Jump to content

క్రీడాభిరామం

వికీపీడియా నుండి
(క్రీడాభిరామము నుండి దారిమార్పు చెందింది)
క్రీడాభిరామం
కృతికర్త: శ్రీనాథుడు/వినుకొండ వల్లభరాయుడు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: వీధి నాటకం
ప్రచురణ:
విడుదల:

మాచల్దేవి క్రీడాభిరామం అనునది వినుకొండ వల్లభరాయుడు మాచల్దేవి గౌరవార్థం రచించిన వీధి నాటకం. ఇది ఓరుగల్లులో ప్రదర్శించబడింది. కాకతీయుల కాలంలో వేశ్యా కులానికి విశేష ప్రాధాన్యముండేది. వేశ్యల్ని పోషించటం ఆనాటి అధికార వర్గాల గౌరవంగా భావించేవారు. ప్రతాప రుద్రుని వుంపుడుగత్తె మాచల్దేవి ఒకతె. ఈమె భవనం ఓరుగల్లులో నాటి అత్యంత సుందర భననాలలో ఒకటి. క్రీడాభిరామం రెడ్డిరాజుల కాలంలో రచించబడ్డ వీధి నాటకం. ఈ కావ్యకర్త విషయంలో సాహితీవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీనాథుడు రాశాడని కొందరు, వినుకొండ వల్లభరాయుడు రచించాడని మరికొందరు భావిస్తున్నారు.

రచయిత

[మార్చు]

ఈ కావ్యంలోని కొన్ని పద్యాలు శ్రీనాథుని ఇతర కావ్యాలలోనివి, చాటువులలోనివి కావడంతో కొందరు ఈ కావ్యాన్ని రచించింది శ్రీనాథుడేననీ, వినుకొండ వల్లభరాయుడి పేరిట పెట్టారనీ భావిస్తున్నారు. ఈ పద్యాలు కేవలం శ్రీనాథునిపై వినుకొండ వల్లభరాయునికి అభిమానం తెలిపేవనీ, బహుశా వారిద్దరి స్నేహాన్ని పురస్కరించుకుని శ్రీనాథుడు వల్లభరాయుడికి కొన్ని రచనా నైపుణ్యాలు మెరుగుపర్చి ఉండవచ్చని మరికొందరు పండితుల వాదన. ఈ క్రమంలో పలువురు పండితుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి:

