రచ్చ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రచ్చ
దర్శకత్వంసంపత్ నంది
రచనపరుచూరి సోదరులు
నిర్మాతఆర్. బి. చౌదరి
తారాగణంరాంచరణ్ తేజ
తమన్నా
ముఖేశ్ రిషి
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుగౌతంరాజు
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
మెగా సూపర్ గుడ్ ఫిలింస్
విడుదల తేదీ
2012 ఏప్రిల్ 5 (2012-04-05)
సినిమా నిడివి
144 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్30 crore (US$3.8 million)[1]
బాక్సాఫీసు45 crore (US$5.6 million)[2]

రచ్చ 2012 లో విడుదలైన తెలుగు చిత్రం. మెగా సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై ఆర్. బి. చౌదరి ఈ సినిమాని నిర్మించారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాంచరణ్ తేజ మరియూ తమన్నా కథానాయక-నాయికలుగా నటించగా మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా 2012 ఏప్రిల్ 5న విడుదలైంది. తమిళ్ మరియూ మలయాళంలో అనువదించబడిన ఈ సినిమా మూడు భాషల్లో అనూహ్యవిజయాన్ని సాధించింది.

కథ[మార్చు]

బెట్టింగ్ రాజ్ (రాంచరణ్ తేజ) హైదరాబాదులో ఒక బస్తిలో ఉండే ఒక యువకుడు. బెట్టింగుల్లో గెలిచి తనని పెంచిన పెంపుడు తల్లిదండ్రులతో కలిసి ఒక సాధారణ జీవితం గడుపుతుంటాడు. తన పెంపుడు తండ్రి (ఎం. ఎస్. నారాయణ) తాగుబోతు అవడంచేత ఒక ప్రమాదకరమైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుంటాడు. నెలలోపు చికిత్స చేసి 20 లక్షల రూపాయలను రుసుముగా చెల్లించాలి. ఆ డబ్బును ఎలా సంపాదించాలని రాజు ఆలోచిస్తుండగా జేమ్స్ (అజ్మల్) అనే కుర్రాడు తనకు సహాయం చేస్తానంటాడు. బెట్ నియమం ప్రకారం ప్రమాదకరమైన డాన్ బళ్ళారి (ముఖేష్ రిషి) కూతురైన చైత్ర (తమన్నా)ను డిసెంబరు 31లోపు ప్రేమలో పడేయాలి. అలా చెయ్యగలిగితే జేమ్స్ రాజుకు 20 లక్షలు ఇస్తాడు. ఈ ఛాలెంజిని రాజు స్వీకరిస్తాడు.

చైత్రను ప్రేమలో పడేయడానికి రాజు చాలా కష్టపడతాడు. తను పెట్టిన షరతులన్నిటినీ నెగ్గి చివరికి తన ప్రేమను పొందుతాడు. కాని దురదృష్టవశాత్తూ వీళ్ళ ప్రేమవ్యవహారం గురించి బళ్ళారి తెలుసుకుంటాడు. డిసెంబరు 31 రాత్రి బళ్ళారి తన మనుషులని రాజును చంపమని పంపుతాడు. వారందిరినీ ఎదుర్కుని చైత్రతో కలిసి శ్రీశైలం పారిపోతాడు. తన స్నేహితుడు బైర్రెడ్డన్న (కోట శ్రీనివాసరావు), బైర్రెడ్డన్న కొడుకు (దేవ్ గిల్)తో కలిసి బళ్ళారి వారిని వెతకడం మొదలుపెడతాడు. అడవుల్లో బళ్ళారి మనుషుల నుంచి తప్పించుకు పారిపోతున్న రాజు, చైత్రలను జేమ్స్ కాపాడి ఒక చోటికి తీసుకెళ్తాడు. అక్కడ అనుకోకుండా బైర్రెడ్డన్న కొడుకు జేమ్స్ మరియూ రాజులను గాయపరిచి చైత్రను తీసుకుని వెళ్ళిపోతాడు. రాజుకి జేమ్స్ అసలు నిజం చెప్పడం మొదలుపెడతాడు.

