Jump to content

వాడుకరి:Chaitanya Kanikicharla

వికీపీడియా నుండి

శాసనోల్లంఘన ఉద్యమం


భారత స్వాతంత్ర్యోద్యమంలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రధాన ఘట్టం. ఈ ఉద్యమం కాంగ్రెసు పార్టీ నాయకత్వంలో 1930 మార్చిలో మొదలై, 1934 వరకూ సాగింది. ఉద్యమానికి నేతృత్వం వహించే బాధ్యతను కాంగ్రెసు పార్టీ మహాత్మా గాంధీకి అప్పగించింది. భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి కల్పించే విషయంలో బ్రిటిషు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించి, నిర్ణయం తీసుకోవడంలో కాలయాపన విధానాలను అవలంబించింది. దాంతో కాంగ్రెసు నాయకులు ఆశాభంగం చెంది ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఆ కార్యాచరణలో భాగమే శాసనోల్లంఘన.

ప్రజా క్షేమం దృష్ట్యా బ్రిటిషు ప్రభుత్వం తీసుకోవాల్సిన 11 కనీస చర్యలను ప్రకటించి, ఆ చర్యలు తీసుకోకపోతే, శాసనోల్లంఘన చెయ్యక తప్పదని గాంధీ, 1930 జనవరి 31 న యంగ్ ఇండియా పత్రికలో ప్రకటించాడు. ఉద్యమంలో భాగంగా చేపట్టవలసిన పలు కార్యక్రమాలను గాంధీ నిర్దేశించాడు. ఆ కార్యక్రమాల నన్నిటినీ అహింసా పద్ధతిలో జరగాలని కూడా అతడు నిర్దేశించాడు. ఉద్యమ కార్యక్రమంలో ప్రధానమైన అంశం ఉప్పు సత్యాగ్రహం. ఇతర కార్యక్రమాల్లో విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగు, మద్యం దుకాణాల వద్ద పికెటింగు, సారా దుకాణాల వేలం పాటలు జరిగే చోట పికెటింగు, బ్రిటిషు వస్తు బహిష్కరణ, పన్నుల ఎగవేత, అటవీ పరిరక్షణ చట్టాల అతిక్రమణ, కల్లు తీసే తాడి, ఈత చెట్లను నరకడం వంటివి ఉన్నాయి. అంతకు మునుపెన్నడూ లేని విధంగా మహిళలు పెద్దయెత్తున పాల్గొనడం ఈ ఉద్యమ ప్రత్యేకత.

ఈ ఉద్యమం రెండు దశల్లో నాలుగు సంవత్సరాల పాటు జరిగింది. మధ్యలో దాదాపు ఒక సంవత్సరం పాటు ఉద్యమాన్ని ఆపారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటిషు ప్రభుత్వం పెద్ద యెత్తున దమనకాండకు పాల్పడింది. ప్రత్యేకంగా ఆర్డినెన్సులను జారీ చేసింది. కాంగ్రెసును దాని శాఖలనూ చట్టవిరుద్ధమైనవని ప్రకటించి, వాటి ఆస్తులను జప్తు చేసింది. 75,000 మందికి పైగా నాయకులను, ఉద్యమకారులనూ అరెస్టు చేసింది. పోలీసు కాల్పుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. జైళ్ళలో అమానవీయ పరిస్థితులు కల్పించింది. పోలీసులు మహిళలపై అత్యాచారాలు, హింస చేసారు.

ఉద్యమ సమయంలో అనేక సమావేశాలు సంప్రదింపులూ జరిగాయి. మూడు రౌండు టేబులు సమావేశాలు, నాలుగు కాంగ్రెసు సమావేశాలు, అనేక అఖిల పక్ష సమావేశాలే కాక మహాత్మా గాంధీకి వైస్రాయి ఇర్విన్‌కూ మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగి ఒక ఒడంబడిక కుదిరింది. అయితే రెండవ రౌడు టేబులు సమావేశం విఫలమవడంతో ఉద్యమం మళ్ళీ మొదలైంది. మధ్యలో దాదాపు ఒక సంవత్సరం పాటు విరామం వచ్చింది. ఈ విధంగా ఉద్యమం రెండు దశల్లో జరిగింది.

పెద్ద యెత్తున జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంతో ఉవ్వెత్తున మొదలై, పేలవంగా, పెద్దగా సాధించినదేమీ లేకుండా ముగిసింది. ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తూ గాంధీ,"ఈసారి శాసనోల్లంఘన అంటూ మొదలైతే, ఇక దాన్ని ఆపలేం. ఒక్క కార్యకర్తైనా బతికి ఉన్నంతవరకు, ఒక్క కార్యకర్తైనా స్వేచ్ఛగా ఉన్నంతవరకూ ఆపకూడదు కూడా" అని అన్నాడు. కానీ 1933 మే 8 న గాంధీయే స్వయంగా ఉద్యమాన్ని సస్పెండు చేయమని కాంగ్రెసు పార్టీ తాత్కాలిక అధ్యక్షుణ్ణి కోరాడు. 1933 మే 9 న ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపేసారు. 1933 జూలైలో సామూహిక ఉద్యమం కాస్తా వ్యక్తిగత శాసనోల్లంఘనగా మారి, రూపు కోల్పోయింది. ఆ తరువాత 1934 ఏప్రిల్ 7 న ఉద్యమం అధికారికంగా ముగిసింది.

పూర్వరంగం

[మార్చు]

భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించేందుకు బ్రిటిషు ప్రభుత్వం 1927 లో సైమను కమిషన్ను ఏర్పాటు చేసింది. 7 గురు సభ్యులున్న ఈ కమిషనులో భారతీయులొక్కరు కూడా లేరు, అందరూ బ్రిటిషు ఎంపీలే. దీన్ని భారతీయులు నిరసించారు. భారత రాజకీయ నాయకులంతా పార్టీలకతీతంగా ఏకీభావానికి వచ్చిన అంశం ఇది.  ఈ కమిషను 1928 లో భారతదేశంలో పర్యటించినపుడు దేశవ్యాప్తంగా దానికి నిరసనలు తెలిపారు. భారతీయులకు రాజ్యాంగాన్ని రచించగల శక్తియుక్తులు లేవని బ్రిటను ప్రభుత్వంలో భారత వ్యవహారాల అండర్ సెక్రెటరీ ఎర్ల్ వింటర్టన్ 1927 నవంబరులో బ్రిటను పార్లమెంటులో ప్రకటించాడు. మీరే ఒక రాజ్యాంగాన్ని రచించి చూపించండని లార్డ్ బిర్కెన్‌హెడ్ సవాలు చేసాడు. ఇదిలా ఉండగా, కాంగ్రెసు పార్టీ 1927 డిసెంబరులో జరిపిన మద్రాసు సమావేశాల్లో సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాలని తీర్మానించింది. అలాగే స్వాతంత్ర్యం వచ్చాక స్థాపించుకోవాల్సిన రాజ్యాంగాన్ని రచించాలని సంకల్పించింది. లార్డ్ బిర్కెన్‌హెడ్ చేసిన సవాలు కూడా ఈ నిర్ణయం తీసుకోడానికి కారణమైంది.  ఇందుకోసం వివిధ పార్టీలతో ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసింది.  ఈ అఖిల పక్షం, భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించే బాధ్యతతో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఏడుగురు సభ్యుల ఈ కమిటీలో తేజ్ బహదూర్ సప్రూ, ఆలీ ఇమాం, అనీ బిసెంట్, ఎం.ఆర్.జయకర్, సుభాష్ చంద్ర బోసు, జవాహర్‌లాల్ నెహ్రూ కూడా ఉన్నారు. ఈ కమిటీ నెహ్రూ నివేదికగా ప్రసిద్ధమైన నివేదికను తయారు చేసి అఖిలపక్షానికి సమర్పించింది. అందులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగం ఎలా ఉండాలో రచించారు.  ఈ రాజ్యాంగపు చిత్తుప్రతిని లక్నోలో 1928 అగస్టు 28-31 తేదీల్లో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రవేశపెట్టారు. సమావేశం ఈ చిత్తుప్రతి నివేదికను ఆమోదించింది. భారతదేశానికి "అధినివేశ ప్రతిపత్తి" (డొమినియన్ స్టేటస్) ఉండాలనే మరొక తీర్మానాన్ని కూడా ఈ అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. జవాహర్‌లాల్ నెహ్రూ ఈ రెండవ తీర్మానాన్ని వ్యతిరేకించాడు.  

1928 లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు సమావేశాల్లో ఈ అఖిల పక్ష నివేదికను ఆమోదించే తీర్మానాన్ని మహాత్మా గాంధీ ప్రవేశపెట్టాడు. అందులోని అధినివేశ ప్రతిపత్తి అంశానికి వ్యతిరేకత ఎదురైంది. దాని స్థానంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని సుభాష్ చంద్రబోసు సవరణ ప్రతిపాదించగా ఎస్.సత్యమూర్తి ఆ సవరణకు మద్దతు పలికాడు. అయితే సమావేశానికి హాజరైన డెలిగేట్లలో మెజారిటీ మంది సవరణను వ్యతిరేకించగా అది వీగిపోయింది. 1929 డిసెంబరు 31 లోపు బ్రిటిషు ప్రభుత్వం ఈ అధినివేశ ప్రతిపత్తిపై నిర్ణయం తీసుకోకపోయినా, లేదా ఈలోపే దాన్ని తిరస్కరించినా, కాంగ్రెసు సహాయ నిరాకరణ ఉద్యమం చేపడుతుందని సమావేశం తీర్మానించింది. అయితే దాదాపు పది నెలల పాటు బ్రిటిషు ప్రభుత్వం ప్రతిపత్తిపై ఏ ప్రకటనా చెయ్యలేదు.

1929 అక్టోబరు 31 న వైస్రాయి ఇర్విన్, లండన్‌లో నేతలతో చర్చలు జరిపి, తిరిగి వచ్చాక, సైమన్ కమిషను నివేదిక ఇచ్చాక, అధినివేశ ప్రతిపత్తిపై చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. కాంగ్రెసుతో సహా వివిధ పార్టీల నాయకులు నవంబరు 1 న జరిగిన ఒక అఖిలపక్ష సమావేశంలో ఆ ప్రకటనను స్వాగతించి ఒక ప్రకటనను వెలువరించాయి. జవాహర్ లాల్ నెహ్రూ అయిష్టంగా, గాంధీ వత్తిడి చేసిన మీదట దానిపై సంతకం చేసాడు. సుభాష్ చంద్ర బోసు సంతకం చెయ్యలేదు.  కలకత్తా తీర్మానం ప్రకారం మరో రెండు నెలల్లోపల బ్రిటిషు ప్రభుత్వం ప్రతిపత్తిని ఇవ్వడమో లేదా ఇవ్వబోమని ప్రకటించడమో చెయ్యాల్సి ఉండగా, ఇప్పుడు ఈ చర్చలు తగవని నెహ్రూ అభిప్రాయం.

ఇదిలా ఉండగా, అధినివేశ ప్రతిపత్తి ఇచ్చే ప్రకటనపై బ్రిటన్ రాజకీయ వర్గాల్లో, పత్రికల్లో గట్టి వ్యతిరేకత ఎదురైంది. భారతదేశం అందుకు సిద్ధంగా లేదని వారి వాదన. దాంతో వైస్రాయ్ ఆ విషయంలో కొంత తగ్గాల్సి వచ్చింది. డిసెంబరు 23 న గాంధీ, నెహ్రూ, ఇతర పార్టీల నాయకులతో వైస్రాయి ఢిల్లీలో సమావేశమయ్యాడు. అధినివేశ ప్రతిపత్తి ఇవ్వడం ఖాయమేనని, దాని విధివిధానాలను చర్చించడమే ప్రతిపాదిత సమావేశ ఉద్దేశమనీ బ్రిటిషు ప్రభుత్వం ముందే ప్రకటిస్తే తప్ప కాంగ్రెసు ఆ సమావేశంలో పాల్గొనజాలదని గాంధీ, నెహ్రూలు ప్రకటించారు.  వైస్రాయి అలాంటి హామీ ఇవ్వనందున, కాంగ్రెసు ప్రతిపాదిత చర్చల నుండి వైదొలగింది.

ఆ తరువాత కొద్దిరోజులకే, 1929 డిసెంబరు 26 - 31 మధ్య లాహోర్‌లో కాంగ్రెసు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో "బ్రిటిషు పాలన నుండి, బ్రిటిషు సామ్రాజ్యవాదం నుండి సంపూర్ణమైన స్వేచ్ఛ కావాలి. బ్రిటిషు వారి కౌగిలి ప్రమాదకరమైనది." అని అధ్యక్షుడు జవాహర్‌లాల్ నెహ్రూ ప్రకటించాడు. 1929 డిసెంబరు 31 న గాంధీ "పూర్ణ స్వరాజ్" డిమాండును ప్రవేశపెట్టాడు. దాన్ని సాధించేందుకు శాసనోల్లంఘన ఉద్యమం చెయ్యాల్సి ఉంటుందని కూడా ప్రకటించాడు.  జనవరి 26 ను సంపూర్ణ స్వాతంత్ర్య దినంగా జరుపుకోవాలని ప్రకటించారు. వివిధ శాసనసభల్లో సభ్యులుగా ఉన్న కాంగ్రెసు నాయకులు తమ పదవులకు రాజీనామా చెయ్యాలని, రాబోయే ఎన్నికల్లో ఎవరూ పాల్గొనరాదనీ సభ తీర్మానించింది. శాసనోల్లంఘన ఉద్యమాన్ని నడిపే బాధ్యతను సమావేశం అఖిల భారత కాంగ్రెసు కమిటీకి అప్పగించింది.

