మనం
మనం (2014 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విక్రమ్ కుమార్ |
---|---|
నిర్మాణం | అక్కినేని నాగార్జున |
కథ | విక్రమ్ కుమార్ |
చిత్రానువాదం | విక్రమ్ కుమార్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, శ్రియా, సమంత |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నృత్యాలు | బృంద |
గీతరచన | చంద్రబోస్, వనమాలి |
సంభాషణలు | హర్షవర్ధన్ |
ఛాయాగ్రహణం | పి. ఎస్. వినోద్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ స్టూడియోస్ |
పంపిణీ | షణ్ముఖ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తన సొంత పతాకమైన అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన మల్టీస్టారర్ సినిమా మనం. అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన ఈ అరుదైన చిత్రంలో శ్రియా, సమంత కథానాయికలుగా నటించారు.[1] గతంలో నితిన్, నిత్యా మీనన్ కలిసి నటించిన ఇష్క్ సినిమా ద్వారా గుర్తింపు సాధించిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకి కథ, చిత్రానువాదం, దర్శకత్వాన్ని అందించగా అమృతం ధారావాహికలో ముఖ్యపాత్ర పోషించిన హాస్యనటుడు హర్షవర్ధన్ సంభాషణలు రచించారు.[2] అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా పి. ఎస్. వినోద్, ప్రవీణ్ పూడి ఛాయాగ్రహణం, కూర్పులను సమకూర్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఆఫీసులో 2013 జూన్ 3న అధికారికంగా ఈ సినిమాని లాంచ్ చేసారు.[3] ఈ సినిమా చిత్రీకరణ 2013 జూలై 7న హైదరాబాదులోని నారాయణగూడ ప్రాంతంలో మొదలయ్యింది.
కథ
[మార్చు]రాధామోహన్ (అక్కినేని నాగ చైతన్య) - కృష్ణవేణి (సమంత)లది పెద్దలు కుదిర్చిన వివాహం. మొదట్లో చాలా అన్యోన్యంగా గడిచిన వీళ్ళ దాంపత్య జీవితంలో కొన్ని మనస్పర్థలు మొదలవుతాయి. రాధకి కృష్ణపై ఎంత ప్రేమ ఉన్నా అది ఆమెకి అర్థమయ్యేలా చెప్పలేకపోతాడు. ఇంతలో వీళ్ళకు ఓ కొడుకు పుడతాడు. వాడిని వీళ్ళిద్దరూ బిట్టు అని పిలుస్తారు. కొన్నేళ్ళ తర్వాత ఒక రెస్టారంట్ దగ్గర రాధ స్నేహితురాలు (నటుడు) నీ భార్యపై ఉన్న ప్రేమను తెలియజేసినప్పుడే ఈ గొడవలు ఆగుతాయి అని చెప్తుంది. ఆ సమయంలో బిట్టుని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తున్న కృష్ణ వీళ్ళిద్దరిని చూసి రాధ తనను మోసం చేసాడని అపార్థం చేసుకుంటుంది. గొడవలు తారాస్థాయికి చేరి బిట్టు 8వ పుట్టినరోజైన 1983 ఫిబ్రవరి 13న వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలనుకుంటారు. రాధకి ఇది ఇష్టం లేదు. మరుసటి రోజు లాయర్ దగ్గరికి బయలుదేరినప్పుడు రాధ, కృష్ణ ఒక ప్రమాదంలో చనిపోతారు. తద్వారా నిన్ను ప్రేమిస్తున్నానని కృష్ణతో చెప్పాలనుకున్న రాధ కోరిక నెరవేరలేదు. పెద్దయ్యాక బిట్టు నాగేశ్వరరావు (అక్కినేని నాగార్జున) అనే ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. డబ్బు, హోదా, పలుకుబడి అన్నీ ఉన్న నాగేశ్వరరావుకు తన తల్లిదండ్రులు తనతో లేరన్న బాధ వెంటాడుతూ ఉంటుంది. కోటీశ్వరుడైన నాగేశ్వరరావు రాధాకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధిపతి. రాష్ట్రపతి నుంచి ఆ ఏడాదికి ఉత్తమ వ్యాపారవేత్త పురస్కారాన్ని అందుకున్న నాగేశ్వరరావు ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వెళ్ళే ఫ్లైట్ ఎక్కుతాడు. అప్పుడు తన తోటిప్రయాణికుడు నాగార్జున తన తండ్రి రాధలా ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు నాగేశ్వరరావు. తండ్రి కనిపిస్తే తల్లి కూడా ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటుందని వెతకడం మొదలుపెట్టిన నాగేశ్వరరావు తన తల్లిలాగే ఉన్న ప్రియను ఒక పుస్తకాల షాపులో చూస్తాడు.
