తుమ్మల సీతారామమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుమ్మల సీతారామమూర్తి
తుమ్మల సీతారామమూర్తి
జననంతుమ్మల సీతారామమూర్తి
డిసెంబరు 25, 1901
గుంటూరు జిల్లా కావూరు
మరణంమార్చి 21, 1990
గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని అప్పికట్ల
ఇతర పేర్లుఅభినవ తిక్కన
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు,జాతీయోద్యమ కవి,కవి, పండితుడు
భార్య / భర్తఅన్నపూర్ణమ్మ
పిల్లలుఒక కుమార్తె నలుగురు కుమారులు
తండ్రినారయ్య
తల్లిచెంచమాంబ,

తుమ్మల సీతారామమూర్తి (డిసెంబరు 25, 1901 - మార్చి 21, 1990) తెలుగులెంకగా సుప్రసిధ్ధుడైన ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు.

జననం

[మార్చు]

1901 డిసెంబరు 25న గుంటూరు జిల్లా కావూరులో రైతు కుటుంబంలో జన్మించాడు. తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వెంకటరమణశాస్త్రి వంటి ప్రముఖుల వద్ద విద్యనభ్యసించిన తుమ్మల, కవిగా, పండితుడిగా, తనకు తానే తీర్చిదిద్దుకొన్నాడు. తుమ్మల అచ్చమైన గాంధేయవాది. తెలుగుదనం మూర్తీభవించిన జాతీయోద్యమ కవి. "మహాత్ముని ఆస్థానకవి" అని కట్టమంచి రామలింగారెడ్డితో పలికించుకున్న తుమ్మల, ఆత్మకథ, మహాత్మకథ వంటి ఆదర్శ ప్రౌఢకావ్యాలు, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ఉదయగానము, పఱిగపంట, పైర పంట, శబల, సమదర్శి, నా కథలు వంటి సామాజిక కవిత్వాన్ని అందించారు. అచ్చ తెలుగు మాటలతో అందమైన పద్యాలు అల్లగలిగిన ఆధునిక కవుల్లో తుమ్మలను మించిన వారు లేరంటె అతిశయోక్తి కాదు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడైన తుమ్మల గాంధీ భక్తి, తెలుగు భాషానురక్తి కలిగిన జాతీయోద్యమ కవి.

జీవన సంగ్రహము

[మార్చు]

తుమ్మల సీతారామమూర్తి 1901 డిసెంబర్ 25గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని కావూరు గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు చెంచమాంబ, నారయ్య. 1930లో అన్నపూర్ణమ్మతో అయనకు పెళ్ళి జరిగింది. వారికి ఒక కుమార్తె నలుగురు కుమారులు కలిగారు.

ఆయనకు విద్యాబుద్ధులు చెప్పి తీర్చిదిద్దిన గురువులు కావూరి శ్రీరాములు, జాస్తి సుబ్బయ్య, తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వేంకటరమణశాస్త్రి. 1930లో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి ప్రథమశ్రేణిలో ఉభయభాషాప్రవీణ పట్టాను అందుకున్నాడు. చదువు పూర్తయ్యాక, తన స్వగ్రామం కావూరు లోని తిలక్ జాతీయ పాఠశాలలో 1924 నుండి 1929 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. 1930 నుండి 1957 వరకు గుంటూరు జిల్లా బోర్డులోని దుగ్గిరాల, బాపట్ల, నిడుబ్రోలు, అప్పికట్ల ఉన్నతపాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. 1920 - 1930 మధ్య కాలంలో కాంగ్రెసులో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1922లో జైలుశిక్ష అనుభవించాడు.

గ్రామజీవనము, గాంధీతత్త్వము, సర్వోదయము, ఆంధ్రాభ్యుదయము, తిక్కన కవితామార్గము, చిన్నయసూరి సిద్ధాంతము ఆయనకు అభిమాన విషయాలు.

మరణం

[మార్చు]

1990 మార్చి 21గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని అప్పికట్ల గ్రామాలో తుమ్మల సీతారామమూర్తి మరణించాడు.

సాహితీ కృషి

[మార్చు]

సీతారామమూర్తి పలు రచనా రూపాలను స్పృశించాడు. ఆయన రచనలను స్థూలంగా కింది విధాలుగా విభజించవచ్చు.

