కొప్పరపు సోదర కవులు
కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి , కొప్పరపు వేంకటరమణ కవి | |
---|---|
జననం | కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి , కొప్పరపు వెంకటరమణ కవి నవంబరు 12, 1885, డిసెంబరు 30, 1887 కొప్పరం గ్రామం అద్దంకి తాలూకా గుంటూరు జిల్లా(ప్రస్తుతం ప్రకాశం జిల్లా) |
మరణం | మార్చి 29, 1932, మార్చి 21, 1942 |
ఇతర పేర్లు | కొప్పరపు సోదర కవులు |
ప్రసిద్ధి | తెలుగు సాహిత్య అవధానం లో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులు |
మతం | హిందూ మతము |
తండ్రి | వేంకటరాయలు |
తల్లి | సుబ్బమాంబ |
కొప్పరపు సోదర కవులు (ఆంగ్లం: Kopparapu Sodara Kavulu) తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులు. వీరు ప్రకాశం జిల్లా (పూర్వం గుంటూరు జిల్లా అద్దంకి తాలూకా) కొప్పరం గ్రామంలో వేంకటరాయలు, సుబ్బమాంబ దంపతులకు జన్మించారు. వీరిలో పెద్దవాడు కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి (జ. నవంబరు 12, 1885 - మార్చి 29, 1932), రెండవవాడు కొప్పరపు వేంకటరమణ కవి (జ. డిసెంబరు 30, 1887 - మార్చి 21, 1942). వీరి గురువులు రామడుగు కృష్ణశాస్త్రి, పోతరాజు రామకవి. ఈ సోదరులిరువురు పదహారేళ్ళు నిండకనే ఆశుకవిత్వాన్ని ప్రదర్శించి కొప్పరపు సోదర కవులుగా పేరుపొందారు.
సాహిత్యసేవ
[మార్చు]కొప్పరపు సోదర కవులు 1908 మొదలుకొని అసంఖ్యాకంగా అష్టావధానాలు చేసి "కవిత పుట్టిల్లు సోదర కవుల యిల్లు" అనే ఖ్యాతిపొందారు. వీరు లక్కవరం, గద్వాల, చల్లపల్లి, మడికొండ వంటి సంస్థానాలలో, హైదరాబాదు సమీపంలోని అలవాల లష్కర్‌లో, నెల్లూరు, మద్రాసు, బాపట్ల, చీరాల, కాకినాడ, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, అశ్వారావుపేట, ఏలూరు, మార్టేరు మొదలైన అనేక చొట్ల 150 సభలలో అష్టావధాన, శతావధాన, ఆశుకవితా ప్రదర్శనలిచ్చారు.[1] వీటిలో 11 శతావధానాలు ఉన్నాయి. వీరి మొదటి ఆశుకవిత్వ సభ అల్వాలు లష్కరులో ఆదిరాజు తిరుమలరావు వీరికి ముంగాలి అందెను బహూకరించాడు. వీరు చెన్నపురి, బాపట్ల, విశదల, చీరాల, గుంటూరు, పంగిడిగూడెం, హైదరాబాదు లలో చేసిన శతావధానాలు ప్రఖ్యాతమైనవి. వీరు ప్రబంధ శైలిలో గంటకు 500 పద్యాలు చెప్పేవారు. మార్టేరు సభలో పందెం వేసి గంటకు 720 పద్యాల లెక్కన అరగంటలో మనుచరిత్రను ఆశువుగా చెప్పినట్లు తెలుసున్నది.
వీరికి బాల సరస్వతి, ఆశు కవీంద్ర సింహ, విజయ ఘంటికా, ఆశుకవి చక్రవర్తి, కుండినకవి హంస, కవిరత్న, అవధాన పంచానన, కథాశుకవీశ్వర, ఆశుకవి శిఖామణి మొదలైన బిరుదులు ఉన్నాయి.
వేదము వేంకటరాయ శాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, వావిలికొలను సుబ్బారావు, వసురాయ కవీంద్రుడు, కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రులు, కాళ్లకూరి నారాయణరావు, జయంతి రామయ్య పంతులు మొదలైన అనేక ప్రసిద్ధాంధ్ర సంస్కృత పండితులు కొప్పరపు సోదర కవుల అవధాన కవితా సరస్వతిని తిలకించి హారతిపట్టారు.
అవధాన పద్యాలు
[మార్చు]- సమస్య: కాంతుడు లేనివేళ గలకంఠి కిలక్కున నవ్వె గిన్కతోన్
పూరణ:
కంతుని వాడితూపులకు గాసిలు నన్ దయ గావవత్తునం
చింతకు రాక దక్కె బ్రియుడేమిటికోయని బిట్టు దూఱుచున్
జింతయు గోపమూను సరసీరుహలోచనజేరె నాతడున్
కాంతుడు లేనివేళ గలకంఠి కిలక్కున నవ్వె గిన్కతోన్
- సమస్య: కామిని పాదనూపురము ఖంగున మ్రోగదు హేతువేమొకో
పూరణ:
తన జారకృత్యమితరులు
గనకుండఁ బటంబుఁ జుట్టెఁ గాళ్ల కపుడు కా
మిని పాదనూపురము ఖం
గున మ్రోఁగదు హేతువేమొకో, యననేలా?