వీళ్ళిదరికీ ఒక స్నేహితుడిగా ఒకరికి తెలియకుండా ఒకరికి పరిచయమైన నాగేశ్వరరావు వాళ్ళ చేత బిట్టు అని పిలిపించుకుంటూ, వాళ్ళతో సమయం గడుపుతూ వాళ్ళ స్నేహాన్ని గెలుచుకుంటాడు. సరిగ్గా వీళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలని నాగేశ్వరరావు ఆలోచిస్తుంటే నాగార్జున తను ప్రేమ అనే అమ్మాయిని తీసుకొచ్చి మేము ప్రేమించుకున్నాం, పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నామని ప్రేమను నాగేశ్వరరావుకి పరిచయం చేస్తాడు. తనకు బాగా నమ్మకస్తుడైన సలహాదారుడు గిరీష్ (బ్రహ్మానందం) చేత నాగార్జున ప్రేమని, ప్రేమ నాగార్జునని అసహ్యించుకునేలా చేస్తాడు. అయితే నాగార్జున ఇక ఈ జన్మలో నేను పెళ్ళిచేసుకోనని భీష్మించుకు కూర్చుంటాడు. ఇలా ఉండగా ఒక రోజు ఏ క్లాక్ టవర్ దగ్గరైతే రాధ, కృష్ణ చనిపోయారో; అక్కడే అంజలి (శ్రియా) అనే డాక్టర్ నాగేశ్వరరావు కారు ఎక్కుతుంది. ప్రమాదానికి గురైన ఒక పెద్దాయనని కాపాడేందుకు వీళ్ళిద్దరూ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ అంజలిని చూసి ప్రేమలో పడ్డ నాగేశ్వరరావు ఆమె అడగగానే ప్రమాదంలో గురై వీళ్ళచే కాపాడబడిన 89 ఏళ్ళ చైతన్య (అక్కినేని నాగేశ్వరరావు)కు రక్తదానం చేస్తాడు. చైతన్య కళ్ళు తెరిచి చూడగానే అంజలి, నాగేశ్వరరావులు 1920లలో చనిపోయిన తన తల్లిదండ్రులు రామలక్ష్మి, సీతారాముడులా ఉండడం చూసి ఆనందంతో మురిసిపోతాడు.
