Jump to content

మన్నె శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
మన్నె శ్రీనివాసరావు
మన్నె శ్రీనివాసరావు
జననంమన్నె శ్రీనివాసరావు
జూన్ 4, 1968
చుండూరుపల్లి, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తిలైఫ్ ఇన్సూరెన్ కార్పోరేషన్ లో హెచ్.జి.ఏ.
ప్రసిద్ధిచరిత్ర పరిశోధకుడు, విమర్శకుడు, రచయిత, దర్శకుడు, సమాజ నిర్వాహకుడు, నాటకపరిషత్ వ్యవస్థాపకుడు
మతంహిందూ
భార్య / భర్తలక్ష్మి
పిల్లలుతారకరామ మోక్షజ్ఞ తేజ
తండ్రిస్వర్గీయ వెంకటేశ్వర్లు
తల్లిరాజేశ్వరి

మన్నె శ్రీనివాసరావు చరిత్ర పరిశోధకుడు, విమర్శకుడు, వక్త రంగస్థల నటప్రయోక్త, రచయిత, దర్శకుడు, గుణనిర్ణేత, సమాజనిర్వాహకుడు, నాటకపరిషత్ వ్యవస్థాపకుడుగా బహుముఖీన ప్రస్థానముతో తెలుగు సాహిత్య, చరిత్ర పరిశోధన, రంగస్థల కళారంగాల వికాసానికి అవిశ్రాంత సేవలు అందిస్తున్నాడు. [1]

జీవిత విశేషాలు

[మార్చు]

మన్నె శ్రీనివాసరావు చరిత్ర ప్రసిద్ధులౌ మన్నె పద్మనాభుడు మూలపురుషుడగు కుదురులో తొమ్మిదో తరాన, పొన్నూరు చేరువలో, నేటి బాపట్ల మండలంలోని చుండూరుపల్లి గ్రామవాసులగు, విఖ్యాత నేత అప్పయ్య పౌత్రునిగా, ప్రఖ్యాత కార్మికనేత వెంకటేశ్వర్లు, రాజేశ్వరి దంపతులకు ఏకైక పుత్రునిగా జూన్ 4న 1968లో జన్మించాడు. వీరికి శిరీష(డా. పుల్లేటికుర్తి విమల్ తేజ యమ్.డి, జనరల్ ఫిజిషియన్ అర్ధాంగి), శ్యామల(సబ్బినేని రాంబాబు అర్ధాంగి), శైలజ(గూడూరు దిలీప్ కుమార్ అర్ధాంగి) అనెడి ముగ్గురు చెల్లెళ్ళు కలరు.

విద్యాభ్యాసం

[మార్చు]

మన్నె శ్రీనివాసరావుకి ఐదో ఏట జన్మస్థలి చుండూరుపల్లి లోనే అక్షరాభ్యాసం జరిగింది. వారి తండ్రి ఉద్యోగరీత్యా రేపల్లెకు బదిలీయైనారు. దాంతో శ్రీనివాసరావు రేపల్లె లోని శ్రీ షిర్డీసాయి మున్సిపల్ అప్పర్ పైమరీ పాఠశాల(భైరవస్వామి స్కూల్)లో ఆరోతరగతి వరకు, పిదప భగవాన్ శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో పదవతరగతి(1983)వరకు విద్యాభ్యాసం గావించాడు. అటుపై రేపల్లె చేరువలోని నగరంలోని శ్రీవెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో ఇంటర్మీ డియట్ (1983-85) చదివాక బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ (అగ్రి. ఇంజనీరింగ్)లో పట్టభద్రుడైనాడు. ఉత్తరకాలాన ఉద్యోగ జీవితములో అవసరార్ధం తమిళనాడు-వినాయక యూనివర్సీటీ నుంచి 2012లో దూరవిద్యద్వారా స్నాతకోత్తరవిద్యలో యమ్.బి.ఏ., పట్టా పొందాడు.

