రాయచూరి యుద్ధము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయచూరు యుద్ధం

రాయచూరు కోట
తేదీ1520 మే 19[1][2]
ప్రదేశంరాయచూరు, కర్ణాటక
ఫలితంవిజయనగర విజయం
ప్రత్యర్థులు
Vijayanagara Empire విజయనగర సామ్రాజ్యం
సేనాపతులు, నాయకులు
Vijayanagara Empire శ్రీ కృష్ణదేవరాయలు[3]ఇస్మాయిల్ ఆదిల్‌షా Surrendered[3]
మీర్జా జహంగీర్ 
సలాబత్ ఖాన్ (బందీ) Executed[4]
Asada Khan[5]
బలం
సమకాలిక మూలం
  • 1,32,000 సైనికులు (32,000 గుర్రాలు. 550 ఏనుగులు)
  • పోర్చుగీసు దళం

మరొక అంచనా.

  • 30,000 సైనికులు

ఆధునిక అంచనాలు

  • 70,000 కాల్బలం
    30,000 గుర్రాలు
  • 550 ఏనుగులు
సమకాలిక మూలం
  • 120,000 కాల్బలం
  • 18,000 గుర్రాలు
  • 150 ఏనుగులు
    కోట లోపల:
    8,000 కాల్బలం
    400 గుర్రాలు
    20 ఏనుగులు
    30 పంగలకర్రలు
    200 ఫిరంగులు
ప్రాణ నష్టం, నష్టాలు
16,000 సైనికులు మరణించారు (సమకాలిక మూలం)తెలీదు

శ్రీకృష్ణదేవరాయలకూ, బిజాపూరు సుల్తాను అహమ్మదు షాకూ మధ్య 1520 లో ఇప్పటి కర్ణాటక లోని రాయచూరు వద్ద జరిగిన యుద్ధమే రాయచూరి యుద్ధం.[6] దక్షిణ భారతదేశ చరిత్రలో ఈ యుద్ధం ఒక మైలురాయి. కర్ణాటక రాష్ట్రంలో కృష్ణ తుంగభద్ర నదుల అంతర్వేదిలోనున్న రాయచూరు పట్టణం చారిత్రకంగా ప్రసిద్ధి గాంచింది. విజయనగర రాజులకు, గుల్బర్గా, బిజాపూరు సుల్తానులకు మధ్య జరిగిన పలు యుద్ధాలకు ఇది వేదికైంది. ఈ యుద్ధంలో రాయలు, సుల్తాను ఓడించి, కృష్ణానదికి అవతలికి తరిమికొట్టాడు.[7]

తొలిపలుకు

[మార్చు]

కాకతీయ రాజు రుద్రుడు 1284లో రాయచూరు కోటను కట్టించాడు. కాకతీయుల పతనం తరువాత రాయచూరు విజయనగర రాజుల ఆధీనం లోనికి వచ్చింది. 1340 లో ముసునూరి కమ్మ నాయకులు రాయచూరు కోటను బలోపేతం చేశారు. 1347 లో కోటను బహమనీలు ఆక్రమించారు.[8] అటు పిమ్మట రెండు శతాబ్దాలలో ఈ కోట కోసం అనేక యుద్ధాలు జరిగాయి. సాళువ నరసింహరాయలు మరణించేటపుడు రాయచూరు కోటను తిరిగి సాధించాలనే కోరికను వెలిబుచ్చాడు.

1520 లో కృష్ణదేవరాయలు, గుర్రాలు కొనేందుకు సయ్యదు మరైకారు అను ఒక మహమ్మదీయునికి డబ్బు ఇచ్చి, గోవా పంపించాడు. అతడు దారిమధ్యలో డబ్బుతోసహా ఆదిల్ ఖాను చెంతచేరాడు. మరైకారుని అప్పగించమని రాయలు ఆదిల్ ఖానుకు కబురంపాడు. ఖాన్ ఈవార్తను పెడచెవిని పెట్టాడు. ఆగ్రహించిన రాయలు యుద్ధానికి సన్నాహాలు చేసాడు. అమర నాయకులందరికి ఆహ్వానాలు పంపించాడు. మంచి ముహూర్తానికై పండితులను సంప్రదించాడు.