ఆసుపత్రిలో తన గతాన్ని గుర్తుతెచ్చుకుంటాడు చైతన్య. బారిష్టర్ చదివిన సీతారాముడు తన తండ్రి చనిపోయాక తన స్వగ్రామానికి తిరిగొచ్చి కొత్త జమీందారుగా బాధ్యతలు తీసుకుంటాడు. అతనికి కార్లంటే పిచ్చి. ఒక కారు ఫొటోని చూసినప్పుడు రామలక్ష్మిని, ఆమె బామ్మని చూసి పెళ్ళి సంబంధం మాట్లాడుకు రమ్మని తన ఇంటికి వచ్చిన మధ్యవర్తితో చెప్తాడు. రామ 6 నెలల గడువు అడుగుతుంది. విషయం తెలుసుకోవాలనుకున్న సీత కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల రామకి పని చేసుకుని బ్రతకాలనుకునే ఒక దొంగలా పరిచయమవుతాడు. అప్పుడు రామ తను ఇప్పటివరకూ చూడని జమీందారును ప్రేమిస్తున్నానని అంటుంది. ఆ ఊరి సంప్రదాయం ప్రకారం పెళ్ళికూతురు కుటుంబం పెళ్ళికొడుక్కి బట్టలు పెట్టాలి. కటిక దరిద్రంలో ఉన్న రామ ఆ బట్టలు కొనేందుకు డబ్బు సంపాదించడానికి 6 నెలల గడువడిగింది. అప్పటివరకూ సీతకి రామ అంటే ఇష్టం, కానీ ఇది తెలుసుకున్న తర్వాత సీతకి రామ ప్రాణం. సీత రామ దగ్గరికి వెళ్ళి నేను నీకు సాయం చేస్తే ఈ పని 3 నెలల్లో పూర్తైపోతుందంటాడు. జీతం కింద మీరు తినేదే తనకీ పెట్టమంటాడు. 3 నెలల్లో పంట చేతికొస్తుంది. అది అమ్మి ఆ డబ్బులతో రామ బట్టలు కొంటుంది. పెళ్ళిలో తను చేసుకోబోయే జమీందారు సీతారాముడు తనకి పరిచయమైన సీత అని తెలుసుకున్న రామ ఆనందానికి అవధులుండవు. ఇద్దరి అన్యోన్య దాంపత్య జీవితంలో కొన్నాళ్ళకు చైతన్య పుడతాడు. చైతన్యకి దాదాపు 9 ఏళ్ళ వయసున్నప్పుడు ఒక ప్రమాదంలో సీత, రామ చనిపోతారు. జీవితాంతం వాళ్ళ చావుకు కారణమయ్యానన్న పశ్చాత్తాపంతో చైతన్య కుమిలిపోతుంటాడు. మళ్ళీ వాళ్ళిద్దరినీ 80 ఏళ్ళ తర్వాత ఇలా కలుసుకున్న చైతన్య వాళ్ళిద్దరినీ ఎలాగైనా ఒకటి చెయ్యాలనుకుంటాడు. వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. చెకప్ కోసం ప్రతిరోజు తన ఇంటికి అంజలి వస్తుందని చైతన్యని తన ఇంటికి తీసుకెళ్తాడు నాగేశ్వరరావు.
ఈ సమయంలో ప్రేమలో విఫలమైన నాగార్జున కొన్ని అనుకోని కారణాల వల్ల నాగేశ్వరరావు ఇంటికొస్తాడు. ఆ రాత్రి కొన్ని అనుకోని సంఘటనల వల్ల ప్రియ తన గతజన్మని గుర్తుతెచ్చుకుంటుంది. నాగేశ్వరరావు ఇంటికెళ్ళి అతన్ని చూసి బిట్టు అని తెలుసుకుని మురిసిపోయినా పక్కనే ఉన్న నాగార్జునని చూసి అసహ్యించుకుని వెళ్ళిపోతుంది. నాగార్జున, ప్రియ ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకోడానికి, వాళ్ళ మధ్య ప్రేమ చిగురించడానికి ఇద్దరినీ సాల్సా డాన్స్ క్లాసులకు ఒకరికి తెలియకుండా ఒకరిని పంపుతాడు. అక్కడి డాన్స్ మాస్టర్ లియోనార్డో (ఆలీ) నాగేశ్వరరావు చెప్పినట్టే నాగార్జున, ప్రియలను ఒక జంటగా ఎంచుకుని డాన్స్ నేర్పుతుంటాడు. నాగార్జున ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా ప్రియ అతన్ని దూరం పెడుతూ చివరికి డాన్స్ క్లాసులకు రావడం మానేస్తుంది. మరోపక్క నాగేశ్వరరావు, అంజలి మధ్య చిగురిస్తున్న ప్రేమను చూసిన చైతన్య ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి గతం గుర్తుతేకూడదని నిర్ణయించుకుంటాడు. గతం గుర్తొస్తే తను మన కొడుకని సంతోషిస్తూనే, ఆయువు ఎక్కువ లేదని బాధపడతారనేది చైతన్య వాదన. నాగేశ్వరరావు పుట్టినరోజున ఎప్పుడూ లేనట్టు వేడుకలు జరుపుకుంటాడు. ఆ పార్టీకి ముఖ్య అతిథులుగా అంజలిని, ప్రియని చీర కట్టుకుని రమ్మంటాడు. తనకి ఇష్టమైన పాత మోడల్ కారు బహుమతిగా ఇచ్చి చైతన్య నాగేశ్వరరావు ఆనందానికి కారణమవుతాడు.