  • మానవల్లి రామకృష్ణ కవి క్రీడాభిరామం శ్రీనాథుని రచన కాదనీ, వినుకొండ వల్లభరాయని రచనేనని పేర్కొన్నారు. శ్రీనాథునికి వల్లభరాయని పేరుతో కృతి రచించాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. పచ్చి శృంగార వర్ణనలో, సంస్కృత రచనను తెనిగించుటో అవమానకరంగా భావించి ఆ పేరు పెట్టి ఉంటాడనీ భావించే వీలులేదన్నారు. శ్రీనాథుని వల్లభాభ్యుదయ కావ్యంలో శ్రీకాకుళ (కృష్ణాజిల్లా) ఆంధ్రవిష్ణువు తిరునాళ్ళలోని శృంగార వర్ణనలు ఇంతకన్నా పచ్చిగా ఉన్నాయనీ, ఎన్నో ఇతర కావ్యాలు శ్రీనాథుడు అనువదించాడనీ గుర్తుచేశారు. శ్రీనాథుడే రచించివుంటే వల్లభరాయునికి అంకితం ఇచ్చి ఉండేవాడే తప్ప అతని పేరు పెట్టే అగత్యమేమీ లేదని నిశ్చయించారు. శ్రీనాథుని నాటకమనుకునేందుకు గల కారణాలు అనేకం ప్రస్తావించి సవివరంగా వాటిని పూర్వపక్షం చేశారు.[1] బి.వి.సింగరాచార్యులు శ్రీనాథుని ఇతరేతరములైన ఏ కావ్యాలలోనూ కనిపించనివీ, క్రీడాభిరామంలో వాడినవీ ఐన పలు పదప్రయోగాలను చూపి రచన వల్లభరాయునిదేనని నిరూపించారు. అప్పటికే ప్రఖ్యాతి పొందిన శ్రీనాథుని హాస్య వ్యంగ్య రూపం (కారికేచర్) గా మంచన పాత్రను రూపొందించారనీ, శ్రీనాథుని కవిత్వాన్ని హాస్యానుకరణం (పేరడీ) చేశారనీ పేర్కొన్నారు. శ్రీనాథుని పట్ల ఎంతో ఆసక్తి ఉంటే తప్ప ఇటువంటివి సాధ్యం కాదని తెలిపారు. ఈ కారణంగా శ్రీనాథుని రచన కాదు, శ్రీనాథుని సహకారమూ ప్రత్యక్షంగా రచనలో లేదని పేర్కొన్నారు.[2]
  • వేటూరి ప్రభాకరశాస్త్రి క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు రచించి ఉండడనీ, కవిసార్వభౌముడు శ్రీనాథుడే కర్త అయివుంటాడని నిశ్చయించారు. సులక్షణ సారము, అప్పకవీయము, సర్వలక్షణ సారము మొదలైన పలు లక్షణ గ్రంథాల్లో శ్రీనాథునివిగా ఉదహరింపబడిన పద్యాలు క్రీడాభిరామంలోనివి కావడం ప్రధాన కారణంగా పేర్కొన్నారు. అవతారికలోని పద్యాల్లో వల్లభరాయుని దాతృత్వం మొదలగు సుగుణాల గురించీ, వాగ్వైభవాన్ని గురించీ వర్ణనలు మితిని మీరినవనీ, వల్లభరాయుడే గ్రంథకర్త అయివుంటే అలా రచించివుండడనీ భావించారు. కృతి అంతములో భైరవుడు వల్లభరాయకవికి వైభవాభ్యుదయములు కృపచేయాలనే ఆశీర్వచనమూ ఉందనీ, తనకు తానే ఆశీర్వదించుకోవడం సాధ్యపడదనీ పేర్కొన్నారు. శ్రీనాథుడు తాను రచించిన పూర్వకావ్యములలోని పద్యాలను క్రీడాభిరామంలో నిక్షేపించాడనీ, రచనా సంవిధానంలో కూడా శ్రీనాథుని పద్ధతి కనిపిస్తూందనీ వివరించారు. కవియన్న కీర్తిని సంపాదించుకునే కోరికతో వినుకొండ వల్లభరాయుడే శ్రీనాథ కవిసార్వభౌమునికి విశేషంగా ధనమిచ్చి క్రీడాభిరామ గ్రంథకర్తృత్వం పొందివుండవచ్చని భావించారు.[3]
  • చిలుకూరి పాపయ్యశాస్త్రి క్రీడాభిరామ కర్త వినుకొండ వల్లభరాయుడే కానీ కృత్యాది, అంతములలోని పద్యాలను వల్లభరాయని కుటుంబంతో కార్యార్థియైన శ్రీనాథుడు రాసిపెట్టి ఉండవచ్చని భావించారు. రచన ఆది అంత్యములలోనివే కాక మధ్యలోని మరో ఐదు శ్రీనాథుని పద్యాలు కూడా వల్లభరాయుడు అనుమతితోనో, లేకుండానో చేర్చుకుని ఉంటాడని పేర్కొన్నారు. వినుకొండ వల్లభరాయని తండ్రి స్వయంగా ఆనాటి విజయనగర సామ్రాట్టు రెండవ హరిహరరాయల ఆస్థానంలోని సువర్ణ భాండాగారాధ్యక్షుడు, ఆ కారణంగా వల్లభరాయనికి కూడా రాజాస్థానంతో సన్నిహిత సంబంధాలు ఉండివుండొచ్చు. కనుక ప్రౌఢదేవరాయల (రెండవ హరిహరరాయలు) ఆస్థానంలో గౌడ డిండిమభట్టుతో సారస్వత సభలో విజయం, సువర్ణ టంకాలతో అభిషేకం వంటి సన్మానాలకు నాందిగా ఆస్థానంలో ప్రవేశించేందుకు వినుకొండ వల్లభరాయల కుటుంబంతో సారస్వతానుబంధం ఏర్పరుచుకుని ఉంటాడని భావించారు. దానివల్ల కృత్యాదిలోని 32 పద్యాలు, మధ్యలోని ఐదారు పద్యాలు, చివరిలో మరికొన్ని పద్యాలు శ్రీనాథుడు ఈ నాటకం గురించి వ్రాసినవి, గతంలో వేరే కావ్యాల్లోనివి ఇందులో చేరాయని నిశ్చయించారు.[4] టేకుమళ్ళ కామేశ్వరరావు కూడా వినుకొండ వల్లభరాయుని అనువాదం పూర్తయ్యాకా సారస్వత మిత్రుడైన శ్రీనాథుడు తన కవిత్వమూసలో వేసి ఉంటాడని భావించారు. శ్రీనాథుడు సాహితీ దిగ్విజయం పూర్తిచేసుకుని స్వస్థలానికి మొరసునాడు (నేటి కర్నూలు ప్రాంతం) మీదుగా బయలుదేరి ఉంటాడన్నారు. ఆ క్రమంలోనే ప్రాంతంలో కనిపించినవాటిపై చాటువులు చెప్తూ నాటుదారిలో వినుకొండ చేరుకునివుంటాడని వివరించారు. వినుకొండ దుర్గంలోని వినుకొండ తిప్పన ఆతిథ్యంలో విడిసివుంటాడనీ, ఆ సమయంలో యువకుడు, కవి, తిప్పన కుమారుడూ ఐన వల్లభరాయుడు శ్రీనాథునికి తారసపడివుంటాడన్నారు. వల్లభరాయుడు పూర్తిచేసిన క్రీడాభిరామాన్ని శ్రీనాథునికి ఇస్తే ఆయన దాన్ని చదివి తన కవిత్వపు మూసలో వేసివుంటాడనీ, వల్లభరాయుడిచ్చిన బహుమతి మూటకట్టుకుని స్వస్థలానికి మరలివుంటాడని నిశ్చయించారు.[5]