సైన్యం

[మార్చు]

రాయలు విజయనగరములోని గుడులలో పూజలు చేసి సైన్యముతో బయలుదేరాడు. ఈ సేనకు ఐదు కిలోమీటర్ల ముందు గూఢచారులు తరలివెళ్ళారు. దారిలోని పరిస్థితులు సైన్యానికి ఎప్పటికప్పుడు తెలిచేయటం వారి పని. చారులకు రక్షణగా రెండువేలమంది రౌతులు ధనుర్బాణాలతో వెళ్ళారు. సైన్యానికి కావలిసిన వస్తువులు అమ్మటానికి వేలమంది వర్తకులు కూడా ఉన్నారు. అందరితో కలుపుకొని 7,36,000 మంది సైన్యము, 32,600 గుర్రాలు, 550 ఏనుగులు ఉన్నాయి.[9] ఆ కోలాహలము చూస్తుంటే ఒక పట్టణమే తరలివెళ్ళుతున్నదా అన్న అనుమానము వస్తుంది.

అందరికీ ముందుగా పెమ్మసాని రామలింగ నాయుడు అను ముఖ్యసేనాధిపతి ఉన్నాడు. ఇతనికి కమ్మ నాయకుడనే పేరు కూడా ఉంది. రామలింగనితోబాటు 30,000 కాల్బలము (ధనుస్సులు, ఈటెలు, బల్లెములు, కత్తులు, డాలులు, తుపాకులతో), వేయి గుర్రాలు, ఏనుగులు ఉన్నాయి. రామలింగని వెనుక తమతమ బలగాలతో తిమ్మప్ప నాయకుడు, అడపా నాయకుడు, కుమార వీరయ్య, గండ రాయలు (విజయనగర పట్టణ రక్షకుడు) ఉన్నారు. వీరితోబాటు మహావీరులగు రాణా జగదేవు, రాచూరి రామినాయుడు, హండె మల్లరాయ, బోయ రామప్పనాయుడు, సాళువ నాయుడు, తిప్పరసు, అయ్యప్ప నాయుడు, కొటికము విశ్వనాథ నాయుడు, చెవ్వప్ప నాయుడు, అక్కప్ప నాయుడు, బోయ కృష్ణప్పనాయుడు, వెలిగోటి యాచమ నాయుడు, కన్నడ బసవప్ప నాయుడు, సాళువ మేకరాజు, మట్ల అనంత రాజు, బొమ్మిరెడ్డి నాగరెడ్డి, బసవ రెడ్డి, విఠలప్ప నాయుడు, వీరమ రాజు ఉన్నారు.

సైనికులందరివద్ద తగు ఆయుధాలున్నాయి. డాలులు ఎంతపెద్దవంటే ఒంటిని కాపాడుకొనుటకు వేరే కవచము అవసరము లేదు. గుర్రాలకు, ఏనుగులకు రంగురంగుల గుడ్డలు తొడిగారు. ఏనుగులపైనున్న హౌడాలు ఏంతపెద్దవంటే వాటిలో నలుగురు సైనికులు చొప్పున రెండువైపుల యుద్ధము చేయవచ్చు. ఏనుగుల దంతాలకు పొడవాటి కత్తులు వేలాడదీశారు. పలు ఫిరంగులుకూడ ఉన్నాయి. ఇరవైవేలమంది చాకలివారు, వేశ్యలుకూడ తరలివెళ్ళారు. రాయలుకు దగ్గరలో ముందువైపున, నీరునింపిన తోలుతిత్తులతో పన్నెండు వేలమంది సేవకులు సైనికులకు నీరందించుటకు ఉన్నారు. ఈవిధముగా రాయలు మల్లయ్యబండ (ప్రస్తుత మలియాబాదు) అను ఊరు చేరి గుడారము వేసాడు. ఇది రాయచూరికి 5 కి.మీ. దూరములో ఉంది. రాజుగారి గుడారము చుట్టూ ముళ్ళతోకూడిన కంప వేసిరి. సైన్యము విశ్రాంతి తీసుకొనుటకు ఆదేశములిచ్చారు.

