Jump to content

గొరవయ్యలు

వికీపీడియా నుండి

గొరవయ్యలు కర్నూలు జిల్లాలో "గొరవయ్యల నృత్యం" అనే శైవభక్తి ప్రధానమైన జానపద కళా విన్యాసాన్ని ప్రదర్శించే కళాకారులు.


వీరి వేషధారణ

[మార్చు]

నల్లని కంబళి ధరించి, నెత్తిన ఎలుగుబంటితో చర్మంతో చేసిన పెద్ద టోపీ లేదా ఎలుగుబంటి తలలాగా తయారుచేసిన టోపీ (ఈ రోజుల్లో క్రీడా 'మస్కట్' లాగా) ధరించి, చేతిలో డమరుకం లేదా పిల్లనగ్రోవి వాయించుకుంటూ (ప్రజలకు ఆకర్షించడానికి) వీధులగుండా పోయేవారు. వీధుల్లో నల్ల కంబలి ధరించి, నెత్తిన ఎలుగుబంటి చర్మంతో చేసిన పెద్ద టోపీతో డమరుకం, పిల్లనగ్రోవి వాయిస్తు నృత్యంచేసే వారిని చూసి పిల్లలు జడుసుకోవడం కూడా జరిగేది. చిన్న పిల్లలంతా వారి వెంటపడి కేరింతలు కొట్టి వాళ్ళు భయపెడితే జడుసుకుని పరుగెత్తుకెళ్ళేవారు. అప్పట్లో ఇదో తమాషా ఆట. కానీ ఇదొక పరిశోధనాంశం అన్న విషయం చాలా మందికి తెలియదు. నేడు అనేక దేశాలలో జంతురూపాలను అలంకరించుకుని ప్రజాకర్షణ చేయడం సర్వసాధారణం.

జానపద కళారూపాల్లో సామూహిక నృత్యాల్లో మతపరమైన, కులపరమైన కళారూపం గొరవయ్యల నృత్యం. రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాకే ప్రత్యేకమైనది ఈ కళారూపం. కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రస్సిద్ది చెందిన శైవ క్షేత్రం. ఇక్కడ వెలసిన మల్లికార్జునుడు శైవులకు ఆరాధ్య దైవం. గొరవయ్యల నృత్యం శైవ మత నేపథ్యంలోనుంచి వెలుగు చూసిందే.

"గొరవయ్య" పదం

[మార్చు]

గొరవయ్యలని కర్నూలు జిల్లాలో మదాసి కురువలేదా కురువ అంటారు . గొరవయ్య శబ్దం గురువు శభ్ధ భవం కావచ్చు. కురువ వంశీయులు కావడంచేత కురువ>గురువ>గొరవ అనికూడా మారివుండవచ్చునని విమర్శకుల అభిప్రాయం. కురువ కులంలో పెద్దకుమారుడు కానీ చిన్న కుమారుడు కానీ తప్పకుండా గొరవయ్యగా మారాల్సిందే. గొరవయ్యలకు సంబంధించిన చారిత్రక విశేషాలు ఎక్కువ తెలియవు కానీ అతి ప్రాచీన కాలం నుండే గొరవయ్యలు నృత్యం చేశారన్నది మాత్రం నిర్వివాదాంశం. 12వ శతాబ్దం నాటి వీర శైవారాధన గొరవయ్యల పుట్టుకకు కారణం కావచ్చు. వీరశైవ మత ప్రాబల్యంతో 12వ శతాబ్దం నాటి సాహిత్యం కూడా దేశీయతకు పట్టం కట్టింది. ఈ నేపథ్యంలోనే దేశీయ కళారూపాలు కూడా ప్రాచుర్యంలోనికి వచ్చాయి. పాల్కురికి సోమనాధుడు ఆ నాటి జానపద సాహిత్య కళారూపాలన్నింటిని తన రచనల్లో పేర్కోన్నాడు. శైవ మత ప్రచారం కోసం గొరవయ్యల వ్యవస్థ పుట్టిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదు. ఇంక ఈ విషయమై చరిత్ర లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం ఉంది.

