చేప
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
చేపలు లేదా మత్స్యాలు (ఆంగ్లం Fish) దవడలు కలిగిన జలచర సకశేరుకాలు. ఇవి మొప్ప చీలికల వల్ల శ్వాసించడం, ద్వంద్వ వాజాల వల్ల ఈదడం జరుగుతుంది. అధిక సంఖ్యలో ఉండటం, ఆకట్టుకొనే ఆకారాలు కలిగి ఉండటం వీటి ప్రత్యేకత.
విషయ సూచిక |
[మార్చు] సామాన్య లక్షణాలు
- ఇవి శీతల రక్త లేదా అస్థిరోష్ణ జీవులు.
- ఇవి సముద్రంలోను, నదులలోను, కాలువలు, చెరువులు మొదలయిన నీరు గల ప్రాంతాలన్నిటిలోను ఉంటాయి.
- శరీరం కండె ఆకారంలో ఉంటుంది. కొన్నింటిలో పొడవుగా సర్పాలలో లాగ ఉంటుంది. కొన్ని చేపలు పృష్ఠోదరంగా అణచబడి ఉంటాయి. జలచర జీవనానికి అనుకూలంగా మెడ లోపించింది.
- మధ్యత్వచం నుంచి అభివృద్ధి చెందిన పొలుసులు, డెంటికల్స్, పలకాలు గల బాహ్యాస్థిపంజరం ఉంటుంది. చలనంలో ఘర్షణ లేకుండా ఉండేందుకు చర్మగ్రంధులు, శ్లేష్మగ్రంధుల యొక్క శ్రావం ఉపయోగపడుతుంది.
- మెత్తటి లేదా కంటకాలు ఆధారంగా కలిగిన ద్వంద్వ, అద్వంద్వ వాజాలు కలిగిన జీవులు. పృష్ఠ, పాయు పుచ్ఛ వాజాలు అద్వంద్వ వాజములు. ఇవి జీవి సమతాస్థితి నిర్వహణకు ఉపయోగపడతాయి. ఉరో శ్రోణి వాజాలు ద్వంద్వ వాజాలు. ఇవి చలనానికి తోడ్పడతాయి. తోకపై గల పుచ్ఛవాజం జీవి ముందుకు కదిలేటట్లు చేసి, చలనంలో మార్గాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది.
- నాసికా రంధ్రాలు జతలుగా ఉంటాయి. శ్వాసాంగాలు మొప్ప చీలికలు. మొప్ప చీలికలకు ఆధారం కల్పిస్తూ మొప్పచాపాలు (Gillarches) ఉంటాయి. కొన్ని మంచి నీటి అస్థిచేపలలో అనుబంధ శ్వాసాంగాలను కలిగి ఉంటాయి. శ్వాసకోశ చేపలలో పరిసరాలు ఎండిపోయినప్పుడు శ్వాసించేందుకు అనుకూలంగా ఊపిరితిత్తులు ఉంటాయి.
- హృదయం ఒక కర్ణిక, ఒక జఠరిక కలిగిన రెండు గదులు కలిగినదిగా వర్ణిస్తారు. హృదయంలోని రక్తం ఒక మొప్ప చీలికలకే ప్రవహించటం వల్ల దీన్ని 'బ్రాంకియల్ హృదయం' అంటారు. ఒక మలిన రక్తాన్ని మాత్రమే సరఫరా చేయడం వల్ల దీన్ని 'చెడురక్తం కలిగిన (Venous heart) హృదయం' అంటారు. హృదయం నుంచి శ్వాసావయాలకు మాత్రమే రక్తం సరఫరా కావడం వల్ల ఈ ప్రసరణను ఏకప్రసరణ (single circulation) అంటారు.
- విసర్జకావయవాలు మధ్యవృక్కాలు. చేపల ముఖ్యవిసర్జక పదార్ధం అమ్మోనియా కావడం వల్ల, వీటిని అమ్మోనోటెలిక్ జీవులంటారు. కొన్ని మృదులాస్థి చేపలు యూరియాను, సముద్రపు టీలియోస్టులు T.M.O. ను విసర్జిస్తాయి.
- మెదడును ఒకే పొర కప్పి ఉంచుతుంది. దీన్ని 'మెనిక్స్ ప్రిమిటివా' అంటారు. కపాల నాడులు 10 జతలుంటాయి.
- చేపలలో అంతర్ చెవి మాత్రమే ఉంటుంది. దీవి ముఖ్యవిధి సమతుల్యత. కనురెప్పలు లేవు.
- పార్శ్వ రేఖా జ్ఞానేంద్రియ వ్యవస్థ లేదా న్యూరోమాస్ట్ అవయవాలను కలిగి ఉండటం చేపల విశిష్ట లక్షణం. ఇవి నీటి అలలలో సమతాస్థితిని కాపాడే రియోరెసెప్టార్స్ లు.
