సుశ్రుతుడు
మహర్షి సుశ్రుతుడు | |
---|---|
జననం | 800 BCE(వివాదంలో ఉంది) ఫెవ్‌ఘాట్ ప్రాంతం, కాశీ రాజ్యం |
మరణం | 700 BCE(వివాదంలో ఉంది), కాశీ రాజ్యం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | Author of సుశ్రుత సంహిత |
విద్యా నేపథ్యం | |
పరిశోధక కృషి | |
వ్యాసంగం |
|
పనిచేసిన సంస్థలు | బెనారస్ విశ్వవిద్యాలయం [1] |
సుశ్రుతుడు (ఆంగ్లం :Sushruta) ఆయుర్వేదానికి చెందిన శస్త్ర చికిత్సకుడడు. ఇతను క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందినవాడు. వారణాసిలో జన్మించాడు.[2] ఇతని ప్రసిద్ధ గ్రంథం సుశ్రుతుడు సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడింది.[2] ఈ సుశ్రుత సంహిత లో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడినవి.[2] ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయవంటివాడు. ప్రపంచంలోని యితర దేశాలు కళ్ళుతెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలనో కాపాడిన అపర ధన్వంతరి సుశ్రుతుడు.
చరిత్ర
[మార్చు]కీ.పూ.600 ప్రాంతాలకు చెందినవాడుగా చరిత్రకారులు సుశ్రుతుణ్ణీ భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పురాణేతిహాసాల ప్రకారం సుశ్రుతుడు 5 వేల ఏళ్ళ కంటే పూర్వంవాడే! ఉత్తర భారత దేశాంలోని గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణం సుశ్రుతుడి నివాస స్థానం. సుశ్రుతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు. సుశ్రుతుడి జీవితకాలం గూర్చి భిన్న భిన్న అంచనాలు ఉన్నాయి. ప్రసిద్ధ భారత చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ సుశ్రుతుడు క్రీ.పూ 9-10 శతాబ్దాల నడుమ జీవించి ఉండవచ్చని అంచనా వేశాడు. వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్యశాస్త్రం అభ్యసించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు.
“ | నూతన మిలీనియం సందర్భంగా 2000 సంవత్సరంలో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర వికిత్స వైద్యుల ఫోటోలతో, వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతునిది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది. | ” |
ఆయుర్వేద వైద్య సేవలు
[మార్చు]వైద్య శాస్త్రంలోని ఆనాటి విభాగాలన్నిటిలో ప్రావీణ్యత సాధించడమే కాక ఒక గొప్ప శస్త్ర చికిత్సకునిగా ఘనకీర్తిని ఆర్జించాడు. సుఖప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్ లను కూడా ఆవిష్క తొలగించడంలో నైపుణ్యం సాధించారు. విరిగిన ఎముకలు అతికించడంలో, కంటి శుక్లాలను రూపుమాపడంలో విశేష కృషి చేశారు.
ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి, మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని యివ్వడంలో, విపత్కర పరిస్థితుల్లో తెగిన శరీరావయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించటంలో అందెవేసిన చేయి సుశ్రుతునిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్సకోస్ం 120 రకాల వైద్య పరికరాలను సుశ్రుతుడు ఉపయోగించేవాడట!
తెగిన శరీర భాగాలను అతికించటం, శరిరంలో పేరుకున్న లేదా చొరబడిన విదేశీ పదార్థాలు (ఫారిన్ ఆంటీబాడీస్) ను కనుగొని తొలగించటం, పుచ్చిన, దెబ్బతిన్న దంతాలను తొలగించడం, వరిబీజం (బుడ్డ) రోగికి హాని కలుగకుండా శస్త్రచికిత్స చేసి వేరుచేయడం యివన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది సుశ్రుతుడే!
ప్రొస్టేట్ గ్రంథిని ఏఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి? ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది? దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి? యిలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను సుశ్రుతుడు వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవజాతికి అందించాడు. ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుగొన్నాదు. మూత్రనాళంలో పేరుకొనే రాళ్ళను తొలగించడం ఎలాగో సశాస్త్రీయంగా నిర్వహించి నిరూపించాడు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను తన శస్త్రచికిత్స విధానం ద్వారా విజయవంతంగా తొలగించాడు. పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు.
