Jump to content

జమదగ్ని

వికీపీడియా నుండి


జమదగ్ని భృగు వంశానికి చెందిన మహర్షి. పరశురాముడుకి తండ్రి. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు.

దస్త్రం:Jamadagni telling Parasuram about kartyaveerarjun.jpg

జమదగ్ని కార్త్యవీరార్జునిని గురించి పరశురామునికి చెప్పు సందర్భము

జమదగ్ని జన్మవృత్తాంతం

[మార్చు]

కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతి ని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఋచీకుడు యాగం చెసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతొ జన్మించినవాడు పరశురాముడు. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.

కార్తవీర్యునితో వైరం

[మార్చు]

హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.

రేణుక ఆలస్యముగా రావడం జమదగ్ని కుమారులని తల్లి ని సంహరించమని ఆజ్ఞాపించడం

[మార్చు]

కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.

జమదగ్ని తలని ఖండించిన కార్తవీర్యార్జుని కుమారులు

[మార్చు]

ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు. ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు


వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జమదగ్ని&oldid=3878057" నుండి వెలికితీశారు