గొరవయ్యలకు సంభందించి పురాణ ఐతిహ్యం

[మార్చు]

భూలోకంలో మణి, మల్లాసురులను రాక్షసులు ప్రజలను హింసించేవారు. శివుడు ప్రజలను రక్షించడానికి మైలారదేవుని అవతారం ధరిస్తాడు. మణి మాలాసురులను సహరించడానికి మైలారదేవుడు విచిత్రమైన వేషంతో వస్తాడు. ఈ వేషం ఇప్పటి గొరవయ్యలు ధరించేదే. పాదాలకు తగిలే విధంగా కంబళితో తయారైన గౌను, తలపైన ఎలుగుమంటి చర్మంతో దట్టమైన వెంట్రుకలున్న ఎత్తయిన టోపి, కుడిచేత డమరుకం, ఎడమ చేత గంట, త్రిశూలం, పిల్లన గ్రోవి, ముఖంపైన విభూది రెఖలు - ఈ వేషంతో మైలార దేవుడు మణి మల్లాసురులను చంపుతాడు.

మైలారదేవుడు తన భార్యతో సరసాలాడుతుండగా ఒకరోజు చిన్న వాదు మొదలవుతుంది. వారికున్న ఆరు కుక్కలలో ఒకటి భార్య పక్షం, మరొకటి మైలాసురుని పక్షం వహించాయి. వారి దగ్గరున్న గొలుసులను ఏ గణం తెంపుతుందోనని వాదులాట, పందెం వేసుకున్నారు. పందెంలో మైలార దేవుని భార్య పక్షమే గెలుస్తుంది. ఈ గొలుసును తెంపడాన్ని సర్పిణి పందెం అంటారు. కర్నూలు జిల్లా గట్టు మల్లయ్య కొండలో దసరా రోజుల్లో ఈ పందెం ఇప్పటికీ జరుగుతుంది. పందెం ముగిసాక ఆరు కుక్కలు ఒక దొన్నెలోని పోట్లాడుకుంటూ పాలు తాగుతాయి. దీనిని ఒగ్గు సేవ అంటారు. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో గొరవయ్యలను ఒగ్గప్పలంటారు. ఈ పేరు రావడానికి వీరి ఒగ్గు సేవే కారణం కావచ్చు. మరో కథలో మైలార దేవుడు రాక్షసులను చంపిన తరువాత అతని ఉగ్రరూపం నుండి శాంతింప చేయడానికి గొలుసులతో బంధిస్తారు. స్వామి గొలుసులను తెంచుకున్న తరువాత ప్రసాద నైవేద్యాలతో శాంతింప చేసినట్లు ఆ సందర్భంలో ఒగ్గు సేవ చేసుకున్నట్లు ఉంది.

గొరవయ్య దీక్ష

[మార్చు]

కురువ కులంలోని పెద్దకుమారుడో చిన్న కుమారుడో గొరవయ్య కావాలని ముందే అనుకున్నారు. గొరవయ్యను చేయడానికి గురువు లేదా గణాచారి అవసరం. ఈ గురువులు కర్నూలు జిల్లా ఆలూరు మండలం గట్టుమల్లయ్య కొండలో ఉన్నారు. గొరవయ్యగా మారాల్సిన పిల్లవాన్ని గట్టు మల్లయ్య కొండలోని మల్లేసుని గుడి దగ్గరకు తీసుకుని వెళతారు. కోనేటిలో స్నానం చేయించి కంబళి పరచి కూర్చో పెడతారు. పిల్లవాని మేనమాతో ప్రమాణం చేయిస్తారు. గురువు గవ్వలతో కట్టిన దండను ముద్రాదానం చేస్తాడు. ముద్రా దానాన్ని పిల్లవాని మెడలో కడ్తారు. శివుని మంత్రాలను దీక్ష తీసుకున్న వారి చెవిలో బండారుతో భుజాలమీద ముద్రలు వేయడాన్ని ముద్రా దానం అంటారు. తరువాత ఉన్ని దుస్తులు, డమరుకం, బండారు సంచి, గంట ఇస్తారు. దీనిని గొరవ దీక్ష అంటారు. ప్రస్తుతం గొరవ దీక్ష ఇచ్చిన గణాచారికి 200 నుండి 300 రూపాయల దాకా రుసుం ఇస్తున్నారు. దీక్షను ఇచ్చే గురువును గణాచారి లేదా మద్దెల గొరవయ్య అని అంటారు. ఈ మద్దెల గొరవయ్య లేదా గణాచారి గొరవ మఠాధిపతి వద్ద శిక్షణ పొందుతాడు.