తదుపరి, సైన్యం రాయచూరి కోట దగ్గరకు చేరింది. కోట తూర్పువైపున గుడారాలు వేసి ముట్టడి మొదలుపెట్టారు. కొంతసేపటికి 1,40,000 సైన్యముతో (రౌతులు, కాల్బలము) ఆదిల్ షా కృష్ణా నది ఉత్తరపు ఒడ్డుకి వచ్చాడని రాయలుకు వార్త అందింది. కొద్దిరోజుల విరామం తర్వాత షా, నదిని దాటి రాయచూరి కోటకు తొమ్మిది మైళ్ళ దూరములో గుడారము వేశాడు. ఇది నదికి ఇదు మైళ్ళ దూరము.

పోర్చుగీసు చరిత్రకారుడు న్యూనెజ్ రాయలు శిబిరాన్ని ఇలా వర్ణించాడు.

"యుద్ధశిబిరములో ఏవస్తువుకూ కొదవలేదు. ఏదికావాలన్నా దొరుకుతుంది. కళాకారులు, స్వర్ణకారులు నగరములోనున్నంత హడావిడిగా ఉన్నారు. అన్నిరకముల రత్నాలు, వజ్రములు, ఆభరణాలు వగైరా అమ్మకానికి ఉన్నాయి. తెలియనివారు అచట యుద్ధము జరగబోతున్నదని ఊహించలేరు. సంపదతో అలరారుతున్న పెద్ద నగరములో ఉన్నారని అనుకుంటారు".

పోరు

[మార్చు]
పోర్చుగీసు సైన్యం

1520 మే పంధొమ్మిదవ తేదీ శనివారం తెల్లవారగానే రెండు సేనలు పోరుకు తలపడ్డాయి. రాయల సేన యుద్ధభేరీని మోగించింది. భేరీలు, నగారాలు, కేకలతో దిక్కులు పిక్కటిల్లాయి. ఆ భయంకరమైన శబ్దానికి గాలిలో విహరిస్తున్న పిట్టలు తొట్రుపడి సైనికుల చేతుల్లోకి వచ్చి పడ్డాయి. మాటలు వినపడక సైగలతోనే సరిపెట్టుకోవాల్సిన స్థితి.

రాయలు రెండు పటాలములతో ముందుకేగి దాడిచేశాడు. వారి ధాటికి తురుష్క సేనలు పారిపోయి కందకాలలో దాగారు. అపుడు సుల్తాను ఫిరంగు లుపయోగించి హిందూ సేనలకు అపార నష్టము కలిగించాడు. దీంతో తురుష్క సేన విజృంభించి హిందువులను దునుమాడుతూ ఒక మైలు దూరం తరిమారు. ఆ సందర్భములో రాయలు తమ సహజసిద్ధమైన శౌర్యపటిమతో సేనల నుత్తేజపరిచాడు. గుర్రమునెక్కి తురుష్కసేన లోకి సూటిగా దూసుకెళ్ళాడు. వారితోబాటు సేనాధిపతి రామలింగ నాయుడూ ఆతనివెంటనున్న యోధులూ అసమాన శౌర్యప్రతాపాలు ప్రదర్శించారు.

రామలింగ

[మార్చు]

రాయవాచక కర్త విశ్వనాథ స్థానాపతి, రామలింగని శౌర్యాన్నిలా వర్ణించాడు.