రాయదుర్గానికి చెందిన సూర్యనారాయణ (ఆర్. పార్థిబన్) ఆ ఊరిలో అందరిచే అభిమానించబడే పెద్దమనిషి. అతని కొడుకే రాజు. తన స్నేహితుడైన రామ్మూర్తి (నాజర్) కూతురే చైత్ర. అప్పటికే రామ్మూర్తి ఆస్తిపై కన్నేసిన తన బావమరిది బళ్ళారి రాజు, చైత్రల కుటుంబాలని చంపించి చైత్రని దత్తత తీసుకుంటాడు. అప్పుడు చిన్నవాడైన రాజు ఆ ప్రమాద స్థలం నుంచి పారిపోతాడు. చైత్ర మేజరయ్యాక తనని చంపి ఆస్తిని కాజేయాలని బళ్ళారి కుట్రపన్నుతాడు. బళ్ళారి గురించి పూర్తిగా తెలిసిన చైత్ర తన మిత్రుడైన జేమ్స్ ద్వారా బెట్టింగ్ రాజు గురించి తెలుసుకుని ఒక పక్కా ప్రణాళిక ద్వారా రాజుని ఈ ఆటలోకి లాగుతారు.

జేమ్స్ ఆసుపత్రిలో జేరాక రాజు చైత్ర రాయదుర్గంలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని తెలుసుకున్న రాజు అక్కడికి చేరుకుంటాడు. అప్పటికే తమ కుటుంబాల చావులకి పగతో రగులుతున్న రాజుకి చైత్ర చేతిని గాయపరిచి చంపే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి మరింత ఆగ్రహానికి లోనవుతాడు. బళ్ళారి, బైర్రెడ్డన్న, బైర్రెడ్డన్న కొడుకులను చంపి చైత్రను కాపాడిన రాజు తనని పెళ్ళి చేసుకుని తమ తల్లిదండ్రుల ఆశయాల ప్రకారం రామ్మూర్తి ఆస్తిని రాయదుర్గం ప్రజలకు పంచేస్తారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. రాంచరణ్ తేజతో ఇది ఆయన రెండో సినిమా. వేలాది అభిమానుల మధ్య ఈ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. 2012 మార్చి 11న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవి, రాంచరణ్ తేజ, తమన్నా, అల్లు అరవింద్, నాగేంద్రబాబు, రాజమౌళి, వినాయక్, వంశీ పైడిపల్లి తదితరులు వచ్చారు.[3]

ఈ సినిమాలో చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ సినిమాలోని వానా వానా వెల్లువాయే పాటని రీమిక్స్ చేసారు. ఆ పాటతో పాటు మిగిలిన పాటలకు కూడా ప్రేక్షకులనుంచి మంచి ఆదరణ లభించింది.

వానా వానా వెల్లువాయే పాటలో రాంచరణ్ తేజ మరియూ తమన్నా
పాట గానం రచన
రచ్చ దీపు, రేవంత్, పృధ్వి చంద్రబోస్
వానా వానా వెల్లువాయే రాహుల్ నంబియర్, చైత్ర భువనచంద్ర
ఢిల్లకు ఢిల్లకు టిప్పు, గీతా మాధురి చిన్ని చరణ్
ఒక పాదం హేమచంద్ర, మాళవిక చంద్రబోస్
సింగరేణి ఉంది సుఖ్విందర్ సింగ్, రాహుల్ సిప్లిగంజ్, సాహితి సుద్దాల అశోక్ తేజ

విమర్శకుల స్పందన[మార్చు]

