ఆవంత్స సోమసుందర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆవంత్స సోమసుందర్
జననంనవంబరు 18, 1924
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సమీపంలో ఉన్న శంఖవరం
ప్రసిద్ధిప్రముఖ అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు , రచయిత.
మతంహిందూ మతము
తల్లిదండ్రులుసూర్యప్రకాశరావు, వెంకాయమ్మ
Notes
వజ్రాయుధం (1949) అత్యంత ప్రముఖమైనది

ఆవంత్స సోమసుందర్ (నవంబరు 18 1924 - ఆగష్టు 12 2016) ప్రముఖ అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు, రచయిత. ఈయన రచనలలో వజ్రాయుధం (1949) అత్యంత ప్రముఖమైనది. ఆరున్నర దశాబ్దాలుగా సాహితీ వ్యాసంగం చేస్తున్న సోమసుందర్ తెలుగు సాహిత్య క్షేత్రంలో గొప్ప కవి, విమర్శకుడు.డా.సి.నారాయణరెడ్డి సిఫార్సుతో గౌరవ డాక్టరేట్ పొందాడు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సిఫార్సుతో ఎన్.టి.ఆర్ పురస్కారాన్ని, కళారత్న పురస్కారాన్ని అందుకున్నాడు. వాసి కంటే రాశికే ప్రాధాన్యమిచ్చారు. 74 సంత్సరాలుగా సాహితీ సేవ చేసాడు.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

సోమసుందర్ తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సమీపంలో ఉన్న శంఖవరం అనే గ్రామంలో కాళ్ళూరి సూర్యప్రకాశరావు, వెంకాయమ్మ దంపతులకు నవంబరు 18, 1924 న ద్వితీయ సంతానంగా జన్మించాడు. తన పినతల్లి ఆవంత్స వెంకాయమ్మకు సంతానం లేకపోవటం వలన చిన్నతనంలోనే సోమసుందర్ వారింటికి దత్తుకు వెళ్లాడు. ఆ విధంగా కాళ్ళూరి అనే ఇంటి పేరు ఆవంత్సగా మారింది.

సోమసుందర్ దత్తత తల్లితండ్రులు ఆయనకు పదేళ్ళ వయసుండగానే పరమపదించారు.చిన్నతనంనుంచీ జులాయిలా తిరుగుతూ వ్యసనాలకు బానిస అయినప్పటికీ చిన్నారి సోమసుందర్ మనసుపై ఆ పుణ్య దంపతులు వేసిన సాహిత్య ముద్ర మాత్రం అలానే నిలిచిపోయింది. ఈయనప్రాథమిక విద్యాభాసం అంతా పిఠాపురంలోనే జరిగింది. 1943లో కాకినాడ పి.ఆర్.కళాశాలలో చేరి, ఉన్నత విద్యనభ్యసించాడు.

దేశ భక్తి

[మార్చు]

.[1] 1942 లో విద్యార్థులతో కలిసి పోరాడానని చెప్పేవారు.

రండి రండి ఉక్కుముక్కు కాకుల్లారా
రండర్రా గద్దల్లారా రండి రండి
సమరంలో క్షతగాత్రుడనై పడిపోయిన
నా శరీరాన్ని తినివేయండి ...........

[1] మొదటి కవిత

నిజాం పాలనకు వ్యతిరేకంగా దాశరథి వంటి కవులు సాగిస్తున్న పోరాటానికి ఉత్తేజితుడై సోమసుందర్ తెలంగాణా పోరాటానికి మద్దతుగా అనేక కవితలు రాసాడు. సోమసుందర్ యువతను ఉద్యమించమని పిలుపునిస్తూ వజ్రాయుధం అనే కవితను వ్రాశాడు. ఆ కాలంలో నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా వ్రాసిన కవితలన్నింటిని ఒక సంకలనం వజ్రాయుధం.

సాహితీ ప్రయాణం

[మార్చు]

సోమసుందర్ నాలుగో ఫారం చదువుతున్న రోజుల్లో పద్య ప్రక్రియపై మోజు కలిగి, వార్తాపత్రికలను ను క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. ఈ ప్రక్రియలో ప్రతీ రోజూ అభ్యాసం కొరకు తాను వ్రాసిన వివిధ పద్యాలను మిత్రులకు, ఉపాధ్యాయులకు చూపేవాడు. 1983 వరకూ కూడా భావకవిత్వం ఈయనకు తారసపడలేదు. భావకవిత్వాన్ని చదివిన తరువాత ఈయన తనదైన వచనా శైలిని అలవరచుకొర్చుకున్నాడు.