పార్టీకొచ్చిన అంజలి నాగేశ్వరరావుకి లాల్చీ, పంచె బహుమతిగా ఇచ్చాక నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని అంటుంది. ఆనందంలో ఒకరినొకరు హత్తుకొని గతజన్మలో వాళ్ళ పెళ్ళిరోజు కింద పడ్డ విధంగా ఇప్పుడు కూడా కిందపడతారు. ఇది చూసిన చైతన్య తన లక్ష్యం నెరవేరిందని ఆనందంతో చెమ్మగిల్ల్లిన కళ్ళతో ఈ దృశ్యాన్ని చూస్తాడు. మరోపక్క ప్రియ వస్తున్న కారుని భవంతికి మరోవైపుకి తీసుకెళ్తారు. సార్ ఆ గదిలో ఉన్నారని ఆమెని అక్కడికి పంపుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాధామోహన్ వేషంలో ఉన్న నాగార్జునని చూసి ప్రియ నివ్వెరబోతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కృష్ణ అని నాగార్జున అనడం ప్రియకి మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పుడు నాగార్జున నువ్వు నన్ను చూసి అసహ్యించుకుని వెళ్ళిపోయిన ఆ రాత్రే నాకు కూడా గతం గుర్తుకొచ్చింది అంటాడు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో, నేను నిన్ను ఎంతగా బాధపెట్టానో గుర్తొచ్చిందంటాడు. నీ విలువ అప్పుడు నాకు తెలియకపోయినా నేను నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యలేదంటాడు. "నువ్వు నన్ను ప్రేమించక్కర్లేదు కృష్ణ. నన్ను తిట్టు, కొట్టు, గొడవపడు కానీ నన్ను దూరం చెయ్యమాకు. మళ్ళి పుడతానో లేదో అన్న భయంతో అడుగుతున్నాను. కాని నువ్వు లేకపోతే చావాలనిపిస్తోంది" అని చెప్పిన తర్వాత నాగార్జున తన పెట్టుడు మీసం తీసెయ్యబోతుంటే ప్రియ ఆపి ముద్దు పెట్టుకుని హత్తుకుంటుంది. వీళ్ళిద్దరూ కలిసిపోయారన్న ఆనందంలో ఆనందబాష్పాలు రాలుస్తూ బయట నుంచుని నాగేశ్వరరావు చూస్తుంటాడు.
మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 14 ఆ రెండు జంటలు తమ గతజన్మల్లో చనిపోయిన రోజు. రెండు సంఘటనలు ఒక క్లాక్ టవర్ దగ్గర ఉదయం 10:20కి జరుగుతాయి. ఆ రోజు తమ ఇళ్ళలో తల్లిదండ్రులు వెళ్ళిపోయాక జరిగిన కొన్ని అసాధారణ సంఘటనలు అనగా దీపాలు ఒక్కసారిగా ఆరిపోవడం, చేపలు చచ్చిపోవడం మొదలైనవి. రాధ, కృష్ణ ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగడం చూసి భయపడుతున్న నాగేశ్వరరావుకు నాగార్జున, ప్రియ బయటికి వెళ్ళిన కారుకి బ్రేకులు లేవని తెలుసుకుని అంజలితో కలిసి వేరే కారులో వాళ్ళని కాపాడేందుకు బయలుదేరతాడు. జ్వరంతో బాధపడుతున్న చైతన్యకి సీత, రామ బయటికెళ్ళి చనిపోయే ముందు జరిగిన వింత సంఘటనలు ఇప్పుడు కూడా జరగడం చూసి భయపడిన చైతన్య ఒక బైక్ డ్రైవరుని లిఫ్ట్ అడిగి ఆ రెండు కార్లని వెంబడిస్తాడు. నాగార్జున, ప్రియలను నాగేశ్వరరావు కాపాడగా ఆ నలుగురిని అదుపు తప్పిన లారీ నుండి క్లాక్ టవర్ దగ్గర 10:20 కి బైక్ డ్రైవర్, చైతన్య కాపాడుతారు. తనని తాను అఖిల్ (అక్కినేని అఖిల్) అని పరిచయం చేసుకున్న ఆ బైక్ డ్రైవర్ చైతన్య ధైర్యాన్ని ప్రశంసిస్తాడు.
తారాగణం
[మార్చు]నటవర్గం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు
- అక్కినేని నాగార్జున
- అక్కినేని నాగ చైతన్య
- సమంత
- శ్రియా
- బ్రహ్మానందం
- తనికెళ్ళ భరణి
- ఆలీ
- ఎం. ఎస్. నారాయణ
- జయప్రకాశ్ రెడ్డి
- పోసాని కృష్ణ మురళి
- నాగినీడు
- శరణ్య
- రాశి ఖన్నా
- రవిబాబు
- వెన్నెల కిషోర్
- కౌషల్ శర్మ
- శ్రీకర్ సి.
- కృష్ణ యాదవ్
సాంకేతికవర్గం
[మార్చు]- సంభాషణలు: హర్షవర్ధన్
- గీతరచన: చంద్రబోస్, వనమాలి
- నృత్యాలు: బృంద
- పోరాటాలు: విజయ్
- దుస్తులు: నళిని శ్రీరాం
- ఛాయాగ్రహణం: పి. ఎస్. వినోద్
- సంగీతం: అనూప్ రూబెన్స్
- కళ: రాజీవన్
- కూర్పు: ప్రవీణ్ పూడి
- ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై. సుప్రియ
- సమర్పణ: కీ.శే. శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ
- నిర్మాత: అక్కినేని నాగార్జున
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాణం
[మార్చు]అభివృద్ధి
[మార్చు]తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున తన కలల ప్రాజెక్ట్ అని ఎన్నో సార్లు ప్రస్తావించారు. అలా ఇష్క్ సినిమా విజయవంతమయిన తర్వాత నితిన్ ద్వారా ఈ సినిమా దర్శకుడు ఇష్క్ సినిమాని తెరకెక్కించిన విక్రమ్ కుమార్ అని తెలిసింది.[4] చాలా అంచనాల మధ్య మొదలయిన ఈ సినిమా పేరు మనం అని మార్చి 2013లో నిర్థారించారు.[5] ఈ సినిమా లాంచ్ హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ ఆఫీసులో 2013 జూన్ 3న లాంఛనంగా జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గున్నారు.[6] సినిమా చిత్రీకరణలో పాల్గునే ముందు ఆగస్టు 2013లో నాగార్జున, నాగేశ్వరరావు గార్లపై ఫొటోషూట్ జరిపారు. సినిమా తొలి ప్రచార చిత్రం విడుదలయ్యాక మనం సినిమా బ్యాక్ టు ఫ్యూచర్ అనే ఇంగ్లీష్ సినిమా యొక్క స్పూర్థి అని, ఈ సినిమాలో నాన్ లీనియర్ కథనం వాడుతూ నాగేశ్వరరావు గారు నాగార్జున కొడుకుగా, నాగ చైతన్య మనవడిగా కనిపిస్తారని వార్తలొచ్చాయి. నిజానికి ఇది వారి మధ్య ఉన్న నిజజీవిత సంబంధాలకు పూర్తి భిన్నం.[7]
నటీనటుల ఎన్నిక
[మార్చు]అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కథానాయకులని తెలిసాక కథానాయికల కోసం పరిశీలన మొదలయ్యింది. ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య సినిమాల్లో నాగచైతన్యతో కలిసి నటించిన సమంతను ఈ సినిమాలో ఒక కథానాయికగా ఎన్నుకున్నారు.[8] తన గత చిత్రాలకు భిన్నంగా అటు సాంప్రదాయబద్ధంగానూ, ఇటు ఆధునికంగానూ సమంత వేషధారణ ఫొటోల ద్వారా విడుదలయ్యింది.[9] గ్రీకువీరుడు సినిమాలోలా కాకుండా ఈ సినిమాలో నాగార్జున పెద్దమనిషి తరహా వేషధారణలో కనిపించారు.[10] మొదట నాగార్జున సరసన ఇలియానాని నటింపజేయాలనుకున్నా ఇలియానా ఈ సినిమాకు 2 కోట్ల పారితోషికం అడగటంతో సంతోషం, నేనున్నాను, బాస్ వంటి హిట్ చిత్రాల్లో తనతో కలిసి నటించిన శ్రియాను మరో కథానాయికగా ఎన్నుకున్నారు.[11] నాగేశ్వరరావు సరసన ఈ సినిమాలో హిందీ నటి రేఖ నటిస్తోందని[12], మోహన్ బాబు పెద్దకొడుకు మంచు విష్ణువర్థన్ బాబు ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడని వార్తలొచ్చాయి.[13] అయితే అవి నిజం కావని ఆపై తేలిపోయాయి.[14] అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా నుంచి ముగ్గురు యువకులు కౌషల్ శర్మ, కృష్ణ యాదవ్, శ్రీకర్ సి.లను పరిచయం చెయ్యబోతున్నట్టు నాగార్జున సెప్టెంబెర్ 2013లో స్పష్టం చేశారు.[15] ఆ తర్వాత నాగార్జున చిన్నకొడుకు అక్కినేని అఖిల్ ఈ సినిమాలో ఓ కీలక అతిథి పాత్ర పోషిస్తున్నాడని,[16] దాని నిడివి మూడు నిమిషాలని వార్తలొచ్చాయి.[17] అయితే ఇది బయట పడటంతో నాగార్జున సినిమా యూనిట్ మీద కోప్పడ్డారని వార్తలొచ్చాయి.[18] అయితే నాగార్జున మాత్రం అఖిల్ మనంలో నటించడం లేదని స్పష్టం చేశారు.[19]
చిత్రీకరణ
[మార్చు]ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాదులోని నారాయణగూడ ప్రాంతంలో వర్షం పడుతుండగా 2013 జూన్ 12న మొదలయ్యింది. ఆ రోజు ఆ వర్షంలో నాగ చైతన్య, సమంతలపై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.[20] 2013 జూన్ 22న మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ జూలై నెల రెండో వారంలో మొదలవుతుందని, ఆ షెడ్యూల్లో ముఖ్యతారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తారని వార్తలొచ్చాయి.[21] ముందుగా అనుకున్నట్టుగానే జూలై చివరి వారంలో రెండో షెడ్యూల్ ముగిసింది.[22] 2013 ఆగస్టు 8న నాగార్జున, నాగేశ్వరరావు గారు చిత్రీకరణలో పాల్గొన్నారు.[23] అదే నెలలో హైదరాబాద్ బిట్స్ పిలాని కాలేజిలో నాగ చైతన్యపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.[24] కొంత కాలం షూటింగ్ వివరాలు బయటకి రాకుండా మెల్లగా సాగింది. అయితే ఉదరంలో క్యాన్సరుతో నాగేశ్వరరావు ఆసుపత్రిలో జేరారు. దాని వల్ల షూటింగ్ నిలిపివేశారు. అయితే నాగేశ్వరరావు గారు త్వరగా కోలుకోవడం వల్ల నవంబరు నెలలో హైదరాబాదులో షూటింగ్ కొనసాగింది. అప్పుడు నాగ చైతన్య, సమంతలపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.[25] వారం రోజుల తర్వాత నాగేశ్వరరావు గారు కూడా హైదరాబాదులో జరుగుతున్న షూటింగులో పాల్గున్నారు.[26] కర్నాటకలోని కూర్గ్ ప్రాంతంలో నాగార్జున, నాగచైతన్య, శ్రియా, సమంతలపై డిసెంబరు 1 నుంచి కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలయ్యింది.[27] ఆపై చిత్రీకరణ డిసెంబరు రెండో వారం నుండి మైసూర్ ప్రాంతంలో కొనసాగింది.[28] అక్కడ నాగార్జున, శ్రియాలపై ఓ పాటను చిత్రీకరించాక షూటింగ్ కూర్గ్ ప్రాంతంలో మరో వారం పాటు కొనసాగింది. అక్కడితో 90 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం అందింది.[29]
మార్కెటింగ్
[మార్చు]అక్కినేని నాగేశ్వరరావు గారి 90వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యొక్క తొలి ప్రచార చిత్రం విడుదలయ్యింది.[30] ఆ చిత్రానికి మంచి స్పందన లభించింది.[31] 2013 నవంబరు 23న నాగ చైతన్య పుట్టినరోజు కానుకగా మనం సినిమాలో అతని వేషధారణకు సంబంధించిన రెండు చిత్రాలను విడుదల చేశారు.
మనం మోషన్ పోస్టర్
[మార్చు]మనం సినిమా మార్కెటింగ్ విషయంలో మోషన్ పోస్టర్ అనే ఒక సరికొత్త పద్ధతిని అవలంభించింది. ఈ మోషన్ పోస్టర్ ని Rev Eye అనే ఒక Augmented Reality అప్ప్లికేషన్ ద్వారా తయారు చేసారు. దీనిని వాడుకరి ఒక సారి తన స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేస్తే చాలు, ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు వీడియో రూపంలో ప్లే అవడమే కాకుండా అవి తన తోటి వారితో సోషల్ నెట్వర్క్ లో షేర్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.[32]
సంగీతం
[మార్చు]అనూప్ రుబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. నాగ చైతన్యతో ఆటోనగర్ సూర్య, విక్రమ్ కుమార్ తో ఇష్క్ సినిమా తర్వాత అనూప్ కలిసి పనిచేసిన సినిమా ఇది.[33] చంద్రబోస్, వనమాలి పాటలను రచించారు.[27]
పురస్కారాలు
[మార్చు]సైమా అవార్డులు
[మార్చు]2014 సైమా అవార్డులు
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ సహాయనటి (శ్రియా)
- ఉత్తమ సంగీత దర్శకుడు
- ఉత్తమ గీత రచయిత (చంద్రజోస్ - కని పెంచిన)
మూలాలు
[మార్చు]- ↑ "వచ్చేనెలలో 'అక్కినేని కుటుంబం' మల్టీస్టారర్". విశాలాంధ్ర. Retrieved 18 May 2013.[permanent dead link]
- ↑ "'మనం' సినిమాకి సంభాషణలు రాయనున్న హర్షవర్ధన్". 123తెలుగు. Retrieved 27 April 2013.
- ↑ "మనం మొదలవుతోంది". ఏపీహెరాల్డ్. Retrieved 16 May 2013.
- ↑ "నాగార్జున కలల చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న విక్రం కుమార్?". 123తెలుగు. Retrieved 27 March 2012.
- ↑ "అక్కినేని త్రయం 'మనం'". విశాలాంధ్ర. Retrieved 9 March 2013.[permanent dead link]
- ↑ "మూడు తరాల సినిమా మొదలైంది". 123తెలుగు. Retrieved 3 June 2013.
- ↑ "బ్యాక్ టు ఫ్యూచర్ కాన్సెప్ట్ తో అక్కినేని మల్టీ స్టారర్ మూవీ?". 123తెలుగు. Retrieved 18 September 2013.
- ↑ "నాగచైతన్య సరసన మరోసారి సమంత...వివరాలు". వన్ ఇండియా. Archived from the original on 2014-07-28. Retrieved 12 October 2012.
