తరిగొండ వెంగమాంబ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నర్రవాడ వెంగమాంబ కొరకు చూడండి వెంగమాంబ పేరంటాలు

తరిగొండ వెంగమాంబ
వెంగమాంబ
జననంతరిగొండ వెంగమాంబ
1730
చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలములోని తరిగొండ
భార్య / భర్తఇంజేటి వెంకటాచలప్ప
తండ్రికానాల కృష్ణయ్య
తల్లిమంగమాంబ

తరిగొండ వెంగమాంబ 18 వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి, తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తురాలు. వేంకటాచల మాహాత్మ్యము, ద్విపద భాగవతం వంటి ఆధ్యాత్మిక కావ్యాలు రచించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

వెంగమాంబ చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలంలోని తరిగొండ గ్రామంలో వాసిష్ఠ గోత్రీకుడైన కానాల మంగమాంబా,కృష్ణయా మాత్య అను నందవరీక బ్రాహ్మణ దంపతులకు 1730లో జన్మించింది.[1] వెంగమాంబ బాల్యంలో తన తోటి పిల్లల్లాగా ఆటలాడుకోక ఏకాంతంగా కూర్చొని భక్తి పారవశ్యంలో మునిగి తేలేది. ఆ చిరు ప్రాయంలోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురంగా గానం చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యంను సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకు పంపాడు. దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంగమాంబకు బోధించాడు. అనతి కాలంలోనే వెంగమాంబ ప్రశస్తి నలుమూలల పాకడంతో తండ్రి ఆమె విద్యాభ్యాసాన్ని మాన్పించి తగిన వరుని కోసం వెతకడం ప్రారంభించాడు.

ఇంటి పనులలో సహాయం చేయమని తల్లి చెప్పినపుడు తన సేవ భగవంతునికే అర్పణమని వెంగమాంబ తిరస్కరించింది. అనేక మంది వరులు ఆమెను చూచి చాలా అందంగా ఉన్నదనో, చాలా తెలివైనదనో నెపాలతో పెళ్లి చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటాచలప్ప వెంగమాంబను చూసి ముగ్ధుడై ప్రేమలో పడి ఆమెను వివాహమాడుటకు అంగీకరించాడు. తండ్రి వివాహం జరిపించాడు. వివాహానంతరం వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించే ప్రయత్నం చేసాడు, కానీ వెంగమాంబ అతనిని దగ్గరికి రానివ్వలేదు.

ఈమె తిరుమలలో ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో తుంబురు కోన వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తుంది. ఈమెకు వేంకటేశ్వరుడు కలలో కనిపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో ఉత్తర వీధిలో, ఉత్తర దిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం ఉన్న ఒక పాఠశాలలో) ఈమె సమాధి ఇప్పటికీ ఉంది. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం సా.శ. 1890లో ఈస్ట్ ఇండియా కంపెనీవారు తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తుంది.[2] ఈమె తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించింది. చివరకు సా.శ.1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ నవమినాడు తరిగొండ వెంగమాంబ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ సజీవ సమాధి చెందింది[1].

రచనలు

[మార్చు]

వెంగమాంబ రచనలన్నీ వేదాంతం, భక్తి ప్రధానమైనవే. ఈమె రచనలలో ముఖ్యమైనవి

  • పద్య కావ్యాలు
    • వేంకటాచల మహాత్మ్యం[1]
    • అష్టాంగ యోగసారం
  • ద్విపద కావ్యాలు
    • ద్విపద భాగవతం (ద్వాదశ స్కంధము)
    • రమా పరిణయం
    • రాజయోగామృత సారం
    • వాశిష్ఠ రామాయణం
  • శతకాలు
    • శ్రీకృష్ణ మంజరి.
    • తరిగొండ నృసింహ శతకం
  • యక్షగానాలు
    • నృసింహ విలాసం
    • శివలీలా విలాసం
    • బాలకృష్ణ నాటకం
    • విష్ణు పారిజాతం
    • రుక్మిణీ నాటకం
    • గోపీ నాటకం
    • చెంచు నాటకం
    • ముక్తి కాంతా విలాసం
    • జలక్రీడా విలాసం
  • తత్వ కీర్తనలు

రచనా వైశిష్ట్యం

[మార్చు]

సాహిత్యంలో మెలకువలు, రహస్యాలు తెలియకనే, అలంకార వ్యాకరణాది శాస్త్రాలు చదవకనే, కేవలం తన ఇష్టదైవం తరిగొండ నృసింహస్వామి దయ వల్లనే తనకు కవిత్వం చెప్పడం వచ్చిందని, తన కృతి వేంకటాచలమాహాత్మ్యం అవతారికలో వేంకమాంబ ఇలా అంది.

