గట్టు మనోహర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"'గట్టు మనోహర్ రెడ్డి"' మహబూబ్ నగర్ జిల్లా గాయక కవులలో ఒకరు. వివిధ సందర్భాలలో జరిగిన అనేక సంఘటనలకు స్పందించి పాటలు రాసి, బాణీలు కూర్చి పాడటం ఆయనకు నిత్యకృత్యం.

స్వస్థలం[మార్చు]

గట్టు మనోహర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా బల్మూర్ మండలం పోలిసెట్టిపల్లి గ్రామం.

విద్యాభ్యాసం[మార్చు]

వీరిది నిరుపేద రైతు కుటుంబం. పాడి పశువులే ఆధారం. పాలు అమ్మడంలో కుటుంబానికి ఒక వైపు ఆసరగా ఉంటూనే మరో వైపు చదువును కొనసాగించారు. అచ్చంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. తెలుగు భాషపై మమకారంతో పాలెం లోని ఓరియంటల్ కాలేజిలో సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రిని పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో మాస్టర్ డిగ్రిని అందుకున్నారు. తెలుగు పండిత శిక్షణ పూర్తి చేసి తాను చదువుకున్న పాఠశాలలోనే ప్రస్తుతం చదువు చెబుతున్నారు.

వృత్తి[మార్చు]

రెడ్డి వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వీరు ప్రస్తుతం అచ్చంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు.

సాహితీ కృషి[మార్చు]

20 సంవత్సరాలుగా మనోహర్ రెడ్డి సాహితీ కృషి కొనసాగిస్తున్నారు. కార్గిల్ యుద్ధం, హైదరాబాదు బాంబు పేలుళ్ళు, పాలమూరు కరువు, బాల కార్మిక వ్యవస్థ, ఏయిడ్స్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, గ్రంథాలయాల ప్రాముఖ్యత తదితర అనేక అంశాలపై పాటలు, పద్యాలు రాసి, పాలమూరు సాహిత్యం సుసంపన్నం కావటంలో తోడ్పడ్డారు. సామాజిక స్పృహతో, దేశభక్తితో వీరు రాసిన అనేక గేయాలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. జిల్లాలో ఎక్కడ కవి సమ్మేళనం జరిగినా మనోహర్ రెడ్డి గొంతు విప్పాల్సిందే. జిల్లాలో జరిగిన అవధానాలలో పృచ్ఛకుడిగా ప్రతిభ చాటుకున్నారు. పాలమూరు కవిత, పాలమూరు గోస, బాల సాహిత్యం, బాలగేయాలు తదితర సంపుటాల్లో వీరి రచనలకు చోటు దక్కింది. తాను వివిధ సందర్భాలలో రాసిన అనేక గేయాలను కలిపి ' మనోహర గేయాలు ' పేరుతో పుస్తక రూపంలో తీసుకవచ్చారు[1].

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, జిల్లా ప్రత్యేకంలో మధ్యపేజి, తేది.05.03.2014