అంతర్జాల చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీన్-చార్లెస్-బోనెన్‌ఫాంట్ భవనంలో IBM 360 మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్

అంతర్జాల చరిత్ర 1950ల్లో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ల అభివృద్ధితో మొదలైంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లోని పలు కంప్యూటర్ సైన్స్ లాబొరేటరీల్లో వైడ్ ఏరియా నెట్‌వర్కింగ్ ఆరంభ అంశాలు ప్రారంభమయ్యాయి.[1] 1960ల్లోనే రాబర్ట్ టేలర్ మార్గదర్శనంలో, లారెన్స్ రాబర్ట్స్ నిర్వహణలో ఆర్పానెట్ వంటి ప్రాజెక్టుల అభివృద్ధికి, సంబంధిత పరిశోధనలకు అమెరికన్ రక్షణశాఖ కాంట్రాక్టులు ఇచ్చింది. 1969లో లాస్ ఏంజెల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడు లియోనార్డ్ క్లైన్‌రాక్ లాబొరేటరీ నుంచి స్టాన్‌ఫర్డ్ పరిశోధన సంస్థలోని నెట్‌వర్క్ నాడ్‌కు మొట్టమొదటి ఆర్పానెట్ మెసేజి పంపించాడిడు.

1980 ల ప్రారంభంలో, అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) అమెరికా లోని పలు విశ్వవిద్యాలయాలలో జాతీయ సూపర్ కంప్యూటింగ్ కేంద్రాలకు నిధులు సమకూర్చింది. 1986 లో ఎన్ఎస్ఎఫ్‌నెట్ ప్రాజెక్టు ద్వారా ఇంటర్ కనెక్టివిటీని అందించింది. ఈ విధంగా అమెరికా లోని పరిశోధన, విద్య సంస్థలు ఈ సూపర్ కంప్యూటర్ సైట్‌లను అందుకోగలిగాయి. NSFNET కి అంతర్జాతీయ కనెక్షన్లు, డొమైన్ నేమ్ సిస్టమ్ వంటి ఆర్కిటెక్చరు ఆవిర్భావం, ఇప్పటికే ఉన్న నెట్‌వర్కులలో అంతర్జాతీయంగా TCP / IP ప్రోటోకోల్‌ను స్వీకరించడం వంటి వాటితో అంతర్జాలం మొదలైంది. [2] [3] [4] 1980 ల చివరలో వాణిజ్య ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISP లు) ఉద్భవించాయి. 1990 లో ARPANET ను రద్దు చేసారు. [5] అధికారిక వాణిజ్య సంస్థల ద్వారా అంతర్జాలం లోని కొన్ని భాగాల్లో పరిమిత ప్రైవేట్ కనెక్షన్లు ఇవ్వడం 1989 - 1990 ల చివరి నాటికి అనేక అమెరికన్ నగరాల్లో మొదలైంది. [6] 1995 లో NSFNET రద్దు చేయడంతో, వాణిజ్యపరంగా అంతర్జాల వాడకంపై ఉన్న చివరి ఆంక్షలు తొలగిపోయాయి.