నా చిననాట నోనామాలు నైన నా
చార్యుల చెంతనే జదువలేదు
పరుగు ఛందస్సులో బది బద్యములనైన
నిక్కంబుగా నేను నేరలేదు
లలికావ్యనాటకాలంకారశాస్త్రము
ల్వీనులనైనను వినగలేదు
పూర్వేతిహాస విస్ఫురితాంధ్రసత్కృతు
ల్శోధించి వరుసగ జూడలేదు
చేరి తరికుండపురి నారసింహదేవు
డాన తిచ్చిన రీతిగ నే నిమిత్త
మాత్రమున బల్కుదును స్వసామర్థ్యమివ్వ
దరయ నించుక యేని నా యందు లేదు.

కావ్యరచనలో పూర్వకవులు తొక్కని దారి లేదు. చెప్పని భావాలు లేవు కదా. నువ్వు కొత్తగా చెప్పేదేముందని ఇప్పుడు కావ్యం రచించావు? ప్రాచీనుల కన్న నీ గొప్పతనం ఏమిటి? అనేప్రశ్నకు, తల్లితండ్రులకు, చిన్నపిల్లల జిలిబిలి పలుకులు ముద్దుగొల్పుతూ ఉంటాయని తరిగొండ వేంకమాంబ పండితులను, ప్రజలను ఇలా వేడుకుని, తన కావ్యాన్ని రుచి చూపింది.

పండితాగ్రగణ్యులార ప్రజలారా నా
బాలభాష కసూయపడక వినుడు
తల్లిదండ్రులు చిన్నపిల్లల పల్కుల
కానంద మొందెడునట్టు యిందు
మీరు నా తప్పొప్పు లేరీతిగానైన
గేలి సేయక చిత్తగింపవలయు
నాంధ్రగీర్వాణ మహాకృతులుండగా
నిప్పుడీ కృతి వినవేల యనగ
భక్ష్యములు మెక్కి యావల బచ్చడియును
నంజుకొనిన విధంబున నా ప్రబంధ
మాలకింతు రటంచు బేరాస చేత
నేను రచియింతు దాని మన్నించి గనుడు.

పండితులను, ప్రజలను, తన కావ్యాలను స్థాలీపులాకన్యాయంగా స్వీకరించి తనని ఉద్ధరించమని వేడుకొనడంలో, వెంగమాంబ వినయశీలం స్పష్టమవుతూంది. రచన తర్వాత లక్షణం పుడుతుంది. కవి సమాజజీవి. శాస్త్రాలన్నీ సమాజజీవితం నుంచే పుడతాయి. శాస్త్రాన్ని అభ్యసించకపోయినా జీవితానుభవం ఉంటుంది కాబట్టి శాస్త్రవిషయాలు, అనుభవవిషయాలు సహజంగానే రచనలో చోటు చేసుకుంటాయి.

వేంకమాంబ గంభీరమైన యోగరహస్యాలను సరళసుందరమైన భావమధురమైన శైలిలో వివరించింది. లలితమైన శృంగార భావనలను కూడా రమణీయశైలిలో చెప్పింది. యోగతత్వ విషయాలను ఎంతో విజ్ఞానప్రదంగా చెప్పింది. ప్రణయకోపాలను, సవతి మాత్సర్యాలను, నర్మగర్భసంభాషణలను, స్త్రీల ఎత్తిపొడుపు మాటలను, శ్రీకృష్ణుని శృంగారలీలలను, సహజంగా, రసవత్తరంగా, హృదయానికి హత్తుకునేలా చెప్పింది. ఆమె ఆత్మవిశ్వాసంతో మధురభక్తి కాక, జ్ఞానాత్మకమైన యోగభక్తితో, పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ రచనలు చేసింది. ఈమె పాడుకోడానికి వీలైన సింగారపు పాటలు, నలుగు పాటలు, ఆరగింపు పాటలు, నిద్ర పుచ్చే పాటలు, మంగళహారతి పాటలు వ్రాసి, తన రచనలను సంగీతసాహిత్యసమ్మేళనాలుగా రూపొందించింది.