మాచల్దేవి

[మార్చు]

మాచల్దేవి గౌరవార్థం వినుకొండ వల్లభారాయుడు క్రీడాభిరామ మనే వీధి నాటకాన్ని రచించగా అది ఓరుగల్లులో ప్రదర్శించబడింది. రావి పాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో వ్రాసిన ప్రేమాభిరామం నాటకాన్ని అనుసరించి తెలుగులో వ్రాయబడిందీ క్రీడాభిరామం. ఈ వీధినాటకాన్ని శ్రీ నాథుడే వ్రాశారని కొందరు, మరి కొందరు వల్లభ రాయుడే వ్రాశాడని వివాదముంది. ఎవరు వ్రాసినా 14 వ శతాబ్దంలో మొట్టమొదటగా తెలుగులో వెలువడిన వీధినాటకం ఇది. ఆ నాటి నట, విట కవుల గురించి క్రీడాభిరామం నాందీ ప్రస్తావనలో ఈ విధంగా వర్ణించబడింది.

నటులది దోరసముద్రము
విటులది యోరుగలు, కవిది వినుకొండ మహా
పుట భేదనమనుత్రితయము
నిటు గూర్చెను బ్రహ్మ రసికు లెల్లరు మెచ్చన్

అని ఈ వీధినాటన్ని మోవూరి భైరవుని తిరునాళ్ళలో ప్రదర్శించి నట్లు తెలుస్తూ ఉంది.ఆనాడు ఓరుగల్లు ఉత్సవాలలో ప్రదర్శించ బదిన అనేక వినోద ప్రదర్శనాల గురించి క్రీడాభిరామంలో వివరించబడింది.

ఏకశిలానగరంలో ఎన్నో దేవాలయాలు

[మార్చు]

ఏక శిలానగరమని పిలువబడే ఓరుగల్లులో ఆనాడు 5500 శివాలయాలు, 1300 విష్ణు దేవాలయాలు, మైలార దేవుడు, దుర్గ, గణపది, వీరభద్ర ఆలయాలు అదిగా వేలకొలది ఉన్నట్లు స్థానిక ప్రతాపరుద్ర చరిత్ర వల్ల తెలుస్తూంది. ఓరుగల్లు మైలారదేవుని వుత్సవం నాడు వీరభటులు చేసే సాహస వీరానృత్యాలు ఆతి భయంకరంగ వుడేవి. వీర శైవ మతోద్రేకులు మండుతూ వుండే నిప్పుగుండాలలో సాహసంగా దూకేవారు. వారసాలను గ్రుచ్చుకునేవారు. భైరవుని గుడి చమడేశ్వరి, మహాశక్తి నగరు, వీరభద్రేశ్వరాగారం, బుద్ధదేవుని విహార భూమి, ముసానమ్మ గుడి, మొదలైన ప్రదేశాలు కాకతీయ ప్రతాప రుద్రుని కాలంలో గొప్ప మహత్తు కలిగిన ప్రదేశాలని ప్రసిద్ధి పొందాయి.

