నాలుగు స్తంభాలాట (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాలుగు స్తంభాలాట
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
తారాగణం సుత్తివేలు,
నరేష్,
ప్రదీప్,
పూర్ణిమ, తులసి
సంగీతం రమేష్ నాయుడు
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన వేటూరి
కూర్పు గౌతమ్ రాజు
నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్
భాష తెలుగు

నాలుగు స్తంభాలాట జంధ్యాల దర్శకత్వంలో, నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి ముఖ్యపాత్రల్లో నటించగా నవతా కృష్ణంరాజు నిర్మించిన 1982 నాటి చలనచిత్రం. నలుగురు యువతీయువకుల జీవితంతో ప్రేమ, పెళ్ళిళ్ళతో జీవితం ఆడుకున్న ఆటగా ఈ కథను రాసుకున్నారు జంధ్యాల. భారమైన ప్రేమకథలో సినిమాల్లో అంతగా అనుభవం లేని హీరోహీరోయిన్లతో నటింపజేసి జంధ్యాల విజయం సాధించారు. హిందీలో ఈ సినిమాను సంజయ్ దత్, అశోక్ కుమార్, పద్మినీ కొల్హాపురి ముఖ్యపాత్రల్లో బేకరార్ అన్న పేరుతో పునర్నిర్మించారు. ఈ సినిమాలో సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు చేసే హాస్యం చాలా ప్రాచుర్యం పొంది, సుత్తి అన్న పదాన్ని తెలుగు నాట ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. ఆ సినిమా నుంచి వేలు, వీరభద్రరావుల పేర్లకు సుత్తి అనేది ఇంటిపేరు అయ్యింది.

చిత్ర కథ

[మార్చు]

నరేష్ (విజయ నరేష్), ప్రదీప్ (ప్రదీప్) ప్రాణస్నేహితులు. నరేష్ ధనవంతుడు కాగా, ప్రదీప్ ది మధ్యతరగతి కుటుంబం. ప్రదీప్ ఇంట్లో అద్దెకుంటున్న కుటుంబంలోని అమ్మాయి శారద (పూర్ణిమ)ని నరేష్ ప్రేమిస్తాడు. నరేష్, శారదలు కలవడానికి ప్రదీప్ రాయబారిగా సహాయం చేస్తాడు. ఈ క్రమంలో ప్రదీప్, శారదల మధ్య కనిపించిన సాన్నిహిత్యాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళ పెద్దలు వాళ్ళిద్దరికీ పెళ్ళి నిశ్చయిస్తారు. అనుకోకుండా ఒకనాడు నరేష్, శారదలు శారీరికంగా దగ్గరవుతారు. నరేష్ మేనమరదలు కమల (తులసి)కి అతనంటే విపరీతమైన ఇష్టం. శారదని పెళ్ళిచేసుకుంటే, చచ్చిపోతానంటూ నరేష్ అన్న బెదిరిస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నరేష్, కమలని పెళ్ళిచేసుకుంటాడు. శారద గర్భవతి అయిందని తెలిసిన ప్రదీప్ ఆమె పరువు నిలబెట్టేందుకు తానే పెళ్ళిచేసుకుంటాడు. అయితే లోకం ముందు భార్యాభర్తలైనా, ఏకాంతంలో చెల్లెలిలా చూసుకుంటానని మాటిచ్చి పెళ్ళాడతాడు. ఆ మాటను నిలబెట్టుకుని ఆమెను అభిమానంగా చూసుకుని పెద్దమనసుతో వ్యవహరిస్తాడు. శారద ఆడపిల్లని కంటుంది, ఆ పాపకి నరేష్ తల్లి మహాలక్ష్మి పేరుపెడతాడు ప్రదీప్. తిరుపతి వెళ్ళేదారిలో రెండు జంటలు కలుస్తాయి. కమల మానసికంగా అనుభవించే క్షోభ చూసి నిద్రమాత్రలు మింగి చివరకు శారద ఆత్మహత్య చేసుకుంటుంది.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

నటీనటుల ఎంపిక

[మార్చు]