ఉద్యమ సన్నాహాలు

[మార్చు]

1930 జనవరి 30 న యంగ్ ఇండియా పత్రికలో రాసిన వ్యాసంలో గాంధీ, కింది డిమాండ్లను ప్రకటించాడు.

  1. సంపూర్ణ మద్య నిషేధం
  2. రూపాయికి పౌండుకూ ఉన్న విలువ నిష్పత్తి తగ్గింపు
  3. భూమి శిస్తును కనీసం 50%కి తగ్గించడం, దానిని శాసన నియంత్రణలో ఉంచడం
  4. ఉప్పుపై పన్ను రద్దు
  5. సైనిక వ్యయాన్ని కనీసం 50%కి తగ్గించడం
  6. తగ్గిన రాబడికి సరిపోయే విధంగా పై స్థాయి ఉద్యోగుల జీతాలను సగానికి లేదా అంతకంటే తక్కువకు తగ్గించడం
  7. విదేశీ వస్త్రంపై రక్షణ సుంకం
  8. తీరప్రాంత ట్రాఫిక్ రిజర్వేషన్ బిల్లు ఆమోదం
  9. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయడం (హత్యానేరంపై ఉన్న వారిని లేదా సాధారణ న్యాయ ట్రిబ్యునల్ ద్వారా ఆ ఆరోపణలున్నవారినీ మినహాయించి). అన్ని రాజకీయ ప్రాసిక్యూషన్‌లను ఉపసంహరించుకోవడం, సెక్షన్ 124 A రద్దు, 1818 యొక్క నియంత్రణ తదితరాల రద్దు. భారతీయ ప్రవాసులందరికీ తిరిగి రావడానికి అనుమతి
  10. C.I.D రద్దు లేదా ప్రజలపై దాని నియంత్రణ రద్దు
  11. నియంత్రణలకు లోబడి ఆత్మరక్షణ కోసం తుపాకీలను ఉపయోగించడానికి లైసెన్సుల జారీ.

"ఇది సంపూర్ణమైన డిమాండ్ల జాబితా కాదు. ఇది కేవలం అతి ముఖ్యమైన కీలక డిమాండ్ల జాబితా మాత్రమే. వీటిని అమలు చేస్తే శాసనోల్లంఘన ఉండదు, అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే వీలున్న ఏ సమావేశం లోనైనా కాంగ్రెసు మనస్పూర్తిగా పాల్గొంటుంది." అని కూడా గాంధీ ప్రకటించాడు.

శాసనసభ్యుల రాజీనామాలు

[మార్చు]

దేశ వ్యాప్తంగా కేంద్ర శాసనసభల్లోను, వివిధ రాష్ట్రాల శాసనసభల్లోనూ ఉన్న కాంగ్రెసు సభ్యుల్లో మొత్తం 172 మంది రాజీనామాలు చేసారు. వారిలో కేంద్ర శాసనసభ సభ్యులు 21 మంది, కేంద్ర శాసన మండలి సభ్యులు 9 మంది, బెంగాలు శాసనభలో 34 మంది, బీహారు,ఒరిస్సాల నుండి 31 మంది, మధ్య రాష్ట్రాల నుండి 20 మంది, బొంబాయి శాసనభలో 6 గురు, మద్రాసు శాసనభలో 20 మంది, సంయుక్త రాష్ట్రాల్క నుండి 16, అస్సాం నుండి 12, పంజాబు నుండి ఇద్దరు, బర్మా నుండి ఒక్కరూ రాజీనామా చేసినవారిలో ఉన్నారు. రాజీనామా చేయని వారిని, ఎన్నికల్లో పాల్గొంటున్నవారినీ పార్టీ సభ్యత్వం నుండి రాజీనామా చెయ్యమని పార్టీ కోరింది.

ప్రతిపాదించిన కార్యాచరణ

[మార్చు]

ఉద్యమంలో భాగంగా గాంధీ వివిధ చర్యలను ప్రతిపాదించాడు. వాటిలో అన్నిటికంటే ప్రధానమైనది ఉప్పు సత్యాగ్రహం. ప్రభుత్వం విధించిన ఉప్పుపన్నును ధిక్కరిస్తూ ఉప్పు తయారుచెయ్యడం ఈ ఉద్యమ లక్ష్యం. తీర ప్రాంతాలకు దగ్గరగా లేని లోతట్టు ప్రాంతాల్లో ఇతర కార్యాచరణను ప్రకటించాడు. కార్యాచరణ ఇలా ఉంది:

  1. ఉప్పు సత్యాగ్రహం
  2. పన్నుల ఎగవేత
  3. విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగు
  4. మద్యం దుకాణాల వద్ద పికెటింగు
  5. అబ్కారీ పాటలు జరిగే చోట పికెటింగు
  6. కల్లు తీసే తాడి,ఈత చెట్లను నరకడం
  7. ఖద్దరు తయారీ
  8. అటవీ చట్టాల ధిక్కారం
  9. అస్పృశ్యతా నిర్మూలనకు కృషి
  10. హిందూ ముస్లిము ఐక్యతకు కృషి

ఉద్యమం తొలిదశ

[మార్చు]

శాసనోల్లంఘన ఉద్యమం రెండు దశల్లో జరిగింది. మొదటి దశ 1930 మార్చిలో మొదలై, 1931 మార్చి 5 న గాంధీ ఇర్విన్ ఒడంబడిక కుదరడంతో ముగిసింది.

ఉప్పు సత్యాగ్రహం

[మార్చు]

ప్రధాన వ్యాసం: ఉప్పు సత్యాగ్రహం

కార్యాచరణ ప్రణాళికలో ప్రధానమైన అంశం ఉప్పు సత్యాగ్రహం. సబర్మతి ఆశ్రమం నుండి బయలుదేరి గుజరాత్ తీరాన గల దండి గ్రామం వరకు పాదయాత్ర చేసి అక్కడ ఉప్పు తయారు చెయ్యాలనేది ఈ సత్యాగ్రహ ఉద్దేశం. ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తూ గాంధీ,"ఈసారి శాసనోల్లంఘన మొదలైందంటే, ఇక దాన్ని ఆపలేం. ఒక్క కార్యకర్త బతికి ఉన్నంతవరకు, ఒక్క కార్యకర్త స్వేచ్ఛగా ఉన్నంతవరకూ ఆపకూడదు కూడా" అని అన్నాడు. 1930 మార్చి 12 న గాంధీ ఆశ్రమం నుండి బయలుదేరాడు. 79 మంది ఆశ్రమ వాసులు వెంట నడిచారు. 24 రోజులు, 241 మైళ్ళ నడక తరువాత ఏప్రిల్ 5 న దండి గ్రామం చేరారు. యాత్ర పొడవునా, గ్రామగ్రామానా ప్రజలు సమధికోత్సాహంతో యాత్రను స్వాగతించారు. దాని వెంట నడిచారు. దేశం లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఈ యాత్ర ప్రజల పత్రికల దృష్టిని ఆకర్షించింది. ఈ యాత్రను తొలుత వైస్రాయి పెద్దగా పట్టించుకోలేదు. కానీ క్రమేణా అది కలగజేసిన సంచలనం బ్రిటిషు పాలకుల్లో ఆందోళన కలిగించింది.

ఏప్రిల్ 6 న దండి గ్రామంలో గాంధీ, అతని అనుచరులూ సముద్రంలో దిగి, బయటికీ వచ్చి లాంఛనంగా ఉప్పు తయారు చేసారు. ఆ చర్య దేశం యావత్తుకూ ఉత్సాహం కలిగించింది. దేశం లోని వివిధ ప్రాంతాల్లో ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు.  తదుపరి చర్యగా గాంధీ, దండికి దక్షిణంగా 40 కి.మీ. దూరాన ఉన్న ధరసానా సాల్ట్ వర్క్స్ పై దాడి చెయ్యాలని నిర్ణయించాడు. ఇదే సంగతిని లార్డ్ ఇర్విన్‌కు లేఖ కూడా రాశాడు. మే 4 అర్ధరాత్రి సమయంలో, బ్రిటిషు ప్రభుత్వం గాంధీని అరెస్టు చేసింది.  ఆ తరువాత మే 21 న సరోజినీ నాయుడు నేతృత్వంలో ఈ దాడి జరిగింది. బ్రిటిషు ప్రభుత్వం కాంగ్రెసుకు చెందిన పలు అనుబంధ సంస్థలను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించి, వాటి ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు టంగుటూరి ప్రకాశంకు ఒక సంవత్సరం జైలుశిక్ష విధించారు.

ఇతర సత్యాగ్రహాలు

[మార్చు]

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ 1930 మేలో అలహాబాదులో సమావేశమై శాసనోల్లంఘన ఉద్యమాన్ని విస్తరిస్తూ కొన్ని తీర్మానాలు చేసింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా, ఆలస్యం లేకుండా దేశం అంతటా విదేశీ వస్త్రాలను బహిష్కరించడం తప్పనిసరి అనీ, ఇప్పటికే ఉన్న స్టాక్ అమ్మకాలను నిరోధించాలనీ, కొత్త ఆర్డర్లను రద్దు చేయించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కమిటీ చెప్పింది. విదేశీ వస్త్రాలతో వ్యాపారం చేసే దుకాణాలను పికెటింగు చేయాలని కాంగ్రెస్ సంస్థలన్నిటికీ కమిటీ పిలుపునిచ్చింది. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరాటంలో పాలుపంచుకొమ్మని విద్యార్థులు, న్యాయవాదులు, కార్మికులు, రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చింది. భూమి శిస్తు కట్టవద్దని రైతులకు పిలుపునిచ్చింది.

దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఉప్పు సత్యాగ్రహాల్లో అనేకమంది అరెస్టయ్యారు. ఉప్పు సత్యాగ్రహం ప్రజలను ఎంతగా ప్రభావితం చేసిందంటే, అంతకు ముందు స్వాతంత్ర్య పోరాటాల్లో అంతగా పాల్గొనని వర్గాలు కూడా ఇప్పుడు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఉప్పు తయారు చేసే వీలు లేని ప్రాంతాల్లో ఇతర పద్ధతుల్లో శాసనోల్లంఘన చేసారు. దేశ వ్యాప్తంగా మహిళలు విశేషంగా పాల్గొన్నారు. ఒక్క ఢిల్లీలోనే 1600 మంది మహిళలు అరెస్టయ్యారు. దక్షిణ భారతదేశ ప్రజలు అంతకు ముందు లేనంతగా ఉద్యమంలో పాల్గొన్నారు. కల్లు గీతను నిరసిస్తూ తాడి ఈత చెట్లను పడగొట్టారు. కేంద్ర ప్రావిన్సులలో అడవులపై ప్రభుత్వ నియంత్రణను ఎదిరించారు. వాయవ్య భారతదేశం లోని ముస్లిములు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వెంట నడిచి ఈ అహింసాయుత ఉద్యమంలో పాల్గొన్నారు. 1930 ఏప్రిల్ 23 న పెషావర్ లోని కిస్సా కహానీ బజార్లో ఖుదాయి ఖిద్మత్‌గార్ ఊరేగింపు జరుపుతూండగా, సైనికులతో ఉన్న అనేక వాహనాలు వాళ్లపైకి చొచ్చుకు పోయాయి. ముగ్గురు సత్యాగ్రహులు అక్కడికక్కడే మరణించారు. ఉద్యమకారులు తమపై దాడి చేసారనే నెపం చూపి సైనికులు, నిరాయుధులైన జనంపై మెషిన్ గన్లతో కాల్పులు జరపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 30 మంది మరణించగా, అసలు లెక్క అంతకు పదిరెట్లు ఉంటుందని ఇతర అంచనాలు చెప్పాయి.

ఈ ఉద్యమానికి, కాంగ్రెసు నాయకత్వానికీ దేశవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ బ్రిటిషు ప్రభుత్వానికి కలవరం కలిగించింది.  1930 జూన్‌లో కాంగ్రెసు కమిటీలను నిషేధించి, జూన్ 30న మోతీలాల్ నెహ్రూను అరెస్టు చేసి 6 నెలల జైలు శిక్ష విధించారు. గుజరాత్‌లో ఒక మహిళా ప్రదర్శనలో పాల్గొన్న కస్తూర్బా గాంధీని ఫిబ్రవరి 7 న అరెస్టు చేసి ఆరునెలల జైలుశిక్ష విధించారు. 1930 అక్టోబరు 29 న అలహాబాదు కోర్టు జవాహర్‌లాల్ నెహ్రూకు 2 సంవత్సరాల జైలుశిక్ష విధించింది.  విదేశీ వస్తువుల బహిష్కరణ, మధ్య నిషేధం కోసం ప్రదర్శనలు, బ్రిటిషు వస్తువులన్నిటి బహిష్కరణ వంటివి దేశవ్యాప్తంగా చేపట్టారు. అడవుల నియంత్రణ చట్టాలను ధిక్కరిస్తూ కేంద్ర ప్రావిన్సులు, బొంబాయి ప్రావిన్సుల్లో చెట్లను నరికారు. గుజరాత్‌ వంటి కొన్ని ప్రాంతాల్లో భూమి శిస్తు కట్టేందుకు నిరాకరించారు. కలకత్తా మేయరు జె.ఎం.సేన్‌గుప్తా, నిషేధిత సాహిత్యాన్ని బహిరంగంగా చదివాడు. 1930 జూలై 31 న తిలక్ వర్థంతిని స్మరించుకునేందుకు బొంబాయిలో తీసిన ఊరేగింపును నిషేధించగా, వారంతా రాత్రంతా వానలో తడుస్తూ రోడ్డు మీదే కూర్చుండి పోయారు. మరుసటి రోజున ఆ గుంపు నాయకులైన మదన్ మోహన్ మాలవ్యా, కమలా నెహ్రూ, విఠల్ భాయ్ పటేల్ లను అరెస్టు చేసారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో విదేశీ వస్త్ర బహిష్కరణ అత్యధికంగా జరిగింది. బీహార్‌లో చౌకీదారీ పన్నును ఎగవేసారు. కేంద్ర ప్రావిన్సులలో అటవీ సత్యాగ్రహాన్ని విజయవంతంగా నడిపారు. కర్ణాటకలో పన్ను ఎగవేత ఉద్యమం చేసారు. మూడు లక్షల తాటి, ఖర్జూర చెట్లను నరికివేశారు. ఆంధ్ర బెంగాలుల్లో కాంగ్రెసు కార్యకర్తలను తలదాచుకోనిచ్చినందుకు ప్రజలను ఖైదు చేసారు. డిసెంబరు 21 న పెద్దాపురంలో వనభోజనాలకు వెళ్ళిన 80 మందిపై పోలీసులు లాఠీచార్జి చేసారు. మహిళలతో సహా అనేక మంది గాయపడ్డారు.

