Jump to content

అంతా మనవాళ్లే

వికీపీడియా నుండి
అంతా మనవాళ్లే
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం తాపీ చాణక్య
తారాగణం వల్లం నరసింహారావు,
కృష్ణకుమారి,
ఎస్.వి. రంగారావు,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఘంటసాల,
పి. లీల,
ఎ.పి. కోమల,
పిఠాపురం
నిర్మాణ సంస్థ సారథి ఫిల్మ్స్
భాష తెలుగు

అంతా మనవాళ్లే 1954, జనవరి 15న విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి తాపీ చాణక్య దర్శకుడు కాగా సారథి ఫిల్మ్స్ బ్యానర్‌పై సి.వి.ఆర్.ప్రసాద్ నిర్మాత. మాస్టర్ వేణు సంగీత దర్శకునిగా వ్యవహరించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. నా చిన్నెలవన్నెల చెలికడొస్తె కనుసన్నల వానిని కవ్విస్తా - ఎ.పి.కోమల, పిఠాపురం - రచన: కొండేపూడి లక్ష్మీనారాయణ
  2. మనసార ననుజేర గదరా ఇక మనసార ననుజేర గదరా - పి. లీల - రచన: తాపీ ధర్మారావు
  3. వెళ్ళిపొదామా మావా వెళ్ళిపోదమా పట్నవాసపు గుళ్ళు వీధులలో బడి - ఘంటసాల - రచన: కొనకళ్ల వెంకటరత్నం
  4. ఆపేవారెవరు నిజాన్ని అడ్డేవారెవరు విజయయాత్రనది సాగిస్తుంటే - మాధవపెద్ది,కె. రాణి - రచన: తాపీ ధర్మారావు
  5. నను కాదని ఎవరనగలరా పలుగాకులు కూసిన బెదురా - ఎ.పి. కోమల - రచన: తాపీ ధర్మారావు
  6. పాడిన పాటేనా ఇంకా పాత పాటేనా కాలము మారిన, దేశము మారిన, లోకభావములే మారిపోయినా పాడిన పాటేనా - పి.సుశీల, మాధవపెద్ది - రచన: తాపీ ధర్మారావు
  7. పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా - మాధవపెద్ది,ఎ.పి. కోమల బృందం - రచన: కొండేపూడి లక్ష్మీనారాయణ
  8. వద్దురా మనకీ దొంగతనం ఇక వద్దుర మనకీ దొంగతనం - బృందం - రచన: కొప్పరపు సుబ్బారావు

చిత్రకథ

[మార్చు]

జగన్నాథం ఘరానా మనిషి. భవానీపురం జిల్లా కో ఆపరేటివ స్టోర్సు ప్రెసిడెంటు. ఆయనకు తోడు స్టోర్సు డైరెక్టర్లు---ఆయన మామ చిదంబరం, హరిజన హాస్టలు మేనేజరు పూర్ణయ్య, మెడికలు షాపు ప్రొప్రయిటరు వైకుంఠం, మార్వాడి సేటు. లోకుల సొమ్మును దోచుకు తినడంలో వీళ్లది పెట్టింది పేరు. చిదంబరం తన కూతురు వరలక్ష్మి అంటే పడి చస్తాడు. మమకారాన్ని అవకాశంగా తీసుకొని అల్లుడు జగన్నాధం ఆయన ద్వారా లోకుల సొమ్మును అనేక విధాల రాబట్టి, దానితో ఒక పెద్ద మేడ కట్టడానికి పూనుకుంటాడు.

ఆ యింట్లోనే ఉండి ఇంటరు పరీక్షకు చదువుతూ వుంటాడు చిదంబరం అన్న కొడుకు సత్యం. వట్టి ఆమాయకుడు. సత్యంతో పాటు, కూతురు గిరిజకూడ చదువుతూంటుంది. గర్విష్టి. తాత చిదంబరం గారాబం చేసి డబ్బిస్తూంటాడు. గిరిజ, పూర్ణయ్య కుమారుడు గౌరీపతితో వినోదాలలో తగులెడుతుంది. ఇదంతా సత్యానికి వచ్చేదికాదు.

