Jump to content

తెల్కపల్లి రామచంద్రశాస్త్రి

వికీపీడియా నుండి

తెల్కపల్లి రామచంద్రశాస్త్రి, సుప్రసిద్ధ సంస్కృత పండితుడు. రాజాపురం శాస్త్రులుగా ప్రసిద్ధుడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

సామాన్యమైన కుటుంబంలో పుట్టి, గురువుల క్రమశిక్షణలో ప్రకాశించి రాజాస్థానాలు చేరి ఉన్నతమైన విలువను పొందిన వారిలో తెల్కపల్లి రామచంద్రశాస్త్రి ఒకడు.ఇతడు నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలం, రాజాపురం గ్రామంలో డిసెంబర్ 6న, 1902లో శేషమాంబ, సుబ్రమణ్యం దంపతులకు జన్మించాడు[1].ఇంటి దగ్గరే వేదవిద్యను అభ్యసించి, ఆ తరువాత వనపర్తి, కర్నూలు, శ్రీకాళహస్తి, ఆకిరిపల్లి, చిట్టిగూడూరు,బందరులలో ఎంతో మంది పండితప్రకాండుల వద్ద సుమారు పన్నెండేళ్లు సంస్కృత విద్యను అభ్యసించాడు.

ఉద్యోగ ప్రస్థానం

[మార్చు]

అతను చదువుకొన్న బందరు జాతీయ కళాశాలలో 1923లో ఒక సంవత్సరం అధ్యాపకుడిగా పనిచేసి ఆనాటి విద్యార్థులైన మరుపూరు కోదండరామిరెడ్డి, వై.బి.రెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, కౌతా ఆనందమోహన్, కౌతా రామమోహన్ వంటి ఉద్ధండుల మెప్పును పొందాడు. కర్నూలులో వెల్లాల శంకరశాస్త్రి ఇతని ప్రియశిష్యుడు. బందరు జాతీయ కళాశాలలో విశ్వనాథ సత్యనారాయణ ఇతనికి సహాధ్యాయి. ఉన్నవ లక్ష్మీనారాయణ కుమారుడైన అర్జునరావుకు ఇతడు సంస్కృతం నేర్పించాడు. 1921లో బెజవాడలో గాంధీని దర్శించాడు. గాంధీ విదేశీ వస్తు బహిష్కరణ పిలుపుననుసరించి ఖద్దరును ధరించాడు.

1924లో స్వగ్రామానికి తిరిగివచ్చి గద్వాల రాణి ఆది లక్ష్మిదేవమ్మ ఆస్థానంలో సంస్కృత విద్వాంసుడిగా నియమించబడ్డాడు. ఇతడు గద్వాల మహారాణికి ఆంతరంగికుడు. గద్వాల రాణికి కుటుంబ, పాలనాపర సమస్యలు వచ్చినప్పుడు ఇతడు తగిన సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇతడు 1959లో రాజాపురం గ్రామానికి మొదటి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై,కిరోసిన్‌తో నడిచే వీధి దీపాలను ఏర్పాటు చేయడమేకాక పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించి వచ్చిన డబ్బును దుర్వినియోగపరచకుండా గ్రామ అభివృద్ధికి ఉపయోగించిన ప్రజానాయకుడు.

బహుముఖ ప్రతిభ

[మార్చు]

ఇతడు బహుముఖీన ప్రతిభావంతుడు. కేవలం సంస్కృత రచనలేకాక ఆయుర్వేదంలో ఇతడు దిట్ట. ఇతని ఆయుర్వేద చిట్కాలు, ప్రసంగాలు ఆకాశవాణిలో ఎన్నో ప్రసారమైనాయి. ఎంతో మంది రోగులకు స్వయంగా ఆయుర్వేద మందులను తయారు చేసి ఇచ్చి స్వస్థత చేకూర్చాడు. అంతేగాక వడ్రంగి, కంసాలి వంటి వృత్తులలో కూడా ఇతనికి ప్రవేశం ఉంది. తన ఇంటి తలుపులకు తానే స్వయంగా చెక్కిన వాణీ విలాస నిలయః అన్న అందమైన అక్షరాలు, తన ఇంటిలో స్వయంగా తయారు చేసుకున్న కర్ర స్టాండ్లకు చెక్కిన మామిడి పిందెల అలంకరణ ఇతడి ప్రతిభకు నిదర్శనాలు.