బ్రిటిషు ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాందోళనను అణచివేసింది. అణచివేత కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్లను జారీ చేసింది. పత్రికలపై ఆంక్షలు పెట్టింది.  ఆందోళనకారులపై విచక్షణా రహితంగా లాఠీచార్జీ చేసింది. కాల్పులు జరిపింది. 1930 ఏప్రిల్, మే రెండు నెలల్లోనే దేశవ్యాప్తంగా 24 కాల్పులు ఘటనలు జరగ్గా వాటిలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 103 మంది అమరులయ్యారు. దేశవ్యాప్తంగా 75,000 మందిని అరెస్టు చేసింది.

ఆంధ్రలో శాసనోల్లంఘన

[మార్చు]

ఆంధ్రలో ఉపుసత్యాగ్రహాన్ని నిర్వహించేందుకు నాయకునిగా కొండా వెంకటప్పయ్యను కాంగ్రెసు పార్టీ నియమించింది. వివిధ జిలాలకు కూడా నాయకులను నియమించారు. ఉద్యమాన్ని నడిపించేందుకు ఒక సమర సమితిని కూడా ఏర్పాటు చేసారు. ఏప్రిల్ 6 వ తేదీని మొదలుకుని వివిధ జిల్లాలో అనేక సార్లు ఉప్పు తయారుచేసి ఉప్పు చట్టాలను ధిక్కరించారు. అనేకమంది నాయకులను ప్రభుత్వం అరెస్టు చేసింది. రాయలసీమలో ఉప్పు సత్యాగ్రహం స్థానే కల్లూరు సుబ్బారావు నేతృత్వంలో మద్య నిషేధం, విదేశీ వస్త్ర బహిష్కరణలను నిర్వహించారు.

ఉప్పు సత్యాగ్రహంతో పాటు మద్యనిషేధం, విదేశీ వస్త్ర బహిష్కరణపై కూడా ప్రజలు ఉద్యమించారు. విదేశీ వస్త్రాలమ్మే దుకాణాల ముందు పికెటింగు జరిపారు. అనేక మంది మహిళలు కూడా ఈ పికెటింగుల్లో పాల్గొన్నారు. గుంటూరు కృష్ణా జిల్లాల్లోని వర్తకులు స్వయంగా తామే ముందుకు వచ్చి ఆర్నెల్ల పాటు విదేశీ వస్త్రాన్ని అమ్మమని ప్రతిన చేసారు. గుంటూరు జిల్లాలో గొల్లపూడి సీతారామశాస్త్రి నాయకత్వంలో కల్లుగీత చెట్లను నరికారు. 1930 జూన్ 21 నాటికి ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెసు సంఘాన్ని, వివిధ జిల్లాల సంఘాలనూ నిషేధించింది.

ఉద్యమంలో పాల్గొన్న కొందరు నాయకులు: కొండా వెంకటప్పయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి, తెన్నేటి విశ్వనాథం, అయ్యదేవర కాళేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, శరణు రామస్వామి చౌదరి, దండు నారాయణరాజు

గాంధీ ఇర్విన్ ఒడంబడిక[మార్చు]

[మార్చు]

ప్రధాన వ్యాసం: గాంధీ-ఇర్విన్ సంధి

శాసనోల్లంఘన ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. వైస్రాయి ఇర్విన్ ఈ ఉద్యమాన్ని ఏదో విధంగా ముగింపజేయాలని భావించాడు. 1931 జనవరి 26 న గాంధీని, ఇతర నాయకులనూ జైలు నుండి విడుదల చేసాడు.  మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ముగిసి, ఫిబ్రవరి మొదటి వారంలో భారత ప్రతినిధి బృందం తిరిగి వచ్చింది. ఆ సమయానికి బ్రిటిషు ప్రభుత్వం గాంధీని ఇతర నాయకులనూ జైళ్ళ నుండి విడుదల చేసింది. రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన నాయకులు ఆ వివరాలను కాంగ్రెసు నాయకులకు వివరించారు. గాంధీ, వైస్రాయితో సమావేశం కోరుతూ ఫిబ్రవరి 14 న ఉత్తరం రాసాడు. ఫిబ్రవరి 17 న వారి సమావేశం జరిగింది. ఆ తరువాత అనేక సార్లు సమావేశమయ్యాక వారి మధ్య 1931 మార్చి 5 న ఒప్పందం కుదిరింది.  గాంధీ ఇర్విన్ ఒడంబడిక కుదిరిన వెనువెంటనే కాంగ్రెసు పార్టీ శాసనోల్లంఘన ఆపివేసింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల కాంగ్రెసు పార్టీ శాఖలకు టెలిగ్రాములు పంపింది.  దీంతో శాసనోల్లంఘన ఉద్యమం తొలిదశ ముగిసింది.

రెండవ రౌండ్ టేబుల్ సమావేశం

[మార్చు]

ప్రధాన వ్యాసం: రౌండు టేబులు సమావేశాలు

రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలు 1931 సెప్టెంబరు 7 న మొదలై డిసెంబరు 11 న ముగిసాయి. గాంధీ డిసెంబరు 28 న స్వదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటికి దేశంలో రాజకీయ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. దేశ వ్యాప్తంగా అరెస్టులు జరిగాయి. జవాహర్ లాల్ నెహ్రూ, సరిహద్దు గాంధీ అనే పేరున్న ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, పురుషోత్తమ దాస్ టాండన్ మొదలైన నాయకులను ప్రభుత్వం అరెస్టు చేసింది. బెంగాలు, సంయుక్త ప్రావిన్సులు, NWFP ల్లో బ్రిటిషు పోలీసుల అకృత్యాలు పెచ్చరిల్లాయి. ఈ విషయాల గురించి గాంధీ వైస్రాయిల మధ్య ఉత్తరప్రత్యుత్తరాల తరువాత 1932 జనవరి 3 న శాసనోల్లంఘన ఉద్యమాన్ని మళ్ళీ మొదలు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యమం మలిదశ

[మార్చు]

గాంధీ రౌండ్ టేబులు సమావేశాల్లో ఉండగానే వైస్రాయి వెల్లింగ్‌డన్, ప్రజలను కాంగ్రెసునూ అణచివేసే చర్యలు చేపట్టాడు. గాంధీ ఇర్విన్ ఒడంబడికను తుంగలో తొక్కాడు.  ఉద్యమాన్ని కొనసాగిస్తున్నట్లు గాంధీ ప్రకటించగానే ప్రభుత్వం అణచివేత చర్యలు చేపట్టింది. పౌరహక్కులను కాలరాచింది. గాంధీతో సహా ప్రముఖ నాయకులను జైల్లో పెట్టింది. నాయకులను జైళ్ళలో పెట్టినప్పటికీ ఉద్యమంలో ప్రజలు ఉధృతంగానే పాల్గొన్నారు.

శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ప్రభుత్వం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను, ఇతర నాయకులనూ అరెస్టు చేసింది. కాంగ్రెస్ నిధులను జప్తు చేసి, కాంగ్రెస్ కార్యాలయానికి సీలు వేసింది. సత్యాగ్రహులపై పోలీసులు, సైన్యం చేసిన అమానవీయ దౌర్జన్యాలు, విచారణ లేకుండా జైలు శిక్ష, లాఠీచార్జి, నిరాయుధులైన స్త్రీ పురుషులపై కాల్పులు, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, వాళ్లను నిర్జన ప్రాంతాల్లో ఒంటరిగా వదలిపెట్టడం, జైళ్లలో సత్యాగ్రహులను హింసించడం వంటి పనులను చేసారు. అయినప్పటికీ ఉద్యమాన్ని కొనసాగించడానికి వేల సంఖ్యలో సత్యాగ్రహులు ముందుకొచ్చారు.

రైతులు మళ్లీ భూ రెవెన్యూ చెల్లింపులను నిలిపివేశారు. జవహర్‌లాల్ నెహ్రూ, పురుషత్తందాస్ టాండన్‌లను అరెస్టు చేశారు. నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లో ఖుదాయి కిద్మత్‌గార్ ను చట్టవిరుద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ను అతని అనుచరులనూ పెద్ద సంఖ్యలో ఖైదు చేసింది. యునైటెడ్ ప్రావిన్స్ బెంగాల్, నార్త్-వెస్ట్ ఫ్రాంటి ప్రావిన్స్‌లో పోలీసుల దౌర్జన్యం కారణంగా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ అణచివేత కారణంగా రెండవ దశ శాసనోల్లంఘన ఉద్యమం అంత ఉధృతంగా నడవలేదు. బ్రిటిషు ప్రభుత్వం బాగా సన్నద్ధంగా ఉండి ముందునుండే నాయకులను అరెస్టు చెయ్యడం, ఉద్యమకారులపై తీవ్రమైన అణచివేతలు ఒక కారణం కాగా, గాంధీ కమ్యూనల్ ఎవార్డు పైనా, హరిజనోద్ధరణ పట్లా తన దృష్టిని మరల్చడం మరొక కారణం.

పూనా ఒడంబడిక

[మార్చు]

ప్రధాన వ్యాసం: పూనా ఒడంబడిక

1930-32 మధ్య లండన్‌లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంటరాని కులాల వారిని హిందూమతం నుండి వేరు చేసి ప్రత్యేకంగా ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చే ప్రతిపాదనను, బ్రిటిషు ప్రధాని ప్రతిపాదించిన కమ్యూనల్ ఎవార్డునూ గాంధీ వ్యతిరేకించాడు. కానీ, శాసనోల్లంఘన ఉధృతంగా జరుగుతున్న ఈ కాలంలో 1932 ఆగస్టు 17 న ప్రధాని కమ్యూనల్ ఎవార్డును ప్రకటించాడు. దీని ప్రకారం ముస్లిములు, సిక్కులు, యూరపియన్లతో పాటు దళితులకు కూడా రిజర్వేషన్లు ప్రకటించింది. గాంధీ దీన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 20 న ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. ఫలితంగా గాంధీ, అంబేద్కరుల మధ్య పూనా ఒడంబడిక కుదిరింది. సెప్టెంబరు 26 న గాంధీ దీక్ష విరమించాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో శాసనోల్లంఘన ఉద్యమం వెనకబడి పోయింది.  దీన్ని కొందరు కాంగ్రెసు నాయకులు తప్పుబట్టారు. నెహ్రూ కూడా ఈ పరిణామం పట్ల బాధపడ్డాడు. నిరాహార దీక్షకు ఇది సమయం కాదని, దీని వల్ల ఉద్యమం నీరుగారిపోతోందనీ అతడు భావించాడు.

బ్రిటిషు ప్రభుత్వం అణచివేత చర్యల మధ్య 1933 జనవరి 26 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనేక మంది అరెస్టయ్యారు.

గాంధీ నిరాహారదీక్ష, ఉద్యమం తాత్కాలిక నిలిపివేత

[మార్చు]

హరిజనోద్ధరణ కోసం, తనను తాను మనసికంగా పరిశుద్ధం చేసుకునేందుకు తాను మళ్ళీ 21 రోజుల పాటు నిరాహారదీక్ష చేస్తానని 1933 మే 8 న గాంధీ యెరవాడ జైలులో ప్రకటించాడు. అతని ఉద్దేశం ఉన్నతమైనదని భావిస్తూ ప్రభుత్వం అతన్ని విడుదల చేసింది.

జైల నుండి విడుదల కాగానే చేసిన ఒక ప్రకటనలో గాంధీ, "అనేక మంది శాసనోల్లంఘన ఉద్యమకారుల ధైర్యసాహసాలు, ఆత్మబలిదానాలకు ప్రశంసలు తప్ప మరేమీ చెప్పలేను. గోప్యత ఈ ఉద్యమ విజయానికి గొడ్డలిపెట్టు. రహస్యాలేమీ లేకుండా చెయ్యమని దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్యమానికి మార్గనిర్దేశం చేస్తున్న వారిని కోరుతున్నాను. భయం సామాన్య ప్రజానీకాన్ని ఆక్రమించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్డినెన్స్‌లు వారిని నీరుగార్చాయి." అని ప్రకటించాడు. తాను నిరాహారదీక్ష చేస్తున్న కాలంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని సస్పెండు చేయవలసినదని కాంగ్రెసు తాత్కాలిక అధ్యక్షుడు ఎం.ఎస్. అనేను కోరాడు. అదే ప్రకటనలో, అరెస్టైన ఉద్యమకారులను విడుదల చెయ్యమని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసాడు. గాంధీ కోరిక మేరకు తాత్కాలిక అధ్యక్షుడు అనే, ఉద్యమాన్ని 6 వారాల పాటు సస్పెండు చేస్తున్నట్లు మే 9 న ప్రకటించాడు.  ఆ తరువాత మరో 6 వారాల పాటు దాన్ని పొడిగించాడు. చట్ట విరుద్ధమైన ఉద్యమాన్ని పూర్తిగా ఆపేవరకూ ఉద్యమకారులను విడుదల చెయ్యమని వైస్రాయి సమాధానమిచ్చాడు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధీ సస్పెండు చెయ్యడాన్ని సుభాష్ చంద్ర బోసు, విఠల్‌భాయి పటేల్‌లు ఒక సంయుక్త ప్రకటనలో విమర్శించారు.

