Jump to content

మాడుగుల వేంకట సూర్య ప్రసాదరాయ కవి

వికీపీడియా నుండి

మాడుగుల వేంకట సూర్య ప్రసాదరాయ కవి శతావధాని, కవి, బహుగ్రంథకర్త. అంతే కాక వైద్యశాస్త్ర, జ్యోతిష శాస్త్ర, మంత్రశాస్త్రాలలో ప్రవీణుడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు ఒక జమీందారీ కుటుంబంలో 1912, జూలై 31న జన్మించాడు. వీరభద్రసీతారామరాయకవి, సన్యాసాంబ ఇతని తల్లిదండ్రులు. శ్రీకాకుళం జిల్లా, బొంతల కోడూరు ఇతని జన్మస్థానం. ఇతని తండ్రి మంచి కవి, నాటకరచయిత. అతడు హలాస్య పురాణాంతర్గత ఉగ్రకుమార చరిత్ర అనే ప్రబంధాన్ని రచించాడు. ఇతని తాత విజయ బాలయ్య, చినతాత ఎఱ్ఱనలు కూడా కవులే. వీరు అనేక మంది కవులను పోషించారు. అనేక కృతులను అంకితం పుచ్చుకున్నారు. ప్రసాదరాయకవి శ్రీకాకుళం మునిసిపల్ హైస్కూలులో ఫోర్తుఫారం వరకు చదువుకున్నాడు. తండ్రివద్ద సంస్కృతాంధ్ర కావ్యాలు పఠించాడు. 1924 నుండి ప్రముఖ శతావధాని కొడుకుళ్ల వేంకటరమణమూర్తి వద్ద సిద్ధాంతకౌముది, ప్రతాపరుద్రీయము, అవధాన విద్య నేర్చుకున్నాడు. ఇతడు 1935 నుండి 1976 వరకు 600లకు పైగా అవధానాలు, ఆశువిద్యాసభలు నిర్వహించాడు.

అవధానాలు

[మార్చు]

ఇతడు అష్టావధానాలు, ద్విగుణిత అష్టావధానాలు, త్రిగుణిత అష్టావధానాలు, దశావధానాలు, షోడశగుణిత అష్టావధానాలు, శతావధానాలు, ఆశువిద్యా ప్రదర్శనలు అనేకం నిర్వహించాడు. ఇతడు ఎక్కువ భాగం శ్రీకాకుళం జిల్లాలో అవధానాలు చేసినా విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో కూడా కొన్ని అవధానాలు ప్రదర్శించాడు. ఇతడు శ్రీకాకుళం, బొంతల కోడూరు, కురుపాం, ఇచ్ఛాపురం, సోంపేట, నరసన్నపేట, పాలకొండ, ఆముదాలవలస, వీరఘట్టం, అరసవిల్లి, చోడవరం, టెక్కలి, బత్తిలి, సంకిలి, విజయనగరం, బొబ్బిలి, ధర్మవరం, విశాఖపట్నం, అనకాపల్లి మొదలైన చోట్ల ఇతని అవధాన విద్యాప్రదర్శనలు జరిగాయి.

అవధానాలలో పూరణలు

[మార్చు]

ఇతడు అవధానాలలో చెప్పిన కొన్ని పద్యాలు:

  • సమస్య: శునకమ్ములు పువ్వులంట చోద్యము గాదే

పూరణ:

కన దురుతర నిష్ఠదపంబు
నొనర్చి జితేంద్రియత్వము గొను హరు తపం
బును జెరుప గడంగు రతీ
శున కమ్ములు పువ్వులంట చోద్యము గాదే!

  • సమస్య: అతివకు జూడ నొప్పెసగె నారు కుచంబులు మూడు మోములన్

పూరణ:

అతి పతిభక్తితో మెలగు నయ్యన సూయను జేరి మ్రొక్కి, మా
పతుల ననుగ్రహింపుమని వాణీ భవాని రమాలతాంగియున్
చతురతమీర బ్రార్ధనలు జల్పెడు వేళను నొక్కచోట న
య్యతివకు జూడ నొప్పెసగె నారు కుచంబులు మూడు మోములన్

  • దత్తపది: పిల్లి - నల్లి - బల్లి - తల్లి అనే పదాలతో భారతార్థంలో పద్యం

పూరణ:

పిల్లిని మించు నెత్తులను వెల్గగజేయు సుయోధనాదులన్
నల్లిని నల్పినట్లుగ రణంబున రూపునడంచి యెంతయున్
బల్లిదులైన పాండవులు భాగ్యములంగొని భక్తియుక్తులై
తల్లిని కుంతిదేవిని సదా భజియింతురు దైవమంచెదన్

  • వర్ణన: భాగవతము సర్వలఘు కందములో

పూరణ:

 ఎడనెడ బడలిడు నుడువుడి
తడబడు కడికడుపు, నెడద గడు దడదడ, నె
న్నెడ తడబడు వడి నడుగిడ
దొడ లెక్కుడు నడరె, కడుపు దొడరి, పడతికిన్

రచనలు

[మార్చు]

ఇతడు 50 వరకు కావ్యాలు, అనువాదాలు, దండకాలు, శతకాలు, అష్టకాలు రచించాడు.

వాటిలో కొన్ని:

  1. అద్భుతోత్తర రామాయణము
  2. చిత్త ప్రబోధము
  3. ముకుందమాల (ఆంధ్రీకృతము)
  4. పుష్పబాల విలాసము (ఆంధ్రీకృతము)
  5. అవధానవిద్య (అముద్రితము)

మూలాలు

[మార్చు]
  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 268–272.