బాల నటుడిగా తెలుగులో పండంటి కాపురం, దేవదాసు, సంతానం - సౌభాగ్యం, మలయాళంలో కవిత వంటి సినిమాల్లో నటించిన నరేష్ కి హీరోగా ఇది తొలి చిత్రం. నరేష్ తల్లి, ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల స్వంత నిర్మాణ సంస్థ మీద ప్రేమ సంకెళ్ళు హీరోగా నరేష్ తొలిచిత్రంగా తీద్దామనకున్నారు. అయితే ఒక డ్యాన్స్ స్కూలుకి కె.విశ్వనాథ్తో కలిసి వెళ్ళిన జంధ్యాలకు నరేష్ ని చూడగా, అతని గురించి వాకబు చేసి తెలుసుకున్నారు. ఆపైన విజయనిర్మలను కలిసి తను తీయబోయే తదుపరి చిత్రంలో హీరోగా చేయడం గురించి అడిగారు. బయటి పతాకంపై, వేరే దర్శకుని ద్వారా నరేష్ హీరోగా పరిచయమైతేనే బావుంటుందని ఆమెకూ అనిపించడంతో ప్రేమసంకెళ్ళు ప్రాజెక్టును అప్పటికి పక్కనపెట్టారు. అంతకుముందు నుంచే విజయనిర్మలకీ, జంధ్యాలకీ సన్నిహితుడైన సంగీత దర్శకుడు రమేష్ నాయుడు నరేష్ తో జంధ్యాల సినిమా తీస్తే బావుంటుందనుకుని ప్రోత్సహించారు. ముద్దమందారంలోనే నరేష్ హీరో అయితే బావుంటుందనుకున్నా, చివరికి నాలుగు స్తంభాలాటలో కుదరడంతో ఆయన చాలా సంతోషించారు. అలా నరేష్ సినిమాలో హీరోగా చేశారు. తన తొలిచిత్రం ముద్ద మందారంలో హీరోహీరోయిన్లుగా పరిచయం చేసిన ప్రదీప్, పూర్ణిమలకు రెండో సినిమా మల్లెపందిరిలో అతిథి పాత్రలను ఇచ్చిన జంధ్యాల ఇందులో మళ్ళీ హీరోహీరోయిన్ పాత్రలకు తీసుకున్నారు.
ఈ సినిమాకు రెండేళ్ళ క్రితం జాతర అనే చిత్రంలో తొలిసారి వెండితెరపై కనిపించిన సుత్తి వీరభద్రరావు, అంతకుముందే జంధ్యాల తొలిచిత్రంలో చిన్నవేషం వేస్తూ నటునిగా ప్రయత్నాలు చేస్తున్న సుత్తివేలుకూ ఈ సినిమాలో హాస్యం పండించే పాత్రలు వచ్చాయి. ఈ సినిమాలో సుత్తి ట్రాక్ విషయంలో కామెడీ పండించిన వాళ్ళిద్దరికీ స్క్రీన్ నేమ్స్ గా సుత్తి స్థిరపడే స్థాయిలో ఈ సినిమాలో హాస్యం విజయవంతమైంది. నిజానికి సినిమాలో మొదటి సుత్తి మీద ట్రాక్ కానీ, వీరభద్రం (సుత్తి వీరభద్రరావు) పాత్రకు గుమస్తా (సుత్తివేలు) పాత్ర కానీ లేవు. అయితే సుత్తి మీద ఓ చిన్న డైలాగుని స్పాట్లో ఉన్న యూనిట్ బాగా ఆస్వాదించడంతో దాన్ని 15 సీన్లకు పెంచారు, అలానే వీరభద్రం ఇంట్లో వంటవాడి పాత్రను సత్తిబాబు అనే నటుడితో చేయించాలని అనుకున్నారు. అయితే వంటవాడి పాత్ర కథాగమనానికి అడ్డుపడుతోందని భావించి దాన్ని తొలగించి, గుమస్తా పాత్రను సృష్టించారు. అప్పటికే జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ సమయంలో స్నేహితుల ప్రోద్బలంతో తనను కలిసిన వేలుకు ఆ పాత్రని ఇచ్చే ఉద్దేశంతో ఓ నాలుగైదు రోజులు సెలవుపెట్టగలరా అని జంధ్యాల అడిగారు. చాలా అదృష్టంగా భావించిన వేలు సెలవుపెట్టి సినిమాలో భాగమయ్యారు.[1]

చిత్రీకరణ

[మార్చు]