వ్యక్తిగత శాసనోల్లంఘనం

[మార్చు]

1933 జూలైలో పూనాలో కాంగ్రెసు నాయకుల సమావేశం జరిగింది. అందులో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపాలా లేదా అనే చర్చ జరిగింది. అనేకమంది నాయకులు ఆపేయాలని అభిప్రాయపడ్డారు.  కానీ గాంధీ ఉద్యమాన్ని ఆపకూడదని వాదించాడు.  చివరకు సామూహికంగా ఉద్యమం చెయ్యడం కాకుండా వ్యక్తిగతంగా శాసనోల్లంఘన చెయ్యాలనీ, గాంధీ వైస్రాయితో సమావేశం కోరాలనీ తీర్మానించారు.  అయితే వైస్రాయి, ఈ చట్టవిరుద్ధమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని పూర్తిగా ఆపేవరకూ గాంధీని కలవనని ప్రకటించాడు.  వ్యక్త్రిగత సత్యాగ్రహాన్నే వ్యష్టి సత్యాగ్రహం అని కూడా అంటారు.

వ్యక్తిగత శాసనోల్లంఘన నిర్ణయానికి అనుగుణంగా గాంధీ, సబర్మతి ఆశ్రమాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాడు. అయితే ప్రభుత్వం దాన్ని తీసుకోలేదు. అక్కడి నుండి గాంధీ పాదయాత్రగా రస్ అనే ప్రదేశానికి బయలుదేరగా ప్రభుత్వం అతన్ని ఆపి పూనా వెళ్ళమని ఆదేశించింది. దానిని ధిక్కరించిన గాంధీని అరెస్టు చేసి ఒక సంవత్సరం శిక్ష విధించింది. ఈ విధంగా కాంగ్రెసు నాయకులు కూడా ఒక్కరొక్కరే వ్యక్తిగత శాసనోల్లంఘన చేసి అరెస్టయ్యారు.

1934 కొత్త సంవత్సరాదిన కాంగ్రెసు పార్టీ ఇలా వ్యాఖ్యానించింది: "వ్యక్తిగత శాసనోల్లంఘన సంతృప్తికరంగా జరగ లేదు. 1933 జూలై సమావేశంలో, వివిధ ప్రాంతాల కాంగ్రెసు నాయకులు వాగ్దానం చేసినట్లుగా ఉద్యమాలు పెద్దగా చెయ్యలేదు. జైళ్ళ నుండి విడుదలై వచ్చిన వాళ్ళు తిరిగి జైళ్ళకు వెళ్ళేందుకు సుముఖత చూపలేదు".

1934 జనవరి నుండి శాసనోల్లంఘన దాదాపుగా ఆగిపోయింది. చివరికి 1934 ఏప్రిల్ 7 న శాసనోల్లంఘన ఉద్యమాన్ని అధికారికంగా ముగించారు.

ఉద్యమ కారులపై బ్రిటిషు ప్రభుత్వ దమనకాండ

[మార్చు]

ఉద్యమ కారులపై బ్రిటిషు ప్రభుత్వం విపరీతంగా దమనకాండ జరిపింది. ప్రభుత్వ దమన నీతి రెండు విధాలుగా ఉంది:

  1. అనేక తాత్కాలిక రాకాసి చట్టాలను ఆర్డినెన్సుల రూపంలో తీసుకువచ్చింది. కేవలం 3 నెలల కాలానికి మాత్రమే ఆర్డినెన్సులను ఉద్దేశించాలి. ఆతరువాత వాటిని శాసనసభ ద్వారా చట్టాలుగా మార్చాలి. కానీ ప్రభుత్వం అనేక నెలల పాటు వాటిని అలాగే అమలు చేసింది.
  2. క్షేత్ర స్థాయిలో పోలీసులను ఇతర బలగాలనూ నియోగించి ఉద్యమ కారులను - మహిళలతో సహా - అణచివేసింది, చిత్రహింసలు పెట్టింది.

ప్రభుత్వ దమన నీతిని పరిశీలించేందుకు బ్రిటన్ నుండి నలుగురు సభ్యుల స్వతంత్ర బృందం ఒకటి భారతదేశంలో 1932 ఆగస్టు నుండి నవంబరు వరకూ పర్యటించింది. లండన్ లోని ఇండియాలీగ్ ఈ పర్యటనను ఏర్పాటు చేసింది. నలుగురు సభ్యులూ ఒక్కొక్కరు సగటున 12,000 మైళ్ళ దూరం దేశంలో ప్రయాణించి, స్వయంగా ప్రజలతో మాట్లాడి, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసారు. "కండిషన్ ఆఫ్ ఇండియా: బీయింగ్ ది రిపోర్ట్ ఆప్ ది డెలిగేషన్ సెంట్ టు ఇండియా బై ది ఇండియా లీగ్, ఇన్ 1932" అనే పేరుతో 534 పేజీల నివేదికను సమర్పించారు. తమ పర్యటన అంతంలో చెప్పిన మాటలను ఆ నివేదికలో ఇలా చెప్పారు:

పది నెలల ఆర్డినెన్సు పాలన చూసాక, భారతదేశాన్ని వీడి వెళ్తున్నాం. ఆర్డినెన్సులు వాస్తవానికి మూడు నెలల కాలానికే ఉద్దేశించబడ్డాయి. వాటికి చట్టబద్ధమైన శాశ్వతత్వం ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ఇప్పుడు గుర్తించింది. వారి వైఫల్యానికి ఇంతకంటే మంచి రుజువు అవసరం లేదు. ఆర్డినెన్సుల వలన మరిన్ని ఆర్డినెన్సులు పుట్టుకొస్తాయి, మరింత అసంతృప్తి పుట్టుకొస్తుంది. ఆగ్రహం, అసంతృప్తిల పరిమాణం - వ్యక్తమైన రూపం ఏదైనా - పెరిగింది. సామాన్య ప్రజలు ఎన్నో కష్టాలకు లోనయ్యారు. కానీ వారు ధైర్యంతో, ఓర్పుతో వాటిని భరించారు. అవి క్రూరమైన అణచివేత చర్యలు పెట్టిన పరీక్షకు నిలబడ్డాయి. భారతదేశం విదేశీయుడితో పోరాడడం మాత్రమే కాదు, తన ఇంటిని చక్కదిద్దుకుంటోంది కూడా. అలహాబాద్‌లో ఐక్యత కోసం జరిగిన గొప్ప ప్రయత్నం భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి. దాని ఫలితం ఏమైనప్పటికీ, పరస్పరం అంగీకరించాలనే సంకల్పం ఇప్పుడు భారతీయ రాజకీయ జీవితంలో ఒక శక్తివంతమైన అంశంగా ఉందని గుర్తించి మేం సంతృప్తి చెందాం.