సత్యం తండ్రి కొద్ది రోజుల కిందట పోయాడు. తల్లి రత్తమ్మ , ఎనిమిదేళ్ల చెల్లెలు శారద, స్వగ్రామంలోనే ఉంటారు. సత్యానికెంతసేపూ తన చదువు, పరీక్షలూ, కవిత్వమూ తప్ప, ఇంటి వ్యవహారాల గోల పట్టించుకొనేవాడు కాడు. ఆ వ్యవహారాలు రత్తమ్మకు అయోమయంగా వుంటాయి. ఆమె అన్న భద్రాచలం ఆ గ్రామంలోనే వున్నాడు గాని ఇలాంటి వ్యవహారాలు తెలిసినవాడు కాదు. అందుచేత ఒక్కసారి వచ్చి లావాదేవీలను చక్క పెట్టవలసిందని మరిది చిదంబరానికి జాబు వ్రాసింది. మంచి సమయానికే 40, 50 వేల వ్యవహారం చేతికి వచ్చిందని జగన్నాధం, మామను వెళ్లి రత్తమ్మ దగ్గర పవర్నామా పట్టాను పుచ్చుకొని రమ్మని పంపిస్తాడు. రత్తమ్మకు ఎక్కడలేని అశలు చూపించి చిదంబరం పవర్నామా పట్టుకొస్తాడు. వేలకు వేలు, రత్తమ్మ బాకీలు వసూలు చేస్తాడు. కూతురు ఇంటికి పెడుతుంటాడు. చాలవు. అల్లుడి సలహా మీద పవర్నామా నుపయోగించి, రత్తమ్మ ఇంటిని తాకట్టు పెట్టి, పెద్దఅప్పు చేసి కూతురు మేడ పూర్తిచేస్తాడు.

కొత్త మేడలో గృహప్రవేశంతో ప్రజల్లో అనుమానాలు బయలు దేరాయి. చిదంబరం పెట్టినపసుపు కంపెనీ వాటాదారులూ, అప్పులిచ్చిన వారూ వచ్చి చిదంబరాన్ని వత్తిడిచేస్తారు. రత్తమ్మ బాకీ వసూలు మాట ఏమిటని సేటుకూడ వచ్చి పడతాడు. వీరందరి వత్తిడికి తట్టుకోలేక చిదంబరం వుక్కిరి, బిక్కిరి అవుతాడు. అల్లుడు, మామ ఆలోచించు కుంటారు. తెల్లవారేసరికి చిదంబరం పరారీ! భవానీపురం అంతా గగ్గోలు అయిపోతుంది.

మార్వాడీసేటు రత్తమ్మ వూరువెళ్లి తనఖా బాకీ ఇరవై వేలు చెల్లించమంటాడు. సెలవులకు అచటకు వచ్చిన సత్యం, రత్తమ్మ, భద్రాచలం అంతా నిర్ఘాంతపోతారు. ఈ చికాకంతా తన తల్లివల్లే సత్యం విసుక్కుని, ఆస్థి వంతటినీ సేటు పరం చేస్తాడు. తల్లి అమాయకురాలని తెలుసుకొని, ఆమెను నొప్పించినందుకు సత్యం చాలా విచారిస్తాడు. అందరూ కలిసి జగన్నాథం దగ్గరకు వచ్చి, సత్యం చదువు నెలాగైనా గట్టెక్కించ వలసిందని ప్రాధేయ పడతారు. జగన్నాధం వాళ్లపై అభిమానం ఉన్న వాడివలె నటిస్తాడు. కాని చదివించడం తనకు మించిన పని అని, స్టోర్సులో గుమాస్తాపని ఇస్తాననీ అంటాడు. తల్లిమనసు మళ్లీ నొప్పించడానికి ఇష్టంలేక సత్యం సరే అంటాడు. రత్తమ్మను, శారదను చూస్తూవుంటానని చెప్పి భద్రాచలం వాళ్లను గ్రామానికి తీసుకుపోతాడు. సత్యం జగన్నాధం ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసుకొంటూ వుంటాడు. స్టోర్సులో జగన్నాధం ముఠా నడిపిస్తున్న మోసాలు ఒకటొకటే తెలుసు కొంటాడు.

ఎంత పెద్దమనుషులైనా మోసాలు చేస్తుంటే ప్రపంచానికి ఒకప్పటికైనా తెలియకుండా వుండవు. భవానీపురంలోనే 'కాగడా' అనే ఒక పత్రిక వెలువడుతూ వుంటుంది. దానికి సంపాదకుడు రావు. ఎవరికి అన్యాయం జరిగినా ఎక్కడ మోసం జరిగినా వాటిని జంకూ గొంకూ లేకుండా తన పత్రిక ద్వారా బయటి పెడుతూ వుంటాడు. రావుకు విమల అనే కూతురు వుంది. కాలేజీలో సత్యానికీ, విమలకు స్నేహం ఏర్పడింది. సత్యం తరచు విమలతో తిరుగుతూ వుండడం మామూలయిపోయింది.

