Jump to content

కె. జె. ఏసుదాసు

వికీపీడియా నుండి
(యేసుదాసు నుండి దారిమార్పు చెందింది)
కె. జె. యేసుదాస్
జననం
కట్టస్సేరి జోసెఫ్ జేసుదాస్

(1955-01-10) 1955 జనవరి 10 (వయసు 69)[1]
వృత్తిగాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1955-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారతీయ శాస్త్రీయ సంగీతము , నేపథ్యగాయకుడు
జీవిత భాగస్వామిప్రభ
తల్లిదండ్రులు
  • అగస్టీన్ జోసెఫ్ [1] (తండ్రి)
  • ఆలిస్ కుట్టి[1] (తల్లి)

కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ (జ. జనవరి 10, 1955) భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. అతను భారతీయ శాస్త్రీయ, భక్తి, సినిమా పాటలు పాడారు. అతను తన ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేల పాటలను పాడాడు. అతనిని గాన గంధర్వన్ గా కూడా పిలుస్తారు. అతను అత్యంత బహుముఖ, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ గా పరిగణించబడ్డాడు.[2][3] అతను భారతీయ భాషలలో పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప అన్ని భారతీయ భాషలలో కూడా పాటలు పాడాడు. [4][5] అతను 1970, 1980 లలో అనేక మలయాళ చలనచిత్ర పాటలను కూడా కూర్చాడు. అతను ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారాలను ఎనిమిది సార్లు, దక్షిణాది పిలిం ఫేర్ పురస్కారాలను ఐదు సార్లు, ఉత్తమ నేపథ్య గాయకునిగా రాష్ట్ర పురస్కారాన్ని నలభై మూడు సార్లు అందుకున్నాడు. రాష్ట్ర పురస్కారాలను అందించే ప్రభుత్వాలలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి.[2] యేసుదాసు 1975లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002లో పద్మ భూషణ్ పురస్కారాన్ని, 2017లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్నీ అందుకున్నాడు.[6] అతను ఐదు దశాబ్దాలలో 80,000 పాటలు పాడినందుకు గాను 2011లో సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ అత్యుత్తమ సాధన పురస్కారాన్ని అందుకున్నాడు.[7] 2006లో చెన్నైలోని ఎ.వి.ఎం స్టూడియోలో ఒకే రోజు నాలుగు భారతీయ భాషలలో 16 సినిమా పాటలను పాడాడు.[8] దాదాపు 14 భాషల్లో సినిమాలు, ప్రైవేటు ఆల్బంలు, భక్తిరస గీతాలు కలుపుకుని సుమారు లక్షకుపైగా పాటలు పాడిన సింగింగ్ లెజెండ్ ఆయన. శబరిమల ఆలయంలో స్వామివారికి రోజూ పవళింపు సేవ సమయంలో ఈ మహా గాయకుడు పాడిన జోలపాటనే వినిపిస్తారు. స్వామివారి పవళింపు సేవ వేళ పాడే హరివరాసనం పాట ఎంతో గుర్తింపు పొందింది.[9]

జీవితం

[మార్చు]

కే .జె. యేసుదాసు 1940 జనవరి 10న కేరళ లోని కొచ్చిలో ఓ క్యాథలిక్ కుటుంబానికి చెందిన అగస్టీన్ జోసెఫ్, ఎలిజిబెత్ జోసెఫ్ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకుడు, రంగస్థల నటుడు. నటునిగా, భాగవతార్ గా ఆయనకు మంచి పేరుండేది. ఆయనకు మంచి ప్రతిభ ఉన్నా ఆర్థికంగా మాత్రం వెనుకబడి ఉండేవారు. యేసుదాసు తన ఐదుగురు పిల్లలలో పెద్దవాడు, అతని తరువాత ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. తండ్రి ప్రభావంతో ఏసుదాసు కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాడు. పదిహేడేళ్ళ వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచాడు. కొడుకులోని ప్రతిభను సానబెట్టడం కోసం తండ్రి అతన్ని తిరుపుణిత్తుర లోని ఆర్.ఎల్.వి. సంగీత కళాశాలలో చేర్చాడు. మొదట్లో ఒక క్రైస్తవుడు కర్ణాటక సంగీతం ఏమి నేర్చుకుంటాడని అతన్ని సహ విద్యార్థులు గేలి చేసేవారు. తర్వాత పట్టుదలగా చదివిన ఏసుదాసు ఆ కళాశాలలోనే ప్రథముడిగా నిలిచాడు. తరువాత అతను తిరువనంతపురంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులైన కె.ఆర్.కుమారస్వామి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, వేల్చూరి హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్, చెంబై వైద్యనాథ భాగవతార్ల వద్ద విద్యనభ్యసించాడు. కానీ ఆర్థిక పరిమితుల కారణంగా తన అధ్యయనాన్ని పూర్తి చేయలేకపోయాడు. అదే సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. తండ్రికి వైద్యం చేయించడం కోసం చిన్న చిన్న పనులు చేసేవాడు. కొద్ది కాలానికి ఆయన ఆసుపత్రిలోనే మరణించడంతో వీరి కుటుంబం మరింత కష్టాలపాలైంది.