- ఏకలింగజీవులు. ఫలదీకరణం బాహ్య లేదా అంతర్ ఫలదీకరణ. పిండదశలో ఉల్బం లేదు. అందువల్ల చేపలను ఉల్బరహిత జీవులంటారు.
[మార్చు] ఆర్థిక ప్రాముఖ్యత
[మార్చు] ఆహారముగా చేపలు
చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది.
- ప్రాచీనకాలం నుండి మానవులకు, కొన్ని జంతువులకు చేపలు ఒక ముఖ్యమైన ఆహారం.
- చేపల్లోపోషక పదార్ధాలు - మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజములు.
- మంచి రుచిగా ఉండే చేపల మాంసం తేలికగా జీర్ణమవుతుంది.
- చేపలు పట్టబడిన తర్వాత తేలిగ్గా పాడవుతాయి. కావున వీటిని వెంటనే వినియోగించాలి లేదా జాగ్రత్తగా నిల్వచేయాలి. ఎండబెట్టుట, స్మోకింగ్, ఉప్పు లేదా మంచు గడ్డలలో నిల్వచేయుట మంచిది.
[మార్చు] పశువుల దాణాగా చేపలు
కొన్ని రకాల చేపలు ఆహారంగా వినియోగించబడగా మిగిలిన భాగములు, తృణీకరించబడిన చేపలు ఎండబెట్టిన పిదప పొడి చేసి చేపల భోజనం (Fish Meal) తయారుచేస్తారు. కోళ్ళు, పందులు, పశువుల పెంపకములో దీనిని ప్రధానమైన కృత్రిమ ఆహారంగా ఉపయోగిస్తారు.
చేపల దాణా తయారీలో చేపల్ని పెద్దపెద్ద పాత్రలలో ఉడకబెట్టుట, బొగ్గులపై కాల్చుట లేదా ఆవిరిలో మెత్తబరుచుట జరుగుతుంది. వీనిలో 60 % మాంసకృత్తులు, ఎక్కువ కాల్షియం, ఫాస్ఫేట్లు, 5.6% నూనెలు ఉంటాయి. అధిక పోషక విలువలను కలిగివుంటాయి. కావున పశువుల్లో పాల దిగుబడి, కోళ్ళలో గుడ్ల దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
[మార్చు] జలవిశ్లేషిత మాంసకృత్తుల తయారీ
సొరచేపలు మొదలైన చేపల్లోని అనవసరమైన మాంసమును చిన్నచిన్న ముక్కలుచేసి, కడిగి 80 వద్ద సజల ఎసిటికామ్లములో ఉడకబెట్టబడుతుంది. తర్వాత దీనిని ఆమ్లము మరియు క్రొవ్వుల నుంచి శుద్ధిపరచుటకై నీటితో, పెట్రోలియంతో కడుగుతారు. దీనిని పొడిగాలిలో ఆరబెట్టిన పిదప 10 % కాస్టిక్ సోడాలో 80 వద్ద జలవిశ్లేషణ చేయాలి. మాంసం నందలి ప్రోటీన్లు ద్రావణ రూపంలోకి మారతాయి. ఈ ద్రావణమును ఎసిటికామ్లముతో తటస్థపరచి ఆవిరిపై ఇగిర్చినప్పుడు సహజ పరిమళముగల మెత్తని పొడి తయారవుతుంది. దీనిలో 35 % మాంసకృత్తులుంటాయి.
జలవిశ్లేషిత ప్రోటీన్లు తేలిగ్గా జీర్ణమవుతాయి. కావున పోషక పదార్ధాల లోపముగలవారు అధికంగా వినియోగించడానికై సరఫరా చేయబడుతుంది. 10 % ఈ పొడి 90 % గోధుమ పిండితో కలిపి రొట్టెలు, బిస్కట్లు, కేక్ లు తయారీలో కూడ వాడవచ్చును.
[మార్చు] మాధ్యమిక దిగుబడులు
- చేపల ఎరువులు: మానవులకు ఆహారంగా వినియోగపడని చేపలను ఎరువుల ఉత్పత్తికి వినియోగించవచ్చును. చనిపోయి చెడిపోయిన చేపలు ఎక్కువగా దొరికినప్పుడు వాటిని సముద్రతీరాల్లో ఎండబెట్టి, బూడిదతో కలిపి పొడిచేయుట ద్వారా ఎరువులు తయారుచేస్తారు. చేపల నుండి నూనె తీసిన తర్వాత మిగిలిన పిప్పి నుండి కూడా ఎరువులు తయారుచేస్తారు. ఇలాంటి ఎరువులలో 5.7% నత్రజని, 3-4% ఫాస్ఫేట్ లు వుంటాయి. ఈ ఎరువుల వాడకం వలన మొక్కలు బాగా పెరిగి అధిక దిగుబడి నిస్తాయి.