తరికొండ వేంకమాంబ రచించిన శ్రీకృష్ణమంజరి చాలా ప్రశస్తమైన స్తుతికావ్యం. దీనిని వావిలికొలను సుబ్బారావు ("ఆంధ్ర వాల్మీకి" వాసుదాస స్వామి) తమ భక్తిసంజీవని అనే పత్రికలో జనవరి 1929 సంచికలో ప్రచురిస్తూ, ఈమెను మహాయోగిని, భక్తురాలు, కవయిత్రిగా పేర్కొన్నాడు.

శ్రీ వెంకటేశ! నా చిత్తంబు నందు
నీ పాదయుగళంబు నిల్పవే కృష్ణ
నన్నేల తరిగొండ నరహరాకృతిని
బ్రత్యక్షమై నన్ను బాలింపు కృష్ణ!

అని ఈ స్తుతిమంజరి కావ్యం మొదలై చివరలో ఈమె తల్లిదండ్రులు కానాల మంగమాంబ, కృష్ణయామాత్యుడు అని చెప్పడం జరుగుతుంది.

సంస్కృత వరాహ, భవిష్యోత్తర, పద్మపురాణాలలోని వేంకటాచల మహాత్యం ప్రశంసలు ఆధారంగా, వేంకమాంబ, 'వేంకటాచల మాహాత్మ్యం' రచించింది. దీనిలో పద్మావతీశ్రీనివాసుల వివాహ వృత్తాంతాన్ని ఎంతో రమణీయంగా రూపొందించింది. .స్త్రీ హృదయాంతరాళాలలోని సున్నితభావాలను, ఆత్మాభిమానాన్ని, ఆత్మగోపనాన్ని వేంకమాంబ అత్యంతమార్దవంగా, మార్మికతతో, చాకచక్యంతో, సరసంగా చిత్రించింది. శ్రీనివాసుని ద్వితీయవివాహసందర్భంలో లక్ష్మీదేవి అనుభవించిన బాధను ఆమె సమర్థంగా వర్ణించింది. ఇది వెంకటగిరి క్షేత్రమహాత్యం వర్ణించే కావ్యం.

వేంకమాంబ తాను భాగవతం ద్వాదశస్కంధాలను ద్విపదకావ్యాలుగా రచించినట్టు, వేంకటాచలమాహాత్మ్యంలోని ఒక పదంలో చెప్పుకొంది.

ద్విపద భాగవతంలో, తత్వార్థాలను పామరులకు కూడా సరళసుబోధకం చేయడానికి, వేంకమాంబ తేటతెలుగు పదాలను ప్రయోగించి సంక్షిప్తసుందరం గావించినట్టు, ఈ ద్విపద పంక్తులను బట్టి తెలుస్తున్నది.

వేశ్యాంగన ముద్దుపళని వ్రాసిన రాధికా సాంత్వనము అనే శృంగారప్రబంధంలో వలె, మితిమీరిన శృంగారవర్ణనలు చేయక, కులాంగన అయిన వేంకమాంబ శృంగారం పేర అసభ్యవర్ణనలు చేయలేనని వేంకటేశ్వరమాహాత్మ్యంలో శ్రీకృష్ణునికి, అనగా కలియుగప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి ఇలా విన్నవించుకోవడం సమంజసంగానే ఉంది.

శృంగారాకృతి తోడ పచ్చి పదముల్‌ శృంగారసారంబు తో
డం గూఢంబుగ జెప్పు నీవనగ నట్లే చెప్పలేనన్న నన్‌
ముంగోపంబున జూచి లేచి యటనే మ్రొక్కంగ మన్నించి
తచ్ఛృంగారోక్తులు తానె పల్కికొను నా శ్రీకృష్ణుని సేవించెదన్‌.