మన కులవృత్తికి ద్రోహం చేయకూడదు. ఇతరులను మోసం చెయ్యొద్దు. అబద్ధం చెప్పొద్దు- అని పిల్ల వానితో ప్రమాణం చేయిస్తారు. ఈ దీక్షను పిల్లవానికి 16 సంవత్సరాలలోపు మాత్రమే ఇప్పిస్తారు. గొరవయ్యలను మైలర దేవుని అంశగా చూస్తారు. గొరవ దీక్షను తీసుకున్న వారు మాత్రమే బండారు ఇవ్వడానికి అర్హులు. బండారు అంటే పసుపురంగు పొడి.ఆడ వాళ్ళలో మొక్కుబడి ఉన్నావారు శివ దీక్షను తీసుకుంటారు. వీరు మైలారదేవుని భార్య మాళవికి ప్రతిరూపాలు. వీరు కన్యలుగానే ఉండి శివ సేవకు అంకితమవుతారు. గొరవ దీక్షను తీసుకున్న వాడు కోటీశ్వరుడు అయినా సంక్రాంతి పండుగనాడు మాత్రం గొరవయ్యలాగా వేషం వేసుకుని ఐదు ఊర్లు అడుక్కోవడం వీరి ఆచారం.

వేషధారణ

[మార్చు]

ఇంతకు ముందే చెప్పినట్లు మైలారదేవుడు రాక్షసులను చంపడానికి వేసుకున్న వేషం గొరవల్లు వేసుకుంటారు. కంబళితో చేసిన పెద్ద అంగరఖా- ఇది మెడనుండి పాదాలదాకా ఉంటుంది. నడుముకు పట్టీ, ఎలుగుమంటి చర్మంతో చేసిన ఎత్తైన టోపీ, మెడలో కంటె, గవ్వల దండ, కుడి చేతిలో డమరుకం, ఎడంచేతిలో గంట ( ఆధునిక కాలంలో ఈ గంటకు బదులుగా పిల్లంగ్రోవి వాడుతున్నారు), నడుముకు జింక చర్మంతో చేసిన బండారు తిత్తి ( సంచి). ఈ వేషంతో వీరు వీధులలో తిరుగుతూ ఇల్లిల్లు తిరిగి అడుక్కుంటారు. ఈ సందర్భంలో పాడే పాటలు:

శివా మల్లేశ్వరా బండారుదయ్యా
కాపాడప్ప
పిల్లలను పెద్దలను దీవించు
గాటెద్దులు కలిగి, కోటి సంపదలు కలిగి కనకపాత్ర కలిగి
మల్లేసునట్లు మగబిడ్లు గలిగి, మల్లికార్జున నీ పాదాలకు నమస్తే

ఒగ్గు సేవ

[మార్చు]