దిసమెలదేవత ఏకవీరా దేవి

[మార్చు]

ఏకవీరాదేవి శైవదేవత. ఏకవీర పరశురాముని తల్లియైన రేణుకాదేవి యని ప్రతీతి. ఈమెను ముహురం అనే గ్రామంలో వెలసి వుండడం వల్ల మూహురమ్మ అని పిలిచేవారు. ఈమె నగ్న దేవత. ఈమె ఆనాడు రాయలసీమ లోనూ, తెలంగాణా లోను ఎల్లమ్మ దేవత అని కూడా పిలుస్తూ వుండేవారు. ఓరు గంటిలో ఓరుగంటి ఎల్లమ్మ అనే ప్రసిద్ధ దేవత వుండేది. ఈ ఎల్లమ్మనే రేణుక అనికూడ పిలిచేవారు. కాకతీయుల కాలంలో బవనీలు, మాదిగస్త్రీలు ఎల్లమ్మ కథను వీరావేశంతో చెపుతూ వుండేవారనీ, వారు మోగించే జవిక జుక జుంజుం జుక జుం జుమ్మంటు సాగేదనీ, క్రిడాభిరామంలో ఉదహరించ బడింది.

వాద్యవైఖరి కడు వెరవాది యనగ ఏకవీరాదేవి యెదుట నిల్పి, పరశు రాముని కథ లెల్ల ప్రౌడిపాడె చారుతర కీర్తి బవనీల చక్రవర్తి.

భక్తిపారవశ్యంలో, నగ్న నృత్యాలు

[మార్చు]

రేణుకాదేవి జమదగ్ని మహాముని భార్య; పరశురాముని తల్లి. తండ్రి ఆజ్ఞ ననుసరించి పరశురాముడు తన తల్లి తలను ఖండించగా, ఆ తలకాయ మాదిగ వాడలో పడిందట. శిరస్సులేకుండా వున్న విగ్రహం ముందు నగ్ననృత్యంలో పూజిస్తూ వుండేవారట. నగ్నంగా వున్న ఈ విగ్రహం ముందు స్త్రీలు కూడా నగ్నంగా పూజిస్తూ నాట్యం చేస్తూ వుండేవారట. ఈ రేణుకాదేవే, తరువాత ఎల్లమ్మగానూ, ఏకవీర గానూ, ప్రసిద్ధి చెందింది. ఏకవీర ఆలయాలు మండపాక, పొలవాన, మాహూరు మొదలైన గ్రామాలలో వెలసి వున్నట్లు క్రీడాభిరామంలో ఉదహరించబడి ఉంది. కాకతీయ రుద్రమదేవి మొగిలిచర్లలో వున్న ఏకవీరాదేవీ ఆరాధించడానికి వెళుతూ వుండేదట. ఓరుగల్లు పట్టణంలో ఏక వీరాదేవి మహోత్సవాలను కూడా తిలకించేదట. గొండ్లి అనేది కుండలాకార నృత్యం. గొంద్లి విధానం ద్వారా బతకమ్మ, బొడ్డెమ్మల వుత్సవ సమయాల్లో పిల్లన గ్రోవులూదుతూ, ఆటలు ఆడుతూ, కుండలాకార నృత్యం చేసేవారు.

గొరగపడుచులు నాట్యాలు

[మార్చు]

ఓరుగల్లు మైలారదేవుని పూజల సమయంలో, మైలారదేవుని కొలిచే గొరగ పోడుచులు పాటలు పాడుతూ, ఒక నీటి పాత్రలో ఒక వస్తువును వేసి, మొగ్గవాలి వెనుకకు వంగి నాలుకతో ఆ వస్తువు నందుకుని ఆవిధంగా ల్తమ ప్రజ్ఞను భక్తిపరస్పరంగా తెలియజేశే వారుట. ఈ విధానాన్ని గూర్చి క్రీడాభిరామంలో......