బ్రిటిష్ కంప్యూటర్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ లీ 1989-90లో స్విట్జర్లాండ్‌లోని సెర్న్ లో చేసిన పరిశోధనల ఫలితంగా వరల్డ్ వైడ్ వెబ్ ఏర్పడింది. ఇది హైపర్‌టెక్స్ట్ పత్రాలను సమాచార వ్యవస్థ లోకి అనుసంధానిస్తుంది. ఇవి నెట్‌వర్కులోని ఏ నోడ్ కైనా అందుబాటులో ఉంటాయి. [7] 1990 ల మధ్య నుండి, అంతర్జాల సంస్కృతి, వాణిజ్యం పైన, సాంకేతిక పరిజ్ఞానంపైనా విప్లవాత్మక ప్రభావాన్ని చూపింది. ఎలక్ట్రానిక్ మెయిల్, తక్షణ సందేశం, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP) టెలిఫోన్ కాల్స్, వీడియో చాట్, వరల్డ్ వైడ్ వెబ్ దాని చర్చా వేదికలు, బ్లాగులు, సోషల్ నెట్‌వర్కింగ్ సేవలు, ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు మొదలైనవి ఈ విప్లవంలో భాగం. 1 Gbit / s, 10 Gbit / s లేదా అంతకంటే ఎక్కువ వేగాలతో పనిచేసే ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్కులు మరింత డేటాను, మరింత అధిక వేగంతో ప్రసారం చేస్తున్నాయి. విశ్వ సమాచార ప్రసార దృశ్యాన్ని అంతర్జాలం ఆక్రమించుకోవడం చాలా వేగంగా జరిగిపోయింది: 1993 లో రెండు-వైపులా జరిగే ప్రసార నెట్‌వర్కుల ద్వారా ప్రవహించే సమాచారంలో 1% అంతర్జాలంలో జరగ్గా, 2000 నాటికి అది 51% కి పెరిగి, 2007 నాటికి 97% కంటే ఎక్కువ స్థాయికి చేరింది. [8] ఆన్‌లైన్ సమాచారం, వాణిజ్యం, వినోదం, సోషల్ నెట్‌వర్కింగ్ సేవల ద్వారా అంతర్జాలం పెరుగుతూనే ఉంది. అయితే, భవిష్యత్తులో విశ్వస్థాయి నెట్‌వర్కు, ప్రాంతీయంగా ఉన్న అంతరాలను బట్టి రూపుదిద్దుకోవచ్చు. [9]

1989-2004: అంతర్జాలోదయం - వెబ్ 1.0[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాల హోస్ట్‌ల సంఖ్య: 1969–2012 [10]

గతంలో ఉన్న నెట్‌వర్కుల మాదిరిగానే, అంతర్జాలంగా పరిణమించిన వ్యవస్థ కూడా ప్రధానంగా ప్రభుత్వాల, ప్రభుత్వ సంస్థల వినియోగం కోసం మాత్రమే ఉండేది. అయితే త్వరలోనే, అంతర్జాలపు వాణిజ్య ఉపయోగంపై ఆసక్తి పెరిగింది. వాణిజ్య ఉపయోగం నిషేధించబడినప్పటికీ, వాణిజ్య ఉపయోగపు ఖచ్చితమైన నిర్వచనం అస్పష్టంగాను, ఆత్మాశ్రయం గానూ మారింది. UUCP నెట్, X.25 IPSS లకు అటువంటి పరిమితులు లేవు. కానీ, చివరికి UUCPNet, ARPANET, NSFNET కనెక్షన్లపై అధికారికంగా నిషేధం ఏర్పడింది.

ఫలితంగా, 1980 ల చివరలో, మొట్ట మొదటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) కంపెనీలు ఉద్భవించాయి. ప్రాంతీయ పరిశోధనా నెట్‌వర్కులకు సేవలను అందించడానికీ, ప్రత్యామ్నాయ నెట్‌వర్క్ యాక్సెస్, యుయుసిపి ఆధారిత ఇమెయిల్, యూస్‌నెట్ న్యూస్‌ను ప్రజలకు అందించడానికీ, పిసినెట్, యుయునెట్, నెట్‌కామ్, పోర్టల్ సాఫ్ట్‌వేర్ వంటి సంస్థలు ఏర్పడ్డాయి. అమెరికాలో మొట్టమొదటి వాణిజ్య స్థాయి డయలప్ ISP ది వరల్డ్, 1989 లో ప్రారంభమైంది. [11]

వరల్డ్ వైడ్ వెబ్, బ్రౌజర్‌ల ఆవిర్భావం[మార్చు]

అప్పటి స్టేట్-మ్యాగజైన్‌లో అప్పటికి అంతగా పరిచయం లేని అంతర్జాలాన్ని పరిచయం చేసే సమావేశం గురించి అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ లైబ్రరీ ఇచ్చిన ప్రకటన