కృష్ణ శాస్త్రి కవితాత్మ

[మార్చు]

1975 లో దేవులపల్లి కృష్ణశాస్త్రి కళా ప్రపూర్ణ అవార్డును పొందినపుడు, వారి అభిమానులు కాకినాడలో సన్మానం ఆ సందర్భంగా ఆవిర్భవించిన గ్రంథమే "కృష్ణశాస్త్రి కవితాత్మ". నభూతో నభవిష్యతి అన్న రీతిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని వివరించాడు. కృష్ణశాస్త్రి తన గురువని చెప్పేవారు కానీ వారు ఇతని గూర్చి ఎక్కడా ప్రస్తావించలేదు. వీరు సాహిత్యజీవితంలో అందుకోవలసిన శిఖరాలకు మించి అందుకున్నారని నిర్ధ్వంద్వంగా చెప్పవచ్చును. అకాడమీ ప్రైజులు, అవార్డులు అనేకం పొందారు‌. వీరికి అనేక మంది రాజకీయనాయకుల దగ్గర, అధికార పీఠాల్లో ఉన్నవారితో మంచి సన్నిహిత సంబంధాలు వుండేవి.

వ్యక్తిత్వం

[మార్చు]
సోమసుందర్ అలనాటి ఓలేటి శశాంకను, సి.నారాయణ రెడ్డిని , గుర్రం జాషువాని,కరుణశ్రీని , వేటూరి సుందరరామ్మూర్తినీ కవిగా తీర్చిదిద్దారు. మహాకవి శ్రీశ్రీ వీరి కవిత్వానికి దాసుడనని చెప్పుకున్నారు.వజ్రాయుధం చదివిన తరువాత తనకూ కవిత్వం రాయాలని కోరిక కలిగి మహాప్రస్థానం రచించినట్లు చెప్పేవారని సోమసుందర్ చెప్పేవారు. వరకూ ఎందరో కవులను ప్రోత్సహించాడు. అప్పటి సమాజం అత్యంత నీచంగా చూసే భోగం వాళ్ళు వారికే సంబంధించిన దివాన్ దాసీ కులంవారితో కలిసి సహపంక్తి భోజనాలు చేసారు.

సోమసుందర్ జ్ణానపీఠ్ పొందాలని ఆశించారు దానిలో భాగంగా సోమసుందర్ లిటరరీ ట్రస్టును ఏర్పరచి ప్రతీ ఏటా ఐదుగురు కవులకు ఆరువేల రూపాయిల నగదు బహుమతిని అందచేస్తున్నారు.కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎందరు నాయకులను సంప్రదించినా ఆ అవార్డు రాలేదు. 2006 లో ట్రస్టు ఆధ్వర్యాన స్థానికంగా మహిళా సాహిత్య సదస్సు జరిపారు.

1980 వ దశకంలో తమ యింటికి పనికివచ్చే పారిశుధ్య కార్మికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానిక కార్మికులు పెద్దఎత్తున ఉద్యమం లేవదీసారు.స్థానిక కాంగ్రెస్ నాయకులు మేడిది చక్రరావు జోక్యం చేసుకుని సోమసుందర్ ని హెచ్చరించి గొడవను పెద్దది కానీయకుండా ఆపుచేసారు.

పాత కొత్త తరాల వారధి

[మార్చు]

1953 వరదలకు చలించిపోయిన సోమ సుందర్ వ్రాసిన గోదావరి జలప్రళయం అనే కావ్యంలోని కొన్ని కరుణ రస ప్రధాన పద్య పాదాలను చూస్తే ఈయన కవితా శక్తిని గుర్తించవచ్చును.

ఏమమ్మా, ప్రళయమువలె పొంగి ఓ గౌతమి
ఇకనైనా దయను చూపి శాంతించవదేమి?
ప్రసవించిన పులివై నీ కన్న బిడ్డలను మమ్ముల
కోరలెత్తి మ్రింగుట ఇది ఏమి న్యాయమే తల్లీ...