వృత్తి

[మార్చు]

ప్రారంభ వృత్తి జీవితం:1960లలో

[మార్చు]

తల్లి, స్నేహితుల సలహా మేరకు సంగీతంలోనే ఆదాయం వెతుక్కోవడం కోసం చెన్నై వచ్చాడు. కాలినడకన తిరుగుతూ అవకాశాల కోసం ఎంతోమంది సంగీత దర్శకులను సంప్రదించాడు. ఆయన గొంతు సినిమా పాటలకు పనికిరాదని చాలామంది తిరస్కరించారు. కానీ ఆయన మాత్రం వేదికల మీద, కార్యక్రమాల్లో పాటలు పాడుతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. 1961 నవంబరు 14 [10]న కేరళ చిత్ర దర్శకుడు ఎ. కె. ఆంథోనీ ఆయనకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చాడు. యేసుదాసు పాటలలో మొదటి ప్రసిద్ధ పాట "జాతి భేదం మత ద్వేషం" (సంగీతం:ఎం.బి.శ్రీనివాసన్) 1961 నవంబరు 14న రికార్డు కాబడింది. అయినప్పటికీ అతని మొదటి పాట "అటెన్షన్ పెన్నె అటెన్షన్"ను మలయాళ సినిమాలో పాడాడు. అతను తన సినిమా నేపథ్యగాయకునిగా మలయాళ చిత్రం "కాలపదుకై" (1962) తో ప్రారంభించి, తమిళ, తెలుగు, కన్నడ మొదలైన చిత్రాలలో పాడాడు. [3]

తర్వాత అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. మలయాళంలోనే కాక తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి (అంతులేని కథ), చుక్కల్లే తోచావే (నిరీక్షణ), సృష్టికర్త ఒక బ్రహ్మ (అమ్మ రాజీనామా), ఆకాశ దేశాన (మేఘసందేశం) లాంటి అనేక విజయవంతమైన పాటలు పాడాడు.

కథానాయకుడు మోహన్ బాబు ఆయన సినిమాల్లో ఏసుదాసు చేత కనీసం ఒక్క పాటైనా పాడించుకునే వాడు. ఏసుదాసు పాడిన అయ్యప్ప పాటలు కూడా ఎంతో పేరు గాంచాయి. అయ్యప్ప పవళింపు కోసం ఆయన పాడిన హరివరాసనం పాట శబరిమలలో ఇప్పటికీ వినిపిస్తారు. మొదట్లో హిందూ భజనలు పాడుతున్నాడని కేరళకు చెందిన ఓ చర్చి వారు అతన్ని వెలివేసినా మళ్ళీ తమలో చేర్చుకున్నారు. ఈయన నటుడిగా కూడా నాలుగు సినిమాల్లో కనిపించాడు.

అతనికి సోవియట్ యూనియన్ లోని వివిధ నగరాలలో సంగీత కచేరీలు చేయడానికి సోవియట్ యూనియన్ ప్రభుత్వం నుండి ఆహ్వానం అందింది. అతను రష్యన్ పాటను రేడియో కజఖస్థాన్లో పాడాడు. [11]

సలిల్, యేసుదాస్, ప్రేమ్‌ నాజిర్ ల త్రయం మలయాళ సినిమా పరిశ్రమలో 1970లలో ప్రవేశించారు.