వరల్డ్ వైడ్ వెబ్ ("www" లేదా "W3") అంటే పత్రాలు, ఇతర వెబ్ వనరులను URI లతో గుర్తించే సమాచార స్థలం. ఈ పత్రాలు హైపర్‌టెక్స్ట్ లింకులతో అనుసంధానించబడి ఉంటాయి. వీటిని వెబ్ బ్రౌజరును ఉపయోగించి అంతర్జాలం ద్వారా, (ఇటీవలి కాలంలో) వెబ్ ఆధారిత అనువర్తనాల ద్వారా చూడవచ్చు. [12] ఇది "వెబ్" పేరుతో ప్రసిద్ది చెందింది. 2010 ల నాటికి, అంతర్జాలంలో పరస్పర సంబంధాల కోసం కోట్లాది మంది వాడుతున్న ప్రాధమిక సాధనం, వరల్డ్ వైడ్ వెబ్. ఇది ప్రజల జీవితాలను ఎంతగానో మార్చివేసింది. [13] [14] [15]

వెబ్ బ్రౌజర్లు రావడానికి ముందు, 1980 ల మధ్య, చివరలో హైపర్ లింక్డ్ అనువర్తనాల రూపంలో ఉద్భవించాయి (హైపర్ లింకింగ్ అనే భావన అప్పటికే కొన్ని దశాబ్దాలుగా ఉంది). ఈ తరువాత, టిమ్ బెర్నెర్స్-లీ 1989 లో వరల్డ్ వైడ్ వెబ్‌ను కనిపెట్టి, 1990 లో మొదటి వెబ్ సర్వరును, WorldWideWeb (పదాల మధ్యలో ఖాళీలు లేకుండా) అనే మొదటి వెబ్ బ్రౌజరునూ తయారు చేసాడు. ఈ బ్రౌజరునే ఆ తరువాత నెక్సస్ అనే పేరుతో పిలిచారు. [16] మార్క్ ఆండ్రీసేన్ 1993 లో మొజాయిక్ (అదే తరువాతి కాలంలో నెట్‌స్కేప్ అయింది) కనిపెట్టాడు. [17] దీన్ని ఉపయోగించడం, వ్యవస్థాపించడం కూడా చాలా సులభం. 1990 లలో అంతర్జాల విజృంభణకు ప్రధాన కారణమనే ఘనతను నెట్‌స్కేప్‌కు ఆపాదిస్తారు. [18] ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఒపెరా, సఫారి వంటి ఇతర వెబ్ బ్రౌజర్‌లు తరువాతి కాలంలో వచ్చాయి. [19]

సమాజంలో వాడుక[మార్చు]

అంతర్జాలం వలన 2000 లలో కలిగిన అపారమైన మార్పులు, అంతర్జాలపు మొదటి దశాబ్దం నాటికి చాలా కొత్తగా ఉండేవి. అవి ఎంత కొత్తో చెప్పాలంటే, ఈ రోజు విశ్వవ్యాప్తంగా అంతర్జాలంలో ఏమి కావాలన్నా అందిస్తున్న మొబైలు పరికరాలు ("స్మార్ట్‌ఫోన్లు", ఇతర మొబైలు పరికరాలు) అప్పట్లో కేవలం వ్యాపారం కోసం మాత్రమే ఉపయోగించే వారు; తల్లిదండ్రులు, పిల్లలు కూడా వాడే సాధారణ గృహోపయోగ వస్తువు కాదు. ఆధునిక కోణంలో సోషల్ మీడియా అనేది అసలు ఉనికిలోనే లేదు. ల్యాప్‌టాప్‌లు ఎంతో లావుగా బరువుగా ఉండేవి. చాలా ఇళ్ళలో కంప్యూటర్లు ఉండేవి కావు. డేటా వేగాలు నెమ్మదిగా ఉండేవి. వీడియో గానీ, వీడియో చేసే, డిజిటలైజ్ చేసే మార్గాలు గానీ చాలామందికి అందుబాటులో ఉండేవి కావు; మీడియా నిల్వ అనలాగ్ టేప్ నుండి డిజిటల్ ఆప్టికల్ డిస్క్‌లకు అప్పుడప్పుడే నెమ్మదిగా మారుతోంది (ఫ్లాపీ డిస్క్ నుండి సిడి ల్లోకి ). PHP, ఆధునిక జావాస్క్రిప్టు, జావా వంటి సాంకేతిక పరిజ్ఞానాలు, అజాక్స్, HTML 4, CSS వంటి -అంతర్జాల అభివృద్ధిని వేగవంతం, సరళీకృతం చేసే సాంకేతికతలు, వివిధ సాఫ్ట్‌వేర్ ఫ్రేమ్‌వర్క్‌లు అప్పటికి లేనేలేవిఉ. అవి 2000 ల ప్రారంభంలో రావడం మొదలైంది.