- దత్తపది: కరము అనే పదము నాలుగు పాదాలలో వచ్చునట్లు స్త్రీ వర్ణన.
పూరణ:
కరమున్ బోల్పంగ నెమ్మేన్ గరిమను గొనియెన్, గంధసంపుష్టదంతీ
ట్కరమున్ బోల్పంగ నూరుల్ గణుతిని గనియెన్, గాళమైయొప్పు దర్వీ
కరమున్ బోల్పంగ నెంతే ఘనతను గొనియన్ గాటమౌ వేణి, క్షీరా
కరముల్ బోల్పంగ సవ్వాకలికికిఁ దనరెన్ గావ్యకృద్వర్ణనాప్తిన్
- వర్ణన: కీర్తిలేని మానవ జన్మము
పూరణ:
పరిమళంబది లేని సూనము, పంకజేక్షణలేని మం
దిరము, నీరము లేని కూపము, నీరజాప్తుఁడు లేని యం
బరము, దేవుడు లేని కోవెల, పండువెన్నెల లేని రా
తిరి యనంజనుఁ గీర్తి గల్గని దేబెజన్మము ధీనిధీ
కొప్పరపు వంశం
[మార్చు]కొప్పరపు సోదర కవుల పూర్వ వంశీయులలో కామరాజ కవి జాంబవతీ పరిణయమును, వేంకటరత్న కవి శాంభవీ శతకం, రామ దండకం లను రచించారు.
వేంకట సుబ్బరాయశర్మ మరణం తర్వాత వేంకటరమణ కవి తమ అనుంగు సోదరుడైన కొప్పరపు బుచ్చిరామ కవి (డిసెంబరు 9, 1892 - మే 29, 1956) తో కలిసి ఆశుకవితా సభలు చేశాడు. వీరు అవధానాలలో కొన్ని లక్షల పద్యాలు చెప్పారు.
వేంకట సుబ్బరాయకవి గారి కుమారుడు కొప్పరపు సీతారామ ప్రసాదరావు అవధానాశు కవితా ప్రదర్శనలిచ్చి ప్రసిద్ధిచెందాడు. వేంకటరమణకవి కుమారుడు మల్లికార్జునరావు, సీతారామ ప్రసాదరావుతో కలిసి సభలలో పాల్గొని అల్పవయస్సులోనే మరణించాడు.
ప్రచురణలు
[మార్చు]వీరి మద్రాసు, గుంటూరు సభల గురించి చిరుమామిళ్ల లక్ష్మీనారాయణ ప్రసాదు, కాకినాడ సభల గురించి చేగంటి బాపిరాజు సేకరించి 1911 ప్రాంతంలో ప్రచురించారు. వీరి ఈ రెండు సంకలనములను మరికొన్ని అవధానాశు కవితా పద్యాలను కలిపి కుంటముక్కల జానకీరామశర్మ 1963 సంవత్సరంలో "కొప్పరపు కవుల యశోడిండిమ" అనే పేరుతో రెండు సంపుటాలుగా మకర సంక్రాంతి పర్వదినాన ప్రచురించాడు. వీరి జీవితచరిత్రను నిడదవోలు వెంకటరావు 1973 సంవత్సరంలో రచించాడు.[2]
రచనలు
[మార్చు]- కనకాంగి
- పసుమర్తి వారి వంశావళి (1909)
- జ్ఞానోపదేశము
- నారాయణాస్త్రము
- సుబ్బరాయ శతకము (1936)
- కృష్ణకరుణా ప్రభావము
- దైవ సంకల్పము (1913)
- దీక్షితస్తోత్రము (1916)
- శతావధానము (1911)
శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం
[మార్చు]మహాపండితులైన వీరి జ్ఞాపకార్థం "శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము" పేరుతో సెప్టెంబరు 9, 2002 సంవత్సరంలో వీరి దౌహిత్రుడు మాచవరం వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయశర్మ (మా. శర్మ) విశాఖపట్టణంలో స్థాపించాడు.[3] ఈ సంస్థ ద్వారా 2003 సంవత్సరంలో "కొప్పరపు సోదర కవులు", 2004 సంవత్సరంలో "కొప్పరపు సోదర కవుల కవిత్వము" అనే గ్రంథాలను డా. గుండవరపు లక్ష్మీనారాయణ ప్రచురించాడు.
మూలాలు
[మార్చు]- ↑ రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 147–153.
- ↑ నిడుదవోలు వేంకటరావు రచించిన కొప్పరపు సోదరకవుల చరిత్ర ఆర్కీవు.కాంలో
- ↑ "Peetham promotes literature's cause in the Hindu". Archived from the original on 2012-11-05. Retrieved 2009-11-23.
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 118.
- అవధాన సరస్వతులు, ఆశు కవి చక్రవర్తులు కొప్పరపు సోదర కవుల కవిత్వము, సంపాదకుడు: డా. గుండవరపు లక్ష్మీనారాయణ, శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము, విశాఖపట్టణం, 2003.