శ్రీరామేశ్వర కవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీరామేశ్వర కవులు పేరుతో రావూరి శ్రీరాములు, ప్రతాప వేంకటేశ్వరులు జంటగా కవిత్వం చెప్పారు. అవధానాలు కూడా చేశారు. వీరు మొదటిలో వేంకట రామకవులు పేరుతో జంటకవిత్వం చెప్పేవారు. తరువాత శ్రీరామేశ్వర కవులుగా పేరు మార్చుకొన్నారు.[1]

రావూరి శ్రీరాములు

[మార్చు]

శ్రీరాములు 1891 లో వికృతి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ షష్ఠి నాడు మన్నవ శేషగిరిరావు, రామమ్మ దంపతులకు గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో జన్మించాడు. ఇతడిని రావూరి వేంకటకృష్ణయ్య, చిన్నమాంబ దంపతులు దత్తతకు తీసుకున్నారు. ఇతడు తెనాలి సంస్కృత కళాశాలలో తన సహధ్యాయి అయిన ప్రతాప వేంకటేశ్వరులుతో కలిసి జంటగా కవిత్వం చెప్పాడు. ఇతడు పిన్నవయసులోనే 1923 అనగా దుర్మతి నామ సంవత్సర చైత్ర శుద్ధ తదియనాడు హఠాత్తుగా మరణించాడు.

ప్రతాప వేంకటేశ్వరులు

[మార్చు]
ప్రతాప వేంకటేశ్వర్లు

ఇతడు 1892 అనగా నందన నామ సంవత్సర శ్రావణ శుద్ధ దశమి నాడు మహాలక్ష్మమ్మ, కోటయ్యశాస్త్రి దంపతులకు గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో జన్మించాడు. ఇతడు తెనాలి సంస్కృత కళాశాలలో చదివి విద్వాన్ పట్టా పొందాడు. ఇతడు శ్రీరాములుతో కలిసి జంటగా చేసిన అవధానాలు కాక శ్రీరాములు మరణించిన తర్వాత కొంత కాలం అవధాన ప్రదర్శనం నిలిపివేసినా తరువాత అవధానాలు చేయడం ప్రారంభించాడు. ఇతడు ఒంటరిగా మన్నవ, కొత్తరెడ్డిపాలెం, చేబ్రోలు, చెఱుకుపల్లి, మధిర, రేమిడిచర్ల లలో శతావధానాలు, తెనాలి, ముత్తుకూరు, జగ్గయ్యపేట, రేమిడిచర్ల, తెట్టు, చుండూరు, మధిర మొదలైన చోట్ల అష్టావధానాలు చేశాడు. ఇతడు విజయవాడలో కొంతకాలం ఉద్యోగం చేశాడు. ఇతడికి కవికిశోర, అవధాన కంఠీరవ ఇత్యాది బిరుదులు, దుర్భా సుబ్రహ్మణ్యశాస్త్రి వంటి పండితులచే సువర్ణ ఘంటికా ప్రదానము వంటి సత్కారాలు జరిగాయి.

జంట అవధానాలు

[మార్చు]

ఈ కవులిద్దరూ కలిసి 12 సంవత్సరాల పాటు అవధానాలు నిర్వహించారు. వీరు ఇనగల్లు, మొగలతుర్తి, పెంటపాడు, అత్తిలి, కొలకలూరు, భీమడోలు, గుండుగొలను, నెల్లూరు, బాపట్ల, గూడూరు, ఒంగోలు మొదలైన చోట్ల తమ అవధాన విద్యను ప్రదర్శించారు. వీరు నిర్వహించిన అవధానాలు పశ్చిమ గోదావరిజిల్లా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఖమ్మం జిల్లాలకే పరిమితం కావడం వల్ల వీరికి తగిన ప్రచారం లభించలేదు. వీరు అవధానలలో పూరించిన పద్యాలను 1927లో ప్రతాప వేంకటేశ్వరులు అవధాన మంజరి అనే పేరుతో ప్రకటించాడు.[2] వీరు అవధానాలే కాక హనుమన్నక్షత్రమాల, వేణుగోపాలతారావళి, సారంగధర వంటి రచనలు కూడా చేశారు.

అవధానాలలో పూరించిన కొన్ని పద్యాలు

[మార్చు]
  • సమస్య:వికసించెన్ గమలంబు గోడను నిశావేళన్ విచిత్రంబుగన్

పూరణ:

ఒక యబ్జానన ప్రక్కయింటి విటుపై నుత్సాహముం జెంది యె
ట్లిఁక వానిం గవయంగ నంచు నడిరేయిన్ బార్శ్వకుడ్యస్థలీ
నికటంబందున నిల్వగాంచి యత డెంతే భ్రాంతి నిట్లెంచుగా
వికసించెన్ గమలంబు గోడను నిశావేళన్ విచిత్రంబుగన్

  • సమస్య: రతికై పిల్వగ నాత్మసోదరియె రారమ్మంచు మున్వచ్చెదాన్

పూరణ:

అతిభక్తిన్ మనయగ్రజుండిటు శుభంబౌనంచుఁ గావింపగా
హితులున్ బంధువులున్ నుతించు నటులయ్యెన్ సత్యనారాయణ
వ్రత సంపూర్తి ప్రసాదమీయవలెనప్పా వేవేగరమ్మంచు హా
రతికై పిల్వగ నాత్మసోదరియె రారమ్మంచు మున్వచ్చెదాన్

  • దత్తపది: నగరు - తగరు - తొగరు - వగరు అనే పదాలతో రామాయణార్థంలో పద్యం

పూరణ:

నగరుల సౌరుమానె విపినమ్ములకున్ రఘురాము డేగుచో
తగరు మఱొక్క రీవిధము ధారుణిపాలన జేయనంచు కెం
దొగరుచి కన్గవన్ గన వినూతన బాష్పకణమ్ము లొల్క పెన్
వగ రుచిలేని వాక్సమితి వాకొనుచుండె నయోధ్య నెల్లరున్

మూలాలు

[మార్చు]
  1. రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 170–174.
  2. ప్రతాప, వేంకటేశ్వరకవి (1 January 1927). అవధాన మంజరి (ప్రథమ ed.). తెనాలి: ప్రతాప వేంకటేశ్వరకవి. pp. 1–138. Retrieved 24 July 2016.