ప్రధాన విద్యాగురువులు :సర్వశ్రీ గణితశాస్త్ర మహామహోపాధ్యాయ పాతూరి మృత్యుంజయశాస్త్రి(సహజకవి పాతూరి రాధాకృష్ణమూర్తిగారి పుత్రులు), పద్యాల గోపీ చంద్ర స్వామి, కొత్తపల్లి రవిబాబు(జనసాహితీ), చిగురుపాటి భాస్కరరావు, గుళ్ళపల్లి గాంధీ, డాక్టర్ రావూరి వీరరాఘవయ్య, నన్నపనేని శేషగిరిమ్మ, బండ్రెడ్డి వసుంధరా దేవి, వడ్లమూడి సాంబశివరావు, కరి సత్యనారాయణరావు మొదలగువారు.

వివాహం - పిల్లలు

[మార్చు]

శ్రీనివాసరావుకి తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం గ్రామవాసులగు కోటపాటి లక్ష్మీనరసయ్య, సత్యవతి దంపతుల తృతీయపుత్రిక లక్ష్మితో 19-05-1996న వివాహం జరిగింది. వీరికి ఏకైక పుత్రుడు తారకరామ మోక్షజ్ఞ తేజ కోయింబత్తూరు అమృత యూనివర్శిటీ నుంచి యం.టెక్(సైబర్ సెక్యూరిటీ)లో డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులై బెంగుళూరు లోని ఫిలిఫ్స్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్నారు.

ఉద్యోగం

[మార్చు]

మన్నె శ్రీనివాసరావు పట్టభద్రులు కాగానే తొలుత ఓ ప్రైవేట్ సంస్థలో 'వ్యవసాయ ఇంజనీర్'గా కొద్దిమాసాలు పనిచేసి, వృత్తి వ్యాసంగాలతో నాట్యకళావ్యాసంగాలకు తీవ్ర అవరోధం కలగటముతో రిజైన్ చేసాడు. ఆపై సాయికోచింగ్ సెంటర్ రేపల్లెలో కొద్దికాలం గణితశాస్త్రము బోధించాడు. పిదప 28-08-1991న లైఫ్ ఇన్సూరెన్ కార్పోరేషన్లో అసిస్టెంట్ ఉద్యోగం పొంది తుని బ్రాంచ్లో చేరాడు. ఆపై క్రమంగా రావులపాలెం (1992-96), వినుకొండ (1996-98), రేపల్లె(1998-2009) లలో పనిచేశాడు. పిదప హెచ్.జి.ఏగా పదోన్నతిమీద 2009 మార్చిలో గురజాలకు బదిలీయై అక్కడ ఏడాదిపాటు అటుపై అవనిగడ్డ (ఆరుమాసాలు), రేపల్లె (2010-17), బాపట్ల (2017-22)లలో పనిచేసాడు. నేడు 2022 మార్చినుంచి రేపల్లెలో పనిచేస్తున్నాడు. ఉద్యోగ జీవితాన ఉత్తమోద్యోగిగా ఇప్పటికే పలుమార్లు పురస్కారాలు, సన్మానాలు అందుకున్నాడు. జీవితబీమా ఉద్యోగుల సంఘనాయకునిగా భిన్నహెూదాలలో విలువైన సేవలందించుతున్నాడు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

శ్రీనివాసరావు తన పదమూడో ఏట భగవాన్ శ్రీసత్యసాయి హైస్కూల్ 8వ తరగతి చదివేటప్పుడు జరిగిన పోటీలలో 1980లో ఎత్తుకు పైఎత్తు అనే నాటికద్వారా రచయితగా, నటునిగా, దర్శకునిగా ఏకకాలంలో రంగస్థలప్రవేశం చేశాడు.

తొలి ప్రదర్శనలొనే ఉత్తమ నటుడు, దర్శకుడు, రచయిత, ప్రదర్శన అనే 4 బహుమతులు సాధించి చరిత్ర సృష్టించాడు. నాటినుంచి నేటివరకు శ్రీనివాసరావు వెనుదిరిగి చూసినదే లేదు.

నటునిగా

[మార్చు]

అశోకుడు(సమ్రాట్ అశోక, బుద్ధం అశోకం), బుద్ధుడు(బుద్ధం శరణం గచ్ఛామి), గిరీశం(కన్యాశుల్కం), వశిష్టుడు(రాగవాసీష్టము), చాణక్యుడు(సచివ సమ్రాట్), శివమూర్తి(నడమంత్రపుసిరి), వాలేశ్వరరావు(జీవనగీత), జోగి(కొక్కోరోకో), కిట్టిగాడు(హుష్ కాకి) పాత్రలు ధరించి తన సాత్వికాభినయంతో ఎనలేని కీర్తి గడించాడు.