పోస్ట్‌మార్టం (శవ పరీక్ష) వేల ఏళ్ళ క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, తొమ్మిది నెలల్లో గర్భాశయంలో చోటుచేసుకునే క్రమపరిమాణాలు, శిశువు పెరుగుదలలోని దశల గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు సుశ్రుతుడు.
మానవ శరీర నిర్మాణం అధ్యయనం, శరీరభాగాల విశ్లేషణ వంటి వివరాలు పేర్కొన్నాడు. శస్త్రవికిత్స అనంతరం పుట్టే నొప్పిని తగ్గించేదిగా ఆల్కహాల్ (మదిర) ను గుర్తించాడు. మానవ శరీరం జీవ
తన జీవిత కాలంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి, వందలాదిమంది శిష్యులను తయారుచేశాడు సుశ్రుతుడు. అంతే కాక శస్త్రచికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారంలో "సుశ్రుత సంహిత" అనే గొప్ప గ్రంథం రాశాడు సుశ్రుతుడు. ఈ సుశ్రుత సంహిత సా.శ.8 వ శతాభ్దంలో అరబ్ భాషలోకి "కితాబ్ షాషూన్ ఎ హింద్" "కితాబ్ ఐ సుశ్రుత" గ్రంథాలుగా అనువదింపబడినవి.
శస్త్రచికిత్స కోసం ఎముకలతో, రాతితో చేసిన పదునైన పనిముట్ల వాడకాన్ని నిషేధించాడు. శస్త్రచికిత్స చేసే వారికి కొన్ని నియమ నిబంధనలు సూచించారు. శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పారు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశారు. ఆరోగ్యంగా ఉండి పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి, నిరంతరం ప్రవహించే నీటిలో కొద్దికాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి, అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు.
సుశ్రుత సంహిత
[మార్చు]సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద గ్రంథం ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం. దీనిని సుశ్రుతుడు సంస్కృతంలో రచించాడు. ఈ "సుశ్రుత సంహిత" లలో 184 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో మనిషి సాధారణంగా గురికాబడే వ్యాధులు 1120 గా నిరూపింపబడింది. అలాగే మానవ శరీరం నిర్మాణం తీరుతెన్నుల గురించి, ప్రతి అవయవ నిర్మాణం గురించి విపులంగా చెప్పబడింది. 700 పై బడిన ఔషధీ మొక్కల లక్షణ విశేషాలు - ఏ వ్యాధికి ఏ మొక్క ఎలా ఔషధంగా ఉపయోగపడి రోగాన్ని ఎలా తగ్గిస్తుందో ఉదాహరణ పూర్వకంగా నిరూపించబడింది. 64 రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారుచేసుకోవాలో యివ్వబడినాయి. అంతేకాక జంతు సంబంధమైన అవయవాల నుండి 57 ఔషదాలను తయారుచేసే వైద్య విన్ఞానం ఉంది.
సుశ్రుత సంహితలో సంపూర్ణ ఆయుర్వేద శస్త్రచికిత్సా విజ్ఞానం యిమిడి ఉంది. ఈ గ్రంథంలో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది పూర్వ తంత్ర కాగా రెండోది ఉత్తర తంత్ర, ఈ గ్రంథంలో ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన "అష్టాంగ హృదయం " వివరింపబడింది.
ఈ గ్రంథంలో 101 శస్త్ర పరికరాల గురించి వివరించాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించుటకు అందరికీ ప్రయోజనకరమైన అనువైన విధానాలతో, తేలికగా అర్థం చేసుకునే విధంగా ఈ గ్రంథ రచన చేశారు. ఈ రోజున కూడా వైద్య సమాచారం నిమిత్తం ఒక బంగారు నిధి తరహాలో ఈ గ్రంథం ఉపయోగపడుచున్నది. ఏ చిన్న సర్జరీ లేకుండా అనేకానేక వ్యాథులను నియంత్రించడానికి, తగ్గించడానికి ఎన్నో సూచనలు ఈ గ్రంథంలో చోటుచేసుకున్నాయి.