జగన్నాధం ముఠావారు చేసే అక్రమాలు ఒకటొకటే 'కాగడా'లో పడడం సాగింది. తమ అక్రమాలు బయట పడినప్పుడల్లా వారు జగన్నాధం దగ్గరకు వెళ్లి సత్యంమీద చాడీలు చెప్పటం సాగించారు. సత్యం తనకు ప్రమాదకరంగా తయారవుతున్నాడని భయపడ్డాడు జగన్నాధం.

ఇదేసమయంలో అక్కడ గ్రామంలో భద్రాచలానికొక దుర్బుద్ధి పుడుతుంది. అతని కొడుకు అంజి ఒక కొక్కిరాయి వెధవ. వాడికెవ్వరూ పిల్లనివ్వడంలేదు. రత్తమ్మ నిస్సహాయ స్థితిని అదనుగా చేసుకొని ఒక రోజున ఆమెకు తెలియకుండా శారదను తీసుకుపోయి, రహస్యంగా అంజికిచ్చి గ్రామఫోన్ పెళ్లిచేస్తాడు. ఇది తెలిసి రత్తమ్మ నెత్తీ నోరూ కొట్టుకుంటూ సత్యానికి టెలిగ్రాం ఇస్తుంది. సత్యం వెళ్లి భద్రాచలంచేసిన ద్రోహానికి తగిన శాన్తి చేసి, తల్లిని, చెల్లిని తనతో భవానీ పురానికి తీసుకు పోతాడు.

సత్యాన్ని ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్న జగన్నాథానికి, తన కూతురు పితూరీ ఒకటి సమయానికి వస్తుంది. ఒకనాడు గిరిజ గబగబ స్టోర్సుకువెళ్లి ఏభై రూపాయలు ఇమ్మని సత్యాన్ని అడుగుతుంది. సత్యం ఆమెవెంటున్న గౌరీపతిని చూస్తాడు. స్టోర్సు సొమ్ము జల్సాలకు ఇవ్వడానికి వీల్లేదంటాడు. గిరిజ తిరిగి ఇంటికివచ్చి జబ్బుగా వున్న వరలక్ష్మికి చాడీలు చెప్పుతుంది. ఆమె జగన్నాధం చెవికొరుకుతుంది. దొరికిందికదా అని జగన్నాధం సత్యంమీద విరుచుకుపడి, తిట్టి, కొట్టి, తల్లి, చెల్లెలుతో సహా ఇల్లు వెడలగొడతాడు. కట్టుగుడ్డలతో వాళ్లు ఒక సత్రం చేరుకుంటారు.

'మనవాళ్లే' కదా అని నమ్మినందుకు అయిన వాళ్లంతా తమకు చేసిన ద్రోహాలతో కృంగి, కృశించి రత్తమ్మ ప్రమాదస్థితిలో పడుతుంది. సత్యం మందు కొనడానికి వైకుంఠం మందులషాపుకి వెళ్తాడు. అతడు మందు ఇవ్వకపోగా, 'కాగడా' వారి నడగమని పరిహాసంచేస్తూ అనరాని మాట అంటాడు. సత్యానికి కోపంవచ్చి దెబ్బలాటకు సిద్ధమౌతాడు. వైకుంఠం సత్యాన్ని పోలీసులచేత పట్టిస్తాడు.

సత్రంలో తల్లి చచ్చిపోతుంది. చెల్లెలు 'అన్నయ్యా అన్నయ్యా, అంటూ దిక్కూ, తెన్నూ తెలియక బజారున పరుగులెత్తుకొని పోతుంది. పోలీసువారు వదలిన తరువాత, సత్యం సత్రానికివచ్చి తల్లి చావూ, చెల్లెలు తప్పిపోవడం వింటాడు. గుండె పగులుతుంది. వైకుంఠం మందు ఇవ్వకపోవడానికి కారణం "కాగడా” యే కదా అని పట్టరాని కోపంతో ఆ పత్రికమీద యుద్ధానికి బయలు దేరుతాడు.

'కాగడా' ఆఫీసుకు వెళ్లి సత్యం ఏం చేస్తాడు? తప్పి పోయిన శారద ఏమయింది? పరారీ అయిన చిదంబరం, ఏమౌతాడు? జగన్నాధం, ఆ ముఠా ఏమయ్యారు ? మొదలైన ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశంలో తెలుస్తుంది.[2]

వనరులు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Antha Manavaale (Tapi Chanakya) 1954". ఇండియన్ సినిమా. Retrieved 28 January 2023.
  2. తాపీ చాణక్య (15 January 1954). Antha Manavaale songs booklet (1954) (1 ed.). p. 12. Retrieved 28 January 2023.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు