Jump to content

యార్లగడ్డ శివరామప్రసాద్

వికీపీడియా నుండి
యార్లగడ్డ శివరామప్రసాద్
జననం(1903-04-03)1903 ఏప్రిల్ 3
చల్లపల్లి, బ్రిటీషు ఇండియా (ప్రస్తుత కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం)
మరణం1976 (72 లేదా 73 వయసులో)
ఇతర పేర్లుశ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహదూర్, చల్లపల్లి రాజా
వృత్తిజమీందారు, రాజకీయనాయకుడు, పారిశ్రామికవేత్త
బిరుదుచల్లపల్లి రాజా

చల్లపల్లి జమీందారుగా ప్రసిద్ధుడైన రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ చల్లపల్లి రాజధానిగా, దేవరకోట సంస్థానాన్ని పాలించిన యార్లగడ్డ వంశ రాజకుటుంబీకుడు, కళాపోషకుడు, దాత, సినీ నిర్మాత మరియు భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలోనూ, కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖామంత్రిగా పనిచేశాడు.

యార్లగడ్డ శివరామప్రసాద్, 1906, సెప్టెంబరు 29న, కృష్ణా జిల్లా, గూడూరులో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. దాకా చదివాడు.[1]

జమీందారు

[మార్చు]

1929లో ఈయన తండ్రి రాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ మరణించిన తర్వాత, జ్యేష్ట పుత్రుడిగా రాజా యార్లగడ్డ శివరామప్రసాద్, 1929లో సంస్థాన పాలన బాధ్యతలను స్వీకరించాడు.[2] 1929 డిసెంబరు 21వ తేదిన ఈయన వివాహ సందర్భంగా, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, ఉమర్ ఆలీషా, వేటూరి ప్రభాకరశాస్త్రి, శ్రీరాం వీరబ్రహ్మకవి వంటి ఉద్దండ పండితులను ఘనసత్కారం చేసి సన్మానించాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మట, రాచరిక వ్యవస్థ నిర్మూలనతో, చల్లపల్లి రాజులకు అధికారం పోయింది.

యార్లగడ్డ శివరామప్రసాద్ చల్లపల్లి సంస్థానానికి పట్టాభిషిక్తుడైన చివరి జమీందారు. ఈయన పాలనకాలంలో సంస్థానం అనేక కమ్యూనిస్టు రైతుల తిరుగుబాట్లను చవిచూసింది. చల్లపల్లి సంస్థానంలో వీటి తీవ్రత మరింత ఉధృతంగా ఉంది. సంస్థానపు కూలీ రైతులు శివరామప్రసాద్ ఆధీనంలో ఉన్న అనేక వేల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. అయితే, ఈ తిరుగుబాటును అణచేందుకు జమీందారుకు, క్రాంగ్రేసు పార్టీ మద్దతున్న పోలీసు బలగం సహాయం చేసింది.[3] శివరామప్రసాద్ కృష్ణా జిల్లాలోని అనేక హిందూ దేవాలయాలకు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నాడు. కూచిపూడి నృత్య కళను పోషించాడు. ఈయన అనేక కొత్త విద్యా సంస్థలను స్థాపించిన సంస్కృత భాష అభివృద్ధికి కృషి చేశాడు.[4][5]

శివరామప్రసాద్, పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్రా బ్యాంకుకు నిధులు సమకూర్చాడు.[6] 1938లో సారథి ఫిలింస్ అనే చిత్రనిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ మాయాలోకం (1945), రోజులు మారాయి (1955) వంటి అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించింది..[6] రోజులు మారాయి సినిమా విజయవంతమైన తర్వాత, శివరామప్రసాద్ ఆ డబ్బుతో హైదరాబాదులో ఒక సినిమా స్టూడియో కట్టాలనే ఉద్దేశంతో, 1956లో హైదరాబాదు రాష్ట్ర ప్రధానమంత్రిగా పనిచేసిన కిషన్ పెర్షాద్ నుండి పన్నెండు ఎకరాలు భూమిలో ఒక భవనం ఉన్న స్థలాన్ని కొనుగోలు చేశాడు.[6][7][8] 1956లో హైదరాబాదులో సారథీ స్టూడియోస్ అనే చిత్ర నిర్మాణ స్టూడియోను నెలకొల్పాడు. హైదరాబాదులో కట్టబడిన తొలి సినిమా స్టూడియో ఇదే.[9][10] అంతేకాక ఈయన చల్లపల్లిలో ఒక చెక్కెర కర్మాగారం స్థాపనకు కూడా నిధులందించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాజకీయాల్లో యార్లగడ్డ శివరామప్రసాద్ స్వాతంత్ర్యానికి పూర్వం జస్టిస్ పార్టీలో ఉన్నాడు. స్వాతంత్ర్యం తర్వాత భారత జాతీయ కాంగ్రేసులో చేరాడు.[11] స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన తొలి సాధారణ ఎన్నికలలో రాష్ట్ర శాసనసభకు స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత కాంగ్రేసు పార్టీలో చేరాడు.