సా.శ. 8 వ శతాబ్దంలో "సుశ్రుత సంహిత"ను అరబిక్ భాషలోకి "కితాబ్ పాషూన్ ఎ హింద్", కితాబ్ ఇ సుస్రుద్" పుస్తకాలుగా అనువదించారు. ఈ గ్రంథంలో విరిగిన ఎముకలు పనిచేసేందుకు కట్టే కర్ర బద్దీల గురించి, శస్త్ర చికిత్సలలో వాడే వివిధ పరికరాల గురించి, ప్రస్తావన ఉంది. శస్త్ర చికిత్సల గురించి విస్తృతంగా చర్చించడమే కాకుండా శస్త్ర చికిత్సలలో వాడే వివిధ శలాకల గురించి ఏకంగా ఒక తంత్రాన్నే రచించారు. దీనినే "శల్యతంత్ర" అంటారు. ఇతర వైద్య విభాగాలలో కూడా ఎంతో సాధికారత సాధించిన ఈయన గాయాలకు, పుండ్లకు చీము చేరకుండా నయం చేయడమే చికిత్స అని, వేగవంతమైన చికిత్స ఇతర వ్యాథులను దరిచేరచివ్వడని పేర్కొన్నాడు. మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేయటం అమానుషమని భావించి మూలికారసము, సోమరసము (మధ్యం) స ద్వారా మత్తు కలిగించి, "అనస్తీషియా" ప్రక్రియకు తొలిరూపం అందించినవారయ్యారు.
ప్రకృతి ఆరాధకుడు
[మార్చు]సుశ్రుతుడు ప్రకృతి ఆరాధకుడు. జంతు, వృక్ష ప్రపంచాల మీద సుదీర్ఘమైన దృష్టి సారించి అనేక అమూల్య అంశాలను వెలువరించారు. సంవత్సరంలోని భిన్న భిన్న ఋతువులలో ఆయా వాతావరనాలకు అనుగుణంగా మెసిలి, వ్యాధిరహితంగా, ఆరోగ్యంగా ఎలా మెలగాలో వివరించారు. ఏఏ కాలాల్లో ఏ కూరగాయలు, ఏ పండ్లు తినవలెనో వివరించారు. తృణధాన్యాలు, పప్పుదినుసులు వాడకం గూర్చి సోదాహరణంగా పలు ఆసక్తికర అంశాలను తెలిపారు.
సుశ్రుతుడు తన గ్రంథ రచన ప్రారంభించక పూర్వమే ప్రకృతిలో అనుసంధానమై వివిధ ప్రయోగాలు చేశారు. ఏ ఏ మొక్క మానవునికి ఎన్నివిధాలుగా ఉపయోగపడిందో కూలంకషంగా అధ్యయనం చేశారు. అంతేకాదు, తమ గాఢ అధ్యయనం ద్వారా తన శిష్యులకు సరళంగా బోధించేవారు. ప్రాక్టికల్స్ కూడా దగ్గరుండి చేయించేవారు. శస్త్ర చికిత్సకు ప్రాధాన్యతనిస్తూనే, వైద్య చికిత్సలో వాడే మూలికలను, క్షార పదార్థాలను, లోహాలను కూడా వర్గీకరించి వివరించేవారు. దాదాపు 14 రకాల బ్యాండేజీలను ఆయా గాయాల తీవ్రత, స్థాయిలను అనుసరిచ్మి తయారుచేసే విధానం కూడా తన గ్రంథంలో వివరించారు. గాయాలు త్వరితంగా నయం కావడానికి అతి ఉష్ణం లేదా అతి శీతల వాతావరణం గాని, పూర్తిగా తడి లేదా పూర్తిగా పొడిగా ఉండడం గాని ఒకే తరహా ఫలితాలను అందిస్తాయని విశ్లేషించి వైద్య చికిత్సలో నూతన ఆవిష్కరణ చేశారు.
