బిరుదురాజు రామరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిరుదురాజు రామరాజు
బిరుదురాజు రామరాజు1.jpg
జననంబిరుదురాజు రామరాజు
(1925-04-16)1925 ఏప్రిల్ 16
తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా,ధర్మసాగర్ మండలం, దేవనూరు
మరణం2010 ఫిబ్రవరి 8
హైదరాబాదు
మరణ కారణంఅస్వస్థత
వృత్తిఉపన్యాసకుడు
ప్రసిద్ధిజానపద విజ్ఞాన పరిశోధకుడు
మతంహిందూ
పిల్లలుబి. రుక్మిణి
తండ్రిబిరుదురాజు నారాయణరాజు
తల్లిలక్ష్మీదేవమ్మ

బిరుదురాజు రామరాజు (ఏప్రిల్ 16, 1925 - ఫిబ్రవరి 8, 2010)[1] జానపద సాహిత్యంపై కృషి చేసిన రచయిత.

బాల్యం - విద్యాభ్యాసం[మార్చు]

బిరుదురాజు రామరాజు 1925 ఏప్రిల్ 16 వ తేదీ దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదురాజు నారాయణరాజు దంపతులకు జన్మించాడు. [2] ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం వరంగల్ జిల్లా మడికొండ లో నడిచింది. మూడవ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. మెట్రిక్ చదివేటప్పుడు 11వ ఆంధ్రమహాసభల సందర్భంగా మహాత్మాగాంధీ వరంగల్ వచ్చినప్పుడు ఇతడు ఆ సభలలో వాలంటీర్‌గా పాల్గొన్నాడు. మహాత్మాగాంధీతో కలిసి పాదయాత్ర చేశాడు. వరంగల్‌లో చదువుకునే రోజుల్లో ఇతనిపై ఆర్యసమాజం ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ తరువాత హైదరాబాదు లోని నిజాం కళాశాలలో బి.ఎ. చదువుకున్నాడు. ఆ సమయంలో దాశరథి కృష్ణమాచార్యతో పరిచయం కలిగింది. నిజాం వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు.

కాళోజీ నారాయణరావు, టి.హయగ్రీవాచారి, ముదిగొండ సిద్ద రాజలింగం, జమలాపురం కేశవరావు మొదలైన యువనాయకులతో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగారశిక్ష అనుభవించాడు. 1947-50ల మధ్యకాలంలో నిజాం కళాశాలలో తెలంగాణా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. బి.ఎ.తరువాత న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపుపొందాడు. ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో అనుమతి లేకుండా కవిసమ్మేళనం నిర్వహించినందుకు అరెస్ట్ కూడా అయ్యాడు. ఎం.ఎ. చదివే సమయంలో సి.నారాయణరెడ్డితో కలిసి కొంతకాలం రామనారాయణకవులు అనే పేరుతో జంటకవులుగా కవిత్వం చెప్పాడు. మాడపాటి హనుమంతరావు ఆంధ్రసంఘం నెలకొల్పి దానికి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించాడు. తెలంగాణా రచయితల సంఘం ఇతడు మొదటి కార్యదర్శిగా ప్రారంభమైంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత ఇది ఆంధ్ర రచయితల సంఘంగా మారింది. దీనికి ఇతడు మొట్టమొదటి కార్యదర్శి. ఎం.ఎ. పూర్తి అయ్యాక ఇతడు ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గదర్శకత్వంలో తెలుగుజానపద గేయసాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి దక్షిణ భారతదేశంలోనే జానపదసాహిత్యంపై మొట్టమొదటి పి.హెచ్.డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సంపాదించాడు. సంస్కృతంలో ఎం.ఎ. చేసి అందులో కూడా డాక్టరేట్ పొందాడు.[3]

ఉద్యోగం[మార్చు]

ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1951లో ఉపన్యాసకుడిగా చేరి అంచెలంచెలుగా తెలుగుశాఖకు డీన్‌గా, అధ్యక్షుడిగా ఎదిగాడు. ఇతని మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందారు. ఇతని పర్యవేక్షణలోనే కేతవరపు రామకోటిశాస్త్రి, కోవెల సుప్రసన్నాచార్య, ముదిగొండ వీరభద్రశాస్త్రి, అక్కిరాజు రమాపతిరావు, అనంతలక్ష్మి, కాళిదాసు పురుషోత్తం, రవ్వా శ్రీహరి వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందారు. ఇతడు 1983లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశాడు.

రచనలు[మార్చు]

 1. ఆంధ్రయోగులు (నాలుగు సంపుటాలు)
 2. సంస్కృత సాహిత్యానికి తెలుగువారి సేవ
 3. చరిత్రకెక్కని చరితార్థులు
 4. మరుగున పడిన మాణిక్యాలు
 5. తెలుగువీరుడు
 6. తెలుగు జానపదరామాయణం
 7. వీరగాథలు
 8. యక్షగాన వాజ్మయము
 9. తెలుగు సాహిత్యోద్ధారకులు
 10. ఉర్దూ తెలుగు నిఘంటువు
 11. విన్నపాలు
 12. గురు గోవిందుసింగు చరిత్ర
 13. పల్లెపట్టు (నాటకం)
 14. తెలంగాణా పిల్లల పాటలు
 15. తెలంగాణా పల్లెపాటలు
 16. త్రివేణి

South Indian folk songs Folktales of Andhrapradesh Folklore of Andhrapradesh Moharram folk songs Glimpses of telugu folklore

పురస్కారాలు[మార్చు]

 • 1994 - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్ ప్రదానం
 • 1995 - భారత ప్రభుత్వం నుండి నేషనల్ ప్రొఫెషనల్‌షిప్
 • 2001 - సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఎమినెంట్ సిటిజన్‌ అవార్డ్
 • 2003 - శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం[4]
 • 2006/2007 - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి 'విశిష్ట పురస్కారం'
 • 2009 - సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి తెలుగు భారతి పురస్కారం[5]

మరణం[మార్చు]

బిరుదురాజు రామరాజు, అస్వస్థత కారణంగా 2010, ఫిబ్రవరి 8హైదరాబాదులో మరణించాడు.

మూలాలు[మార్చు]

 1. ఎడిటర్ (February 9, 2010). "జానపద సాహిత్య సృష్టికర్త.. బిరుదురాజు కన్నుమూత". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 1 January 2015.[permanent dead link]
 2. కె., విద్యావతి. "మన జానపదబ్రహ్మ బిరుదురాజు రామరాజు". తెలంగాణా సాహితీవనం. Retrieved 1 January 2015.[permanent dead link]
 3. దేవులపల్లి, ప్రభాకర్‌రావు (ఫిబ్రవరి 28, 2010). "తెలంగాణా తలమానికం బిరుదురాజు రామరాజు" (PDF). ప్రజాతాంత్ర: 8–9. Retrieved 1 January 2015.
 4. Special Correspondent (Aug 15, 2003). "Raja-Lakshmi award to be conferred on Biruduraju Ramaraju". The Hindu. Retrieved 1 January 2015.
 5. ఎడిటర్ (Jun 9, 2009). "CP Brown Academy award for folkore veteran". The New Indian Express. Retrieved 1 January 2015.