మెయిలింగ్ జాబితాలు, ఈమెయిళ్ళు, ఇ-కామర్స్ మొదట్లో ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ షాపింగ్ (ఉదాహరణకు అమెజాన్, ఈబే ), ఆన్‌లైన్ ఫోరమ్‌లు, బులెటిన్ బోర్డులు, వ్యక్తిగత వెబ్‌సైట్‌లు, బ్లాగుల కోసం మాత్రమే అంతర్జాలాన్ని ఎక్కువగా వినియోగించారు. ఆ రోజుల్లో ఈ వినియోగం వేగంగా పెరుగుతూ ఉండేది. కానీ ఆధునిక ప్రమాణాలతో పోలిస్తే అప్పట్లో ఉపయోగించిన వ్యవస్థలు నిశ్చలం గాను, పెద్దగా సామాజిక సంబంధాలు లేకుండానూ ఉండేవి. ప్రసార సాంకేతికత స్థాయి నుండి విశ్వ సమాజపు మౌలిక సదుపాయాలలో కీలకంగా మారడానికి, అంతర్జాలానికి 2000 ల మొదట్లో జరిగిన అనేక సంఘటనలు అవసరమయ్యాయి.

డాట్ కామ్ బబుల్[మార్చు]

1997 నుండి 2001 మధ్య కాలంలో, అంతర్జాలానికి సంబంధించిన మొట్టమొదటి ఊహాజనిత పెట్టుబడి ఊపు ఏర్పడింది. ఇందులో "డాట్-కామ్" కంపెనీల ( వ్యాపారాలు ఉపయోగించే .com అనే డొమైన్ పేరు‌ను బట్టి ఈ పేరు వచ్చింది) షేర్ల కోసం పెట్టుబడిదారులు ఎగబడడంతో ఈ సంస్థల విలువలు ఊహాతీతంగా పెరగడానికి దారితీసింది. అలా వేగంగా పెరిగిన స్టాక్ విలువలు, తరువాత వచ్చిన మార్కెట్ క్రాష్‌లో కుప్పకూలాయి. ఇదే మొదటి డాట్-కామ్ బబుల్. అయితే దీనివలన ప్రజల్లో ఉత్సాహం, సంస్థల్లో పెరుగుదల తాత్కాలికం గానే మందగించాయి; త్వర లోనే కోలుకొని మళ్ళీ పెరుగడం మొదలైంది.

ఆ తరువాత వచ్చిన కాలాన్ని అంతర్జాలానికి సంబంధించినంత వరకు వెబ్ 2.0 అని పిలవడంతో, 2004-2005 వరకూ ఉన్న కాలాన్ని వెబ్ 1.0 గా అభివర్ణించారు.

2004 - ప్రస్తుతం: వెబ్ 2.0 - విశ్వాంతర్యామి, సామాజిక మాధ్యమం[మార్చు]

అంతర్జాలాన్ని ఒక సామాజిక వ్యవస్థ స్థానంలోకి తీసుకువచ్చే మార్పులు చాలా వేగంగా, 2004 నుండి 2009 వరకూ ఉన్న ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వ్యవధిలో జరిగి పోయాయి. అవి:

 • 2004 లో "వెబ్ 2.0 " కు పిలుపు (మొదట 1999 లో సూచించబడింది)
 • అవసరమైన హార్డ్‌వేర్ (కంప్యూటర్ల వంటివి) ఇళ్ళలోకి చొచ్చుకుపోయాయి.
 • నిల్వ సాంకేతికత, డేటా యాక్సెస్ వేగం పెరగడం - ఫ్లాపీ డిస్క్‌ల స్థానంలో హార్డ్ డ్రైవ్‌లు వచ్చాయి. మెగాబైట్ల నుండి గిగాబైట్లకు (2010 నాటికి టెరాబైట్లకు) నిల్వ పెరిగి పోయింది. ర్యామ్ కిలోబైట్ల నుండి గిగాబైట్లకు, ఈథర్నెట్ వేగం సెకనుకు కిలోబిట్ల నుండి సెకనుకు పదుల మెగాబిట్లకు, సెకనుకు గిగాబిట్లకూ పెరిగిపోయింది.
 • హై స్పీడ్ ఇంటర్నెట్, డేటా కనెక్షన్ల విస్తృత కవరేజి, తక్కువ ధరలకు, పెద్ద ట్రాఫిక్, మరింత నమ్మదగిన సరళమైన ట్రాఫిక్, ఎక్కువ ప్రదేశాల నుండి ట్రాఫిక్‌ అందుబాటు లోకి వచ్చింది
 • కమ్యూనికేషనుకు కొత్త మార్గాలు ఏర్పడ్డాయి. సామాజిక మాధ్యమం, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి వెబ్‌సైట్‌లు, వికీపీడియా (ముందే ఉనికిలో ఉంది కాని ప్రాముఖ్యతను సంతరించుకుంది) లు విస్తరించాయి.
 • మొబైల్ విప్లవం, అన్ని వయసుల వారికి వారి రోజువారీ జీవితంలో భాగస్వామ్యం చేయడానికి, చర్చించడానికి, నిరంతరం నవీకరించడానికి, ప్రతిస్పందించడానికి వీలు కల్పించింది.
 • పైన చెప్పినవన్నీ కలగలిపి డిజిటల్ మార్కెటింగ్ కు ఆస్పదం ఏర్పడింది. ప్రపంచంలో అత్యధిక శాతం మంది అంతర్జాలం వాడటం వల్లా, సామాజిక మాధ్యమాల్లో తమవంతు పాలు పంచుకోవటం వల్లా, అనేక బాహురాష్ట్రీయ సంస్థలు ఈ మాధ్యమాలను వాహకాలుగా వాడుకుని అంతర్జాలంలో మార్కెటింగ్ చర్యలను ప్రారంభించారు.
 • RAM పరిమాణాలు పెరగడం, విశ్వసనీయత పెరిగడం, ధర తగ్గడంతో చిన్నచిన్న మొబైల్ పరికరాలపై కూడా కంప్యూటింగ్ పనులను చేసుకోగల వస్తువుగా మారింది.
 • పూర్తిగా అధిక ప్రాసెసింగ్ శక్తి కంటే కూడా విద్యుత్తును సమర్థంగా వాడుకునే సామర్థ్యం గల ప్రాసెసరు, పరికరాల రూపకల్పనపై ప్రాధాన్యత పెరిగింది. దీని లబ్ధిదారులలో ఒకటి ARM. ఈ బ్రిటిష్ సంస్థ, 1980 ల నుండి చేసిన పరిశోధన కారణంగా మొబైల్, ఎంబెడెడ్ పరికరాల మార్కెట్లో ARM ఆర్కిటెక్చర్ వేగంగా ఆధిపత్యాన్ని పొందింది.

"వెబ్ 2.0" అనే పదం వినియోగదారు సృష్టించిన కంటెంట్ (వాడుకరి-వాడుకరి పరస్పర చర్యలతో సహా), వినియోగం, ఇంటర్‌పెరాబిలిటీని నొక్కి చెప్పే వెబ్‌సైట్‌లను వివరిస్తుంది. ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ డిజైన్‌పై కన్సల్టెంటయిన డార్సీ డినుచి 1999 జనవరిలో రాసిన "ఫ్రాగ్మెంటెడ్ ఫ్యూచర్" అనే వ్యాసంలో మొదటగా దీని ప్రసక్తి వచ్చింది. అందులో ఆమె ఇలా రాసింది: [20] [21] [22] [23]

"ఇప్పుడు మనకు తెలిసిన వెబ్, నిశ్చల స్థితిలో ఉన్న పేజీలను బ్రౌజరు తెచ్చి బ్రౌజర్ విండోలోకి లోడ్ చేస్తుంది. ఇది రాబోయే వెబ్ ఆకారానికి పిండ రూపం మాత్రమే. వెబ్ 2.0 యొక్క తొలి మెరుపులు కనపడడం ఇప్పుడే మొదలైంది. ఆ పిండం ఎలా అభివృద్ధి చెందుతోందో ఇప్పుడిప్పుడే చూస్తున్నాం. అంతర్జాలమంటే తెర నిండా ఉండే పాఠ్యం, గ్రాఫిక్స్‌లు కావు, ఇదొక ట్రాన్స్‌పోర్ట్ మెకానిజం అని మనకు త్వరలోనే అర్థమౌతుంది. పరస్పర సంబంధాలు ఏర్పరచుకునే ఈథర్ ఇది. ఇది [...] మీ కంప్యూటర్ తెరపై కనిపిస్తుంది, మీ టీవీ సెట్‌లో కనిపిస్తుంది [...] మీ కారు డాష్‌బోర్డులో [...] మీ సెల్ ఫోనులో [...] చేతితో పట్టుకునే గేమ్ మెషీన్లలో [. ..] కనిపిస్తుంది. బహుశా మీ మైక్రోవేవ్ ఓవెన్‌లో కూడా కనిపిస్తుంది. " [24] [25] [26] [27]