ఔషథాల తయారీకి ఉపయోగపడు మొక్కలు తులసి నుంచి ఆముదం వరకు, ఔషధోపయోగ గుల్మాలు సీతాఫలం మొదలైన పండ్లు గురించి, వృక్షాలు నేరేడు, మారేడు మొదలైన వాటి గూర్చి తన గ్రంథంలో వివరించటానికి పూర్తి అధ్యాయం కేటాయించాడు. వందలాది మొక్కలు, వృక్షాలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు గూర్చి, వాటిని ఉపయోగించుకొనే విధానాలను గూర్చి విశ్లేషన చేస్తూ ఎంతో సమాచారాన్ని తన గ్రంథరచనలో పొందుపరిచాడు. ఈ గ్రంథం అరబిక్ లోనే కాక లాటిన్ తదితర విదేశీ భాషలలోకి అనువాదమైంది. వ్యాధి గ్రస్తమైన శరీరాన్ని మూడు రకాలుగా విభజించి వ్యాధికి పూర్వం, వ్యాధి గ్రస్తుడు అయినపుడు, వ్యాధి నయం అయిన తర్వాత రోగి శరీర తత్వాన్ని అవగాహన చేసుకోవాలని, ముఖ్యంగా ఆయా రోగులు శరీరతత్వాలను తెలుసుకొని, వారి శారీరక, మానసిక బలాలను, ఓర్పును పరిశీలించి వైద్యం చేయాలని సూచించారు. గర్భ నిరోధంతో పాటు గర్భ ధారణకు కూడా అనువైన ఔషధాలను, యవ్వనోత్సాహానికి తగిన మందులను తన ములికా వైద్య ప్రకరణంలో పేర్కొన్నారు. ఈయన సృష్టించిన "సందంశ యంత్రాలు" ఆధునిక శస్త్రవైద్యుల spring forceps, dissection and dressing forceps లకు తొలి రూపములుగా ఉన్నాయి.
ప్రసిద్ధ గాథ
[మార్చు]అత్యవసర మైన పనిమీద ఒక వ్యక్తి అడవిలో నుండి ప్రయాణిస్తూ పరుగులు తీస్తున్నాడు. మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగి అతని ముక్కు తెగిపడింది. రక్తం విపరీతంగా కారుతుండగా తెగిన ముక్కు భాగాన్ని అరచేతిలో పట్టుకొని సమీపంలోని ఒక ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు. అర్థరాత్రివేళ సుశ్రుతుడు నిద్రనుంచి మేల్కొని తలుపు తీసి చూస్తే ఒక యాత్రికుడు ముఖమంతా రక్తసిక్తమై రొదిస్తూ కనిపించాడు. అతడి ముక్కు విరిగి వుండడం సుశ్రుతుడు గమనించాడు. రక్తం ధారగా ప్రవహిస్తోంది. ముందు అతడికి ధైర్యం చెప్పి లోపలికి తీసుకు వెళ్ళాడు.
ఆరోజుల్లో మనిషికి మత్తు కలిగించే మందులు లేవు. నీటితో అతడి గాయాన్ని కడిగాడు. మూలికా రసంతో అద్దాడు. తర్వాత అతనికి మత్తునిచ్చే నిమిత్తం ఒక చిన్న గిన్నెడు సుర (మధ్యం) ఇచ్చి తాగించాడు. అతడు నెమ్మదిగా స్పృహ కోల్పోగా, వెంటనే అతి సూక్ష్మమైన కత్తులు, సూదులతో చికిత్స ప్రారంభించాడు. ఒక ఆకుతో అతని ముక్కును కొలిచారు. అతి చిన్నది, పదునైన కత్తిని వేడిచేసి, దవడ భాగం నుంచి కొంత కండ తీసుకున్నాడు. దానిని రెండు ముక్కలుగా చేసి బహు జాగ్రత్తగా అతని ముక్కు పుటాలలో అమర్చారు. ముక్కు ఆకారాన్ని సరిచేసి, బియ్యపు పిండిని అద్ది, చందనపు (గంధం) పట్తు వేసారు. దానిమీద బూరుగు దూదిని పెట్టి, ఔషధ నూనెను పోసి, చక్కగా కట్టు కట్టారు. వనమూలికల నుంచి సేకరించిన మిశ్రమ నూనె బాగా పనిచేసింది. రెండు రోజుల్లో అతడు నెమ్మదిగా కోలుకున్నాడు. అతను ఆహార విహారాల్లో ఏ విధంగా మసలుకోవాలో ఏయే మందులు సేవించాలో వివరాలను సుశ్రుతుడు వివరించి పంపించాడు.