వేంగమాంబ తన కావ్యంలో పచ్చి శృంగారవర్ణనలు చేయలేదు సరి కదా, అక్కడక్కడ సందర్భోచితంగా వెలువడిన శృంగార పద్యాలు కూడా కృతిపతి శ్రీకృష్ణుని చమత్కారాలే అని లోకానికి చెప్పినట్టు తెలిస్తున్నది. ఎరుకసాని పాత్రను వేంకటాచలమాహాత్మ్యం కావ్యంలో ప్రవేశపెట్టి పాత్రోచితభాషగా సోదిభాషను ప్రయోగించి, నాటకీయతను, రమణీయతను కలిగించింది వేంకమాంబ

అవ్వోయవ్వ నీ తలంచిన తలంపు మేలవుతాదంట. దేవుళ్లు పలుకుసుండారు. తలచిన తలపేమంటివా, సెప్పెద విను దయితమ్మ! ఆ నల్లనయ్య యే దిక్కు నుండి వచ్చినాడంటావా? తల్లి ఇదిగో ఈ మూల నుండి వచ్చాడే....

తరిగొండ వేంగమాంబ శైలి, వేదాంతవిషయవివరణ సందర్భంలో కూడా మధురమై, వ్యావహారికానికి సన్నిహితమై ఉండటం విశేషం. ఆమె రచనలు ఆత్మజ్ఞానానికి, ఔచిత్యానికి ఆటపట్టు. ఈమె నిర్గుణోపాసన నుంచి, సగుణోపాసులోకి దిగి మధురభక్తి సంప్రదాయాన్ని గురించి ప్రబోధాత్మకమైన, భక్తిదాయకమైన, రసోప్లావితమైన, అధ్యాత్మికచింతనాభరితమైన కమనీయకావ్యాలను రమణీయంగా రచించి, ఆంధ్రపాఠకలోకానికి అందించింది.

శ్రీమహావిష్ణువు వరాహావతారంలో హిరణ్యాక్షుని సంహరించి పాతాళాంతర్గతయైన భూమిని ఉద్ధరించిన తరువాత తన అవతారం గురించి భార్య లక్ష్మీదేవి ఏమి అడుగుతుందో, ఎలా గేలి చేస్తుందో అని తన సందేహాలను విష్ణువు గరుత్మంతునితో హాస్యంగా సంభాషించిన ఘట్టాలను ఆమె వర్ణించిన తీరు అత్యద్భుతమని విమర్శకులు శ్లాఘించారు.

వెంగమాంబ రచించిన తొమ్మిది యక్షగానాల్లో నృసింహ విలాసము, బాలకృష్ణనాటకము, రుక్మిణీనాటకము, విష్ణుపారిజాతము, జలక్రీడా విలాసము అనే అయిదింటికి బమ్మెర పోతన భాగవతము కల్పతరువు ప్రత్యక్షంగా కధావస్తువును ప్రసాదించింది.దశమస్కందంలోని రాసక్రీడాంశం ఆధారంగా వెంగమాంబ లేఖిని నుండి వెల్వడిన బాలకృష్ణ నాటకలో పోతన గారి ఒరవడికి చక్కని ఉదాహరణ.వెంగమాంబ రచించిన తాత్త్విక కావ్యాల్లో విశిష్టమైనది రాజయోగామృతసారం మిక్కిలి ప్రసస్తమైనది. భాగవత తృతీయస్కంధంలోని కర్దమ ప్రజాపతి వృత్తాంతమే ఇందలి ఇతివృత్తం.ఈ కధలోని కపిలదేవహుతి సంవాదం ఆధారంగా వెంగమ్మ ఈ ద్విపదికృతిలో స్వానుభవపొర్వకమైన రాజయోగ విజ్ఞానాన్ని ముచ్చటగా మూడుప్రకరణాల్లో వివరించింది వెంగమాంబ. వెంగమాంబ రచనలన్నింటిలో పరిమితిలోను, కవితా పరిణతిలోను ప్రధమగణ్యమైన గ్రంధం శ్రీభాగవతము.ఇది ద్విపదకావ్యము.భగవంతుని ప్రేరణయే కారణంగా తాను ఈగ్రంధాన్ని రచించినట్లు వెంగమాంబ అవతారికలో తెలిపింది. ఒకనాటి మధ్యాహ్న సమయంలో భగవానుడు భూసుర శ్రేష్ఠుని రూపంలో వచ్చి, భాగవతంలో తత్త్వార్ధాలు పామరులకుసైతం బోధపడేటట్లు సంగ్రహంగాను, శ్రీహరి మహిమలను విస్తారంగాను రచించవలసినదిగా వెంగమాంబను ఆదేశించాడు.ఆయనే మరికొంత సేపటికి బాలకృష్ణుని రూపంలో ఆమె చెంతకు వచ్చి, భగవ్త గ్రంధాన్ని చేతికిచ్చి దీనిని ద్విపదగా రచించిమని సూచించి వెళ్ళినాడు.