- చేప నూనెలు: చేపల నుండి రెండు రకాల నూనె (Oil) లను తయారుచేస్తారు. చేపల మొత్తము దేహాన్నుంచి తయారుచేయబడు నూనెలను 'చేప దైహిక నూనెలు' (Fish body oil) అంటారు. చేపలను నీటిలో బాగా ఉడకబెట్టినప్పుడు నీటి ఉపరితలముపై ఏర్పడు నూనెలను తొలగించి మరుగుచున్న ఉప్పు నీటిలో శుద్ధిచేయుట ద్వారా దైహిక నూనెలను తయారుచేస్తారు. వీటిని రమ్గులు, క్రిమిసంహారక సబ్బులు, క్రొవ్వొత్తులు, తోలు మరియు స్టీలు పరిశ్రమలలో వినియోగిస్తారు. షార్క్, స్కేట్, కాడ్ మొదలైన చేపల కాలేయము నుండి 'చేప లివర్ నూనె' (Fish liver oil) తయారుచేస్తారు. అప్పుడే పట్టిన చేపల్లోని కాలేయములను వెంటనే తొలగించి ఎక్కువనీటిలో మరగబెట్టినప్పుడు నీటి ఉపరితలముపై నూనె తేలుతుంది. దీనిని ఎప్పటికప్పుడు తొలగించి శుద్ధిచేయడం జరుగుతుంది. ఈ కాలేయ నూనెల్లో విటమిన్ ఎ మరియు డి లతో పాటు 55-75% క్రొవ్వులు, 5-10% ప్రోటీన్లు వుంటాయి. ఈ నూనెలను ఔషధ ప్రాముఖ్యత కలిగివుంటాయి.
[మార్చు] జీవ నియంత్రణ
గంబూజియా, ఇసోమస్, ఖీలా, పుంటియస్, బెరీలియస్, డానియో, అంబాన్సిస్, పాంఛాక్స్ వంటి చేపలు దోమల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి. కావున ఇలాంటి చేపలను రిజర్వాయిర్లలో, బావులలో, చెరువులలో వాడుట ద్వారా దోమల సంతానాన్ని నియంత్రించి వానిద్వారా మానవులలో సంక్రమించే మలేరియా, బోద వ్యాధుల వంటి వ్యాధులను నియంత్రించవచ్చును. తెగిపోయిన అవయవాల స్థానంలో కొత్త అవయవాలను తయారు చేసుకోగలిగే సామర్థ్యం ఫ్లాట్ వార్మ్ ప్లానేరియా అనే చేపకుంది. ప్లానేరియా చేప 32 ముక్కలుగా విడిపోయిన తరువాత.. ప్రతి ముక్కకు తల, కళ్లు ఇలా అన్ని అ వయవాలు, అవయవ వ్యవస్థలు ఏర్పడి పూర్తిస్థాయి చేపలుగా మనుగడ సాగించగలదు.
[మార్చు] వర్గీకరణ
- ప్లాకోడెర్మి (Placodermi)
- కాండ్రిక్తిస్ లేదా మృదులాస్థి చేపలు (Chondrichthys)
- ఆస్టిక్తిస్ లేదా అస్థి చేపలు (Osteichthys)
- క్రాసోప్టెరిగై
- ఎక్టినోటెరిగై (Actinopterygii):
- సిలురిఫార్మిస్ (Siluriformes): పిల్లి చేప, వాలుగ, డాక్టర్ చేప
- సిప్రినిఫార్మిస్ (Cypriniformes): కార్ప్ చేప, రాహు, బొచ్చె
- కారసిఫార్మిస్ (Characiformes): పిరాన్హా
- శ్వాసకోశ చేపలు
[మార్చు] పురాణాలలో
- విష్ణువు దశావతారాలలో మత్స్యావతారము మొదటిది.
- మత్స్య యంత్రం ఛేదించి అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకున్నాడు.
[మార్చు] మూలాలు
- (1997) The Diversity of Fishes. Blackwell Publishing. ISBN 0-86542-256-7.
- Helfman G, Collette BB, Facey DH and Bowen BW (2009) The Diversity of Fishes: Biology, Evolution, and Ecology Wiley-Blackwell. ISBN 978-1-4051-2494-2
- Moyle, PB and Cech, JJ (2003) Fishes, An Introduction to Ichthyology. 5th Ed, Benjamin Cummings. ISBN 978-0-13-100847-2
- Nelson, J. S. (2006). Fishes of the World. John Wiley & Sons, Inc.. ISBN 0471250317.