  • గాంధీకావ్యాలు - ఆత్మకథ, మహాత్మకథ, అమరజ్యోతి, సర్వోదయగానము, గాంధీగానము, మహాత్మగాంధీ తారావళి.
  • రాష్ట్రకావ్యాలు - రాష్ట్రగానము, ఉదయగానము.
  • ఖండకావ్యాలు - పఱిగపంట, పెద్దకాపు, శబల, పైరపంట, సమదర్శి, కదంబకైత, చక్కట్లు, దివ్యజ్యోతి.
  • కథాకావ్యాలు - ఆత్మార్పణము, ధర్మజ్యోతి.
  • సామాజిక కావ్యాలు - ఎక్కట్లు, సందేశసప్తశతి.
  • స్వీయచరిత్ర కావ్యాలు - నేను, నా కథలు, తపస్సిద్ధి.
  • వేదాంతకావ్యాలు - గీతాదర్శము, భజగోవిందం, లక్ష్మీనృసింహ స్తోత్రము, హనుమాన్ చాలీసా.
  • నీతికావ్యాలు - తెనుగు నీతి, నీతికుసుమావళి.
  • స్మృతికావ్యాలు - రామకృష్ణస్మృతి, విశ్వదాత.
  • శతకములు - పురాంతక శతకము, రామశతకము, రామలింగేశ్వర శతకము.
  • జంగం కథలు - బిల్హణీయము.
  • నాటకాలు - గిరికా పరిణయము, హనుమద్విజయము,మహేంద్ర జననము.
  • హరికథలు - అన్నదాన మాహాత్మ్యము, సాత్రాజితీ పరిణయము, నామదేవ చరిత్రము.

కృతులు (ప్రచురించిన సంవత్సరము క్రమములో)

[మార్చు]
  1. గిరికా పరిణయము, 1911-1918
  2. మధ్య హనుమద్విజయము, 1911-1918 మధ్య
  3. అన్నదాన మాహాత్మ్యము, 1911-1918 మధ్య
  4. సాత్రాజితీ పరిణయము, 1911-1918 మధ్య
  5. పురాంతక శతకము, 1911-1918 మధ్య
  6. రామశతకము, 1919
  7. రామలింగేశ్వర శతకము, 1919
  8. బిల్హణీయము, 1920
  9. మహాత్మగాంధీ తారావళి, 1921
  10. నామదేవ చరిత్రము, 1922
  11. రామకృష్ణస్మృతి, 1923
  12. భజగోవిందం, 1923
  13. లక్ష్మీనృసింహ స్తోత్రము, 1925
  14. మహేంద్ర జననము, 1924
  15. ఆత్మార్పణము (4 ముద్రణలు), 1932-1953
  16. ఆత్మకథ (ప్రథమ భాగము), 1936
  17. నీతికుసుమావళి, 1937
  18. రాష్ట్రగానము (7 ముద్రణలు), 1938-1973
  19. ధర్మజ్యోతి (5 ముద్రణలు), 1943-1985
  20. పఱిగపంట (2 ముద్రణలు), 1943-1952
  21. పెద్దకాపు, 1948
  22. అమరజ్యోతి, 1948
  23. తపస్సిద్ధి, 1949
  24. ఆత్మకథ (మొత్తం అయిదు భాగములు), 1951
  25. ఉదయగానము (2 ముద్రణలు), 1955-1973
  26. శబల, 1955
  27. సర్వోదయగానము, 1961
  28. తెనుగు నీతి, 1961
  29. నేను, 1963
  30. గీతాదర్శము, 1963
  31. పైరపంట, 1964
  32. సమదర్శి, 1967
  33. మహాత్మకథ, 1968
  34. నా కథలు, 1973
  35. ఎక్కట్లు, 1976
  36. హనుమాన్ చాలీసా, 1978
  37. సందేశసప్తశతి, 1981
  38. కదంబకైత, 1983
  39. గాంధీగానము, 1987
  40. చక్కట్లు, 1993
  41. దివ్యజ్యోతి, 1994
  42. తెనుఁగులెంక తుమ్మల సమగ్ర సాహిత్యము, తుమ్మల శతజయంతి ఉత్సవ సంఘ ప్రచురణ, గుంటూరు, 2001
    1. మొదటి భాగము - బాపూజీ ఆత్మకథ
    2. రెండవ భాగము - మహాత్మకథ
    3. మూడవ భాగము - ఖండకావ్యములు - రామశతకము, రామలింగేశ్వర శతకము, మహాత్మగాంధీ తారావళి, మహేంద్ర జననము, రామకృష్ణస్మృతి, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ధర్మజ్యోతి, పఱిగపంట, శబల, ఉదయగానము, సర్వోదయగానము, తెనుగు నీతి, నేను, గీతాదర్శము
    4. నాల్గవ భాగము - ఖండకావ్యములు - పైరపంట, సమదర్శి, నా కథలు, హనుమాన్ చాలీసా, సందేశసప్తశతి, కదంబకైత, గాంధీగానము, చక్కట్లు, దివ్యజ్యోతి