2004 లో ఈయన రచించిన అక్షర నాదం అనే కవితా సంపుటిలోని కొన్ని పద చిత్రాలను గమనించినట్లయితే ఈయన ప్రతిభ, ఈయన ఏవిధంగా రెండు తరాలకు వారధిగా ఉన్నారనే విషయం సుస్ఫష్టమౌతుంది.

గ్లోబలైజేషన్ తో ఈ భూమి రజస్వలై
నవవరాన్వేషణలో మిటకరిస్తుంది......
హ్యూమన్ జెనిటిక్ ఇంజనీరింగ్ తో
అవతరించిన క్లోనింగ్ కోడె దూడ
' అంబా" అని అరవడం
గ్రాంధికమని నిషేదిస్తుంది. (నేటిని ఏటికి విడిచి అనే కవిత నుంచి )

నేడు నా ముని వాకిట
పూచిన గులాబి పరిమళం నిండా
బాంబుల విషధూమం నింపింది పడమటి గాలి (సమరం కాదిది మరణం అనే కవిత నుంచి )

ఇన్ని జంత్ర స్వరాల నాదాలలోంచి
ఎన్ని వెన్నెల మైదానాలు - ఎలా తెరుచుకున్నాయి?
దూరంలో మసకబారిన కొండలు
బూడిద బుంగలు (బితోవెన్ సంగీతంపై వ్రాసిన మూన్ లైట్ సొనాటా అనే కవిత నుంచి)

వంకవంకల వయ్యారాలతో
తల్లిలా పవళించిన ఏటి ఒడిలో
నిటారుగా నిలచిన కొబ్బరి తోట....
రేగిన జుత్తుతో ఊరికే మారాంచేసే
పిల్లవాడి వెర్రి ఊగిసలాట...... (ఏటి వడిలో కొబ్బరి తోట అనే కవిత నుంచి)

ఈయన కవిత్వంలో సరళత, అదే సమయంలో అర్ధ గాంభీర్యతా, ఉదత్తమైన లోతైన భావాలు, మానవత్వపు పరిమళాలు పుష్కలంగా పొర్లాడుతూంటాయి.

బానిసల దేశం, గోదావరి ప్రళయం, రక్తాక్షి, హిరోషిమా, రక్షరేఖ, సీకింగ్ మై బ్రోకెన్ వింగ్, వంటి ఈయన రచనలలో ఆయా సంఘటనలకు, సందర్భాలకు ఒక కవి తన హృదయమంతటితోనూ స్పందించిన విధానాన్ని దర్శించవచ్చు.

అంధురాలికోసం బిథోవెన్ సృష్టించిన వెన్నెల, సౌరాష్ట్రంలో జరిగిన నరమేధం, ఎన్నటికీ పూర్తికాని సోమశిల ప్రోజెక్టూ, ఖుజరహో శిల్ప విన్యాసం, సొమాలియాలో అన్నార్తులూ, సైగల్ గానమాధుర్యం ఇవీ ఈయన కవితా వస్తువులు. వీటిలో ఏ ఒక్కటీ కూడా ఈ మట్టిని, గాలిని విడిచి సాము చెయ్యవు.

అవార్డులు

[మార్చు]

ఈయన 1979 లో సోవియట్ లాండ్ నెహ్రూబహుమతి పొందాడు. రాజాలక్ష్మీ ఫౌండేషను అవార్డు, పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందాడు. 2008 సంవత్సరానికి గానూ ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారం ఈయనను వరించి, వన్నెకెక్కింది. ఈయన పొందని అవార్డు లేదు. వీరి ప్రతిభను మించిన అవార్డులు అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

రచనల పట్టిక

[మార్చు]

ఆవంత్స సోమసుందర్ ఇంతవరకూ 77 పుస్తకాలు రచించారు. చాలా పుస్తకాలు అనేక పునర్ముద్రణలు పొందాయి. ఈయన ప్రస్తుతం తన స్వీయచరిత్ర రెండవ భాగాన్ని వ్రాస్తున్నారు.

ఈమధ్య ప్రచురించిన ఈయన పుస్తకం పేరు " దేశి సారస్వతము-సమాజ వాస్తవికత. " దేశి సాహిత్యంలో ఉండే సామాజిక స్పృహపై వ్రాసిన విశ్లేషణాత్మక గ్రంథం.