- ↑ "'మనం' లో సమంత లుక్ ఇదే...(ఫోటో)". వన్ ఇండియా. Retrieved 13 September 2013.
- ↑ "మనం సినిమాలో న్యూ లుక్ లో నాగార్జున". టాలీవుడ్.నెట్. Archived from the original on 2013-08-23. Retrieved 21 August 2013.
- ↑ "అక్కినేని వారి సినిమాకు...2 కోట్లు అడిగిన ఇలియానా". వన్ ఇండియా. Archived from the original on 2014-07-28. Retrieved 7 February 2013.
- ↑ "మనంలో రేఖ?". తెలుగుమిర్చి. Archived from the original on 2013-09-11. Retrieved 5 June 2013.
- ↑ "మనంలో కలిసిపోయిన మంచు...!!". ఏపీహెరాల్డ్. Retrieved 1 October 2013.
- ↑ "రేఖ నటించడం లేదు!". తెలుగుమిర్చి. Archived from the original on 2013-09-28. Retrieved 19 June 2013.
- ↑ "'మనం'లో ముగ్గురు కొత్త కుర్రాళ్ల పరిచయం". ఆంధ్రభూమి. Retrieved 12 September 2013.[permanent dead link]
- ↑ "'మనం' సినిమాలో సర్ ప్రైజ్ గా." ఇండియాగ్లిట్స్. Retrieved 18 November 2013.
- ↑ "అఖిల్ నిడివి 3 నిమిషాలట!". ఇండియాగ్లిట్స్. Retrieved 21 November 2013.
- ↑ "మన్మధుడుకి కోపమొచ్చిందట!". హలోఆంధ్ర. Archived from the original on 2013-11-23. Retrieved 21 November 2013.
- ↑ "అక్కినేని అఖిల్ 'మనం'లో నటించట్లేదు!". వెబ్ దునియా. Retrieved 20 November 2013.
- ↑ "నారాయణగూడలో సందడి చేస్తున్న చైతు – సమంత". 123తెలుగు. Retrieved 12 June 2013.
- ↑ "ముగిసిన మనం సినిమా మొదటి షెడ్యూల్". 123తెలుగు. Retrieved 23 June 2013.
- ↑ "'మనం' సెకండ్ షెడ్యుల్ పూర్తయింది…". ఫిలింసర్కిల్. Retrieved 1 August 2013.[permanent dead link]
- ↑ "టెన్షన్ పడుతున్న నాగచైతన్య". ఆంధ్రప్రభ. Retrieved 5 September 2013.[permanent dead link]
- ↑ "బిట్స్ పిలానీలో సందడి చేస్తున్న నాగ చైతన్య". 123తెలుగు. Retrieved 31 August 2013.
- ↑ "హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న మనం". 123తెలుగు. Retrieved 10 November 2013.
- ↑ "మళ్లీ నటనలో పాల్గుంటున్న ఏ.ఎన్.ఆర్". 123తెలుగు. Retrieved 17 November 2013.
- ↑ 27.0 27.1 "డిసెంబర్ 1 నుంచి కూర్గ్ లో 'మనం'". 123తెలుగు. Retrieved 23 November 2013.
- ↑ "మైసూర్ కు వెళ్లనున్న మనం". తెలుగువన్. Retrieved 9 December 2013.
- ↑ "మార్చి చివర్లో రానున్న 'మనం'". 123తెలుగు. Retrieved 13 December 2013.
- ↑ ""మనం" ఫస్ట్ లుక్". తెలుగువన్. Retrieved 19 September 2013.
- ↑ "నాగ్ 'మనం' ఫస్ట్‌లుక్ అదుర్స్". వెబ్ దునియా. Retrieved 20 September 2013.
- ↑ ""మనం మోషన్ పోస్టర్"". Rev Eye. Archived from the original on 2014-05-12. Retrieved 12 May 2014.
- ↑ "అక్కినేని "మనం" చిత్రానికి అనుప్ రూబెన్స్ మ్యూజిక్". సినీఅవుట్లుక్. Archived from the original on 12 జూలై 2013. Retrieved 17 March 2013.