దావూద్ సాహెబ్ షేక్
దావూద్ సాహెబ్ షేక్ తెలుగు రచయిత. ఆయన కర్నూలు ఉస్మానియా కళాశాలలో తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన చేస్తూనే తెలుగు భాషాభివృద్ధి ధ్యేయంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను అనువదించి ప్రచురించారు. చివరి దశ వరకు తెలుగులో రచనలు గావించారు.
జీవిత విశేషాలు
[మార్చు]దావూద్ సాహెబ్ షేక్ కర్నూలు జిల్లా చిట్వేలు గ్రామములో ఖాదర్‌బి, సుల్తాన్ సాహెబ్ దంపతులకు జూలై 1 1916 న జన్మించారు. చిన్న నాటనే తల్లిదండ్రుల్ని కోల్పోయి, జీవనయానంలో బ్రతుకు తెరువుకై నెల్లూరు చేరుకొన్నారు. అక్కడ రూపాయిన్నర పెట్టుబడితో ట్రంకురోడ్డులో పెట్టుకొన్న కిళ్లీ కొట్టు తెలుగు సాహిత్యం పట్ల అతనిలో తొలి బీజాంకురం వేసింది. అలనాటి సుప్రసిద్ధ నెల్లూరు కవులు మరుపూరు కోదండరామిరెడ్డి, పిలకా గణపతిశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, రేవురు సుబ్బారావు, జక్కా సుధాకరం వంటి వుద్దండులు ప్రతి సాయంత్రం ‘సాహిత్య తాంబూల సేవన మంజూషా” (కిళ్లీ కొట్టుకి కవులు పెట్టుకున్న ముద్దు పేరు) వద్దకి చేరటం, తమతమ పద్య రచనా పఠనం గావించటం దావూదు కవిలో సాంప్రదాయక పద్యరచన పట్ల ఆసక్తిని పెంచిన విషయాలు. తనకు తొలి ఆడబిడ్డ పుట్టిన పిదప ఆయన ఆనాటి సంస్కృతాంధ్ర పండితులైన దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారిని ఆశ్రయించి తన 22వ యేట విద్యాభ్యాసానికి వొడిగట్టారు. అప్పటి పండిత వర్గం శర్మగారి వద్దకు చేరి ‘సాయిబుకు సంస్కృతం నేర్పుతున్నావటగా! ఇక రాళ్లదెబ్బలకు సిద్ధంగా వుండు’ అంటూ అవహేళన చేశారట. అయితే సంస్కృతాంధ్ర భాషల్లో మదరాసు విశ్వవిద్యాలయం ద్వారా విద్వాన్ పట్టా పుచ్చుకొని వుత్తరోత్తరా నంద్యాల పురపాలక పాఠశాలలో తెలుగు పండితుడుగా చేరిన పిదప తన తొలి మాసం వేతనాన్ని గురువుగారి పాదపద్మాలకి గురుదక్షిణగా మనియార్డరు ద్వారా సమర్పించుకున్నారు దావూదు కవి. ఆ మనియార్డరు చేతపుచ్చుకుని తనను దెప్పి పొడిచిన పండిత మిత్రుల్ని సమావేశపరచి ‘ఇదుగోనండీ! నా సాయిబు శిష్యుడు విసిరిన తొలి రాయి’ అంటూ దాన్ని అందరికీ చూపి పొంగిపోయారట దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారు. ఆ గురు శిష్యుల ఆత్మబలం అటువంటిది [1]. పిదప కర్నూలు ఉస్మానియా కళాశాలలో దాదాపు 30 సంవత్సరాలు తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన గావించారు. అరబిక్, ఉర్దూ, తెలుగు భాషల్లో మంచి విద్వత్తును సంపాదించిన ఆయన తెలుగు భాషాభివృద్ధి ధ్యేయంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను అనువదించి ప్రచురించారు. ఈయన రచనలపై తెలుగులో రెండు, ఉర్దూలో ఒక పి.హెచ్.డి. పరిశోధనలు జరిగాయి. చివరి దశ వరకు తెలుగులో రచనలు గావించారు. ఈయన 1994లో మరణించాడు.
రచనావ్యాసంగము
[మార్చు]- చిత్త పరివర్తనము
- దాసీపన్నా (1956)
- రసూల్ ప్రభువు శతకము
- సంస్కార ప్రయాణము (1957)
- సూఫి సూక్తులు
- సంత్‌వాణి
- అల్లా మాలిక్ శతకము
- సఖుడ (శతకం)
- క్రీడాషిర్డీశ్వరము
- సాయి శతకము
- సాయిబాబా దండకము
- సాయిబాబా చరిత్రము (కావ్యము)
- అభినవ తిక్కన కవితా సమీక్ష (వచనం)
- నాగూర్ ఖాదర్ వలీ చరిత్రము
- ఆజాదు చరిత్రము
- ఆదర్శము (నవల)
- అబ్దుల్ ఖాదర్ జీలాని
- గౌసుల్ ఆజం దస్తగిరి దివ్య చరిత్ర (వచనం)
- చంద్ర వదన మోహియార్ (ఖండ కావ్యము)
- కదిరి సమాధి గాథ
స్వతంత్ర రచనలు. తెలుగు అనువాదాలు
[మార్చు]దావూద్ సాహెబ్ షేక్ ఆశ్రుమాల (జయశంకర్ కృతికి అనువాదం), అనంద కుమార (హిందీ మిలన్ అనువాదం) వంటి స్వతంత్ర రచనలు కూడా చేసారు.
మూలాల జాబితా
[మార్చు]- సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 60
- ↑ "ముస్లిం తెలుగు కవుల్లో ఆణిముత్యం దావూదు కవి". Archived from the original on 2016-03-04. Retrieved 2020-06-11.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)