అలిశెట్టి ప్రభాకర్
అలిశెట్టి ప్రభాకర్ | |
---|---|
జననం | 1956, జనవరి 12 కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల |
మరణం | 1993, జనవరి 12 |
వృత్తి | చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ |
ప్రసిద్ధి | కవి |
మతం | హిందూ |
అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 1956 జనవరి 12 న పుట్టారు. అలిశెట్టికి ఏడుగురు అక్కా చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. తండ్రి పరిశ్రమల శాఖలో పనిచేస్తూ ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. ఆయన మరణంతో 11 ఏళ్ల వయసులో ప్రభాకర్ కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించాడు. ఆదర్శాలకు అనుగుణంగా పేదరాలయిన 'భాగ్యం' ను పెళ్ళి చేసుకొన్నారు. జీవిక కోసమే తప్పా, ఏనాడు సంపాదన కొరకు ఆరాటపడని మనిషి. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. చిత్రకారుడిగా, ఫోటో గ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే, కవిగా ఎదిగాడు. 1982 లో హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్‌గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై మినీ కవిత్వం రాశాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతి కొద్ది మంది కవుల్లో అలిశెట్టి ఒకడు. క్షయ బారిన పడి 1993 జనవరి 12న మరణించారు.[1]
చిత్రకారుడిగా - అలిశెట్టి
[మార్చు]ఆయన మొదట చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. ప్రారంభంలో పత్రికలకు పండుగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేసేవాడు.
ఫోటో గ్రాఫర్‌గా - అలిశెట్టి
[మార్చు]సిరిసిల్లలో రాం ఫోటో స్టూడియోలో ఫోటోగ్రఫీ నేర్చుకొని, 1975 లో జగిత్యాలలోని సొంత ఇంట్లో పూర్ణిమ స్టూడియో ప్రారంభించాడు. కరీంనగర్‌లో స్టూడియో శిల్పి (1979), హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ (1983) పేర్లతోనూ స్టూడియోలు నడిపి ఫోటో గ్రాఫర్‌గా జీవితాన్ని గడిపాడు.
కవిగా - అలిశెట్టి
[మార్చు]జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలో ప్రవేశించాడు. 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చైన ఆయన మొదటి కవిత. ఎర్ర పావురాలు (1978) అచ్చైన ఆయన మొదటి కవితా సంకలనం.[2] ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్‌గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతిపొందాడు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా కవిత్వం రాశాడు.
అచ్చైన కవితా సంకలనాలు
[మార్చు]- ఎర్ర పావురాలు (1978)
- మంటల జెండాలు (1979)
- చురకలు (1981)
- రక్త రేఖ (1985)
- ఎన్నికల ఎండమావి (1989)
- సంక్షోభ గీతం (1990)
- సిటీ లైఫ్ (1992)
- మరణం నా చివరి చరణం కాదు
ప్రసిద్ధ కవితలు
[మార్చు]- తనువు పుండై... తాను పండై...తాను శవమై...వేరొకరి వశమై...తను ఎడారై ... ఎందరికో.. ఒయాసిస్సై.... అంటూ సెక్స్ వర్కర్ల దయనీయ స్థితి గురించి ఆయన రాసిన కవిత సుప్రసిద్దమైనది. వేశ్యల గురించి ప్రస్తావన వచ్చిన అనేక సందర్భాలలో అనేక మందిచే ఉదహరింపబడిన కవిత.
- హృదయ త్రాసు కవిత ఆయనకు కవిగా మంచి పేరు తెచ్చినదే.
ఉదహరింపు కవితలో ఇలా అంటారు
శిల్పం
చెక్కకముందు బండ
శిక్షణ
పొందకముందు మొండి
ప్రతిభ
వెనకాల ఎంతో ప్రయాస
సో.......
కాలానికి
వదలకు భరోసా
ప్రతిభలేకపోతే జీవితం వ్యర్థం అని, సాధన చేస్తేనే బండ శిల్పంగా మారుతుందని, కాలానికి వదిలేయకుండా ప్రయత్నం చేయాలని ఈ చిన్న కవితలో ఎంతో అందంగా చెప్పారు ప్రభాకర్.
జీవితం అనే మినీ కవితలో మనిషి ప్రకృతిని చూసి ఎంతో నేర్చుకోవలసినది ఉందంటారు. చిన్న విత్తనం నుంచి బయటకు వచ్చిన మొక్క, మానుగా మారి కొమ్మలు, రెమ్మలతో శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఆకాశం అంత ఎత్తును చూస్తుంది. అంతేకాదు, తాను సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆశ్రయించినవారికి నీడ ఇస్తుంది. సమాజంలో పుట్టిన వ్యక్తి కూడా స్వార్థ చింతన మానుకుని వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుని తనకు, తన కుటుంబానికే కాక సమాజానికి ఉపయోగపడాలి అనే సందేశాన్ని ఎంతో తేలికైన మాటలతో చక్కగా వివరించారు. జీవితంలో నిరాశావాదానికి చోటులేదంటారు. వృక్షం స్వయంకృషికి ప్రతీక అంటారు -జీవితం అనే ఈ మినీకవితలో.
ఈ వృక్షం
నువ్వు ఉపిపోసుకోడానికి
వినియోగింపబడ్డది కాదు
స్వయం కృషిని
శాఖోపశాఖలుగా
విస్తరింపజేసుకొమ్మని.