1970లో అతను కేరళ సంగీత నాటక అకాడమీకి అతి పిన్న వయస్కునిగా నామినేట్ చేయబడ్డాడు.[11]

బాలీవుడ్: 1970 లు

[మార్చు]

దక్షిణ భారత సినిమాల్లో ఒక దశాబ్దం పాడిన తరువాత, 1970 ల ప్రారంభంలో యేసుదాస్‌కు బాలీవుడ్‌లో అవకాశం లభించింది. అతను పాడిన మొదటి హిందీ పాట "జై జవాన్ జై కిసాన్" (1971) చిత్రం కోసం, అయితే మొదటి విడుదలైన సినిమా "చోటీ సి బాత్", దీని ఫలితంగా అతను "జనేమాన్ జనేమాన్" వంటి పాటలకు ప్రాచుర్యం పొందాడు. అమితాబ్ బచ్చన్, అమోల్ పాలేకర్, జీతేంద్రతో సహా హిందీ సినిమాలోని పలువురు ప్రముఖ నటుల కోసం హిందీ పాటలు పాడాడు. రవీంద్ర జైన్, బప్పిలహరి, ఖయ్యాం, రాజ్‌కమల్, సలీల్ చౌదరితో సహా అనేకమంది సంగీత దర్శకుల కోసం మంచి హిందీ పాటలను పాడాడు.

యేసుదాస్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ పాటలు రవీంద్రజైన్ సంగీతంతో 1976 చిత్రం "చిచ్చోర్"లో ఉన్నాయి.

1999 నవంబరు 14 న, పారిస్లో జరిగిన "మ్యూజిక్ ఫర్ పీస్" కార్యక్రమంలో "సంగీతం , శాంతిలో అత్యుత్తమ విజయాలు" కోసం యునెస్కో గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కొత్త సహస్రాబ్ది ఉదయానికి గుర్తుగా నిర్వహించిన కచేరీలో హాజరైన వారిలో లియోనెల్ రిచీ, రే చార్లెస్, మోంట్సెరాట్ కాబల్లే, జుబిన్ మెహతా వంటి కళాకారులు ఉన్నారు.[12]

2001 లో అతను సంస్కృత, లాటిన్, ఇంగ్లీష్ భాషలలో అహింసా ఆల్బమ్ కోసం పాటలను న్యూఏజ్, కర్ణాటక సంగీత శైలుల మిశ్రమంలో పాడాడు. [13] మధ్యప్రాచ్యంలో తన సంగీత కచేరీలలో అతను కర్ణాటక శైలిలో అరబిక్ పాటలు పాడాడు.[14] భారతీయ సంగీతాన్ని ప్రోత్సహిస్తూ విదేశాలలో తన ప్రదర్శనల ద్వారా భారతదేశానికి సాంస్కృతిక రాయబారిగా తరచూ పనిచేస్తున్నాడు.

2009 లో యేసుదాస్ 'మ్యూజిక్ ఫర్ పీస్' అనే నినాదంతో తిరువనంతపురంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సంగీత ప్రచారాన్ని ప్రారంభించాడు.[15] 'శాంతి సంగీత యాత్ర' ప్రారంభించిన సందర్భంగా హేమంత్ కర్కరే భార్య కవిత కర్కరే, యేసుదాస్‌కు టార్చ్ అందజేశారు.[16] సూర్య కృష్ణమూర్తి నిర్వహించిన 36 ఏళ్ల సూర్య సంగీత ఉత్సవంలో యేసుదాస్ 36 సార్లు ప్రదర్శన ఇచ్చాడు.[17]

2011లో అతను నేపథ్యగాయకునిగా 50 సంవత్సరాలు పూర్తి చేసాడు. దర్శకుడు సేతు ఇయాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న "పార్త విళి పార్తబడి" చిత్రంలో అతను రెండు భిన్నమైన స్వరాలతో పాట పాడాడు. అతను, తనయుడు విజయ్‌ యేసుదాసు, మనవరాలు అమేయా ముగ్గురూ కలిసి ఒక పాట పాడారు. [18]


వ్యక్తిగత జీవితం

[మార్చు]
A statue of Chembai Vaidyanatha Bhagavatar sponsored by Yesudas at Chembai gramam (Kottayi village) in Palakkad; next to Bhagavatar's house.

యేసుదాస్ పథనంథిట్ట జిల్లాలోని మలపిళ్ళైకు చెందిన ఎం.కె.అబ్రహం చిన్న కుమార్తె అయిన ప్రభను వివాహం చేసుకున్నాడు. వారి వివాహం 1970 ఫిబ్రవరి 1న కొచ్చి లోని సంతా క్రూజ్ బసిల్లికా వద్ద జరిగింది. వారికి ముగ్గురు కుమారులు. వారు వినోద్, విజయ్, విశాల్. వారి రెండవ కుమారుడు విజయ్ యేసుదాస్ కూడా సంగీతకారుడు. అతను 2007, 2013 లలో కేరళ రాష్ట్ర ఫిలిం ఫేర్ పురస్కారాన్ని ఉత్తమ నేపథ్యగాయకునిగా పొందాడు.[19] వీరు చెన్నై, కేరళలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇతనికి అమెరికాలోని ఫ్లోరిడా, ఫ్లవర్ మౌండ్ లలోనూ ఎస్టేట్‌లు ఉన్నాయి. వ్యాపార లావాదేవీలకొరకు తరచూ అమెరికా సందర్శిస్తుంటాడు.

నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని ఆయన గాఢంగా విశ్వసిస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచీ తోటి వారితో అలాగే మెలిగే వాడు. సంగీతకారులలో కూడా అతను తన స్వంత కథానాయకులను కలిగి ఉన్నాడు. మహ్మద్ రఫీ, చెంబై వైద్యనాథ భగవతార్, బాలమురళి కృష్ణ లను అతను ఎక్కువగా ఆరాధిస్తాడు. జ్ఞానం, సంగీతం, కళల దేవత అయిన సరస్వతి దేవి కీర్తనలను పాడటానికి యేసుదాస్ తన పుట్టినరోజున కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా ఆలయాన్ని సందర్శిస్తుంటాడు. 2000 లో అతని 60 వ పుట్టినరోజున సంగీత ఉత్సవం ప్రారంభమైంది. ప్రతి జనవరిలో కొల్లూరు మూకాంబికా ఆలయంలో తొమ్మిది రోజుల సంగీత ఉత్సవం ప్రారంభమవుతుంది. 2010 జనవరి 10 ఆదివారం, కొల్లూరు శ్రీ మూకాంబికా ఆలయంలో తన 70 వ పుట్టినరోజు (సప్తతి) ను 'సంగీతార్థన' (శాస్త్రీయ భక్తి పాటలు) తో పాటు, 70 మంది గాయకులతో పాటు మూకాంబికా దేవత ముందు జరుపుకున్నాడు. సంగీతార్థనలో త్యాగరాజు కవితలలో "పంచరత్న గాయన" ఉన్నాయి. విద్యారంభ కార్యక్రమంలో కూడా అతను పాల్గొన్నాడు. ఆల్ ఇండియా రేడియో ప్రత్యేక సంగీతార్థనను కేరళ అంతటా ప్రసారం చేసింది. "హరివరాసనం" అనే హిట్ సాంగ్ తో సహా అయ్యప్పకు అంకితం చేసిన అనేక పాటలు యేసుదాస్ పాడాడు. [20][21][22][23] 2002 లో, మరాద్ ఊచకోత సమయంలో, ప్రముఖ కవి సుగతకుమారితో కలిసి ఈ స్థలాన్ని సందర్శించి, హింసకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహించాడు. జి. దేవరాజన్ స్వరపరచిన భక్తి పాటల సంగీత శైలి "హరివరాసనం"ను యేసుదాస్ పాడాడు. ఈ పాటను శబరిమల వద్ద ఆలయాన్ని మూసివేయడానికి ముందు పాడుతారు. అనేకమంది ప్రఖ్యాత గాయకులు ఈ పాటను విభిన్న పద్ధతులలో పాడినప్పటికీ, శబరిమల ప్రతిరోజూ హరివారణానం కోసం యేసుదాస్ స్వరాన్ని అధికారికంగా ఉపయోగిస్తున్నారు.[2]

సంగీత సంస్థ

[మార్చు]

1980 లో యేసుదాస్ త్రివేండ్రం వద్ద తరంగణి స్టూడియోను స్థాపించాడు. 1992 లో కార్యాలయం, స్టూడియోను తమిళనాడు రాజధాని చెన్నెకు తరలించాడు. ఈ సంస్థ 1998 లో యుఎస్‌లో విలీనం చేయబడింది. తరంగణీ స్టూడియో, తరంగణి రికార్డ్స్ కేరళలో రికార్డింగ్ కేంద్రంగా మారాయి. ఇది మొదటిసారిగా మలయాళ చలనచిత్ర పాటల ఆడియో స్టీరియోలో క్యాసెట్లను తెచ్చింది. చెన్నైలోని స్టూడియో 27 లో రికార్డ్ కంపెనీకి వాయిస్ మిక్సింగ్ స్టూడియో కూడా ఉంది. స్టూడియో ప్రపంచవ్యాప్తంగా యేసుదాసు చలనచిత్ర, భారతీయ శాస్త్రీయ సంగీత కచేరీలను ప్రదర్శిస్తుంది.[24]