123తెలుగు.కామ్ వారు తమ సమీక్షలో "రచ్చ పూర్తి మాస్ జనం ని లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ చిత్రం ఆ విషయంలో పూర్తి న్యాయం చేసింది. కమ్మర్షియల్ అంశాలు నిండుగా ఉన్న ఈ చిత్రం బి, సి కేంద్రాలలో భారీ విజయం సాదిస్తుంది. తమన్నా, రామ్ చరణ్ తేజ్ లు వారి నటనతో ఆకట్టుకున్నారు" అని వ్యాఖ్యానించారు.[4] వన్ ఇండియా వారు తమ సమీక్షలో "ఏదైమైనా మొదటి నుంచి ఈ చిత్రం రూపకర్తలు తమ టార్గెట్ మాస్ ఆడియన్స్, ఫ్యాన్స్ అని స్పష్టంగా చెప్తున్నారు. వారి అంచనాలకు తగినట్లే తయారైన ఈ చిత్రం వారిని రీచ్ అయ్యే అవకాశం ఉంది. పాటలు, పోరాటాలు మిగతా జనాలకి కూడా పడితే సినిమా ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉంది" అని వ్యాఖ్యానించారు.[5] నమస్తే అమెరికా వారు తమ సమీక్షలో "రచ్చ ఓ తెలుగు సినిమా. ఒక సారి చూస్తే తప్పులేదు. కానీ, సినిమా చూశాక ఏ ఉద్వేగాలూ ఉండవు. ఓ రెండున్నర గంటల టైంపాస్ అంతే" అని వ్యాఖ్యానించారు.[6]

బాక్సాఫీస్ ఫలితం[మార్చు]

ఈ చిత్రం 700 మిలియన్ రూపాయల వసూళ్ళు సాధించి అందరినీ అబ్బురపరిచింది. ఈ చిత్రం 850 మిలియన్ రూపాయల గ్రాస్ మరియూ విదేశాల్లో 600 మిలియన్ రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. రచ్చ తమిళ్ అనువాద వర్షన్ 149 మిలియన్ రూపాయలు మరియూ మలయాళం వర్షన్ 10 మిలియన్ రూపాయలు వసూలు చేసాయి. 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 140 మిలియన్ రూపాయలు మరియూ ప్రపంచవ్యాప్తంగా 190 మిలియన్ రూపాయలు గ్రాస్ వసూలు చేసింది.[7] ఈ సినిమా 2012 మే 24న 127 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.[8] ఆపై 2012 జూలై 13న 38 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.[9]

మూలాలు[మార్చు]

  1. "Rachcha Movie Budget". muvi.com. Archived from the original on 2012-08-22. Retrieved July 14, 2012.
  2. "Racha collects over 45 crores in 50 days". The Times of India. Archived from the original on 2013-10-04. Retrieved May 23, 2012.
  3. "ఘనంగా రచ్చ ఆడియో విడుదల". నమస్తే అమెరికా. Archived from the original on 2012-05-23. Retrieved మార్చి 11, 2012.
  4. "సమీక్ష: "రచ్చ" – మాస్ మసాలా ఎంటర్ టైనర్". 123తెలుగు.కామ్. Retrieved ఏప్రిల్ 5, 2012.
  5. "వన్ మ్యాన్ షో ('రచ్చ' రివ్యూ)". వన్ ఇండియా. Retrieved ఏప్రిల్ 5, 2012.
  6. "రచ్చ రివ్యూ". నమస్తే అమెరికా. Archived from the original on 2013-06-12. Retrieved ఏప్రిల్ 5, 2012.
  7. "Ram Charan's Racha crosses 45 crore mark". The Times of India. Archived from the original on 2013-08-31. Retrieved 4 May 2012.
  8. "Ram Charan's Racha completes 50 days in 127 centers". The Times of India. Archived from the original on 2013-10-04. Retrieved 23 May 2012.
  9. "38 కేంద్రాల్లో 100 రచ్చ". సూర్య దినపత్రిక. Retrieved జూలై 13, 2012.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=రచ్చ&oldid=3865187" నుండి వెలికితీశారు