ఈ పదం 2002-2004 లో తిరిగి కనిపించింది. మొదటి వెబ్ 2.0 సమావేశంలో టిమ్ ఓ'రైల్లీ, డేల్ డౌగెర్టీ సమర్పించిన తరువాత 2004 చివరలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వారి ప్రారంభ వ్యాఖ్యలలో, జాన్ బాటెల్, టిమ్ ఓ'రైల్లీ లు "వెబ్ యాజ్ ప్లాట్‌ఫామ్" యొక్క నిర్వచనాన్ని వివరించారు. ఇక్కడ డెస్క్‌టాప్‌కు విరుద్ధంగా సాఫ్ట్‌వేర్ అనువర్తనాలు వెబ్‌లో నిర్మించబడతాయి. దీనిలో ప్రత్యేక అంశం ఏమిటంటే, "కస్టమర్లే మీ కోసం మీ వ్యాపారాన్ని నిర్మిస్తారు". [28] కంటెంట్‌ను ఉత్పత్తి చేసే వినియోగదారుల కార్యకలాపాలు (ఆలోచనలు, పాఠ్యం, వీడియోలు లేదా చిత్రాల రూపంలో) విలువను సృష్టించడానికి "ఉపయోగించుకోవచ్చు" అని వాళ్ళు చెప్పారు.

వెబ్ 2.0 అంటే సాంకేతికంగా జరిగిన అభివృద్ధేమీ కాదు. వెబ్ పేజీలను తయారు చేయడంలో, వాటిని ఉపయోగించే విధానంలో వచ్చిన సంచిత మార్పులను ఇది సూచిస్తుంది. వెబ్ 2.0 అనేది ఒక విధానాన్ని వివరిస్తుంది, నిష్క్రియాత్మకంగా ఉండే వెబ్ సైట్‌లలో సమాచారాన్ని చూడడం అనేదానికి విరుద్ధంగా, వినియోగదారులే స్వయంగా కంటెంట్ సృష్టికర్తలుగా సోషల్ మీడియాలో వినియోగదారులు పరస్పరం సంభాషించుకోడానికీ సహకరించుకోడానికీ వెబ్‌ 2.0 లో సైట్‌లు గణనీయంగా దృష్టి పెడతాయి. వెబ్ 2.0 కు ఉదాహరణలు సోషల్ నెట్‌వర్కింగ్ సేవలు, బ్లాగులు, వికీలు, ఫోల్కోనమీలు, వీడియో షేరింగ్ సైట్లు, హోస్ట్ చేసిన సేవలు, వెబ్ అప్లికేషన్లు, మాషప్‌లు . [29] టెర్రీ ఫ్లై, తన 3 వ ఎడిషన్ ఆఫ్ న్యూ మీడియాలో, వెబ్ 1.0, వెబ్ 2.0 మధ్య తేడాలను వివరించే విధానాన్ని ఇలా వివరించాడు:

"వ్యక్తిగత వెబ్‌సైట్ల నుండి బ్లాగులు, బ్లాగ్ సైట్ల అగ్రిగేషన్‌కు, ప్రచురణ నుండి స్వయంగా పాల్గొనడానికి, పెద్ద యెత్తున పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేసిన వెబ్ కంటెంట్ నుండి ఇంటరాక్టివ్ ప్రాసెస్‌కు, కంటెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థల నుండి ట్యాగింగ్‌పై ఆధారపడ్డ లింకులకూ (ఫోల్కోనమీ) చేసే ప్రస్థానమే". [30]

ఈ శకంలో సామాజిక సంపర్కం ద్వారా ప్రాముఖ్యతను పొందిన సంస్థలు, ఇంటింటికీ చేరిన అనేక పేర్లు ఉన్నాయి - యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, రెడ్డిట్, వికీపీడియా వంటివి వీటికి ఉదాహరణలు.