వెనుకకు మొగ్గవాలి కడు విన్ననువొప్పగ దొట్టెనీళ్ళలో
మినిగి తదంతరస్థమాగు ముంగర ముక్కున గ్రుచ్చి కొంచు లే
చెనురసనా ప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూస పే
రనునమలీల నిప్పడుచు పాయము లిట్టివి యేలు నేర్చెనో

ఇక పురుషులు వీర భద్రస్వామిని నెత్తిమీద పెట్టుకుని ప్రభలుగట్టి అడుగుల మడుగులతో, నగారా డోళ్ళు వాయిస్తూ వారసాలు పొడుచుకుని నృత్యం చేసేవారట. వీరి గురించి క్రీడాభిరామం లో.....

వీరు మైలార దేవభటులు. గొండ్లి యాడించుచున్నారు. గొరగపడుచు వాడుచున్నది చూడు మూర్థాభినయము. తాను వెట్టిక పీలంతగాని లేదు. వీరశైవ సాంప్రాదాయం. మైలార లింగస్వామి భక్తులు. వీరు కురుబ జాతికి చెందినవారు. వీరి ఇలవేల్పు వీరభద్రస్వామి. ఇంకా కాకతీయుల కాలంలో కోలాటం, గొండ్లి (గర్భనృత్యం) పేరణి నృత్యం (అంటే కుంభంపైకెక్కి నృత్యం చేయడం ) వుప్పెన పట్టేలాటలు (అంటే చెఱ్ఱుపట్టీ) గిల్లిదండం ఆట, చిఱ్ఱాగోనె, చిల్లగోడె అనె ఆటలులు కూడ ప్రచారంలో వుండేవి. శైవ సాంప్రదాయంలో నందికోల ఆట అనేది వుంది. అది తెలంగాణాలో ఈనాటికి కార్తీక మాసంలో జరుగుతూ వుంది.

ఈ నంది కోల ఆటను గురుంచి సోమనాథుడు బసవపురాణంలో....................

కోలాటమును బాత్ర గొండ్లి పేరణియు - గేళిక జోకయు లీల నటింప,.

జాణలు మెచ్చే జాజరపాటలు

[మార్చు]

కాకతియుల కాలంలో ప్రచారంలో వున్న జాజర పాటల గురించి నాచన సోమయాజి తన వసంత విలాసంలో.....

వీణాగానము వెన్నెల తేట - రాణ మీరగా రమణుల పాట
ప్రాణమైన వినబ్రహ్మణవీట - జాణలు మెత్తురు జాజరపాట
.

బ్రాహ్మణ వీట జాజరపాట రాణించె వనడాన్ని బట్టి అది ఆనాటి బ్రహ్మణులలో ఎక్కువ ప్రచారంలో వుందని చెప్పవచ్చు.

ఆ కాలంలో తప్పెట్లు, కొమ్ములు, డమాయీలు, బూరలు, శంఖాలు, సన్నాయులు, డోళ్ళు, చేగంటలు మొదలైన వాద్యాలు ప్రచారంలో వుండేవి..

కాకతీయుల కాలంలో విర్మాణ శిల్పం, విద్య, చిత్రలేఖనము, చేతి పనులు, కళలుగా వరిగణింపబడ్డాయి. ప్రతి చెంబు మీదా చిత్రాలు చెక్కేవారు. బట్టలపైన అద్దకంతో బొమ్మలను అద్దేవారు. ఇండ్ల గోడలపై చిత్రాలను చిత్రించేవారు. పడుచులు ఇండ్ల ముంగిట ముగ్గులతో రకరకాల చిత్రాలను చిత్రిస్తూ వుండేవారు. ప్రజలు వారి వారి అభిరుచులను బట్టి, చిత్రపటాలు, వ్రాయించుకునే వారు. వీరపూజ అభిలాష గలవారు, వీరుల చిత్రాలను వ్రాయించుకునే వారు.

యివి కూడా చూడండి

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

మూలాలు

[మార్చు]
  1. క్రీడాభిరామ పీఠిక:మానవల్లి రామకృష్ణకవి:పు.2-4
  2. క్రీడాభిరామం:సమాలోకనము(పీఠిక):బి.వి.సింగరాచార్యులు:ఎమెస్కో బుక్స్
  3. క్రీడాభిరామ పీఠిక:వేటూరి ప్రభాకరశాస్త్రి:పు.16-19
  4. శ్రీనాథుని కవితాసమీక్ష:చిలుకూరి పాపయ్యశాస్త్రి
  5. శ్రీనాథ సోమయాజి:చిలుకూరి పాపయ్యశాస్త్రి:ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక:1968-69:పుట.129

యితర లింకులు

[మార్చు]