వజ్రాయుధం: నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా వ్రాసిన కవితాసంకలనం. 1946 అక్టోబరు 26న దొడ్డి కొమరయ్య మరణంపై వ్రాసిన ఖబడ్ధార్ అనే కవితతో ఇది మొదలవుతుంది. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1956 లో నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. ఇది ఇప్పటికి 5 ముద్రణలు పొందింది. అనంతపురం లోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారు దీనిని పాఠ్యపుస్తకంగా స్వీకరించారు.

కాహళి : ఇవి ఆంధ్రరాష్ట్ర ఉద్యమ సమయంలో వ్రాసిన కవితలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఉద్యమిస్తున్న సమయంలో వారానికి ఒకటి చొప్పున "జ్వాల" అనే వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. 1953 లో పుస్తక రూపంగా వచ్చాయి.

గోదావరి జల ప్రళయం: 1953 లో వచ్చిన గోదావరి వరదలు వచ్చిన సందర్భంలో, సోమసుందర్ రాజమండ్రి, అమలాపురం, కపిలేశ్వరపురం వంటి ప్రాంతాలను సందర్శించి అప్పటి గోదావరి బీభత్సాన్ని కరుణరసార్ధ్రంగా కవిత్వీకరించారు.

రక్తాక్షి : ఫ్యూడల్ చట్రంలో సమాజం ఎదుర్కొన్న నిరంకుశత్వాలు, అమానుషత్వాలను కథా వస్తువుగా తీసుకొని చేసిన ఛందోబద్ద కావ్యం. ఈ కావ్య ప్రత్యేకత ఏమిటంటే ఆధునిక కాలంలో విస్మరింపబడ్డ ప్రాచీన ఛందస్సును తీసుకొని రచించటం. ఉదా: శ్రీ వృత్తం, వనితా వృత్తం వంటివి. రక్తాక్షి కావ్యంలో రెండు భాగాలు ఉంటాయి. 1. సచితానందం 2. రక్తాక్షి

మేఘరంజని: 1954 లో వెలువడ్డ కథాకావ్యం. దీర్ఘ వచన పద్యం. మొత్తం ఆరు అధ్యాయాలు ఉంటాయి. సోమరసం-సుందరకాండ: ఇది తాత్విక చింతనామయ కావ్యం. ఏమిటీ లోకం? ఏందుకీ బాధలు? వంటి ప్రశ్నలు, వాటికి కవి కనుగొన్న సమాధానాలతో ఈ కావ్యం రచింపబడింది.

మిణుగురులు: అద్భుతమైన పదచిత్రాలతో కూడిన ఆధునిక కవితాసంకలనం.

అనలకిరీటం: 1975 లో వెలువడిన కవితా సంపుటి. ప్రగతిశీల, విప్లవాత్మక భావాల నర్మగర్భపు వ్యక్తీకరణలతో కూడిన కవితా సంపుటం. ( సోమసుందర్ మాటలలో)

వెన్నెలలో కోనసీమ : 1977 లో అమలాపురంలో ఆవిష్కరింపబడిన గీత సంపుటి. సంగీతానికి అనుకూలంగా ఉండే గీతాల రచన. ఈ గీతాలలో చాలావాటిని రేడియోలలో పాటలుగా పాడారు.

రాలిన ముత్యాలు: మినీ కవితల ఉద్యమానికి ముందే లఘుకవితల పేరిట వ్రాసినటువంటి చిన్ని చిన్ని కవితలు.

మా ఊరు మారింది: సోమసుందర్ ఎమర్జన్సీని సమర్ధించాడు. ఈ విషయం నార్ల వెంకటేశ్వరరావును కలవరపరచి, ఈయనతో భేటీ అయి అయిదురోజులపాటు చర్చించగా, ఈయన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా తన భావాలను మార్చుకొని, ఒక ప్రకటన ఇవ్వటం జరిగింది. ఆ భావ పరిణామక్రమంలో వ్రాసిన 7 భాగాల కావ్యమే మా ఊరు మారింది. దీనిలో ప్రణాళికల ద్వారా గ్రామాలు ఏ విధంగా మారాయి అని వివరిస్తూ వ్రాసినటువంటి కావ్యం.

