలని పేర్కొంటాడు.[38] అశ్వఘోషుడు జన్మతః బ్రాహ్మణుడు కాకపొతే ప్రసిద్ధ ఋషుల అబ్రాహ్మణ తల్లుల ప్రస్తావన చేయనవసరం లేదు.[39] ఏదైనప్పటికీ శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు, సకల వేదశాస్త్ర కోవిదుడైన అశ్వఘోషుడు కారణాంతరాల వల్ల బ్రాహ్మణ మతం విసర్జించి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించినట్లు తెలుస్తుంది. ఇతని నాటక రచనపై గ్రీకుల ప్రభావం ఉండవచ్చు.

అశ్వఘోషుని రచనలు భారతదేశంలోనే కాక దక్షిణాసియా దేశాలలో (జావా, సుమిత్రా, మలయా ద్వీపకల్పం) సా.శ. 7 శతాబ్దం నాటికి బహుళ వ్యాప్తిలో వున్నట్లు సా.శ. 675-685 మధ్యకాలంలో భారతదేశంలో పర్యటించిన ఇత్సింగ్ (I-tsing లేదా Yijing) అనే చైనీయ యాత్రికుని రాతలను బట్టి తెలుస్తుంది.[9]మధ్య ఆసియాలో లభ్యమైన అశ్వఘోషుని మూల ప్రతులను బట్టి అతని రచనలు మధ్య ఆసియా (Central Asia) అంతటా వ్యాపించాయి అని తెలుస్తుంది. సా.శ. 403, 414-421 ప్రాంతాలలోనే అతని రచనలు, ఆపాదిత రచనలు టిబెట్, చైనా, జపాన్ భాషలలో అనువదించబడ్డాయి.[7] దీనిని బట్టి భారతదేశంలో మహాకవి కాళిదాసు ప్రభవించిన కాలం (క్రీ. శ. 5 వ శతాబ్దం) నాటికే అశ్వఘోషుని రచనలు భారతదేశంలోనే కాక ఖండాంతర సరిహద్దులను దాటి వ్యాపితమైనాయి అని అర్ధమవుతుంది.

అశ్వఘోషుడు ప్రాచీన భారతీయ మహాకావ్య రచయితలలో ప్రప్రథముడుగా భావించబడిన కవి, నాటకకర్త. ఇతని కవితా ప్రభావం తరువాతి కాలంలోని భాసుడు (క్రీ. శ. 3 లేదా 4 శతాబ్దాలు), కాళిదాసు (క్రీ. శ. 5 వ శతాబ్దం) వంటి సంస్కృత కవుల కవిత్వంపై స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే సంస్కృత సాహిత్యంలో ధ్రువతారగా వెలగవలసిన అశ్వఘోషునికి మాత్రం సరైన గుర్తింపు, స్థానం దక్కలేదు.[2] దీనికి కారణం అశ్వఘోషుడు బౌద్ధుడు కావటమే అతను చేసిన తప్పిదం.[2] సంస్కృత సాహిత్యంలో అశ్వఘోషుడు, కాళిదాసు లిరువురూ మహాకవులే అయినప్పటికీ, వైదికమతానురక్తుడైన కాళిదాసు కృతులకు లభించిన గౌరవం, బౌద్ధ ధర్మానురక్తుడైన అశ్వఘోషుని రచనలకు దక్కలేదు. బౌద్ధ కవి కాబట్టే ఇతర కవులు కాని, ఆలంకారికులు కాని అతనికి కవిగా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదనే చెప్పాలి.[16]

ఇవి కూడా చూడండి

[మార్చు]