ఒగ్గు సేవ అంటే దొన్నెలలోని పాలను కుక్కలలాగా అరుచుకుంటు కొట్టుకుంటూ నాలుకలతో తాగడం. గొరవయ్య దీక్షను తీసుకున్న వారు శివరాత్రి రోజున లేదా మైలార, మాళవికల కళ్యాణం రోజున ఈ ఒగ్గు సేవ చేస్తారు. ఒగ్గుసేవకు ముందు సర్పిణి పందెం ఉంటుంది. అంటే గొలుసు తెంచడం, భక్తులు తెచ్చిన పాలు, పెరుగు, పండ్లు దొణెలలో పోసి ఈ గిన్నెలను ఒక వలయాకారంగా ఉంచుతారు. లేదా వరుసగా ఎడమెడమగా వరుసగా ఉంచుతారు. ఈ దోనెల చుట్టూ డమరుకం వాయిస్తూ తిరుగుతూ గంట కొడుతూ కుక్కలవలె వొంగి అరుస్తూ, మెడలపై కరచుకుంటారు. ఈ దృశ్యం పిల్లలకే కాదు పెద్దలకు కూడా భయం కలిగిస్తుంది. ఒగ్గు సేవ తరువాత దోనెలలో మిగిలిన పాలు, పెరుగు, పండ్లు శివ ప్రసాదంగా భావించి భక్తులు సేవిస్తారు. పురాణ కథలోని ఆరు కుక్కలకు ప్రతీకగా ఒకప్పుడు ఆరుమంది పాల్గోనేవారు. కానీ ఇప్పుడు ఒగ్గు సేవలో పల్గొనే గొరవయ్యలకు సంఖ్యానియమం లేదు. ఒగ్గు సేవ చేస్తున్నప్పుడు కుక్కలవలె అరవడంచేత వీరిని మైలారం కుక్కలు అని కూడా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు. కడప జిల్లాలోని గ్రామాల్లో ఇప్పటికీ వీరిని ఒగ్గులప్పలు, మైలారం కుక్కలు అనే పేర్లతోనే పిలుస్తున్నారు. దసరా పండుగ రోజు గట్టు మల్లయ్య కొండలో వివిధ పద్ధతులతో పాడుతూ నాట్యం చేస్తారు. వారి శరీరం నుండి రక్తాన్ని తీసి ధార పోసి దేవునికి నైవేద్యం చేస్తారు. వీరి నాట్య పద్ధతి కూడా విచిత్రంగా ఉంటుంది.

నృత్య కళ

[మార్చు]

గొరవయ్యలు నృత్యం చేస్తున్నప్పుడు పాటలు పాడరు. పాట పాడే సమయంలో డమరుకాన్ని ఒక పక్క మాత్రమే నాలుగు వేళ్ళతో వాయిస్తారు. డమరుకంతో పాటు పిల్లనగ్రోవిని లయాత్మకంగా వాయిస్తారు. డమరుకం నుండి పుట్టే ధ్వనులు డడ ముడ్డ డడ్ యిరడ డడబుడ్డ బుడబుడ్డ బుడ్ అని ఉంటాయి. వీరిని చూస్తే పిల్లలకు భయం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పిల్లలను భయపెట్టడానికి గొరవయ్యలకు పట్టిస్తానని చెప్పడం జరుగుతుంది. నృత్యంలో సరిసంఖ్యలో పల్గొంటారు. ఇల్లిల్లూ తిరిగే సమయంలో మాత్రం ఒక్కరే నృత్యం చేస్తారు. డమరుకం, పిల్లన గ్రోవి వాయిస్తూ గుండ్రంగా తిరుగుతూ, ఒక్కొక్క కాలితో నేలపై కొట్టడం, తల తిప్పడం, పిల్లల్ని భయపెట్టడానికి ఉన్నట్టుండి డమరుక శబ్ధాన్ని బుడ బుడ్ బుడబుడ్ బుడడ్ అని వినిపించడం నడుమును వయ్యారంగా ఆడించడం వీరి నృత్యంలోని ప్రత్యేకతలు.

సామూహికంగా నృత్యం చేస్తున్నప్పుడు సరిసంఖ్యలో వరుసలుగా నిలబడి ఒకసారి డమరుకాన్ని వాయించి గుండ్రంగా తిరుగుతూ తిరిగి వరుసలో నిలబడతారు. వరుసలోని ఎదురుబదురుగా పోటీగా అడుగులు వేస్తూ కూర్చొని లేవడం, కూర్చొని తిరగడం ఒక వరుసలోని వారు మరో వరుస లోనికి మారడం చేస్తారు. ఇదంతా డమరుకం, పిల్లంగ్రోవి వాయిస్తూనే చెస్తుంటారు. తరువాత పాటలు పాడుతూ గజ్జెల్ని నేలపై తాడిస్తూ నాలుగు వేళ్ళ సహాయంతో డమరుకం వాయిస్తారు. ఒకరు పాడుతుంటే మిగిలిన వారు వంత పాడతారు.