ఆగతనికి శుభారంభం : వచన కవితలు

బృహత్కావ్యాలు (నాలుగు సుదీర్ఘ కవితలు) : నాలుగు దీర్ఘకావ్యాలు. సుమారు 300 పేజీల పుస్తకం. ఈ పుస్తకంలో అక్షయతరంగిణి, కాలం వీలునామా, ముక్తఛ్ఛాయ, అరచే లోయలు అనే నాలుగు దీర్ఘ కవితలు ఉంన్నాయి. దీనిలో ముక్తఛ్చాయలో మననుంచి మన నీడ విడిపోవటం, అసలు మననీడ అంటే ఏమిటి అనే విషయాలపై తాత్విక, భౌతిక చింతనలతో కూడిన భావాలుంటాయి.

ఆధునిక కవిత్వం: వ్యాసావళి

క్షితిజ రేఖలు: అయిదు దీర్ఘ కావ్యాలు.

మార్క్సిజము-కవిత్వం: వ్యాసావళి

ఒక్క కొండలో వేయి శిల్పాలు: 120 పేజీల దీర్ఘ కవితల సంకలనం

ఆంగ్ల సీమలో ఆమని వీణలు (యాత్రా సాహిత్యం) : 1983 లో ఈయన ఆంగ్లసీమలో చేసిన ప్రయాణ విశేషాలతో కూడిన ట్రావెలాగ్.

గంధ మాదనం: రచనా కాలం 1995/96. హనుమంతుడు సీతను అన్వేషించటానికి వెళ్లినపుడు మధ్యలో మకాంచేసిన పర్వతం పేరు గంధమాదనం. జీవితం యొక్క అన్వేషణకు గ్రంథాలయం ప్రాతిపదిక అనే భావనతో వ్రాసిన దీర్ఘకావ్యం.

చేతావని: చేతావని అంటే హెచ్చరిక (1994) . బాబ్రి మసీదు కూల్చినపుడు వ్రాసిన దీర్ఘ కావ్యం. 50 పేజీలు.

దోనా పాలా: ఇది ఒక ప్రదేశం పేరు. గోవా ప్రయాణంలో వ్రాసిన కవితలు.

రక్షరేఖ: బాబ్రి మసీదు కూలగొట్టిన తరువాత బొంబాయిలో (ముంబాయి) మతకలహాలు చెలరేగాయి. ఇలాంటి మతకలహాలు పాకిస్తాను విడిపోయినప్పుడు కూడా జరగలేదు. వాటికి స్పందిస్తూ వ్రాసినటువంటి దీర్ఘ కవితా సంపుటి.

హృదయంలో హిరోషిమా: 1997 లో హిరోషిమా ఉదంతాన్ని స్మరించుకొంటూ వ్రాసిన కవితలు.

ధూపఛ్చాయ: నక్సలైట్లు రైలుపెట్టిని కాల్చివేస్తే దాన్ని నేపథ్యంగా తీసుకొని వ్రాసిన దీర్ఘకావ్యం.

జీవన లిపి : 120 పేజీల సంపూర్ణ కావ్యం. మానవుడు విప్లవానికై జరిపే కృషి అనే అంశంపై వ్రాసిన దీర్ఘకావ్యం.

సీకింగ్ మై బ్రోకెన్ వింగ్ :దేశంలో వామపక్ష అతివాద పార్టీలన్ని విడిపోతున్నాయి. దాన్ని సింబలైజ్ చేస్తూ వ్రాసిన అన్వేషాత్మకమైన దీర్ఘ కవిత.

సోమసుందర్ కథలు : 1984 లో ప్రచురింపబడిన సోమసుందర్ బానిసల దేశం వగైరా కథలు.

బుద్ధదేవ్ బోస్: బుద్ధదేవ్ బోస్ అనే ఆయన ప్రముఖ బెంగాలీ కవి. వీరి మోనోగ్రాఫ్, కొన్ని కవితల యొక్క అనువాదాలతో కూడిన రచన.

లియోనార్డో డావిన్సీ: డావిన్సీ జీవిత చరిత్ర. ఆయనను ఒక సంపూర్ణ మానవునిగా దర్శింపచేసే పుస్తకం.

హంసధ్వని: భారతీయ ఆధునిక సంగీతకారుల జీవిత చిత్రణలు. (బిస్మిల్లా, బడేముల్లా తదితరులు) .