దర్శకుడిగా

[మార్చు]

శ్రీనివాసరావు 13ఏట 1980లో భుజంగం (ప్రతినాయకుడు) పాత్ర ధరించుతూ, ఎత్తుకు పై ఎత్తు అనే స్వీయరచనకు దర్శకత్వమొహించుతూ దర్శకునిగా రంగస్థలప్రవేశం చేశాడు. ఆపై పలు సాంఘిక, చారిత్రక, పౌరాణిక ఇత్యాది పద్య, వచన నాటిక, నాటకాలను అత్యుత్తమ ప్రయోగ విలువలకు పెద్దపీటవేస్తూ ప్రదర్శింప చేసి మేధావుల, విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు పొందాడు. అనేక బహుమతులు సాధించాడు. దర్శకునిగా శ్రీనివాసరావుకి సమ్రాట్ అశోక, జీవనగీత, వేద(నా) భూమి, బీమాబచావో, ఎత్తుకు పైఎత్తు, నడమంత్రపుసిరి వంటి స్వీయరచనలతోపాటు పెమ్మరాజు గోపాలకృష్ణమూర్తి రచించిన మహారథి కర్ణ, తనికెళ్ళ భరణి రచించిన కొక్కోరోకో, ఎల్.బి.శ్రీరామ్ రచించిన హుష్ కాకి అఖండ ఖ్యాతి నందించాయి. మరిముఖ్యముగా శ్రీనివాసరావు బుద్ధం అశోకం, బుద్ధం శరణం గచ్ఛామి వంటి పద్యనాటకాలన్ని 36మంది నటవర్గం - 9మంది సాంకేతికనిపుణులతో ప్రతీకాత్మక రంగోద్దీపనంతో విజయవంతముగా ప్రయోగించి గండవరం సుబ్బరామిరెడ్డి, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, వేమూరి రామయ్య, తాళ్ళూరి శివరామకృష్ణారావు,కె.యస్.టి.శాయి, సాక్షి రంగారావు, చాట్ల శ్రీరాములు వంట్యనేకమంది రంగస్థలకళాకోవిదుల ప్రశంసలు బహుళంగా పొందాడు. అదేవిధంగా కన్యాశుల్కం, రాగవాసిష్ఠం(బోయి భీమన్నగారి రచన), హిరణ్యకశ్యపుడు (ఆమంచర్ల గోపాలరావు గారి రచన) వంటి ఓల్డ్ క్లాసిక్స్ ని రసజ్ఞులను అలరించేరీతిలో ప్రయోగించిన తీరు శ్రీనివాసరావుకి దర్శకునిగా ఓ గౌరవప్రద స్థానం తెచ్చిపెట్టింది.

రచయితగా

[మార్చు]

శ్రీనివాసరావు రచయితగా 13ఏట 1980లో ఎత్తుకు పైఎత్తు అనే నాటిక రచించి, దానిలో భుజంగం (ప్రతినాయకుడు) పాత్ర ధరించుతూ ప్రదర్శింపజేశారు. రచయితగా శ్రీనివాసరావు ఇంతవరకు 11 నాటకాలు, 11 నాటికలు, 5 ఏకపాత్రలు, 9 ఆకాశవాణి నాటికలు, 3 దూరదర్శన్ నాటికలు రచించారు. పౌరాణికం, చారిత్రకం, జానపదం, సాంఘికం, కాల్పనికం వంటి పంచ ప్రక్రియలలో శ్రీనివాసరావు రచనలు సాగించడం ఓ విశేషం. పద్యనాటకం, వచననాటకం, సంగీతరూపకం, నృత్యరూపకం, యక్షగానం ప్రక్రియ లలోనూ రచనలు చేయడమో విశేషం. బుద్ధం అశోకం, బుద్ధం శరణంగచ్ఛామి, పరుశురామోపాఖ్యానం, శ్రీమద్విరాట్ పర్వం, బ్రహ్మర్షి విశ్వామిత్ర ఇత్యాది పద్యనాటకాలు - శ్రీకృష్ణ సత్య, చాణక్య చంద్రగుప్త, అక్బర్ సలీమ్ అనార్కలి ఇత్యాది వచననాటకాలు - నడమంత్రపుసిరి, జీవనగీత, సమ్రాట్ అశోక, అమృతతిలకం ఇత్యాది నాటికలు - ఎత్తుకు పై ఎత్తు, పశ్చాత్తాపం వంటి బాలల నాటికలు - వేద(నా)భూమి, బీమాబచావో వంటి వీధినాటికలు - సింహాచలం భద్రాచలం, నటుడు వంటి ఆశు నాటికలు - నందవ్రజ వైభవమ్ ఇత్యాది నృత్యరూపకాలు-ముక్తేశ్వర క్షేత్రమహాత్మ్యమ్ వంటి సంగీతరూపకాలు - వ్యాఘ్రపుర వైభవమ్ ఇత్యాది యక్షగానాలు - రాజు వెడలె, సందట్లో సడేమియా, తెరతీసాం వంటి ఆకాశవాణి నాటికలు శ్రీనివాసరావుకి నాటకరచయితగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