నాలుగు స్తంభాలాట చిత్రీకరణను జంధ్యాల తనకు ఇష్టమైన విశాఖపట్నం పరిసరాల్లోనే చేశారు. విశాఖ, అరకులోయ, భీమిలి, యారాడ మొదలైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. సినిమా షూటింగ్ కోసం జంధ్యాల తొలిచిత్రం సినిమా ముద్ద మందారం సినిమా కోసం తీసుకున్నట్టే విశాఖపట్నానికి చెందిన ఎం.వి.పి.కాలనీలో ఇళ్ళు అద్దెకి తీసుకుని యూనిట్ ఉండి చిత్రీకరణ జరుపుకున్నారు. చిత్రీకరణలో జంధ్యాల ప్రత్యేకమైన శైలిని అవలంబించేవారు. సీన్ విభజన, స్క్రిప్టులపై మంచి పట్టు ఉన్న జంధ్యాల సంభాషణలు మాత్రం ఎంచుకున్న లొకేషన్లను బట్టి రాసుకునేవారు. ఈ సినిమాలోని చినుకులా రాలి పాటను ముప్పై రోజుల పాటు కొద్ది కొద్దిగా తీశారు. కారులో లొకేషన్లు చూసుకుంటూ వెళ్ళి నప్పినచోట షూటింగ్ చేసే జంధ్యాల, రోజూ ముందుగా కొన్ని కొన్ని షాట్లు చినుకులా రాలి పాటకు తీసి, తర్వాత మిగిలిన సన్నివేశాలు తీసుకునేవారు. అంతేకాక కొన్ని సన్నివేశాలు, షాట్లు ఎందుకు తీస్తున్నారో, ఏం తీస్తున్నారో యూనిట్ కీ, స్క్రిప్టు పూర్తిగా తెలిసిన నిర్మాత వంటి కీలకమైనవారికీ కూడా అర్థమయ్యేది కాదు.
అప్పటికి సీనియర్ నిర్మాతగానే కాక సినిమా రంగంపై మంచి అభిరుచి ఉన్న వ్యక్తిగా పేరున్న నిర్మాత నవతా కృష్ణంరాజు పరాజయాల్లో ఉండడంతో ఈ సినిమాపైనే అన్ని ఆశలూ పెట్టుకుని నిర్మించారు. ఆయనకు జంధ్యాల సినిమా తీసే ధోరణి అర్థంకాక కొన్నాళ్ళు గొడవపడ్డారు. అయితే సినిమా పూర్తయ్యేకొద్దీ జంధ్యాల సినిమాపై మంచి కమాండ్ ఉన్న వ్యక్తి అని, అది ఆయన సినిమా తీసే శైలి అనీ అర్థమయింది కృష్ణంరాజుకు.
ఈ సినిమా పాటల చిత్రీకరణలో వినూత్నమైన ప్రయత్నాలు చేశారు. నరేష్ మొదటిసినిమాగా చేద్దామనుకున్న ప్రేమ సంకెళ్ళు సినిమా మేకప్ టెస్ట్ కోసం నరేష్ కొన్ని మోటార్ సైకిల్ జంప్స్ చేశారు. దాన్ని చూసిన జంధ్యాల రాగమో, అనురాగమో పాట కోసం అతనితో ఫీట్స్ చేయించారు. కొండల్లో ఆరు అడుగుల ఎత్తు మీంచి మోటార్ సైకిల్ నడుపుతూ దూకేయమంటే హీరోహోండా సిబి 100 బండితో నరేష్ అలానే దూకేశారు. దూకిన ప్రదేశం జంపింగ్ కి అనుకూలంగా లేకపోయినా బైక్ మాత్రం సరిగానే దిగింది. అలానే చాలానే రిస్కీ ఫైట్లు ఆ ధైర్యంతో జంధ్యాల నరేష్ తో చేయించారు. గోదావరిలో కూడా సినిమాకోసం నరేష్ దూకారు. ఈ సాహసాల్లోనే భాగంగా విశాఖలోని ఎర్రకొండల్లో భూమి రబ్బర్ లా కిందకూ మీదకూ కదులుతూంటే తమాషాగా ఉందని అక్కడ నరేష్, పూర్ణిమలను నిలబెట్టి కొన్ని షాట్లు తీసుకున్నారు. ఇంతలో అక్కడివారు పరుగెత్తుకుంటూ వచ్చి- అది ఊబి.. దిగబడితే మళ్ళీ బతికి బయటపడరని చెప్పడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.
సినిమా నిర్మాణానికి రూ.12 లక్షలు ఖర్చయింది, సుమారుగా 50 రోజుల పాటు సినిమా చిత్రీకరణ జరుపుకుంది.[1]

విడుదల, ప్రాచుర్యం

[మార్చు]

సినిమా 1982లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. సినిమాలోని చినుకులా రాలి పాట చాలా ప్రాచుర్యం పొందింది. సినిమాలోని సుత్తి హాస్యం అద్భుతమైన విజయం సాధించింది. సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు ఆ సన్నివేశాల్లో నటించినందుకు వారిద్దరి పేర్లకు ముందు సుత్తి ఇంటిపేరుగా స్థిరపడి, వారిద్దరికీ సుత్తి జంటగా పేరొచ్చింది.[1] సుత్తి అన్న పదం అర్థంపర్థం లేకుండా, అవతలివారికి ఆసక్తి లేకున్నా మాట్లాడుతూపోవడాన్ని సూచిస్తూ ఇప్పటికీ తెలుగువారి నుడికారంలో చేరిపోయింది.

చిత్ర బృందం

[మార్చు]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిలా పొంగు నీప్రేమ నాప్రేమ నీపేరే నాప్రేమ, రచన: వేటూరి సుందర రామమూర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • దొరలనీకు , రచన వేటూరి సుందర రామమూర్తి, గానం.సుశీల
  • కలికి చిలుకరా , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • కొబ్బరాకు గాలి రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • రాగమో అనురాగమో , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 పులగం, చిన్నారాయణ (April 2005). జంధ్యా మారుతం (I ed.). హైదరాబాద్: హాసం ప్రచురణలు.
  2. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.