సాహిత్య రంగం

[మార్చు]

1922- 23 సంవత్సరం నుంచి ఇతని సాహిత్య ప్రస్థానం ప్రారంభమైంది. ఇతని మొదటి రచన 27 ఆర్యావృత్తాలతో కూడిన భారతీ తారామాల అనే శారదాస్తుతి. దీనిని ఇతడు బందరులో ఉన్నప్పుడే రచించాడు. మాణిక్యప్రభు పీఠాన్ని దర్శించి ఆశువుగా కవితా కాంతా స్వయంవరం అను ఖండకావ్యాన్ని చెప్పాడు. ఇది 1926లో ముద్రించబడింది.

శృంగేరీ పీఠానికి వెళ్లి అక్కడ శారదాదేవిని చూడగానే ఇతడూ శారదా నవరత్నమాలికను ఆశువుగా చెప్పడమే కాకుండా లలితాస్తవఝరి అనే పేరుతో మరో 50 శ్లోకాలను చెప్పాడు. మైసూరులోని పరకాల మఠాన్ని దర్శించి అక్కడి హయగ్రీవస్వామిపై హయగ్రీవ శతకాన్ని రచించి పండితుల మెప్పును పొందాడు. తర్వాత కాలంలో శారదానవరత్నమాలికను పొడిగించి శారదాస్తుతి శతకాన్ని రచించాడు. ఇవేకాక ఉమామహేశ్వర సుప్రభాతం, శ్రీహనుమత్సుప్రభాతం, మామిళ్లపల్లి లక్ష్మీనరసింహ సుప్రభాతం, గురుపీఠతత్త్వదర్శనం, శివానందాష్టకం, గణేశ పంచరత్నాలు, అయ్యప్పస్తుతి వంటి ముద్రిత రచనలతోపాటు కలిశతకం, రవీంద్రతపఃఫలము, ధూమశకట ప్రమాదం, చ్యవనోపాఖ్యానం, సుకన్యాస్తవం, మృత్యుశకటం వంటి అముద్రిత రచనలను చేశాడు. ఇతని కావ్యలక్ష్మి రచనను గోలకొండ కవుల సంచికలో చోటుచేసుకుంది.

తెల్కపల్లి రామచంద్రశాస్త్రి సంస్కృత కవితలు, సాహిత్యోపన్యాసాలు ఆకాశవాణిలో ఎన్నో ప్రసారమైనాయి. కామకోటి, ఆంధ్రభూమి, సనాతన మత ప్రచారిణి, సమాలోచన మొదలైన పత్రికలు ఇతని రచనలను ప్రచురించాయి. వనపర్తికి చెందిన విక్రాల నరసింహాచార్యులతో కలిసి ఇతడు జంట కవిత్వం చెప్పాడు. ఆమనగల్లు మండలం సింగంపల్లెలో అష్టావధానం చేశాడు.

సన్మానాలు

[మార్చు]

ఇతడు వనపర్తి, ఆత్మకూరు, కొల్లాపురం సంస్థానాలలో చాలాసార్లు సన్మానింపబడ్డాడు. కంచికామకోటి, శృంగేరి, పరకాల, పుష్పగిరి, మాణిక్యప్రభు పీఠాలలోని అధిపతులను అతని పాండిత్యం, కవిత్వంతో మెప్పించి సత్కారాలు అందుకున్నాడు. 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్కృ త సలహా సంఘం సభ్యులుగా నియమితులైనాడు. 1977 నుంచి కళాకారుల గౌరవ వేతనాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1979 సంవత్సరపు ఉత్తమ సంస్కృత విద్వాంసునిగా ఇతడిని సత్కరించింది.

బిరుదులు

[మార్చు]

మరణం

[మార్చు]

సంస్కృత భాషాసేవ తన జీవితమంతా చేసిన మహాపండితుడు తెల్కపల్లె రామచంద్రశాస్త్రి 1990, ఏప్రిల్ 30న మరణించాడు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]