సమాజ నిర్వహకునిగా

[మార్చు]

బాల్యమునుంచి 1996వరకు చైతన్య సాంస్కృతిక యువజనసంఘం ద్వారా నాటకాలు ప్రదర్శించిన శ్రీనివాసరావు 19-11-1996న తమ నాటకగురువులు kst శాయి గారి పేరిట శాయి కళాస్రవంతి అనే సంస్థ నెలకొల్పి ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. నేటిదాకా అనేక రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద 1700 పైబడి ప్రదర్శనలు ఇచ్చి తెలుగు నాటక వికాసానికి దోహదపడుతున్నాడు.

నాటక పరిషత్ నిర్వాహకునిగా

[మార్చు]

ఎన్టీఆర్ పరమపదించగానే 1996 జనవరిలోనే తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ దివ్య స్మృత్యర్ధం ఎన్టీఆర్ కళాపరిషత్ నెలకొల్పి...ఏకపాత్రల, నాటికల పోటీలు నిర్వహించాడు. ఈ పరిషత్ ద్వారా బహుభాషా నాటకపోటీలు నిర్వహించి...ఆతరహా పోటీలు తెలుగునాటకచరిత్రలొనే తొలిసారిగా నిర్వహించిన చరిత్ర సృష్టించాడు.

సాహితీవేత్తగా

[మార్చు]

కళావాచస్పతి కొంగర జగ్గయ్య దగ్గర సాహిత్య రచనలో శిక్షణ పొందిన శ్రీనివాసరావు నేటిదాకా అన్ని సాహితీ ప్రక్రియలలో కలిపి 60 పైబడి రచనలు చేసి కీర్తి గడించాడు.

ఇటీవల ఆవిష్కరణ అయిన ఎన్టీఆర్ సినీ జీవితచరిత్ర వెండితెర వేలుపు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ మీద వచ్చిన అపూర్వ విలక్షణ ప్రామాణిక గ్రంథముగా ఎన్టీఆర్ బంధువర్గం, అభిమానులు, సినీ వర్గాలు, సాహితీవిమర్శకులు చే కొనియాడబడుతుంది.

నాటక రచన్లతోపాటు రేపల్లె చరిత్ర, భావపురి రంగస్థలి, నాట్యకళాయోగి పామర్తి సుబ్బారావు, కోన ప్రభాకరరావు జీవితచరిత్ర మొదలగు చరిత్ర పరిశోధన పల్నాటి వైభవం, దివ్యధాత్రి మొదలగు పద్య కావ్యాలు రచనలు శ్రీనివాసరావుకి ఎనలేని పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి.

పురస్కారాలు

[మార్చు]

సాహిత్య, కళారంగాలలో మన్నె శ్రీనివాసరావు చేస్తున్న కృషిని గుర్తించి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి వున్న సంస్థలు అనేకం ప్రతిష్ఠాత్మక అవార్డులు, పురస్కారాలు, బిరుదులు ప్రదానం చేశాయి.