"...... ఆయన సంతరించిన ఎనభైవేల చివ్వలవారున్నూ రణపెండ్లికొడుకులై ఇక్కడి ఆశపాశలు విడిచి కయ్యమందేదీ వియ్యమందేదిగా ఎంచి అని మీది దృష్టిచే రామలింగనాయని వెంబడిని నడువంగా తురకలు ఈ వార్తలువిని డేరిజావద్ద జీరాసంజోగంతో విచ్చుకత్తుల రౌతులు అరవైవేలున్నూ వారిని చుట్టుక నిండు సంజోకం గుర్రాలు పదివేలకున్నూ వార్లను అనుభవించుకయుండె మదహత్తులు వెయ్యికిన్ని ఈరీతిన డేరిజావద్ద ఉంచి మూడుతెగల తురకలున్నూ తమతమ పాళ్యములో ఆయత్తపాటుతో జాగ్రత్తకలిగియుండగా రామలింగనాయడు తురకల పాళ్యంవారి సమీపానికిపోగానే గుర్రాన్ని కత్తికేడం తీసుకొని ఏనుగుల బారుమీద శైలతటానికి సింహపుపిల్లల చందాన తొక్కినడచి మదహత్తీల తొండాలు ఖండాలుగా నరికి మావటీలను ఈటెల చేత కుమ్మి తోయగా ఏనుగులవారి మీదికి నడవగలవారు గుర్రాల పక్కరలెత్తి కురుచ ఈటెలతోనున్నూ, పిడిఈటెలతోనున్నూ, పందిబల్లెములతోనున్నూ గుచ్చితోసెదిన్ని దోసకాయల చందాన వేటారు తునకలుగా నరికేదిన్ని ఈరీతి నొప్పించగా గుర్రాలవారు వెనకా ముందై పారసాగారు. అప్పుడు నాలుగువేల గుర్రం చాపకట్టుగా పడగా అటువెనుక విచ్చుకత్తుల రవుతులమీద నడచి జగడం ఇయ్యగా సరిచావులుగా ఆరువేలకు నాలుగు వేల రవుతులు పడ్డారు. అంతట రామలింగమనాయడు డేరీజు తాళ్ళు తెగకోయించగా, డేరీజా నేలకూలిన క్షణాన కృష్ణరాయలు భేరీతాడనము చేయించి మదహత్తిని ఎక్కుకొని ఉభయఛత్రాలొ మకర టెక్కెలతో నూట ఇరువై ఘట్టాలు ఏనుగులున్నూ అరవైవేల గుర్రాలున్నూ ఐదు లక్షల పాయదళమున్నూ పొట్లంగా నడిచారు. కనుక ఆక్షణాన కృష్ణవేణి ఉభయతీరాలున్న ప్రవాహం నిండి రాసాగింది".

తురుష్క సైన్యం నది దాటడానికి ప్రయత్నించింది. రామలింగని యోధులు వారిని వెంబడించి ప్రవాహం లోనే వేలమందిని వధించారు. రాయలు కృష్ణానది దాటి అహమ్మదు షా వెంటబడగా ఆతడు అసదు ఖాను సాయముతో ఏనుగునెక్కి పారిపోయాడు. సలాబతు ఖాను అను తురుష్క సేనాని ధైర్యము వీడక చివరివరకు పోరాడి రాయలుకు బందీగా చిక్కాడు.

రాయలు విజయోత్సాహముతో రాయచూరు కోటకి తిరిగివచ్చి దాడిని కొనసాగించాడు. ఈ కోట ముట్టడిలో క్రిస్టొవావ్ డి ఫిగరెడొ అను పోర్చుగీసు శూరుడు ఎంతో సాయమందించాడు. ఆతని సైనికులు కోట మీదనున్న తురుష్క సేనలను తుపాకులతో కాల్చి ఏరివేశారు. కోట స్వాధీనమయింది.