కాజీ నజ్రుల్ ఇస్లాం: ఖాజీ, బెంగాలీ విప్లవకవి. వీరి కవిత్వాన్ని, జీవితాన్ని ఈ పుస్తకంద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసాడు.

కాళిదాసు రామకథ: రచనా కాలం 1990 లు. రఘువంశంలో కాళిదాసు చెప్పిన రామకథకు, వాల్మీకి రామకథకు గల సునిశితమైన వ్యత్యాసాలను తెలుపుతూ వ్రాసిన విశ్లేషణాత్మక పుస్తకం.

రుధిరజ్యోతిర్ధర్శనం: శ్రీరంగం నారాయణబాబు కవిత్వం లోతు పాతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చూపించిన గొప్ప విమర్శనాత్మక గ్రంథం. నారాయణ బాబు గొప్ప కవేమీ కాదు అని వ్యాఖ్యానించిన శ్రీ శ్రీతో విభేదించి, సోమసుందర్ నారాయణ బాబు వ్రాసిన రుధిర జ్యోతి కావ్య సౌందర్యాన్ని ఈ పుస్తకంద్వారా తెలుగు ప్రజలకు పరిచయం చేసాడు. ఈ కారణం చేతనే శ్రీ శ్రీకి సోమసుందర్ గారికి అభిప్రాయ భేదాలు పొడచూపాయి.

జాతికి జ్ఞాన నేత్రం: కొడవటిగంటి కుటుంబరావు రచనలపై చేసిన విశ్లేషణాత్మకమైన గ్రంథం.

కవిత్వం కాలాతీత కాంతిరేఖ: ఆధునిక కవిత్వానికి ఉండవలసిన లక్షణాలపై సూత్రీకరణ చేస్తూ వ్రాసిన విశ్లేషణాత్మకమైన 200 పేజీల గ్రంథం.

ఆధునిక కావ్య ప్రకాళిక: ఇతరుల పుస్తకాలకు వ్రాసిన పీఠికలలో కొన్నింటిని ఏర్చి కూర్చి చేసిన సంకలనం.

అమృత వర్షిణి: తిలక్ కవిత్వంపై వ్రాసిన విమర్శనాత్మక వ్యాసావళి.

సాహిత్యంలో సంశయ కల్లోలం: విరసం ఆవిర్భవించిన కొత్తలో విజయనగరం నుంచి చిత్తూరుదాకా ప్రయాణించి సభలు జరిపి, ఆ సభల్లో పలువురు వెలిబుచ్చిన సందేహాలకు ఇచ్చిన సమాధానాల సంకలనం. ఆ యా ప్రదేశాలలో వారి సందేహాలను చిన్న చిన్న స్లిప్పులపై తీసుకొని, వాటికి సమాధానాలను పత్రికా ముఖంగా ఇచ్చారు. వాటన్నిటినీ క్రోడీకరించి ఈ పుస్తకంగా ప్రచురించారు.

అక్షర సుమార్చన: తిక్కన, వేమన ఇత్యాదులపై వ్రాసిన వ్యాసావళి. వావిలాల గోపాల కృష్ణయ్యకు అంకితమీయబడింది.

పురిపండా ఎత్తిన పులి పంజా: పురిపండా అప్పలస్వామి పై వ్రాసిన వ్యాస సంపుటి.

నూరు శరత్తులు : 1990 లకి నూరేళ్ళు నిండిన కృష్ణ శాస్త్రి, విశ్వనాధ మొదలైనవారిపై వ్రాసిన వ్రాసావళి.

ఆ తరం కవితా తరంగాలు: భావకవుల తరువాత వచ్చిన పఠాభి, పాలగుమ్మి పద్మరాజు, వంటి వారిపై వ్రాసిన వ్యాసావళి.

నారాయణ చక్రం: డా: సి. నారాయణరెడ్డి కవిత్వంపై విశ్లేణాత్మకంగా వ్రాసిన గ్రంథం.

గోపుర దీపాలు : చలం పురూరవ పై వ్రాసిన పుస్తకం.

కృష్ణశాస్త్రి కవితాత్మ: కృష్ణశాస్త్రి కవిత్వంపై సమగ్ర విమర్శ.

గురజాడ గురుత్వాకర్షణ: గురజాడ అప్పారావు పై వ్రాసిన పుస్తకం. పూర్రిచర్డ్ అనే మాటపై పరిశోధన ఉంటుంది.