వెంగమాంబకు పూర్వం తెలుగులో ద్విపదభాగవతాలు కొన్ని వెలసి ఉన్నప్పటికీ, వెంగమాంబ కృతి యొక్కటే పోతనగారి రచనను ఆమూలాగ్రం సమర్ధవంతంగా అనుసరించిన ప్రఖ్యాతికి, ఆభక్తి గౌరవాలను నోచుకున్నది.ఇందువల్ల ఆనాటి (18వ శతాబ్దం) వెంగమాంబకు అందుబాటులో ఉన్న పోతన భాగవతిప్రతిలోని పాఠాలను గుర్తించగల పదవకాశం ఈనాడు మనకు ఆమె ద్విపదికృతి వల్ల సిద్ధిస్తూఉంటుంది. వెంగమాంబ పోతన రచనను యధాతధంగా ద్విపదీకరించినప్పటికీ, ఆమె అచ్చటముచ్చట కధలో కొన్ని చిన్న మార్పులు చేర్పులు చేసింది.

విశేషాలు

[మార్చు]

పలు ప్రక్రియలలో ఇన్ని గ్రంథాలు వ్రాసిన కవయిత్రులు ఆ కాలంలో లేరు. ఇటీవలే వెంగమాంబకు సంబంధించిన జీవిత విశేషాలను, రచనల వివరాలను తెలుపుతూ ఒక జాతీయ సదస్సును తిరుమల తిరుపతి దేవస్థానములు ఉద్యోగుల శిక్షణా సంస్థ డైరెక్టర్ భూమన్ ప్రారంభించాడు. ఆమె కీర్తనలకు ప్రాచుర్యం కలిగించే లక్ష్యంతో "జీవనగానం" అవే సి.డి.ని 2007లో విడుదల చేశారు.

తరిగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వెంగమాంబ ప్రతిమ తరతరాలుగా పూజలు అందుకొంటున్నది. జనవరి 1న, ఇతర పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయ.

ఉత్తర మాడా వీధిలో నివసించే తరిగొండ వెంగమాంబ హారతి తీసుకోనిదే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందునుండి కదలని రథానికి గుర్తుగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతి ఇమ్మని భక్తులూ, అర్చకులూ అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది .ఈ సేవనే తరిగొండ ముత్యాల హారతి అనేవారు. వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.

ఆంధ్రప్రభ దినపత్రికలో ఆమె జీవిత కథ సీరియల్‌గా వచ్చింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 ఆర్కీవు.కాం లో 1925 శ్రీ వేంకటాచల మాహాత్మ్యము పుస్తక ప్రతి.
  2. సప్తగిరి ఆధ్యాత్మిక మాస పత్రిక, తి.తి.దే. ప్రచురణ - జనవరి 2008 - డా. రమేశన్ వ్రాసిన ఆంగ్ల గ్రంథం ధారావాహికకు డా. కోరాడ రామకృష్ణ అనువాదం

వెలుపలి లంకెలు

[మార్చు]
  • వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా 600 బీ.సీ. టు ద ప్రెజెంట్ - సూసీ థారూ, కే.లలిత వాల్యూం 1 పేజీ 122-124 (ఆంగ్లములో)
  • తరిగొండ వేంకమాంబ, దక్షిణాది భక్తపారిజాతాలు, శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.
  • గౌరు వాస్తు ప్లానర్స్ వారి 2008 సంవత్సరం కేలండర్‌లో ఇచ్చిన విశేషాలు