మొబైలు విప్లవం[మార్చు]

సాధారణంగా "వెబ్ 2.0" తో మొదలైన మార్పు ప్రక్రియ, ఆ తరువాత కొద్ది కాలానికే మొబైలు పరికరాల పెరుగుదల కారణంగా చాలా వేగవంతమైంది. మొబైల్ అంటే స్మార్ట్‌ఫోన్‌ల రూపంలో ఉన్న కంప్యూటరే. ప్రజలు దాన్ని విస్తృతంగా ఉపయోగించడం, ప్రతిచోటికీ తమతో తీసుకువెళ్లడం, ఇతరులతో సంప్రదించడం, ఫొటోలు, వీడియోలను పంచుకోవడం, "ప్రయాణిస్తూనే" సమాచారాన్ని పొందడ్ం లేదా షాపింగ్ చేయడం, సామాజిక మాధ్యమాల కోసం ఉపయోగించడం మొదలైఅంవి ఈ మొబైలు విప్లవంలో భాగం.

స్థానం ద్వారా ట్యాగ్ చేయబడిన పోస్ట్‌లు లేదా వెబ్‌సైట్‌లు, సేవలకు స్థాన అవగాహన తోడవ్వడంతో, స్థానాన్ని బట్టి లభించే సేవలు, క్రౌడ్‌సోర్సింగ్ విస్తరించాయి. మొబైల్-లక్ష్యంగా ఉన్న వెబ్‌సైట్‌లు ("m.website.com" వంటివి, ముఖ్యంగా కొత్త పరికరాల కోసం రూపొందించబడినవి) మామూలై పోయింది. డెస్క్‌టాప్‌ల శక్తితో చాలా తక్కువ విద్యుత్ వినియోగంతో నడిచే నెట్‌బుక్‌లు, అల్ట్రాబుక్‌లు, విస్తృతమైన 4 జి, వై-ఫై, మొబైల్ చిప్‌లు, అంతర్జాల అభివృద్ధి లోని ఈ దశకు దోహదపడ్డాయి. " యాప్ " అనే పదం ("అప్లికేషన్ ప్రోగ్రామ్" లేదా "ప్రోగ్రామ్" ను సూచించే చిన్న మాట) యాప్ స్టోర్ " అనే పదం ఆవిర్భవించాయి.

ఈ "మొబైల్ విప్లవం" తో ప్రజల వేళ్లకొనల వద్దనే అపరిమితమైన సమాచారం అందుబాటు లోకి వచ్చేసింది. సెల్ ఫోన్‌ల నుండి అంతర్జాలాన్ని చూసే సామర్థ్యంతో మీడియాను వినియోగించే విధానంలో మార్పు వచ్చింది. వాస్తవానికి, మీడియా వినియోగ గణాంకాలను చూస్తే, 18 - 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు వినియోగించే మీడియాలో సగానికి పైగా స్మార్ట్‌ఫోన్ ద్వారానే చేస్తున్నారని తెలుస్తోంది. [31]

మూలాలు[మార్చు]