శివరామప్రసాద్ 1933లో కృష్ణా జిల్లా బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1937లో మద్రాసు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనెట్ సభ్యుడు.[1]

రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ కళా పోషకుడిగా, సినీ కళను కూడా ప్రోత్సహించాడు. సారధి సంస్థను స్థాపించి అనేక సినిమాలను నిర్మించాడు. వీటిలో మాలపిల్ల, జమిందారీ విధానం మీద, పెత్తనాలను గర్హిస్తూ తీసిన రైతుబిడ్డ, ద్రోహి కొన్ని ప్రముఖ సినిమాలు. రైతుబిడ్డ వంటి జమీందారీ వ్యతిరేక చిత్రాన్ని ఒక జమిందారే నిర్మించడం గొప్ప విషయం.

యార్లగడ్డ శివరామప్రసాద్, దివి శాసనసభ నియోజకవర్గం నుండి ఒకసారి (1955) అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గంనుండి రెండు సార్లు (1962, 1967) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యాడు. 1962లో ఏర్పడిన అవనిగడ్డ నియోజకవర్గం స్థానంలో 1952, 1955 ఎన్నికలలో దివి ద్విసభ్య శాసనసభ నియోజకవర్గం. యార్లగడ్డ శివరామప్రసాద్ 1952లో తొలిసారి దివి శాసనసభ నియోజకవర్గం నుండి మద్రాసు రాష్ట్ర శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి సి.పి.ఐ అభ్యర్థి చండ్ర రామలింగయ్య చేతిలో ఓడిపోయాడు.[12]

బిరుదులు

[మార్చు]

శివరామప్రసాద్, వీరి పూర్వీకులకు మరాఠా సామ్రాజ్యపు పీష్వాలు ఇచ్చిన శ్రీమంతు అనే బిరుదును కొనసాగించాడు.[13] ఈయన ఇతర బిరుదులు రాజా, బహదూర్, జుబ్దతుల్ అఖ్రాన్. ఈ మూడింటిని వీరి వంశజులకు మొఘల్ చక్రవర్తులు ప్రసాదించారు.[14]

స్మారకాలు

[మార్చు]

దివిసీమలోని శివరాంపురం పట్టణం రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ పేరు మీదుగా నామకరణం చేయబడింది.[15] చల్లపల్లిలోని జూనియర్ కళాశాలకు ఈయన పేరిట, శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ జూనియర్ కళాశాల అని పేరుపెట్టారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Whos Who In India Burma Amp Ceylon (1939). Bombay: The Sun Publishing House. 1939. p. 133. Retrieved 4 August 2024.
  2. మాగంటివారి స్వీయచరితమయిన చల్లపల్లి జమిందారీలు
  3. Basu, Jyoti (1997). Documents of the Communist Movement in India: 1949-1951 (in ఇంగ్లీష్). National Book Agency. p. 722. ISBN 978-81-7626-006-0.
  4. Registrar, India Office of the (1962). Census of India, 1961 (in ఇంగ్లీష్). Manager of Publications. p. 26.
  5. Naidu, T. Appala (2014-07-08). "Make Kuchipudi heritage village: artistes". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-06-19.
  6. 6.0 6.1 6.2 Damodaran, Harish (2018-11-25). India's New Capitalists: Caste, Business, and Industry in a Modern Nation (in ఇంగ్లీష్). Hachette India. p. 111. ISBN 978-93-5195-280-0.
  7. Narasimham, M. L. (2019-04-02). "Rhythm of rural mileu: Kalasi Vunte Kaladu Sukham". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-06-19.
  8. Nanisetti, Serish (2018-04-02). "A house for Maharaja Kishen Pershad in Hyderabad". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-06-19.
  9. Yojana - Volume 39 (in ఇంగ్లీష్). Publications Division, Ministry of Information and Broadcasting. 1995. p. 123.
  10. Nanisetti, Serish (2018-04-02). "A house for Maharaja Kishen Pershad in Hyderabad". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-06-19.
  11. Grover, Verinder; Arora, Ranjana (1996). Encyclopaedia of India and Her States: Andhra Pradesh, West Bengal, Bihar and Orissa (in ఇంగ్లీష్). Deep & Deep. p. 16. ISBN 978-81-7100-726-4.
  12. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 94.
  13. Itihas (in ఇంగ్లీష్). Director of State Archives, Government of Andhra Pradesh. 2009. p. 124.
  14. Vadivelu, A. (2017-10-13). The Aristocracy of Southern India (in ఇంగ్లీష్). Mittal Publications. p. 112.
  15. Katti, Madhav N. (1984). Studies in Indian Place Names (in ఇంగ్లీష్). Place Names Society of India by Geetha Book House. p. 148.