సురేంద్ర (కార్టూనిస్ట్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురేంద్ర
Surendra-cartoonist.png
పోసా సురేంద్రనాద్
జననం(1962-06-06)1962 జూన్ 6
India హనుమానగుత్తి ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంచెన్నై
వృత్తికార్టూన్ ఎడిటర్
ఉద్యోగంThe Hindu
ప్రసిద్ధిప్రముఖ కార్టూనిస్ట్.
మతంహిందూ
తండ్రిరామకృష్ణా రెడ్డి
తల్లిచిన్నమ్మ

సురేంద్ర ప్రముఖ వ్యంగ చిత్రకారుడు. 1996 సంవత్సరం నుండి ది హిందూ నేషనల్ డైలీలో కార్టూన్ ఎడిటర్ గా 2021 వరకు పనిచేశాడు.

బాల్యం, కళపై ఆశక్తి[మార్చు]

పోసా రామకృష్ణా రెడ్డి, చిన్నమ్మ దంపతులకు జూన్ 6 న 1962 లో హనుమానగుత్తి, వైఎస్‌ఆర్ జిల్లా లో జన్మించిన సురేంద్ర చదివింది బియస్సీ. వీరి పూర్తి పేరు పోసా సురేంద్రనాద్.

సురేంద్ర కార్టూనిస్టుగా మారడం అన్నది యాదృచ్ఛికంగా జరిగింది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ఎడిటర్‌గా ఉద్యోగం రావడంతో సురేంద్ర తండ్రి రామకృష్ణారెడ్డి తన కుటుంబాన్ని 1978 లో కడపనుండి విజయవాడ కు తరలించారు. అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతున్న సురేంద్రకు మామూలు పాఠ్యాంశాల కంటే పాఠ్యేతర విషయాలపైనే ఎక్కువగా దృష్టి వుండేది. తన తండ్రి రామకృష్ణారెడ్డి రచయిత. ఆయన ఆంధ్రజ్యోతి వారపత్రికకు సబ్ఎడిటర్‌ గా పనిచేశాడు.

విజయవాడలోని వారింటికి చాగంటి సోమయాజులు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య , వేగుంట మోహన ప్రసాద్ వంటి ప్రఖ్యాతకవులు, సాహితీవేత్తలు వస్తుండేవారు. సురేంద్రకు వారితో సంభాషించే అవకాశం కలిగేది.

కార్టూనిస్టుల నుండి ప్రచురణకు వచ్చే కార్టూన్లను సురేంద్ర తండ్రిగారైన రామకృష్ణారెడ్డి సెలక్ట్ చేస్తూ వుండేవాడు. అప్పటి కార్టూనిస్ట్ ల ఒరిజనల్ కార్టూన్లను చూస్తూ వుండడంతో క్రమక్రమంగా సురేంద్రకు కార్టూన్లపై ఆశక్తి ఏర్పడింది.

కార్టూన్ కళలో స్ఫూర్తి[మార్చు]

ఆ రోజుల్లో ప్రముఖ కార్టూనిస్ట్ అయిన మోహన్ (చిత్రకారుడు) విశాలాంధ్ర దినపత్రిక లో సర్ఎడిటర్ గానే కాక ఆర్టిస్ట్ గా కూడా పనిచేసేవాడు. ఆర్టిస్ట్ గా విశాలాంధ్ర వారి పుస్తకాలకు ఆయన వేసే ముఖచిత్రాలు, ఆయన రాసే ఒక ప్రత్యేకమైన రాత సురేంద్రను బాగా ఆకర్షించేవి. అందుకేనేమో సురేంద్ర తొలినాళ్ళలో వేసిన కార్టూన్లపై మోహన్ ప్రభావం బాగా కనిపిస్తుంది. కానీ కాలక్రమంలో సురేంద్ర తనదైన సొంతశైలిని ఏర్పర్చుకున్నాడు. అలాగే ఆరోజుల్లో విజయవాడ ఆంధ్రజ్యోతి కార్యాలయానికి ఎదురుగా ఉన్న మైత్రి బుక్ హౌస్ లో మంచి-మంచి రంగుల బొమ్మలతో ఉండే చైనీస్ పుస్తకాలు సురేంద్రను బాగా ఆకట్టుకునేవి. అందుచేతనే సురేంద్ర ఎక్కువగా ఆ మైత్రి బుక్ హౌస్లో ఉండేవారు. మైత్రి యజమాని విశ్వేశ్వరరావు సురేంద్రను తన పెట్టే ప్రతి బుక్ఎగ్జిబిషకూ తీసుకువెళ్లడమే గాక సురేంద్రలోని బొమ్మలపట్ల ఆసక్తిని గమనించి “బాలకుంచె” అని పేరు పెట్టి బాగా ప్రోత్సహించాడు. మొదట్లో తండ్రి రామకృష్ణారెడ్డి ఆలోచనలు ఇస్తే వాటి ఆధారంగా వివిధ కార్టూనిస్టుల గీతల ప్రభావంతో కార్టూన్లు వేసేందుకు ప్రయత్నం చేసేవాడు సురేంద్ర. కాలక్రమంగా స్వంతంగా వేయడం, తన మొదటి కార్టూన్ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి తదితర పత్రికలలో తన కార్టూన్లు ప్రచురించాడు.