ఫలితాలు, పర్యవసానాలు

[మార్చు]

ఉప్పుపై పన్ను ఎత్తివేసారు. ఉప్పు సత్యాగ్రహం వలన ప్రపంచ వ్యాప్తంగా భారత స్వాతంత్ర్యోద్యమానికి వచ్చిన గుర్తింపుతో, ప్రజల్లో అది తీసుకువచ్చిన చైతన్యంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. బ్రిటన్నుండి వచ్చే దిగుమతులు బాగా తగ్గిపోయాయి. 1929-30 లో రూ 103.10 కోట్లు ఉన్న దిగుమతులు 1930-31 లో రూ 61.29 కోట్లకు, 1931-32 లో రూ 44.76 కోట్లకూ పడిపోయాయి.

ఉద్యమం తలపెట్టినపుడు, ఉప్పు తయారు చేయడంలో విశేషమేముందని బ్రిటిషు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. "చిటికెడు ఉప్పుతో ప్రభుత్వాన్ని కూలదోసే పిచ్చి ప్రయత్నం" అని వైస్రాయి ఇర్విన్ అన్నాడు.  ప్రభుత్వానికి కొమ్ము కాసే ది స్టేట్స్‌మన్ పత్రిక "అధినివేశ ప్రతిపత్తి వచ్చేవరకూ గాంధీ సముద్రాన్ని మరిగిస్తాడట" అని హేళన చేసింది. కానీ ఆ ఉద్యమం పెరిగి పెరిగి గాలివానగా మారడంతో ఆందోళన చెందింది. ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య ఆందోళనకు గుర్తింపు, మద్దతూ తెచ్చిపెట్టిన ఉద్యమం ఈ శాసనోల్లంఘన. టైమ్ పత్రిక గాంధీని తన 1930 మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. దండి యాత్రను "న్యూ ఇంగ్లాండ్ వాసులు ఒకప్పుడు బ్రిటిషు టీ పన్నును ధిక్కరించినట్లుగా వీళ్ళు బ్రిటిషు ఉప్పు పన్నును ధిక్కరించారు" అని పోల్చింది.

ప్రజలు పెద్దయెత్తున స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రముఖ నాయకులందరినీ జైళ్ళలో వేసినప్పటికీ, బ్రిటిషు ప్రభుత్వం ఉద్యమాన్ని ఆపలేకపోయింది. తమ పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అడ్డుకోలేక పోయింది. పరాయిపాలన పట్ల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమించారు. మహిళలు కూడా పెద్దయెత్తున పాల్గొన్న ఉద్యమం ఇది.

గాంధీ ఇర్విన్ లు జరిపిన సమాలోచనలు సమాన ఫాయీలో జరిగాయి.  కాంగ్రెసు భారతీయులందరికీ ప్రతినిధి అని, దానితో సగౌరవంగా వ్యవహరించాలనీ బ్రిటిషు ప్రభుత్వం గుర్తించిందని చెప్పడానికి అది సూచిక. అలాంటి స్థితి రావడం పట్ల బ్రిటిషు ప్రముఖులు కొందరు బాధపడ్డారు. వారిలో చర్చిల్ ఒకడు. "మిస్టర్ గాంధీ అనే ఈ మిడిల్ టెంపుల్ లాయరు, ఒక పక్కన దేశంలో శాసనోల్లంఘన ఉద్యమం చేయిస్తూనే, మరో వైపు ఇలా.. మొలకొక పంచె కట్టుకుని, చొక్కా లేకుండా తూర్పు దేశాల్లో ఉండే ఫకీరు లాగా తయారై, రాజప్రతినిధి యైన వైస్రాయితో సమాన ఫాయీలో చర్చించేందుకు వైస్రాయి భవనపు మెట్లు ఎక్కిరావడం చూస్తూంటే ఆందోళన గానూ, వెగటు కలిగిస్తూనూ ఉంది." అని చర్చిల్ వ్యాఖ్యానించాడు.  ఇర్విన్ తరువాత వైస్రాయిగా వచ్చిన వెల్లింగ్‌డన్ చేపట్టిన చర్యలు ఈ బాధ నుండి వచ్చినవే అని కొందరు చరిత్రకారులు భావించారు.

ఇండియా లీగ్ సంస్థ బ్రిటిషు పౌరులతో ఏర్పాటు చేసిన స్వతంత్ర బృందం భారతదేశంలో పరిస్థితిని కూలంకషంగా పరిశీలించి ఇచ్చిన తటస్థ నివేదిక, దేశంలోని పరిస్థితులకూ, బ్రిటిషు ప్రభుత్వ దమనకాండకూ రూపుకట్టింది. ఉద్యమానికి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

శాసనోల్లంఘన ఉద్యమం, అది తలపెట్టిన లక్ష్యాలను సాధించలేక పోయింది. ప్రజలు పెద్దయెత్తున స్వచ్ఛందంగా పాల్గొన్నప్పటికీ, ఉద్యమాన్ని సరిగా నడిపించడంలో నాయకత్వం విఫలమైంది. ఏక దీక్షతో ఉద్యమం జరుగుతూ ఉన్న క్రమంలో అంటరానితనం, హరిజనోద్ధరణ వంటి ఇతర అంశాలను కూడా చేపట్టడంతో ఉద్యమం పదును కోల్పోయింది. మధ్యలో ఒక సంవత్సరం పాటు అంతరాయం కూడా రావడంతో బ్రిటిషు ప్రభుత్వం తేరుకుని తగు సన్నాహాలు చేసుకుని మలి ఉద్యమాన్ని అణచివేసేందుకు బాగా సిద్ధమైంది, అణచివేసింది కూడా.  తుదకు ఉద్యమం ఆరు వారాల పాటు తాత్కాలికంగా ఆగిపోయి, మరో ఆరువారాల పాటు సస్పెన్షను కొనసాగి, ఆపైన వ్యక్తిగత ఉద్యమంగా మారి, చివరికి ఆగిపోయింది.

ఈ ఉద్యమం ముగిసాక గాంధీ, హరిజనోద్ధరణ, మత సామరస్యం వంటి సామాజిక అంశాల పైననే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాడు. కాంగ్రెసు పార్టీతో బంధం తెంచుకున్నాడు.