పాటలు- సాహిత్యం

[మార్చు]

శివుడు నీవయ్య శ్రీశైల మల్లయ్య
కావగ రావయ్య శివయ్య
సిక్కు జడలవాడు శివ నీలకంటుడు
పైనిండ యీబూది మహా శివుని
మెడలోన రుద్రచ్చలు దేవాది దేవా
సన్న కమ్మడి తెచ్చి సరి మడత వేయించి
గుండు మల్లెలు పోసి దేవాది దేవా
గుండు మల్లెలపైన శివుని కొప్పిరి పెట్టి
పాలు బెల్లం పోసెనే మహాశివుని
మనసార తను కొలిసెను దేవాది దేవా
వారమారమునాదు సోమవారము నాడు
నానందమయ్యెడు శివుడు నానందమయ్యెడు

మల్లేసుని వేట వర్ణనను సంబంధించిన పాటలో వేటలో లాగే పరుగులెత్తడం, పాటలోను వాద్యం వాయించే సమయాల్లో బిరబిరా పడటం, వాయించడం ఉంటుంది.

యాట యెల్లిన చూడరే మల్లేసుడు
యాట యెల్లెను చూడరే మల్లేసుడు
సామి యాట యెల్లిన చూడు కాడు కాపురమందు
సాటిలేని గట్ట సామి మల్లేసుడు
సామి మెరుపు చందన కార మెరుపు చందనకార
మెడనిండా తెల్పూలు ముందు గంగనపాలు
ముడిసి పుట్టన బోసి క్రున్నులు దాగిన గురనీల జంగాము
కన్నె జింకను బట్టి కొంత యీబూదిని బెట్టీ
తనలోన బల్కిన శివ నీల కంటుడు

శివ రాత్రికి మల్లయ్య కొండకు పోతూ గొరవయ్యలు పాడే పాట ఇలా ఉంటుంది. ఈ పాటలో మల్లయ్య కొండను, అందులోని దేవాలయాన్ని, దేవుని ఘనతను, కోనేరు లోతు పాతులను, తెలుపుతూ పాటను పాడతారు. ఇందులోని పల్లవి ఎత్తుకోనే సమయంలో చివరి రెండు పాదాలు పల్లవిలాగా ఆలపించడంతో ఒక తూగు వస్తుంది. (చిగి చెర్ల కృష్ణారెడ్డి) ఈ పాటలో డమరుకాన్ని తక తక తక గతిలో కొడుతుంటారు.

శివకొండకని పోదాము రారమ్మ
మల్లయ్య కొండ సామినే చూతాము
శివాపురమికి పరమటంట
శిద్దులేలే మల్లయ్య కోండ
సిన్నగనే పోదాము రారమ్మ
ఆ పరవతాలకు మెల్లగనే పోదాము

మల్లయ్యను నిద్ర లేపడానికి పాడే పాట

కురువతై మైలారులింగ జడజడాలింగాలు
పాములే వరనంబు పార్వతీ మల్లయ్య
మల్లయ్యను లేపరమ్మ
మల్లయ్య పూజారి మైలారు లింగన్న
సద్దురుని లేపరమ్మ
పరమట దేశాన పాలు కవల్లోచ్చే
పంచనే దిగినాయి మల్లయ్యను లేపురమ్మ
మల్లయ్య పూజారి మైలారు లింగన్న
సద్దురుని లేపురమ్మ

చివరగా బండారు ఇచ్చే పాటనే మంగళం పాటగా పడతారు. శుభ కార్యాలకు, ఇంటికి అరిష్టం కలుగకుండా ఉండడానికి ఇంటికి పిలిపించి పాడించుకుంటారు. గొరవయ్యలు ఇంటిలోని శివుని కొలిచి ఇంటి యజమానితో పూజింపచేసి యీనాములు పుచ్చుకుంటారు. తరువాత తిత్తిలోని బండారును ఇస్తూ పాడతారు.