వివాదాలు

[మార్చు]
  • గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలు జీన్స్ ధరించడం మన సంస్కృతి కాదని అన్నాడు. యేసుదాసు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి.[25]
  • "హరివరాసనం విశ్వమోహనం" పాటను మార్చేస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అంటున్నది. పాట మూలప్రతిలో ఉన్న కొన్ని పదాలు.. ముఖ్యంగా ప్రతి పాదంలో ఉండాల్సిన స్వామి అనే పదం జేసుదాసు పాడిన రికార్డులో లేవని బోర్డు నూతన అధ్యక్షుడు టీ పద్మకుమార్ తెలిపారు. హరివరాసనం అనే పదాన్ని జేసుదాసు సరిగా ఉచ్చరించలేదని చెప్పారు. కాబట్టి విస్మరించిన పదాలను చేర్చి అదే పాటను మళ్లీ జేసుదాసుతోనే పాడించి కొత్తగా రికార్డు చేయిస్తామని ఆయన ఇటీవల పేర్కొన్నారు.[26]

పురస్కారాలు, బిరుదులు

[మార్చు]
  • పద్మవిభూషణ్ :2017
  • పద్మభూషణ్  : 2002.
  • పద్మశ్రీ  : 1973.
  • అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు, 1989
  • కేరళ ప్రభుత్వ ఆస్థాన గాయకుడు
  • సంగీత నాటక అకాడమీ అవార్డు in 1992.
  • ఆస్థాన విద్వాన్ ఉడుపి, శృంగేరి,, రాఘవేంద్ర మఠాలు.
  • సంగీత సాగరము 1989.
  • సంగీత చక్రవర్తి 1988 పల్లవి నరసింహాచారి.
  • సంగీత రాజా 1974.
  • సంగీత రత్న పాండిచ్చేరి గవర్నర్ ఎం. ఎం. లఖేరా
  • స్వాతి రత్నము
  • సప్తగిరి సంగీత విద్వన్మణి (2002)
  • భక్తి సంగీత శిరోమణి (2002)
  • గాన గంధర్వ.
  • గీతాంజలి పురస్కారం నీలం సంజీవరెడ్డి చేతులమీదుగా.
  • కలైమామణి పురస్కారం తమిళనాడు రాష్ట్రప్రభుత్వం.
  • నేషనల్ సిటిజెన్ అవార్డు 1994.
  • కేరళ రత్న 2008 లో జైహింద్ టివి నుంచి
  • 2000 లో డాక్టర్ పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం.
  • యునెస్కో వారి నుంచి అవుట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ మ్యూజిక్ అండ్ పీస్ పురస్కారం 1999.
  • భారత ప్రభుత్వం నుంచి ఏడు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడి పురస్కారం
  • కేరళ ప్రభుత్వం తరపున 24 సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం
  • కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆరు సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం
  • పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ గాయకుడి పురస్కారం
  • 2012లో సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

ఏసుదాసు ఏడు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. ఇది ఇప్పటికీ ఓ రికార్డు.

సం చిత్రం భాష పాట
1972 అచనుమ్ బప్పయుమ్ మలయాళం మనుష్యన్ మాతంగలే
1973 గాయత్రి మలయాళం పద్మతీర్థమూ ఒనరు
1976 చిత్‌చోర్ హిందీ "గోరి తెరా గాఁవ్ బడా ప్యారా మైఁతో గయా మారా ఆకే యహాఁ రే"
1982 మేఘసందేశం తెలుగు "ఆకాశ దేశానా ఆషాఢ మాసానా మెరిసేటి ఓ మేఘమా"
1987 ఉన్నికలే ఒరు కథా పరయం మలయాళం ఉన్నికలే ఒరు కథా పరయం
1991 భారతం మలయాళం రామ కథా గాన లయం
1993 సోపానం మలయాళం సోపానం
సం చిత్రం పాట
2006 గంగ "వెళ్ళిపోతున్నావా"
1990 అల్లుడుగారు (సినిమా) "ముద్దబంతి నవ్వులో"
1988 జీవన జ్యోతి
1982 మేఘసందేశం "సిగలో"