తుమ్మల కవితా సంకలన గ్రంథములు

[మార్చు]
  1. యుగకవిత, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1984
  2. రంగా - భారతి, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1986
  3. సంక్రాంతి, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1988
  4. రైతుజీవనము, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1990
  5. సత్యం శివం సుందరం, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1990
  6. తుమ్మల వాణి, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1992
  7. తుమ్మల యుగవాణి, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1996
  8. తుమ్మల సుభాషితములు, తుమ్మల శ్రీనివాసమూర్తి, 2000
  9. తుమ్మల వాణి, తుమ్మల శతజయంతి ఉత్సవ కమిటి, 2001
  10. ఆంధ్రప్రశస్తి, తుమ్మల శ్రీనివాసమూర్తి, 2004
  11. పండుగ కవితలు, తుమ్మల శ్రీనివాసమూర్తి, 2005
  12. తెనుఁగుతీపి, తుమ్మల శ్రీనివాసమూర్తి, 2005

సమ్మానములు

[మార్చు]

బిరుదులు

[మార్చు]

తుమ్మల సీతారామమూర్తికి తెనుగు లెంక, అభినవ తిక్కన, మహాత్ముని ఆస్థానకవి బిరుదులు. ఒక సభలో సీతారామమూర్తి ప్రసంగించబోతుండగా శ్రోతల్లోంచి ఒకరు లేచి మీకు అభినవ తిక్కన అన్న బిరుదు వుంది కదా. మీ పద్యాలలో అత్యుత్తమమైనది ఒకటి, తిక్కన పద్యాల్లో అత్యంత చెత్త పద్యమొకటి వినిపించి, దానికన్నా మీ పద్యం ఏ విధంగా గొప్పదో చెప్పండి. నేను మీరు అభినవ తిక్కనేనని ఒప్పుకుంటానని ప్రశ్నించారు. దానికి సమాధానంగా నన్ను నేను ఎప్పుడూ అభినవ తిక్కనగా భావించలేదు. కానీ వాళ్ళూ వీళ్ళూ అంటూంటే ఊరుకోవడం కూడా పొరబాటని ఇప్పుడు తెలిసివచ్చింది. ఈ సభాముఖంగా నేను ఆ బిరుదును వదిలివేస్తున్నాను. నేను తెలుగు లెంక, మహాత్ముని ఆస్థానకవి అన్న బిరుదులకు తగ్గవాణ్ణని భావిస్తూ వాటిని అట్టిపెట్టుకుంటున్నానని తుమ్మల అంగీకరించారు.

తుమ్మల జీవితము, కవిత్వము, వ్యక్తిత్వము పై ఇతరులు వ్రాసిన గ్రంథములు

[మార్చు]
  1. తెనుఁగులెంక తుమ్మల, గొల్లపూడి ప్రకాశరావు, 1975
  2. యుగకవి తెనుఁగులెంక శ్రీ తుమ్మల సీతారామమూర్తి, తుమ్మల శ్రీనివాస మూర్తి, 1989
  3. తెనుఁగులెంక తుమ్మల సీతారామమూర్తి కవిత్వం - వ్యక్తిత్వం, జూపూడి అమ్ములయ్య (అమూల్యశ్రీ), 1995
  4. తుమ్మల సీతారామమూర్తి (భారతీయ సాహిత్య నిర్మాతలు), నాగళ్ల గురుప్రసాదరావు, సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ, 2000
  5. అజరామరవాఙ్మయమూర్తి తుమ్మల సీతారామమూర్తి, సూర్యదేవర రవికుమార్, 2002

బయటి లంకెలు

[మార్చు]