రిఫరెన్సులు

[మార్చు]
  • Mudiganti Gopala Reddy; Mudiganti Sujatha Reddy. Sanskrita Saahitya Charitra (Telugu) (2002 ed.). Hyderabad: Potti Sreeramulu Telugu University .
  • Buswell, Robert E., (2004). Encyclopedia of Buddhism. Macmillan Reference USA. p. 35. ISBN 0-02-865718-7.{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
  • Stuart H. Young (trans.), Biography of the Bodhisattva Aśvaghoṣa, Maming pusa zhuan 馬鳴菩薩傳, T.50.2046.183a, translated by Tripiṭaka Master Kumārajīva [2]
  • Li Rongxi (2002). The Life of Asvaghosa Bodhisattva; in: The Lives of Great Monks and Nuns [3], Berkeley CA: Numata Center for Translation and Research, pp. 9–16
  • J.K. Nariman. "Literary History of Sanskrit Buddhism, "Aśvaghoṣa and his School"". Wayback Machine. Bombay 1919. Archived from the original on 10 జనవరి 2011. Retrieved 18 September 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  • T.Ravichand. "మహాకవి అశ్వఘోషుడు" (PDF). మిసిమి (1997 October). Retrieved 18 September 2017.
  • T.Ravichand. "మహాకవి అశ్వఘోషుడు" (PDF). మిసిమి (1997 November). Retrieved 18 September 2017.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Mudiganti & Sanskrita Saahitya Charitra 2002, p. 244.
  2. 2.0 2.1 2.2 మిసిమి, 1997 & October, p. 262.
  3. Randall Collins, The Sociology of Philosophies: A Global Theory of Intellectual Change. Harvard University Press, 2000, page 220.
  4. 4.0 4.1 Mudiganti & Sanskrita Saahitya Charitra 2002, p. 243.
  5. Li Rongxi (2002). The Life of Asvaghosa Bodhisattva; in: The Lives of Great Monks and Nuns, Berkeley CA: Numata Center for Translation and Research, pp. 9–16
  6. Stuart H. Young (trans.), Biography of the Bodhisattva Aśvaghoṣa, Maming pusa zhuan 馬鳴菩薩傳, T.50.2046.183a, translated by Tripiṭaka Master Kumārajīva.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 మిసిమి, 1997 & October, p. 264.
  8. Coulson, Michael (1992). Sanskrit. Lincolnwood: NTC Pub. Group. p. xviii. ISBN 978-0-8442-3825-8.
  9. 9.0 9.1 J.K. Nariman & Aśvaghoṣa and his School 1919.
  10. Yoshichika Honda. 'Indian Buddhism and the kāvya literature: Asvaghosa's Saundaranandakavya.' Hiroshima Daigaku Daigakuin Bungaku Kenkyuuka ronshuu, vol. 64, pp. 17–26, 2004. [1] (Japanese)
  11. Johnston, E. H. (1928). Saundarananda (PDF). Lahore: University of Panjab.
  12. Lallanji Gopal. Asvaghosha, Vajrasuchi (1995 ed.). Mahabodhi Society of India, Mulagandhakuti Vihara Sarnath. p. 56.
  13. 13.0 13.1 మిసిమి, 1997 & October, p. 267.
  14. మిసిమి, 1997 & October, p. 268.
  15. మిసిమి, 1997 & November, p. 299.
  16. 16.0 16.1 16.2 16.3 Mudiganti & Sanskrita Saahitya Charitra 2002, p. 245.
  17. మిసిమి, 2008 & May, p. 130.
  18. Nattier, Jan. 'The Heart Sūtra: A Chinese Apocryphal Text?'. Journal of the International Association of Buddhist Studies Vol. 15 (2), 180–81, 1992. PDF Archived 2013-10-29 at the Wayback Machine
  19. Chinese Buddhist Apocrypha by Robert E. Buswell. University of Hawaii Press: 1990. ISBN 0-8248-1253-0. pgs 1–29
  20. Alexander Wynne, The Origin of Buddhist Meditation. Routledge, 2007, page 26.
  21. Yamabe, Nobuyoshi. 'On the School Affiliation of Aśvaghoṣa: "Sautrāntika" or "Yogācāra"?' Journal of the International Association of Buddhist Studies Vol. 26 (2), 225-249, 2003. PDF
  22. https://books.google.com/books?id=sfqRhylNBpwC&pg=PA95#v=onepage&q&f=false
  23. https://books.google.com/books?id=ROvDtaUI9xMC&pg=PA419#v=onepage&q&f=false
  24. https://books.google.com/books?id=U7owDwAAQBAJ&pg=PA81#v=onepage&q&f=false
  25. 25.0 25.1 దివాకర్ల వేంకటావధాని. అశ్వఘోష, బుద్ధచరితము, ఆంద్ర వచనానువాదం (1975 ed.). New Delhi: సాహిత్య అకాడమి. p. 4.
  26. Edwin Gerow. "Kalidasa". Encyclopedia Britannica. Encyclopedia Britannica. Retrieved 18 September 2017.
  27. 27.0 27.1 Chandra Rajan (2005). The Loom Of Time. Penguin UK. pp. 268–274.
  28. Vasudev Vishnu Mirashi and Narayan Raghunath Navlekar (1969). Kālidāsa; Date, Life, and Works. Popular Prakashan. pp. 1–35.
  29. Ram Gopal. Kālidāsa: His Art and Culture (1984 ed.). Concept Publishing Company. p. 14.
  30. C. R. Devadhar (1999). Works of Kālidāsa. Vol. 1. Motilal Banarsidass. pp. vii–viii. ISBN 9788120800236.
  31. Gaurīnātha Śāstrī 1987, pp. 77–78
  32. Ram Gopal. Kālidāsa: His Art and Culture (1984 ed.). Concept Publishing Company. p. 8.
  33. మిసిమి, 1997 & October, p. 265.
  34. J.K. Nariman et al.
  35. Mudiganti & Sanskrita Saahitya Charitra 2002, p. 247.
  36. Mudiganti & Sanskrita Saahitya Charitra 2002, p. 248.
  37. Mudiganti & Sanskrita Saahitya Charitra 2002, p. 250.
  38. Rahul Sankrityayan. Volga Se Ganga (A journey from the Volga to the Ganges) (1943 ed.). Kitab Mahal. ISBN 81-225-0087-0. Retrieved 20 September 2017.
  39. మిసిమి, 1997 & October, p. 263.