శివ బండారు బండారు తలలో మల్లయ్య
యీబూది బండారు తలలో
శ్రీశైల మల్లయ్య యీబూది
శివమనందియీశుని యీబూది ||బండారు||
గట్టు మల్లయ్య సామి బండారు
మాగంగు మాళమ్మ దేవి బండారు
మైలారు లింగయ్య బండారు
మాగంటి ఈశుని బండారు
తిరపతీ తిమ్మమ్మ బండారు
శివ సామి గోవింద రాజుని బండారు
నువ్వెక్కలాడేనే బండారు
వైబోగమాడెనే బండారు.

సామాజిక జీవనం

[మార్చు]

జమ్మలమడుగు ప్రాంతంలో దసరా ఉత్సవాల్లో భాగంగా గొరవయ్యలు నృత్య ప్రదర్శనలిస్తారు. ఈ పరిశోధకుడు వారిని కలిసినప్పుడు చెప్పిన విషయాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. వీరు మదనపల్లె తాలూకా తంబళ్ళ పల్లెకు చెందిన వారు. ఊరూరా తిరుగుతూ వీరు నృత్య ప్రదర్శన లిస్తుంటారు. వీరిలో గణ నాయకుడు సిద్దయ్య తాను స్వయంగా శివుని మీద రచించిన దండకం చదివి వినిపించాడు. వీరంతా శివరాత్రి నాటికి గట్టు మల్లయ్య కొండ చేరతారు. పొలాలు ఉన్నా, తమ కుల వృత్తిని మాత్రం మరచిపోమని వీరు చెబుతారు. ప్రభుత్వం ఈ కళాకారులను ఆదుకోవలసిన అవసరం ఉందని వీరిలో చాలామంది పేద కుటుంబాలకు చెందిన వారని వీరు వాపోయారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 20 సంవత్సరాల కింద 40 మంది గొరవయ్యలుంటే నేడు 9 మంది గొరవయ్యలు మాత్రమే ఉన్నారని వీరు కూడా భిక్షాటన చేస్తున్నారని, ప్రభుత్వం ఎటువంటి ఆధారం చూపలేదని వివరించారు. కురుబ కులస్థులైన వీరు గొరవయ్య కుల వృత్తితోబాటు వ్యవసాయం, జీవుల్ని కాయడం వంటివి చేసి బతుకుతున్నారు. ఫిబ్రవరి గురువారం 17వ తేదీ 2005 ఆంధ్రజ్యోతి దినపత్రికలో భిక్షాటనే మల్లయ్య దార్ల బతుకులు అన్న శీర్షిక కింద వ్యాసం ప్రచురితమైంది. చిత్తూరు జిల్లాలోని మల్లయ్య కొండ దేవాలయానికి వందల ఎకరాల మాన్యం ఉందని, ఈ మాన్యంలో గొరవయ్యలకు చెందాల్సిన భుములు కూడా ఉన్నాయని అందులో పేర్కొనడం జరిగింది. మాన్యపు భూములు ఉన్నప్పటికీ అవి వీరికి చెందక వీరు భిక్షాటనకు దిగడం ప్రస్తుత సమాజం కళారూపాలకు ఇస్తున్న విలువలను మనం గ్రహించవచ్చు.

ఆధారాలు

[మార్చు]
  • జానపద నృత్యకళ - డా. చిగిచెర్ల కృష్ణారెడ్డి
  • అనంతపురం : అప్పరాయునిచెరువు లోని ముసుగు రామన్న బృందం.
  • అనంతపురం : కె. రామంజనేయ బృందం, కురుబనాగన్న బృందం
  • చిత్తూరు జిల్లా, తంబళ్ళపల్లె: బన్యాల శారదయ్య బృందం

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]