శరచ్చంద్రిక : శ్రీశ్రీ నుంచి కుందుర్తి ఆంజనేయులు వరకూ ఆధునిక కవులపై వ్రాసిన పరిశీలనాత్మక వ్యాసావళి.

ఉర్దూసాహిత్యంలో ఉన్నత శిఖరాలు: కబీర్ నుంచి ఖైఫీ అహ్మద్ దాకా ఉండిన గొప్ప గొప్ప ఉర్దూ కవుల గురించి పరిచయంచేస్తూ వ్రాసిన పుస్తకం.

శేషేంద్ర జాలం: శేషేంద్ర కవిత్వంపై వ్రాసిన వ్యాసావళి.

అగ్నివీణ ఆలాపించిన అణుసంగీతం: అనిసెట్టి సుబ్బారావు కవిత్వంపై వ్రాసిన విశ్లేషణాత్మక పుస్తకం.

కవితా కల్పవల్లి: ఆధునిక కవిత్వం-విమర్శనాత్మక విశ్లేషణ.

ఆగామి శతాబ్ధానికి ఆహ్వానం: వ్యాసాలు.

చరమ దశాబ్ది-కవితా రసాబ్ధి: 90 లలో కవిత్వంపై వచ్చిన వ్యాసావళి.

అక్షర నాదం: 2004 లో వెలువరించిన కవితా సంపుటి.

ఆమ్రపర్ణి: కావ్యం

జీవన లిపి: సంపూర్ణ కావ్యం

చిన్మయ లహరి: స్వీయ కవితా సంపుటి.

మనస్సంగీతం: పాటల సంపుటి.

విషవలయం: నాటకం. 1980 లలో అనేక పరిషత్తులలో బహుమతులు సాధించిన గొప్ప నాటకం

సోమసుందర్ లేఖలు: సినీనటుడు రమణారెడ్డికి సోమసుందర్ వ్రాసిన లేఖలను నెల్లూరులోని ఈయన అభిమానులు పుస్తకరూపంలోకి తీసుకొచ్చారు. నగరం నుంచి గగనం దాకా మనిషి: వివిధ పత్రికలలో చుట్టు-చూపు అనే పేరుతో వచ్చిన వ్యాసాలన్నింటిని సంగ్రహపరచి ప్రచురించిన పుస్తకం. సుమారు 250 పేజీలు.

మంది-మనిషి: వ్యాస సంపుటి .

సోమసుందర్ వద్ద ప్రస్తుతం ఇంకా 10 పుస్తకాలవరకూ అముద్రితంగా ఉన్నాయి. త్వరలో వెలువరించాలన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

పురస్కారాలు

[మార్చు]

సోమసుందర్ 1979లో అత్యంత ప్రతిష్ఠాకరమైన సోవియెట్ ల్యాండ్ నెహ్రూ బహుమతి పొందాడు. రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, గౌరవ డాక్టరేట్ వంటివి పొందాడు.[2] 2008 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారాన్ని అందుకున్నాడు.[3] 1986లో అ.ర.సం. గుంటూరుశాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు.[4]

శత జయంతి ఉత్సవాలు

[మార్చు]

ఆయన జన్మించి 100 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా 18 నవంబర్, 2023 నుండి 18 నవంబర్, 2024 వరకు ఆయన శత జయంతి వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ నిర్వహింపబడుచున్నది

మరణం

[మార్చు]

ఈయన 2016, ఆగస్టు 12 వ తేదీన కాకినాడలో మరణించాడు.[5]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Encyclpopaedia of Indian Literature, Sahitya Akademi (1992) పేజి.4135
  2. ఈనాడు పత్రిక[permanent dead link] సాహిత్యం శీర్షికలో చీకోలు సుందరయ్య వ్యాసం
  3. https://archive.today/20120907092831/www.nandamurifans.com/news/files/2008/may/jayanthi/ntrmay28a.jpg
  4. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
  5. విలేకరి, కాకినాడ (12 August 2016). "ప్రముఖ రచయిత ఆవంత్స సోమసుందర్ కన్నుమూత". ప్రజాశక్తి. Archived from the original on 12 ఆగస్టు 2016. Retrieved 12 August 2016.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)