ఉద్యోగ ప్రస్థానం[మార్చు]

జీవితంలో కొందరి మంచి మిత్రుల పరిచయాలు, సహవాసాలు మనిషి ఉన్నతికి ఎంతలా దోహదపడతాయో చెప్పడానికి గొప్ప ఉదాహరణ సురేంద్ర జీవితం. సురేంద్ర తొలిసారిగా తన ఉద్యోగ ప్రస్థావాన్ని తన మిత్రుడు శ్రీనివాస్ ప్రసాద్ కి స్వయానా బావగారు నిజం శ్రీరామూర్తిగారి సిపారస్ పై లేఅవుట్ ఆర్టిస్ట్ గా నెలకు రూ.250/-జీతంపై హైదరాబాద్ లోని వినుకొండ నాగరాజుగారి “కమెండో” పత్రికలో ఉద్యోగం ప్రారంభించారు. హైదరాబాద్ లో నివాసం, చాలీచాలని జీతం. ఈ సమయంలోనే పవిత్ర కూటమిలో ఒకరైన చిత్రకారుడు కాళ్ళ సురేంద్రను తన మరో మిత్రుడైన గులాంగౌస్ వద్దకు పంపించాడు. కమెండోలో పనిచేసిన నాలుగునెలల కాలం గులాంగౌస్ దగ్గర గడిపితే ఆ తర్వాత ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న సురేంద్రను హైదరాబాద్లో అప్పటికే ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్న కె. లక్ష్మారెడ్డికి పరిచయం చేసి పనిదొరికేలా చేసింది ప్రఖ్యాత చిత్రకారుడు, కార్టూనిస్ట్ అయిన మోహన్.

1983 లో సురేంద్ర ఆదివారం, బాలచంద్రిక వారపత్రికలకు బొమ్మలు, కార్టూన్లు వేసేవాడు. అదే కాలంలో బాలల అకాడమీ బాలచంద్రికకు సంబంధించిన చొక్కాపు వెంకటరమణ పరిచయం. ఆదివారం వారపత్రిక అనంతరం 1984లో ఆంధ్రభూమికి సురేంద్ర ను పరిచయం చేసిన వ్యక్తి చొక్కాపు వెంకటరమణ. ఆంధ్రభూమిలో సురేంద్ర 1984 నుండి 1990 వరకూ పనిచేసాడు. ఆ కాలంలో గజ్జెల మల్లారెడ్డి రాజకీయ వ్యంగోక్తులుగా అల్లన కవితలకు సురేంద్ర వేసిన బొమ్మలు బాగా ఆదరణను పొందాయి. ఆ తర్వాత కాలంలో “అక్షింతలు” పేరుతో ఈ వ్యంగ్యోక్తులన్నీ పుస్తక రూపంలోకి రావడం జరిగింది.

1990 నుండి 1995 వరకూ ఉదయం (పత్రిక)లో పనిచేసాడు. అనంతరం 1995 నుండి జూన్ 1996 వరకూ మరలా ఫ్రీలాన్సర్ గానే వుంటూ తెలుగు, హిందీ, ఇంగ్లీషు పత్రికలయిన ఆంధ్రప్రభ, హిందీ మిలాప్, మరియు సిటిజన్స్ ఈవినింగ్ అనే ఆంగ్ల పత్రిక ఈ మూడింటికీ ఏకకాలంలో పనిచేసాడు. 1996 సంవత్సరం నుండి ది హిందూ నేషనల్ డైలీలో కార్టూన్ ఎడిటర్ గా 2021 జూన్ నెలలో పదవీవిరమణ చేశాడు.

అవార్డులు[మార్చు]

  • 2013 లో Lifetime Achievement Award from the ‘Cartoon Watch’ magazine.
  • 2019 లో నవ తెలంగాణా పత్రిక ప్రతీయేటా బహుకరించే ‘శేఖర్ స్మారక ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డ్ ' అందుకున్నాడు.
  • 2021 జూలై 31న 'కేరళ కార్టూన్ అకాడెమీ' సురేంద్ర టాక్ షోను నిర్వహించాడు.
  • 2021 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్టూన్ రంగంలో 'వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ 'సురేంద్రకు ప్రకటించాడు.

అధారాలు, మూలాలు[మార్చు]