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "ఆయన పాట 'స్వరరాగ గంగా ప్రవాహం'". eenadu.net. ఈనాడు. Archived from the original on 10 జనవరి 2017. Retrieved 10 జనవరి 2017.
  2. 2.0 2.1 2.2 "Music legend Yesudas turns 70". The Hindu. Chennai, India. 10 January 2010. Retrieved 8 January 2011.
  3. 3.0 3.1 "'I don't sing trendy music'". Rediff. Retrieved 2009-09-06.
  4. "Those magical moments..." Chennai, India: The Hindu. 3 September 2002. Archived from the original on 2010-01-15. Retrieved 2009-08-19.
  5. "Life devoted to music". The Hindu. 1 February 2001. Archived from the original on 29 అక్టోబరు 2009. Retrieved 2009-08-19.
  6. "Padma Bhushan Awardees – Padma Awards – My India, My Pride". India.gov.in. Retrieved 2011-09-09.
  7. "Yesudas receives CNN-IBN 'Indian of the Year' award". 17 December 2011. Retrieved 2016-09-01.
  8. "One for the records". Chennai, India: The Hindu. 1 December 2006. Archived from the original on 2010-04-18. Retrieved 2010-05-01.
  9. "Yesudas Birthday: ఆయన గాత్రం.. స్వరరాగ గంగా ప్రవాహం!". Samayam Telugu. 2019-01-09. Retrieved 2019-10-02.
  10. Telugu, TV9 (2021-11-15). "Yesudas: ఆయనది అయిదు పుష్కరాల స్వరం.. అయినా తరగని మాధుర్యం.. జేసుదాసు తొలి పాటకు ఆరవై ఏళ్లు". TV9 Telugu. Retrieved 2021-11-18.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  11. 11.0 11.1 "CDR K J YESUDAS THE INDIAN PLAYBACK SINGING LEGEND'S RAGS TO RICHES". stateofkerala.in. Archived from the original on 5 December 2011.
  12. "KJ Yesudas completes 50 glorious years as singer". Asianet india. Archived from the original on 24 January 2012.
  13. "Ahimsa Album". Hinduonnet.com. 19 ఫిబ్రవరి 2001. Archived from the original on 10 డిసెంబరు 2006. Retrieved 9 సెప్టెంబరు 2011.
  14. Vineet Pillai (15 November 2003). "Exclusive – Interview with Yesudas on 15th November 2003". Indien-netzwerk.de. Archived from the original on 31 మే 2010. Retrieved 1 అక్టోబరు 2019.
  15. "Yesudas' Musical Campaign for peace". oneindia.com. 13 January 2009. Archived from the original on 17 జనవరి 2021. Retrieved 1 అక్టోబరు 2019.
  16. "Tributes paid to Hemant Karkare". Chennai, India: The Hindu. 12 January 2009. Archived from the original on 2012-11-03. Retrieved 2010-05-01.
  17. "Gaanagandharvan graces the Soorya festival for the 36th time". thiraseela.com. Archived from the original on 2017-06-30.
  18. "మనవరాలితో యేసుదాసు గానం". www.andhrajyothy.com. 2018-12-13. Retrieved 2019-10-02.[permanent dead link]
  19. Ajay Gosh. "Dr. KJ Yesudas: Singer With A Golden Voice". Archived from the original on 22 ఫిబ్రవరి 2014. Retrieved 1 అక్టోబరు 2019.
  20. "Gandharva of songs : K.J Yesudas celebrates 70th birthday". Non Resident Kerala Associations. Archived from the original on 27 డిసెంబరు 2018. Retrieved 1 మే 2010.
  21. "Yesudas celebrated Birthday at Kollur". Oneindia Entertainment. 19 January 2009. Archived from the original on 11 July 2012. Retrieved 2010-05-01.
  22. "Yesudas celebrates 70th birthday in Kollur". The New Indian Express. 11 January 2010. Archived from the original on 2014-03-07. Retrieved 2010-05-01.
  23. PTI (10 January 2012). "Music legend Yesudas turns 72". Chennai, India: The Hindu. Retrieved 2010-05-01.
  24. "Dr. K. J. Yesudas". keralatourism.org. Archived from the original on 1 జూన్ 2010. Retrieved 18 March 2010.
  25. Pratap (2014-10-04). "వస్త్రధారణపై యేసుదాసు వ్యాఖ్య: మండిపడ్డ మహిళలు". telugu.oneindia.com. Retrieved 2019-10-02.
  26. "జేసుదాసు పాడిన అయ్యప్ప పాటపై వివాదం!". www.ntnews.com. Archived from the original on 2019-10-02. Retrieved 2019-10-02.

బయటి లింకులు

[మార్చు]