ప్లాస్టిక్ సర్జరీ
[మార్చు]ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే! తెగిన భాగాలను శరీరంలోని మరొక అవయవం నుండి కొంతభాగం తీసి తెగిన చోట అమర్చి పుర్వ రూపానికి తీసుకువావడమే ప్లాస్టిక్ సర్జరీ! ప్లాస్టిక్ సర్జరీలో, రైనోప్లాస్టీ (ముక్కు నిర్మాణమును ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దడం) మీద ప్రఖ్యాతి చెందిన, సాధికార గ్రంథం "సుశ్రుత సంహిత" రాసాడు.
ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన మూల సూత్రాలను సుస్పష్టంగా వివరించాడు సుశ్రుతుడు. అతి సున్నితమైన శరీరభాగాల నుండి చర్మాన్ని వేరుచేసి కొత్త చర్మంతో కప్పడం, కండరాలను తిప్పి దెబ్బతిన్న భాగాలపై మేకప్ చేయడం, పూర్తిగా కాలిన చర్మాన్ని తొలగించి కొత్త చర్మం కప్పడం వంటి ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సా విధానాన్ని వైద్యులకు స్పష్టంగా అవగాహన కలిగించారు సుశ్రుత మహర్షి తన "సుశ్రుత సంహిత" గ్రంథంలో!
పాశ్చాత్య అల్లోపతీ విధానం పుట్టక ముందు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేదాన్ని పెంచి పోషించి, ఆధునాతన శస్త్రచికిత్సా నిపుణులకు సైతం అచ్చెరుపు గొలిపే విధంగా విజయవంతమైన ఎన్నో శస్త్ర చికిత్సలను జరిపి ప్రపంచ వైద్యులకు మార్గదర్శిగా నిలిచిన క్రాంతిదర్శి సుశ్రుత మహర్షి.
క్షార సూత్రం
[మార్చు]ఈ క్షార సూత్రం చికిత్స ఫిస్టులా వ్యాధికి ఉద్దేశించారు. ఈ వ్యాధిని భగందరం, లూటీ వ్యాధి, రాచపుండు మొ. పేర్లతో పిలుస్తారు. ఆధునిక వైద్యశాస్త్రంలో "ఫిస్టులా ఇన్ ఆనో"గా పేర్కొంటారు. ఫిస్టులాను క్షారములుగా విభజించారు. క్షార సూత్ర చికిత్స ఫిస్టులా వ్యాధికేకాక అర్స మొలలు (పైల్స్), నాడీ వ్రణం మొ. వాటికి ఏ విధంగా ఉపయోగించాలో తమ గ్రంథంలో విశదీకరించారు. ముందుగా దారమును తీసుకొని దానికి 21 సార్లు క్షారయుక్తమైన ఔషధాలతొ సమ్మిళితం చేస్తారు. దీనిఏ క్షార సూత్రమని అంటారు. దినిని ఉపయోగించి అయిదారు వారాలలో ఫిస్టులా వ్యాధిని నయం చేయవచ్చు. రక్తస్రావం లేకుండా, శస్త్ర చికిత్స లేకుండా ఈ వ్యాధిని అతి తేలికగా, పూర్తిగా నిర్మూలించవచ్చు. మధుమేహ రోగులకు, రక్త పోటు ఉన్నవారికి కూడా ఈ క్షార సూత్ర చికిత్స ఎంతో ప్రయోజనకరమని ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు.
వైద్య విధానాలు
[మార్చు]సుశ్రుతుడు రాసిన గ్రంథరచన ఆధారంగా ఈయన స్వయంగా అనుసరించిన వైద్యచికిత్సా విధానాలు అనేకం తెలియవస్తాయి. శస్త్ర చికిత్సను అతి నైపుణ్యంతొ నిర్వహించడానికి కొన్ని జంతువుల వెంట్రుకలను, బాగా ఎదిగిన వెదురు చెట్ల బొంగులను, కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన చెట్ల బెరడుతో చేసిన కుంచెలను వాడేవారు. వైద్యుడి వేష భాషలు ఎలా ఉండాలో ముఖ్యంగా ప్రవర్తన ఏ తీరులో ఉండాలో చెప్పారు. మంచి ఆరోగ్యంలో ఉండి, పూర్తి చేతనతో, ఉత్సాహంగా శస్త్రచికిత్సలు చేయాలన్నారు. శస్త్రపరికరాలను ఎప్పటికప్పుడు ఉష్ణజలంతో పరిశుభ్రపరచాలని హితవు పలికారు.