 1. Kim, Byung-Keun (2005). Internationalising the Internet the Co-evolution of Influence and Technology. Edward Elgar. pp. 51–55. ISBN 1845426754.
 2. "The Untold Internet". Internet Hall of Fame. October 19, 2015. Retrieved April 3, 2020. many of the milestones that led to the development of the modern Internet are already familiar to many of us: the genesis of the ARPANET, the implementation of the standard network protocol TCP/IP, the growth of LANs (Large Area Networks), the invention of DNS (the Domain Name System), and the adoption of American legislation that funded U.S. Internet expansion—which helped fuel global network access—to name just a few.
 3. "Study into UK IPv4 and IPv6 allocations" (PDF). Reid Technical Facilities Management LLP. 2014. Archived from the original (PDF) on 2023-03-06. Retrieved 2021-04-05. As the network continued to grow, the model of central co-ordination by a contractor funded by the US government became unsustainable. Organisations were using IP-based networking even if they were not directly connected to the ARPAnet. They needed to get globally unique IP addresses. The nature of the ARPAnet was also changing as it was no longer limited to organisations working on ARPA-funded contracts. The US National Science Foundation set up a national IP-based backbone network, NSFnet, so that its grant-holders could be interconnected to supercomputer centres, universities and various national/regional academic/research networks, including ARPAnet. That resulting network of networks was the beginning of today's Internet.
 4. "So, who really did invent the Internet?" Archived 3 సెప్టెంబరు 2011 at the Wayback Machine, Ian Peter, The Internet History Project, 2004. Retrieved 27 June 2014.
 5. మూస:Cite IETF
 6. "The First ISP". Indra.com. 1992-08-13. Archived from the original on March 5, 2016. Retrieved 2015-10-17.
 7. Couldry, Nick (2012). Media, Society, World: Social Theory and Digital Media Practice. London: Polity Press. p. 2. ISBN 9780745639208.
 8. "The World's Technological Capacity to Store, Communicate, and Compute Information", Martin Hilbert and Priscila López (2011), Science, 332(6025), pp. 60–65; free access to the article through here: martinhilbert.net/WorldInfoCapacity.html
 9. The Editorial Board (15 October 2018). "There May Soon Be Three Internets. America's Won't Necessarily Be the Best. – A breakup of the web grants privacy, security and freedom to some, and not so much to others". The New York Times. Retrieved 16 October 2018.
 10. "Internet host count history". Internet Systems Consortium. Archived from the original on May 18, 2012. Retrieved May 16, 2012.
 11. "The World internet provider". Retrieved May 28, 2009.
 12. "What is the difference between the Web and the Internet?". W3C Help and FAQ. W3C. 2009. Retrieved 16 July 2015.
 13. "World Wide Web Timeline". Pews Research Center. 11 March 2014. Retrieved 1 August 2015.
 14. Dewey, Caitlin (12 March 2014). "36 Ways The Web Has Changed Us". The Washington Post. Retrieved 1 August 2015.
 15. "Website Analytics Tool". Retrieved 1 August 2015.
 16. "Tim Berners-Lee: WorldWideWeb, the first Web client". W3.org.
 17. "Frequently asked questions by the Press – Tim BL". W3.org.
 18. "Bloomberg Game Changers: Marc Andreessen". Bloomberg.com. 17 March 2011.
 19. "Browser". Mashable. Archived from the original on 2 సెప్టెంబరు 2011. Retrieved 2 సెప్టెంబరు 2011.
 20. Graham, Paul (November 2005). "Web 2.0". Retrieved 2006-08-02. I first heard the phrase 'Web 2.0' in the name of the Web 2.0 conference in 2004.
 21. O'Reilly, Tim (2005-09-30). "What Is Web 2.0". O'Reilly Network. Retrieved 2006-08-06.
 22. Strickland, Jonathan (2007-12-28). "How Web 2.0 Works". computer.howstuffworks.com. Retrieved 2015-02-28.
 23. DiNucci, Darcy (1999). "Fragmented Future" (PDF). Print. 53 (4): 32.
 24. Idehen, Kingsley. 2003. RSS: INJAN (It's not just about news). Blog. Blog Data Space. August 21 OpenLinkSW.com
 25. Idehen, Kingsley. 2003. Jeff Bezos Comments about Web Services. Blog. Blog Data Space. September 25. OpenLinkSW.com
 26. Knorr, Eric. 2003. The year of Web services. CIO, December 15.
 27. "John Robb's Weblog". Jrobb.mindplex.org. Archived from the original on December 5, 2003. Retrieved 2011-02-06.
 28. O'Reilly, Tim, and John Battelle. 2004. Opening Welcome: State of the Internet Industry. In San Francisco, California, October 5.
 29. "Web 2.0: Compact Definition". Scholar.googleusercontent.com. 2005-10-01. Archived from the original on 2012-11-29. Retrieved 2013-06-15.
 30. Flew, Terry (2008). New Media: An Introduction (3rd ed.). Melbourne: Oxford University Press. p. 19.
 31. "Media consumption on mobile skyrockets in the US". Mobile World Live (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-02-12. Retrieved 2020-11-01.