Jump to content

చెరుకుపల్లి

వికీపీడియా నుండి
(చెరుకుపల్లి (గుంటూరు జిల్లా) నుండి దారిమార్పు చెందింది)

చెరుకుపల్లి, ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. అదే చెరుకుపల్లి మండలానకి కేంద్రం.ఇది ఆరుంబాక శివారు గ్రామం.

పేరువెనుక చరిత్ర

[మార్చు]
చెరుకుపల్లి సబ్ రిజిస్ట్రారు కార్యాలయం
ప్రస్తుతం చెరుకుపల్లిలో సబ్ రిజిస్ట్రారు కార్యాలయంగా ఉన్న 1928 నాటి భవనం

సుమారు 300 సం. లకు పూర్వం గుంటూరు జిల్లా పెనుమూడి గ్రామానికి చెందిన యెల్లాప్రగడ శాసుర్లు బాపట్ల సమీప గ్రామానికి కాలినడకన ప్రయాణం చేస్థూ విరామం కోసం ఈ ప్రాంతంలో ఆగి పరిసరాలను గమనించి గ్రామనిర్మాణానికి అనువైనదిగా భావించి కొంతకాలం తరువాత వారు మరికొంతమందితో కుటుంబసమేతంగా విచేసి గృహాలను నిర్మించుకొని నీటివనరుకై ప్రయత్నం చేస్తుండగా కేవలం చెలమలోతులోనే చెరుకురసం వంటి మంచి నీరు లభించటంతో ఈ గ్రామానికి చెరుకుపల్లి అని నామకరణం చేసి వారి ఇంటి పేరును చెరుకుపల్లిగా మార్చుకొని చెరుకుపల్లి పెదశాసుర్లు గా ప్రసిద్ధి చెందాడు. వీరి కుమారుడు శ్రీరాములు గారు అన్ని కులాల వారు నివసిస్థేనే గ్రామానికి పూర్థి శోభ చేకూరుతు౦దని భావించి నాలుగు వర్నాలవారు స్థిరపడడానికి చాలా కృషి చేసారు. నారుమడులకు అవసరమైన నీటి కోసమని దొరువు తీస్తూ౦డగా పోలేరమ్మ అమ్మవారి విగ్రహం లభించింది. విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చి తాటాకులతో నీడ ఏర్పాటుచేసి రజకులను పూజారులుగా నియమించి ప్రతినిత్యం ధూపదీపనైవేద్యములు జరిపేలా ఏర్పాట్లు చేసారు. గ్రామంలో అమ్మవారి విగ్రహం లభించటం శుభసూచకంగా భావించి గ్రామస్థులంతా అమ్మవారికి పూజలు చేయటం ప్రారంభించారు. శ్రీరాములుగారు వ్యవసాయపనులకు వెళుతూ భోజనం, మంచినీళ్ళు వెంటతీసుకొని వెళ్ళేవారు, సాయంత్రానికి తెచ్చుకున్న మంచినీళ్ళు ఆయిపోవడంతో "అమ్మాపోలేరా దాహంగా ఉందమ్మా" అని తలచుకోగానే అమ్మవారు అద్రుశ్యరూపంలో గజ్జెల పట్టీల సవ్వడితో వచ్చి మంచి నీళ్ళు పోస్తుంటే శ్రీరాములుగారు దోసిటపట్టి నీళ్ళు త్రాగటం చూసిన తోటిపనివారు ఆశ్ఛర్యంతో ఇళ్ళకు వెళ్ళి కుటుంబసభ్యులతో జరిగిన వింత గురించి చెప్పుకొనేవారట. ప్రతిసంవత్సరం మొదటి ఆధివారం, బ్రాహ్మణులు అమ్మవారికి చద్దినైవేద్యాలు సమర్పించేవారు.

గ్రామ భౌగోళికం

[మార్చు]

చెరుకుపల్లి గ్రామం, జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 40 కి.మీ ల దూరంలో ఉంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

చెరుకుపల్లి గ్రామం, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రహదార్లతో విస్తృతంగా కలపబడి ఉంది. దగ్గరలోని రైలు స్టేషన్లు: తెనాలి, పొన్నూరు, రేపల్లె. పొన్నూరు పట్టణం నుండి 15 కి.మీ.లు, తెనాలి పట్టణం నుండి 25 కి.మీ.లు, రేపల్లె పట్టణం నుండి 23 కి.మీ. ల దూరంలోను చెరుకుపల్లి ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]
  • చెరుకుపల్లి లోని ప్రైవేటు డిగ్రీ కళాశాల.
  • కావూరు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల.
  • శాస్త్రి మెమోరియల్ ప్రాధమికోన్నత పాఠశాల, చెరుకుపల్లి:- చెరుకుపల్లి గ్రామవాస్థవ్యులు, చెరుకుపల్లి శాస్త్రులుచే 1946 వ సంవత్సరంలో ఇద్దరు ఉపాధ్యాయులతో ప్రారంభించబడిన ఈ పాఠశాల 1952 లో అంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలగా మార్చబడింది.

విద్యా విశేషాలు

[మార్చు]
  • ఈ గ్రామానికి చెందిన శ్రీ తూనుగుంట గౌరీశంకర్, లక్షీపద్మావతి దంపతులకు చిరువ్యాపారమే జీవనాధారం. పెద్దగా ఆర్థికస్తోమతులేని కుటుంబం. వీరి చిన్నకుమార్తె శివనాగజ్యోతి, చిన్నప్పటినుండి ప్రభుత్వ పాఠశాలలోనే చదివినది. 10వ తరగతి పరీక్షలలో ఈమె రేపల్లె డివిజనులోనే ప్రథమురాలుగా ఉత్తీర్ణురాలై, నూజివీడు ఐ.ఐ.ఐ.టి.లో సీటు సాధించింది. అక్కడగూడా ఈమె కష్టపడి చదివి తన ప్రతిభతో బి.టెక్.లో క్యాంపస్ లోనే ప్రథమురాలిగా ఉత్తీర్ణురాలై బంగారుపతకం సాధించింది.

మౌలిక సదుపాయాలు

[మార్చు]
చెరుకుపల్లి లోని ప్రభుత్వ కార్యాలయాలు
చెరుకుపల్లి లోని ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయం

వైద్య సౌకర్యం:

[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం. చెరుకుపల్లిలో ఉన్న ప్రైవేటు అసుపత్రులు చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.

అంగనవాడీ కేంద్రం

[మార్చు]

బ్యాంకులు

[మార్చు]

చెరుకుపల్లిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు శాఖను, 2015 డిసెంబరు-30 న ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో ఇది అ బ్యాంకు 49వ శాఖ. ఆంధ్రా బ్యాంకు శాఖ కూడా ఉంది.

సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

రామయ్య చెరువు:- సుమారు 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును ఇటీవల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, పూడిక తీసి అభివృద్ధి పరచారు. ఈ విధంగా చేయుటవలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగింది. ఈ పూడిక మట్టితో ఆదర్శ కాలనీలో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టినారు. ఈ పూడికతీత మట్టిని రైతులు ట్రాక్టర్లతో తమ పొలాలకు తరలించుకుని, తద్వారా రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకొని, ధనం ఆదా చేసుకున్నారు. మట్టి తీయడంతో చెరువులో నీరు ఊరినది. అడపాడపా పడిన వర్షాలతో చెరువు నిండినది. ఈ నీటితో చెరుకుపల్లి, అరుంబాక గ్రామాల రైతులకు సాగునీటి ఇబ్బంది తప్పినది. నీరు లేక భూములు బీడుగా ఉంచాల్సివస్తుందని భయపడిన రైతులు, చెరువునీటితో సాగుచేసి, ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. రేపల్లె నియోజకవర్గంలో ప్రధాన పంచాయితీగా అభివృద్ధి చెందింది.
  2. 2013 జూలై లో ఈగ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచి గా దేవరకొండ శ్రీదేవి ఎన్నికైంది
  3. చెరుకుపల్లిలో రు. 30 లక్షల వ్యయంతో గ్రామ పంచాయతీ భవనం నిర్మించారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

గుడిస్వయంభూగా లభించిన పోలేరమ్మ విగ్రహాన్ని బ్రాహ్మణకుటుంబంచే స్థాపించబడి పూజందుకోవడం వెశేషం. ఈ అమ్మవారి తిరునాళ్ళు, 2014,మే-27 మంగళవారం నాడు అత్యంతవైభవంగా నిర్వహించారు. రు. 50 లక్షలతో పునర్నిర్మాణం అయిన తరువాత మొదటిసారి జరుగుచున్న ఈ ఉత్సవంలో భారీ ఎత్తున ఏర్పాట్లుచేసారు. విద్యుత్తు ప్రభలు గూడా భారీ యెత్తున ఏర్పాటుచేసారు. ఉదయం నుండియే భక్తులు అమ్మవారిని దర్శించుకొని కానుకలు చెల్లించుకున్నారు. సాయంత్రం 5 గంటలనుండి జరిగిన పోలేరమ్మ శిడిమానోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. మరుసటి రోజు 28వ తేదీ బుధవారం నాడు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి, అమ్మవారికి చద్దినైవేద్యాలు సపర్పించుకున్నారు.

శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

దేవాలయ ఆవరణలో, గ్రామస్థుల విరాళాలు 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మంటప నిర్మాణానికి, 2015,జూన్-11వ తేదీ గురువారంనాడు, శంకుస్థాపన నిర్వహించారు.

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు 2014,మే-10, శనివారం నాడు వైభవంగా నిర్వహించారు.

శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 2014,మే-14 న (వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి 11 రకాలతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి లక్ష మల్లెల పూజ, చండీ హోమం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి కళ్యాణోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు.

శ్రీ భూనీలాసమేత చెన్నకేశ్వస్వామివారి అలయం

[మార్చు]

ఈ ఆలయంలో, 2014,జూన్-9, సోమవారం నాడు, వార్షిక కళ్యాణ మహోత్సవాలు ప్రారంభించారు. పంచాహ్నిక దీక్షతో నిర్వహించుచున్న ఈ కార్యక్రమంలో తొలిరోజు స్వామివారికి స్నపన కార్యక్రమం నిర్వహించి, పెళ్ళికుమారునిగా అలంకరించారు. ఈ కల్యాణ కార్యక్రమాలలో భాగంగా, రాత్రికి అంకురార్పణ, రుత్విగ్వరణము నిర్వహించారు. మంగళవారం నాడు, ధ్వజారోహణ చేసారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. మూడవ రోజు బుధవారం ఉదయం, నిత్యహోమం, బలిహరణ నిర్వహించారు. నాల్గవరోజు గురువారం రాత్రి 8 గంట్లకు స్వామివారికి ఎదురుకోలోత్సవం, 9 గంటలకు కళ్యాణం నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 13వ తేదీ శుక్రవారం నాడు, నిత్యహోమం, బలిహరణ నిరవహించారు. అనంతరం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి, చెరుకుపల్లి వీధులలో ఊరేగినారు. గ్రామోత్సవంలో మహిళలు స్వామివారికి హారతులు సమర్పించారు. 14వ తేదీ శనివారం నాడు ఈ ఆలయంలో విశేషపూజలు నిర్వహించారు. వెకువఝాముననే, నిత్యహోమం, బలిహరణం, వసంతోత్సవం, చక్రస్నానాలు నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి నిర్వహించి, ధ్వజారోహణ చేసారు. 15వ తేదీ ఆదివారం నాడు, స్వామివారి కల్యాణమహోత్సవాలు ముగింపుకు చేరుకున్నవి. ముగింపు సందర్భంగా ఆదివారం ఉదయం వైఖాసన శాస్త్రోక్తవిధిగా స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించారు. రాత్రి జరిగిన పవళింపుసేవ కార్యక్రమంలో మహిళలు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు.

శ్రీ రామాలయం

[మార్చు]

స్థానిక వీరరాఘవపేటలోని ఈ ఆలయంలో, గత 49 సంవత్సరాలుగా, శ్రీ సీతారాముల వసంతనవరాత్రి ఉత్సవాలు, వార్షికంగా నిర్వహించుచున్నారు. 2015,మార్చి-29వ తేదీ నాడు, ఈ సంవత్సరపు ఉత్సవాలు ముగింపునకు వచ్చినవి. ముగింపు సందర్భంగా ఆలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతాలలో పలువురు దంపతులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల ముగింపు అనంతరం, రాత్రికి, శ్రీ సీతారాములకు నిర్వహించిన పవళింపు సేవలో మహిళలు అధికసంఖ్యలో పాల్గొని, జోలపాటలు పాడినారు.

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

చెరుకుపల్లి గ్రామంలోని ఆదర్శ కాలనీలో ఈ ఆలయ నిర్మాణానికి 2017,ఫిబ్రవరి-19వతేదీ ఆదివారంనాడు భూమిపూజ నిర్వహించారు. తిరుమల-తిరుపతి దేవస్థానం సహకారంతో సమరసత సేవా ఫౌండేషన్ ఈ నిర్మాణాన్ని చేపట్టినది.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం

[మార్చు]

గ్రామంలోని వీరరాఘవపేటలోని ఈ ఆలయ వార్షికోత్స వేడుకలను, 2015,మే నెల-1,2,3 తేదీలలో వైభవంగా నిర్వహించారు.

