బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త
జననంబిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త
1929, అక్టోబర్ 02
మహబూబ్ నగర్ జిల్లా,బిజినపల్లి
మరణం2008, జులై 24
ప్రసిద్ధికవి
మతంహిందూ
తండ్రిబాదం శంభయ్య
తల్లిలక్ష్మమ్మ

బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త మహబూబ్ నగర్ జిల్లా చెందిన తెలుగు కవి. ఈ కవి స్వస్థలం జిల్లాలోని బిజినపల్లి. ఇంటి పేరు బాదం, అయినా తన ఊరిపేరే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. సొంతూరులో గ్రంథాలయాన్ని స్థాపించాడు. నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో సైతం పాల్గొని, జైలు జీవితాన్ని అనుభవించాడు. జాతీయ విప్లవం, సామాజిక చైతన్యం, మానసిక పరివర్తనం వర్ధిల్లాలనేదే ఈ కవి ఆశయం, ఆకాంక్ష.[1]

కుటుంబ నేపథ్యం

[మార్చు]

బిజినేపల్లికి చెందిన బాదం శంభయ్య, లక్ష్మమ్మ దంపతులకు లక్ష్మీకాంతం గుప్త 1929, అక్టోబర్ 02 వ తేదిన జన్మించాడు...[2] మధ్య తరగతి వైశ్య కుటుంబంలో జన్మించిన గుప్త బాల్యంలోనే తండ్రిని కోల్పోయి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హైదరాబాదులోని వైశ్య వసతి గృహంలో ఉండి, చదువును కొనసాగించి, స్వాతంత్ర్యానికి పూర్వమే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. చిన్నతనం లొనె వివాహమైన ఈ కవికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కలరు. కుమార్తె శ్రీమతి బి.సుహాసిని సంగీతంలొ పట్ట భద్రులు, ఆకాశవాణి కళాకారిణి. మనవరాలైన శ్రుతి (రవి శంకర్ కూతురు) కూచిపూడి నాట్యం లొ డిప్లొమా చేసి దేశ విదేశాలలొ ప్రదర్శనలు ఇస్తోంది.

వృత్తి జీవితం

[మార్చు]

నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని గడిపిన గుప్త, 1987లో ఉద్యోగ విరమణ చేశాడు. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. 1985లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారిచే గౌరవించబడ్డాడు.

సాహిత్య కృషి

[మార్చు]

ఈ కవి, కవి కన్న ముందు గాయకుడు. మొదట్లో జి. నారాయణ రావు అనే తన మిత్రుడు రాసిన గేయాలను వివిధ సంధార్భాలలో, సమావేశాలలో పాడి వినిపించేవాడు. అలా కవిత్వ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లోని వైశ్య హాస్టల్‌లో చదువుకొనే సమయంలోనే తొలిసారి రచనా రంగంలోకి అడుగుపెట్టి ...

వాసవీ కుమారులు రారండి!
వైశ్య సోదరులిక లేవండి.
వసుధలోన మీ వాసిని నిల్పగ, వడివడిగా త్యాగం చేయండి.

అంటూ కుల సోదరులకు మేలుకొల్పు గీతాన్ని వినిపించి కలమందుకొన్న ఈ కవి...తర్వాత తన జన్మభూమి పాలమూరును- నీవే దిక్కను వారల నీట ముంచక మంచి పాలముంచు మా పాలమూరు అని కీర్తిస్తూ, వీరభోగ్య వసుంధరా! పేరబరగు భారతాంబరో నేనెంత ప్రస్తుతింప! అని తన దేశాన్ని ప్రేమిస్తూ కవిత్వం రాశాడు.

రచనలు
 • గేయమాల
 • పగడాల మాల
 • గాంధీ పథం
 • నవ్య జగత్తు
 • శ్రీ హనుమాన్ చాలీసా (తెలుగు సేత)
 • యశోవల్లరి
 • డబ్బూ నీ విలువెంత?
 • చంపకోత్పల సౌరభం
 • కాలమా నీ బలమెంత?
నవ్య జగత్తు

పై పేర్కొన్న పద్య, గేయ కృతులలో "గాంధీ పథం" మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహా రావు గారికి (1975), "నవ్య జగత్తు" ను శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారికి (1980), "యశోవల్లరి" ని మాజీ ముఖ్యమంత్రి శ్రీ మర్రి చెన్నారెడ్ది గారికి (1985), "డబ్బూ ! నీ విలువెంత?" అనే గేయ సంపుటిని శ్రీ చింతల శ్రీనివాస్ గారికి (1995), "చంపకోత్పల సౌరభం" ను ప్రస్తుత తెలంగాణ సాంస్కృతిక సలహాదారు శ్రీ కె.వి.రమణా చారి గారికి (2004), అంకితమిచ్చారు. శ్రీ తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా ను ద్విపదుల్లో తెలుగులో రచించి "వైశ్యరత్న" శ్రీ కొత్తూరి సీతయ్య గుప్త గారికి (1988) అంకితమిచ్చారు. తన పేరును కవితా జగత్తులో సుస్థిరం చేసుకున్నారు.

గుప్త రాసిన పుస్తకాలలో ఆణిముత్యం లాంటి పుస్తకం- నవ్య జగత్తు. ఇది పద్య జగత్తు, గేయ జగత్తు, వచన కవితా జగత్తుల సమ్మేళనం. అంటే మూడు ప్రక్రియల ముచ్చటైన పుస్తకమన్న మాట. ఇందులోని కవిత ఏ రూపంలో ఉండినా, అద్భుతమైన రసగుళికే. కొన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసారమైన సమస్యా పూరణలకు పూరించిన పద్యాలు ఇందులో ఉన్నాయి. మరికొన్ని హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాలలో స్వయంగా కవితా గానం చేసి, వినిపించిన కవితలు కొన్ని ఉన్నాయి.

బయటి లంకె

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. :నవ్య జగత్తు,(స్వకీయం), రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్, పుట-17
 2. పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర,, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, పసిడి ప్రచురణలు, హైదరాబాద్,2012, పుట-81