పోరుపిదప

[మార్చు]

యుద్ధము తరువాత సుల్తానులు రాయల వారి వద్దకు రాయబారాలు పంపారు కాని వారికి సరైన సమాధానము లభించలేదు. రాయలు విజయనగరము తిరిగివచ్చి పెద్దఎత్తున సంబరాలు చేశారు. ఓడిపొయిన అదిల్ షా రాయబారి రాయలు దర్శనముకై నెలరోజులు వేచియున్నాడు. సుల్తాను వచ్చి రాయలు పాదములకు మొక్కినచో గెలిచిన భూభాగము తిరిగి ఇవ్వబడునని రాయబారికి చెప్పబడింది. దీనికి షా నుండి సమాధానం లేదు. రాయలు బిజాపూరు పై దండెత్తి అచట బందీలుగా ఉన్న పూర్వపు బహమనీ సుల్తాను ముగ్గురు కొడుకులను విముక్తులను చేశారు. పెద్దకొడుకును దక్కను సుల్తానుగా ప్రకటించారు. అటుపిమ్మట అదిల్ షా స్వాధీనములోనున్న బెళగాం పై దండయాత్రకు సన్నాహాలు చేస్తూండగా రాయలు ఆరోగ్యం క్షీణించి 1530 లో 45 వ ఏట స్వర్గస్థుడయ్యాడు. అతని తరువాత అచ్యుత దేవరాయలు పట్టాభిషిక్తుడయ్యాడు.

రాజకీయ పరిణామాలు

[మార్చు]

రాయచూరు యుద్ధం వల్ల దక్షిణభారత చరిత్ర ఒకవిధముగా పెద్దమలుపు తిరిగింది. ఓడిపోయి బలహీనపడిన అదిల్ షా మిగతా సుల్తానులకు స్నేహహస్తమందించాడు. వారందరూ ఏకమై విజయనగరసామ్రాజ్యాన్ని నాశనము గావించుటకు కంకణబద్ధులయ్యారు. విజయమువల్ల హిందువులకు చేకూరిన గర్వము, అసహనము సుల్తానులకు కంటకమై తళ్ళికోట యుద్ధానికి, విజయనగర విధ్వంసానికి దారి తీసింది. ఒక మహానగరము మృతనగరమయ్యింది. హిందువుల పరాజయమువల్ల దక్కనులో పోర్చుగీసువారి ప్రాభవము కూడా తగ్గిపోయింది. పరదేశీయుల వ్యాపారాలన్నీ తగ్గిపోయాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. Sewell, Robert. Forgotten Empire Vijayanagar.
  2. Sastri, K A Nilakanta. Further Source Of Vijayanagara History Vol I.
  3. 3.0 3.1 3.2 Bhat, N. Shyam (2009). "Political Interaction between Portuguese Goa and Karnataka". Portuguese Studies Review, Vol. 16, No. 2. Baywolf Press. p. 27.
  4. GOPAL, M. H. (1956). THE HISTORY OF VIJAYANAGAR EMPIRE VOL.1. POPULAR PRAKASHAN,BOMBAY. pp. 139–144.
  5. Sewell, Robert. Forgotten Empire Vijayanagar. The Raya then crossed the river and seized the Shah's camp, while the Shah himself, by the counsel and help of Asada Khan, a man who afterwards became very famous, escaped only with his life, and fled from the field on an elephant.
  6. Roy (2014), p. 68: "In 1520, Battle of Raichur was fought between Krishna Raya of Vijayanagara and Sultan Ismail Adil Shah of Bijapur."
  7. Krishna Reddy (2008). Indian History. Tata McGraw-Hill. ISBN 9780070635777.
  8. Eaton (2013), p. 278: "In the confusion surrounding the expulsion of imperial forces in 1347, the Doab apparently fell to the powers that simultaneously arose on the ashes of Tughluq imperialism in the Deccan, the Bahmani sultanate (1347-1538).
  9. GOPAL, M. H. (1956). THE HISTORY OF VIJAYANAGAR EMPIRE VOL.1. POPULAR PRAKASHAN,BOMBAY. p. 136.

వనరులు

[మార్చు]