సున్నితమైన అవయవాలను అతికించే ముందు ఏ మాత్రం అవకాశం ఉన్నా పూర్వకర్మ చికిత్స (ఫిజియో థెరపీ) ను ఆ వ్యక్తికి అందించాలని, అప్పుడే శస్త్ర చికిత్సకు సంసిద్ధుడై, చికిత్స అనంతరం త్వరిత గతిన స్వస్థతను పుంజుకుంటాడని వివరించారు. మానవులకు హాని కలిగించే, వ్యాథులను ఏర్పరచి క్రిమికీటకాలను పేర్కొంటూ వాటిని వర్గీకరణ చేశరు. ఏ క్రిమి/కీటకం దాడి చేసి అనారోగ్యం కలిగిస్తే ఏవిధమైన మూలికా వైద్యం అవసరమో వివరించారు.
మెదడు (పెద్దమెడడు) లోచిక్కుకుపోయిన శల్యాన్ని వెలుపలికి తీసుకు రావటనికి కూడా చికిత్సను సూచించారు. కపాలానికి రంధ్రంఅ చేసి, మెదడులోని శల్యాన్ని తీసే విధానానికి అంకురార్పణ చేశారు. శరీరంలో ప్రవహించే రక్తంలో అతి సూక్ష్మ క్రిములు పుట్టి, ధమనులు సిరలలో జీవిస్తూ పలురకాల అస్వస్థతలకు గురిచేయగలవని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. ఈ విధంగా మానవుడికి దాపురించే వ్యాధికారకాలు, చికిత్సా విధానాలను తమ గ్రంథ రచనలో ఇమిడ్చి, మానవ జాతికి మహోపకారం చేశారు. ఈ నాతికీ వైద్య విజ్ఞాన కోశంగా ఉపయోగపడుతున్న "సుశ్రుతసంహిత" లోని ముఖ్యాంశాలు దేశ దేశాల వారికి మౌలిక ప్రయోజనకరంగా ఉన్నాయి. సుశ్రుతుడు అంకురార్పణ చేసిన అనేక వైద్యచికిత్సలు ఆయుర్వేద వైద్యవిధానం ద్వారా మనకు పరిచయం కావడంతో ఏమంత విశేషంగా అనిపించకపోవచ్చు. కొన్ని మాత్రం తెరమరుగున వుండి, ఈనాటికీ వైద్య శాస్త్రవేత్తల పరిశోధనలలో మగ్గుతూ పూర్తి వివరాలకోసం వేచివున్నాయి. ఉదా: రక్త మోక్షణ.
యితర దేశాలకు తరలిపోయిన గ్రంథాలు
[మార్చు]సుశ్రుతుని గ్రంథ రచనలు కొన్ని టిబెట్ ప్రాంతానికి ఆ కాలంలోనే తరలివెళ్ళాయి. ఈయన వైద్య సంప్రదాయానికి చెందిన శల్య చికిత్సకులు ఉండేవారని, వారు ఉపయోగించిన శస్త్ర పరికరాలు చిత్రపటములే కాక, ఆయా పరికరాలలో కొన్నిపురావస్తు పరిశోధకులకు లభించినట్లు తెలియవచ్చింది. క్రీ.పూ. 8 వ శతాబ్దానికి చెందిన ఈయన గ్రంథం "అమృత అష్టాంగ హృదయ గుహ్యోపదేశ తంత్ర" ఈ రోజున మన దేశంలో లభించదు. అయినప్పటికీ ఈ గ్రంథం అనువాదం టిబెట్ లో "గుష్టి" (నాలుగు వైద్య శాస్త్ర తంత్రములు) పేరుతో లభిస్తున్నవి.