  • యన్.టి.ఆర్. శతాబ్ది రంగస్థల పురస్కారము: యన్.టి.ఆర్.శతజయంతి కమిటీ - తెనాలి వారిచే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు 25-03-2023న ప్రదానమ్
  • అక్కినేని అంతర్జాతీయ శతజయంతి ప్రత్యేక పురస్కారం : అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (AFA) వారి చే గుంటూరులో జరిగిన అక్కినేని శత జయంతి వేడుకలలో 23-09-2023న ప్రదానం చేశారు
  • నాట్యశ్రీ అవార్డు : అలహాబాద్ నాట్యసంఘ్ వారిచే జాతీయస్థాయిలో అతికొద్దిమందికి ఏటా ప్రదానం గావించే ప్రతిష్ఠాత్మక నాట్యశ్రీ అవార్డును 14-03-2001న.
  • నాట్యభూషణ్ అవార్డు : ఉత్కళ యువసాంస్కృతిక సంఘ్ -కటక్ (ఒడిసా)చే నాట్యభూషణ్ అవార్డును సెప్టెంబరు-1999లో.
  • కవిసమ్రాట్ నోరి నరసింహశాస్త్రి సాహిత్యపురస్కారం : హైదరాబాద్ లోని నోరి నరసింహశాస్త్రి ఛారిటబుల్ ట్రస్ట్ వారి ప్రతిష్ఠాత్మకమైన కవిసమ్రాట్ నోరి నరసింహశాస్త్రి సాహిత్య పురస్కారం-2014
  • మహాకవి గురజాడ అప్పారావు అవార్డు పురస్కారం: యువకళావాహిని - హైదరాబాద్ వారి ప్రతిష్ఠాత్మకమైన మహాకవి గురజాడ అప్పారావు అవార్డును 25-03-2016న గుంటూరు
  • తెలుగురత్న అవార్డు పురస్కారం : తెలుగుభాషా పరిరక్షణ సమితి-పుంగునూరు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధనా కేంద్రం తిరుపతి సంయుక్తంగా.
  • బందరు ఆంధ్ర సారస్వత సమితి ఉగాది పురస్కారం: ఉత్తమ నటప్రయోక్త, రచయితగా 2012-ఉగాది పురస్కారం.
  • కళాజగతి-విశిష్ట వ్యక్తి అవార్డు పురస్కారం: నాలుగు దశాబ్దాల పైబడి నిరాటంకంగా వెలువడుతున్న రంగస్థల మాసపత్రిక కళాజగతిచే విశిష్ట వ్యక్తి అవార్డు-2000.
  • జీవిత బీమాలలిత కళాసమితి-మచిలీపట్నం పురస్కారం: జీవిత బీమా లలితకళాసమితి-మచిలీపట్నం వారి ప్రతిష్ఠాత్మక ఉగాది పురస్కారం-2000.

బిరుదులు

[మార్చు]
  • వాగ్దేవిపుత్ర(శ్రీప్రభాకర నాట్యమండలి గుడివాడ సహా 13 సంస్థల పౌరసన్మానం), అభినయ కళాప్రపూర్ణ(చెర్వుజమ్ములపాలెం పౌరసన్మానం),
చరిత్రపరిశోధనా చక్రవర్తి(బాపట్లప్రజల పౌరసన్మానం), సరస్వతీపుత్ర(సంస్కృతాంధ్రపండితులు గుమ్మడి సీతారామయ్యచే ప్రదానం), కళారత్న(నేషనల్ యునెస్కోక్లబ్)

అధారాలు, మూలాలు

[మార్చు]
  1. మన్నె శ్రీనివాసరావు. "అక్షరం; 10టి.వి". 10టి.వి. దూరదర్శన్. 10టి.వి. Retrieved 13 August 2021.

బయటి లింకులు

[మార్చు]
  • 64 కళలు
  • రేపల్లె చరిత్ర - రచన - మన్నె శ్రీనివాసరావు
  • భావపురి రంగస్థలి - రచన - మన్నె శ్రీనివాసరావు
  • తెరచిన పుస్తకం - కె.యస్.టి.శాయి
  • నటనాలయంలో ఇంజనీర్ - డాక్టర్ పి.వి.రమణ వ్యాసం (వార్త మైయిన్ ఎడిషనలో)