శ్రీ నాగదేవత ఆలయం

[మార్చు]

పెద్దపల్లి గ్రామ గొల్లపాలెంలోని ఈ ఆలయ నాలుగవ వార్షికోత్సవ వేడుకలు 2017, జూన్- 9 శుక్రవారంనాడు ప్రారంభమైంది

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • కవి, తెలుగులెంక బిరుదుపొందిన తుమ్మల సీతారామమూర్తి మండలంలోని కావూరు గ్రామంలో జన్మించాడు.
  • క్రికెట్ ఆటగాడు, వి.వి.ఎస్ లక్ష్మణ్ స్వగ్రామం మండలంలోని బలుసులపాలెం. ఆయన తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు.
  • కె.వి.వి మాజీ ఛైర్మన్ మరియూ కోస్తా జిల్లాల గ్రామోద్యోగుల సంఘ మాజీ అధ్యక్షులు అయిన శ్రీ గోగినేని నాగేశ్వరరావు, ఆసియా పసిఫిక్ అచీవర్స్ పురస్కారం అందుకున్నారు. 2014, జూన్-15 న రష్యాలోని తాష్కెంట్లో జరిగిన ఒక కార్యక్రమంలో, సామాజిక, విద్యా, సేవారంగాలలో వివిధసేవలు అందించిన పలువురికి ఈ పురస్కారాలు అందజేసినారు. శ్రీ గోగినేని నాగేశ్వరరావు, దశాబ్దాల క్రితమే గ్రామీణ సేవాసంస్థను స్థాపించి, వయోజన విద్య తదితర సేవాకార్యక్రమాలను నిర్వహించారు. వీరు స్వయంగా వెళ్ళలేకపోయినందున, వీరికి రెండు రోజుల క్రితం తపాల ద్వారా జ్ఞాపిక, ప్రశంసాపత్రం పంపినారు.
  • చెరుకుపల్లి గ్రామం, ఈ మండలం లోని గ్రామాలకే కాక చుట్టుపక్కల ఉన్న ఇతర మండలాలలోని గ్రామాలకు కూడా కూడలిగా ఉంది. పొన్నూరు, రేపల్లె, తెనాలి, బాపట్ల రహదారులకు ఈ గ్రామం కూడలి. ఈ గ్రామం చుట్టుపట్ల మండలాలకు వైద్యసేవా కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం వ్యవసాయంపై, అందునా వరిపై ఆధారపడినది కనుక సహజంగానే ధాన్యం మిల్లులు చెరుకుపల్లిలో వెలిసాయి. అలాగే కలప కోత మిల్లులకు కూడా ఈ గ్రామం ప్రసిద్ధి. చుట్టుపక్కల తాటిచెట్లు విరివిగా ఉండటం చేత తాటిచెట్లే ఈ కోత మిషన్ల వద్ద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.అధిక శాతం మాగాణి పొలాలతో కూడిన ఈ మండలంలో మెట్ట ప్రాంతం కూడా ఉంది. వరితోపాటు, మినుము కూడా పండిస్తారు. మండలానికి ప్రకాశం బారేజి నుండి సాగునీరు సరఫరా అవుతుంది. భూగర్భ జలాలు తాగునీటికి ప్రధాన వనరు.
  • చెరుకుపల్లి గ్రామములోని ప్రభుత్వ కార్యాలయ సముదాయం వద్ద ఏర్పాటుచేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ, 2014, సెప్టెంబరు-20, శనివారం నాడు నిర్వహించారు.

కొన్ని వివరాలు

[మార్చు]

ప్రముఖ సమీప ప్రదేశాలు

[మార్చు]
  • వినయాశ్రమం: ఇది చెరుకుపల్లికి 4 కి.మీ.ల దూరంలో కావూరు గ్రామంలో ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం నెలకొల్పబడిన ఈ ఆశ్రమాన్ని గాంధీజీ సందర్శించాడు. అహింసా సిద్ధాంతం, ఇతర గాంధీ ప్రబోధాలను వ్యాపింపజేయడానికి స్థాపించబడిన ఈ ఆశ్రమ ప్రాంగణంలో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల, కర్షక పరిషత్, ఆయుర్వేద వైద్యాలయం పనిచేస్తున్నాయి.
  • దగ్గరలోని సముద్రతీరం: నిజాంపట్నం
  • పార్లమెంటులో ఈ ప్రాంతం
  • వినయాశ్రమం గురించి

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]