సుశ్రుతుడు, చరకుడు సృజించిన వైద్య విధానాలు క్రీస్తు పూర్వ కాలంలోనే అగ్నేయాసియా, ఉత్తర ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలలో బాగా వాడుకలోవున్నాయని రూఢి అయింది. మధ్య ప్రాచ్యంలో ఏడవ శతాబ్దిలోనే చరకుని గ్రంథాలు, సుశ్రుతుని వైద్య సంహితలు అరబ్బీ భాష లోకి తర్జుమా చేయడం జరిగింది. ముస్లిం ప్రముఖ చరిత్రకారుదు ఫరిస్తా రాసిన చరిత్ర రచన ఆధారంగా మరి 16 ప్రాచీన భారతీయ వైద్య శాస్త్ర గ్రంథములు కూదా 8 వ శతాబ్దం నాటికి అరబ్బులకు పరిచయం కాగలిగాయి.
ఫరిస్తా రాసిన రాతల ప్రకారం మరికొన్ని ఆసక్తికర అంశాలు తెలియవస్తాయి. మహమ్మదీయ ప్రముఖుడు ఖలీఫాహరున్ అల్ రషీద్ కు అత్యవసర వైద్యం చేయడానికి "మనక్" అనే భారతీయ వైద్యుడిని హడావుడిగా అరేబియాకు పిలిపించుకున్నారు. ఆ తర్వాత "మనక్" బాగ్దాద్లో స్థిరపడి అక్కడి ఆస్పత్రికి అధికారిగా నియమితులైనట్లు, మనక్ తో పాటు మరో ఆరుగురు భారతీయ వైద్యులను తమ దేశానికి ఆహ్వానించినట్లు మొదలగు చారిత్రాత్మక ఆధారాలను ఫరిస్తా తన గ్రంథ రచనలో పేర్కొన్నాడు.
గ్రంథసూచిక
[మార్చు]- Dr. Rudolf Hoernle. Medicine of India.
- D. P. Agrawal. Sushruta: The Great Surgeon of Yore.
- Chari PS. 'Sushruta and our heritage' Archived 2013-04-19 at the Wayback Machine, Indian Journal of Plastic Surgery.
- Rana RE and Arora BS. 'History of Plastic Surgery in India', Journal of Postgraduate Medicine.
- Gunakar Muley. 'Plastic Surgery in Ancient India'. Archived 2006-07-07 at the Wayback Machine
- Aufderheide, A. C.; Rodriguez-Martin, C. & Langsjoen, O. (1998). The Cambridge Encyclopedia of Human Paleopathology. Cambridge University Press. ISBN 0-521-55203-6.
- Dwivedi, Girish & Dwivedi, Shridhar (2007). History of Medicine: Sushruta – the Clinician – Teacher par Excellence Archived 2008-10-10 at the Wayback Machine. National Informatics Centre (Government of India) .[unreliable source?]
- Kearns, Susannah C.J. & Nash, June E. (2008). leprosy. Encyclopædia Britannica.
- Kutumbian, P. (2005). Ancient Indian Medicine. Orient Longman. ISBN 81-250-1521-3.
- Lock, Stephen etc. (2001). The Oxford Illustrated Companion to Medicine. USA: Oxford University Press. ISBN 0-19-262950-6.
మూలాలు
[మార్చు]యితర లింకులు
[మార్చు]- Sushruta Samhita (English Translation)
- Syncretism in the Caraka and Suśruta saṃhitās
- Aufderheide, A. C.; Rodriguez-Martin, C. & Langsjoen, O. (1998). The Cambridge Encyclopedia of Human Paleopathology. Cambridge University Press. ISBN 0-521-55203-6.
- Dwivedi, Girish & Dwivedi, Shridhar (2007). History of Medicine: Sushruta – the Clinician – Teacher par Excellence Archived 2008-10-10 at the Wayback Machine. National Informatics Centre (Government of India) .
- Kearns, Susannah C.J. & Nash, June E. (2008). leprosy. Encyclopedia Britannica.
- Kutumbian, P. (2005). Ancient Indian Medicine. Orient Longman. ISBN 81-250-1521-3.
- Lock, Stephen etc. (2001). The Oxford Illustrated Companion to Medicine. USA: Oxford University Press. ISBN 0-19-262950-6.
- All articles lacking reliable references
- Articles lacking reliable references from March 2010
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- ఆయుర్వేద వైద్యులు
- భారతీయ శాస్త్రవేత్తలు
- ప్రాచీన భారత వైద్యులు
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు