Jump to content

పట్రాయని సంగీతరావు

వికీపీడియా నుండి
పట్రాయని సంగీతరావు
దస్త్రం:Sangeetharao-Hindu images 10-3-2006.jpg
పట్రాయని సంగీతరావు చిత్రపటం.
జననం
పట్రాయని నరసింహమూర్తి

నవంబరు 2, 1920
మరణం2 జూన్ 2021
చెన్నై, తమిళనాడు
మరణ కారణంశతాధిక వయస్సులో కరోనాతో తుదిశ్వాస
వృత్తిగాయకుడు, సంగీత దర్శకుడు
పిల్లలు2 కుమారులు, 3 కుమార్తెలు
తల్లిదండ్రులు

పట్రాయని సంగీతరావు (1920 - 2 జూన్ 2021[1]) ఆంధ్ర దేశానికి చెందిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు.

పట్రాయని సంగీతరావుకు తల్లిదండ్రులు పెట్టిన పేరు నరసింహమూర్తి, ఇది వారి తాత పేరే అయినా సంగీతరావుగానే ప్రసిద్ధుడు, పట్రాయనివారి సంగీత కుటుంబంలో మూడవతరానికి చెందినవాడు సంగీతరావు. తాత పట్రాయని నరసింహశాస్త్రి, తండ్రి పట్రాయని సీతారామశాస్త్రి - వీరిరువురి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు.

బాల్యం

[మార్చు]

ఇతను నరసింహమూర్తిగా 1920 నవంబరు 2 తేదీన సీతారామశాస్త్రి, మంగమ్మలకు ప్రథమ సంతానంగా ఇప్పటి విజయనగరం జిల్లా, కిండాం అగ్రహారంలో జన్మించాడు. ఇతనికి ఆయపిళ్ళ లక్ష్మీనారాయణ, చెన్నమ్మ మాతామహులు. ఇతని ఇద్దరు సోదరులు పట్రాయని నారాయణమూర్తి, పట్రాయని ప్రభాకరరావులు.

తండ్రి సీతారామశాస్త్రి సంగీత శిక్షకుడిగా జీవనయానం చేస్తున్నప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, సాలూరు మొదలయిన ప్రదేశాలలో సంగీతరావు బాల్యం గడిచింది. శ్రీకాకుళం జిల్లా నాగావళి ఒడ్డున పాఠశాలలో కొన్నాళ్ళు చదువుకున్నాడు. ఇతనికి ఎనిమిది సంవత్సరాల వయసులో ఉండగా తల్లి మంగమ్మ మరణించింది. ఆమె మరణం ఇటు సీతారామశాస్త్రికి, అటు పిల్లలకు జీవితంలో పెనువిషాదంగా పరిణమించింది. కొంతకాలం తల్లి పుట్టింట్లో పిల్లలు ముగ్గురూ పెరిగి, క్రమంగా ఒకరొకరిగా సాలూరులో స్థిరపడిన తండ్రి, తాతగార్ల దగ్గరకు చేరుకున్నారు.

పట్రాయని నరసింహశాస్త్రి సాలూరులో పెదగురువుగా, ఆయన కుమారుడు సీతారామశాస్త్రి చిన గురువుగా పిలువబడుతూ సాలూరు వాసుల ప్రేమాభిమానాలను పొంది ఉన్న రోజులు అవి. నరసింహశాస్త్రి సాలూరులో ఒక చిన్న ఇంట్లో వృద్ధురాలైన తల్లితో కలిసి నివసిస్తూ ఉండేవాడు. సీతారామశాస్త్రి సాలూరు, చుట్టుపక్కల గ్రామాలు, బరంపురం వంటి సంస్ధానాలలో సంగీత విద్యా ప్రదర్శనలు చేస్తూ ఇంచుమించు సంచార జీవనం చేసేవాడు.

బాల్యంలో తాత దగ్గర గడిపిన జీవితం సంగీతరావుని అతిచిన్న వయసులోనే సంగీతజ్ఞుడుగా రూపొందడానికి సహాయం చేసింది. గొప్ప సంగీత విద్వాంసుడిగా పేరు సంపాదించుకొని ఉన్న నరసింహశాస్త్రి, మనవలు సాలూరు చేరేనాటికి చాలా నిరాడంబరంగా, ఒక యోగిలాగ జీవితం సాగిస్తూ ఉన్నాడు. ఆరడుగుల ఎత్తు, బోడితల మీద జడకట్టిన చిన్న పిలక, చెవులకి ఒరిస్సాలో రూపొందిన కుండలాలు, మెడలో పెద్ద సైజు రుద్రాక్ష తావళం, కాషాయం రంగుదేరిన ధోవతి పంచెకట్టు, పైన శాలువా. ఇదీ అప్పటికి ఎనిమిదేళ్ళ వయసులో ఉన్న మనవడు సంగీతరావు మనస్సులో స్థిరపడ్డ తాత రూపం. ఉదయం లేస్తూనే తాతగారి వెంట తిరుగుతూ పూజా పునస్కారాలకి సహాయం చేస్తూ, భజనలో గొంతు కలుపుతూ ఉండేవాడు. ఆ రోజుల్లో సాలూరు, బొబ్బిలి ప్రాంతాలలో జరిగే ఏకాహాలు, సప్తాహాలు, దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు, భజన కాలక్షేపాలు జరిగినప్పుడు తాతతో పాటు వెళ్ళి వారి ప్రోత్సాహంతో అతి చిన్న వయసులోనే స్వరకల్పనలు చేస్తూ సంగీతప్రదర్శన చేసేవాడు.

ఇతను బొబ్బిలిలో ప్రముఖ విద్వాంసుడు ఆకుండి నారాయణశాస్త్రి దగ్గర కొన్నాళ్లు శిష్యరికం చేసాడు. గురువుగారు బొబ్బిలి బాలికల పాఠశాలలో టీచర్ గా పనిచేసేవాడు. మహారాణి వద్ద ఆయన వీణాగానం చేసినప్పుడు శిష్యుడు సంగీతరావుతో పాటలు పాడించేవారుట నారాయణ శాస్త్రి. స్వర పల్లవులు, లక్షణగీతాలు, వర్ణాలు ఇలా ఎన్నో నేర్చుకున్నాడు ఆయన దగ్గర. బొబ్బిలి స్కూల్లో 4, 5 తరగతులు చదువుకున్నాడు. ప్రతిరోజు రాణీగారు పూజా మహల్ కి వచ్చి అర్చన చేస్తున్నప్పుడు నారాయణశాస్త్రి శిష్యుడు సంగీతరావుతో గాత్రం పాడిస్తూ వీణతో సహకరించేవారుట. బొబ్బిలి సంస్థానంలో జరిగిన పట్టాభిషేకం ఉత్సవంలో నారాయణశాస్త్రి తాను రచించిన నవరాగమాలికను సంగీతరావుతో పాడించాడు. ఆ రోజులలో కంటాభంజి రైల్వే వారి గణేశ ఉత్సవాలలో కచేరీ చేసి శ్రీరంగం గోపాలరత్నంతో పాటు బంగారు మెడల్ బహుమతిగా పొందాడు. ఆ రకంగా ఎంతో చిన్న వయసులోనే సంగీతరావు సంగీత కచేరీలు చేశారు. చాలా చిన్న వయసులోనే అనగా సంగీతరావుకు తొమ్మిది సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది.

తాత నరసింహశాస్త్రి వైద్యం కోసం కుటుంబం కొన్నాళ్లు బొబ్బిలిలో ఉండి తిరిగి సాలూరు తిరిగివెళ్లిపోయాడు. 1931లో తాత నరసింహశాస్త్రి కన్నుమూసాడు. అప్పటికి సంగీతరావుకు పదిసంవత్సరాల వయసు. నరసింహశాస్త్రి మరణంతో అప్పటికి సంప్రదాయంపై తిరుగుబాటు ధోరణిలో ఉన్న సీతారామశాస్త్రి గారికి సంప్రదాయంపై అభిమానం ఏర్పడింది. 1919 లోనే సాలూరులో స్ధాపించిన సంగీత పాఠశాలను అభివృద్ధి చేయడానికి నడుంకట్టారు సీతారామ శాస్త్రి. పర్ణశాలలా కనిపించే శ్రీ శారదా గాన పాఠశాల 1936 కాలానికి భవనంగా రూపుదిద్దుకుంది.

సాలూరు మహారాజా వారికి నాటకాలంటే సరదా ఉండేది. అనేక నాటక సమాజాలవారు సాలూరుకు వచ్చేవారు. సంస్థానంలో జరిగే ఉత్సవాలలో, పర్వదినాలలో సాలూరు, జయపురంలో హరికథా కాలక్షేపాలు జరిగేవి. వీటికి సీతారామశాస్త్రి హార్మోనియం సహకారం అందించే వాడు. అందువల్ల ఆనాటి ఎందరో ప్రముఖ నటులు, సాహితీ వేత్తల ప్రభావం సంగీతరావు పై ప్రసరించింది.

బొబ్బిలి నాగరికంగా ఎంత అభివృద్ధి చెంది ఉన్నా, బొబ్బిలి జీవితం కన్నా సాలూరులో, తమ పాఠశాల విద్యార్థులతో గడిపిన జీవితమే ఆకర్షించింది సంగీతరావుని. సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన శిష్యులు కొందరి గురించి, ఆనాటి వారి అమాయకమైన ప్రవర్తన, సంగీతం పైన వారు చూపిన అమితమైన శ్రద్ధాసక్తులు, తన జీవితంలో వారు ఏర్పరచిన ప్రభావం, ఆనాటి సాలూరు జీవితం గురించి సంగీతరావు తన ‘చింతాసక్తి’ పుస్తకంలో ఎంతో వివరంగా రాసాడు.

సీతారామశాస్త్రికి కుటుంబ పోషణతో పాటు పాఠశాల నిర్వహణ బాధ్యత కూడా క్రమంగా భారంగా మారిన దశలో ఆయనకు విజయనగరంలోని సంగీత కళాశాలలో గాత్రంలో ప్రొఫెసర్ గా ఉద్యోగావకాశం వచ్చింది. ఆ పరిస్థితులలో శిష్యులకి పాఠశాలను అప్పగించి వెళ్ళలేక వెళ్ళలేక విజయనగరానికి కుటుంబంతో సహా తరలి వెళ్ళారు సీతారామశాస్త్రి.

విజయనగర జీవితం

[మార్చు]

విజయనగరం విద్యల నగరంగా అప్పటికే సుప్రసిద్ధమై ఉంది. ప్రముఖ సంగీత విద్వాంసులు, సాహితీరంగంలో దిగ్గజాలెందరో విజయనగరంలో ఉండేవారు. సంగీతంలోనే కాక సీతారామశాస్త్రికి ఛందోబద్ధంగా పద్యాలు అల్లడం వంటి సాహిత్యాభిమానం కూడా ఉండడం చేత చాలామంది విద్వాంసులు, పండితులతో గాఢమయిన పరిచయం ఉండేది.

ప్రతిరోజు సాయంత్రం సీతారామశాస్త్రి ఇంటి వద్ద సంగీత సాహిత్యాలలో అభిరుచి కలిగిన కవి, పండితులు కలుసుకుని సాహిత్య చర్చలు చేసేవారు. కవితాగోష్ఠులు జరిగేవి. సీతారామశాస్త్రి మిత్రబృందం అంతా ఆనాటికే వివిధ రంగాలలో ప్రసిద్ధి చెందినవారు. ప్రతిరోజూ సాయంత్రం తండ్రి, మిత్రులతో జరిపే సంగీత, సాహిత్య గోష్టులు సంగీతరావుని విశేషంగా ఆకర్షించేవి. ఆనాటి సంగీత విద్వాంసుల, సాహితీవేత్తలతో కలిగిన పరిచయాలు సంగీతరావు సంగీత సాహిత్య జీవితాలపై విశేషమైన ప్రభావం చూపాయి.

విజయనగరంలో భారతీతీర్థ సంస్థ దసరా సభలలో 1939వ సంవత్సరంలో సీతారామశాస్త్రిని సంగీత భూషణ బిరుదుతో గౌరవించింది. 1952 సంవత్సరంలో సంగీతరావు విద్వత్తును గుర్తించి అదే సంస్థ వారికి కూడా ఆంధ్ర సంగీత భూషణ బిరుదును ప్రదానం చేసింది. తండ్రితో పాటు అదే గౌరవాన్ని అందుకోవడం సంగీతరావు ప్రతిభకి తార్కాణం.

ఆకుండి వెంకటశాస్త్రికి గురుపూజ జరిగిన సందర్భంలో సంగీత రావు 1943 లో కాకినాడ వెళ్ళారు. అప్పుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు వంటి ప్రముఖులతో సంగీతరావుకి పరిచయం ఏర్పడింది. ఫ్రేజర్ పేట రినైసాన్స్ క్లబ్ లో సంగీతరావు కచేరీ చేసారు. అప్పుడు ప్రముఖుల నుండి లభించిన ప్రశంసలు ఆయనలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని నింపాయి.

పట్రాయని సీతారామశాస్త్రి గొప్ప హార్మోనిస్టు. భారతీయ సంగీతానికి హార్మోనియం పనికిరాదని దానిని విదేశీ ప్రభుత్వం నిషేధించింది. స్వాతంత్ర్యానంతరం కూడా హార్మోనియం పై రాజకీయ నిషేధం కొనసాగింది- నిన్న, మొన్నటిదాకా. సమకాలీన విద్వాసులు కూడా దానిని తమ కచేరీలలో ఉపయోగించేవారు కాదు. కానీ సీతారామశాస్త్రికి హార్మోనియం ప్రాణసమానం. చాలా సున్నితమైన స్వరాలను, గమకాలను కూడా హార్మోనియం మీద పలికించేవాడని ప్రతీతి. తండ్రిలాగే సంగీతరావు కూడా హార్మోనియంని ఎంతో అద్భుతంగా నేర్పుగా వినిపించడంలో ప్రావీణ్యం చూపేవాడు. ప్రత్యేకంగా ఏ విద్యాకేంద్రంలోను సంగీతాన్ని అభ్యసించడం గాని, వాయిద్యాలపై శిక్షణ గానీ పొందకుండానే హార్మోనియం, వీణ, వయోలిన్ వాయిద్యాల పై స్వయం ప్రతిభతో పట్టు సాధించాడు. ఉన్నత పాఠశాల వరకు సాలూరులోను, స్కూలు ఫైనల్ వరకు చదువును విజయనగరంలో పూర్తిచేసాడు.

తండ్రి సీతారామశాస్త్రి పనిచేసిన కాలేజీ, విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల. విద్యల నగరం విజయనగరంలో సంగీతం నేర్చుకొని తమలోని కళను సానపెట్టుకోవడానికి వచ్చే విద్యార్థులెందరో ఉండేవారు. అలా వచ్చిన వారిలో గురువుగారికి ఆనాడు అత్యంత ప్రీతి పాత్రుడు, నేటి మన గాన గంధర్వ ఘంటసాల వేంకటేశ్వరరావు. సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన వారికి సింహాచలం దేవస్థానం వారి సత్రంలో భోజన సదుపాయాలు కల్పించబడేవి. చలనచిత్ర సంగీతకారుడిగా తన విజయంలో గురువు సీతారామశాస్త్రివద్ద చేసిన శిష్యరికం పాత్రని ఘంటసాల తన జీవితంలో ఎప్పుడు మరిచిపోలేదు. ఎన్నో ఘట్టాలలో గురువుని అత్యంత భక్తిశ్రద్ధలతో తలుచుకున్నాడు. తాను చిత్రపరిశ్రమలో నిలదొక్కుకొని ఇల్లు కట్టుకొని 1950లో గృహప్రవేశం చేసిన సందర్భంగా గురువుని మద్రాసుకు పిలిచి ఎంతో ఆత్మీయంగా ఘనంగా సత్కరించాడు.

వివాహం చిన్న వయసులోనే జరగడం, కుటుంబ బాధ్యతలు పైబడడం వంటి కారణాలు సంగీతరావు జీవితానికి ఒక గమ్యాన్ని నిర్దేశించుకోవలసిన ఆవశ్యకతను కలిగించాయి. కొన్నాళ్ళు సాలూరులోనే ఉండి పాఠశాలను నిర్వహించే ఉద్దేశంతో సాలూరులో మకాం పెట్టాడు. తండ్రి ప్రారంభించిన సంగీత పాఠశాలను ఇంకా అభివృద్ధి లోకి తీసుకొని రావాలన్న ఆశ ఎంత ఉన్నా ఆర్థిక వనరులు అందుకు అనుమతించలేదు.

ఈ పరిస్థితిలో శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నది ఒడ్డున ఉన్న కలివరం అనే కుగ్రామానికి చెందిన గంగుల అప్పలనాయుడు సంగీతరావుని తమ ఊరికి ఆహ్వానించారు. ఒక విధంగా ఆస్థాన గాయకుడి పదవిలాంటి ఉద్యోగం. అంతకుముందు మండా సూర్యనారాయణశాస్త్రి, వాసా కృష్ణమూర్తి అక్కడ కొంతకాలం ఉండి వెళ్ళారు. కలివరంలో సంగీతరావు కుటుంబంతో మూడు సంవత్సరాలున్నాడు.

మొదటిసారి సంగీతరావు 1942 లో మద్రాసు వచ్చాడు. అప్పటికి ఘంటసాల సినీ పరిశ్రమకు రాలేదు. నాగయ్యతో భక్త పోతన తీస్తున్న రోజులవి. జెమిని స్టూడియోలో పనిచేస్తున్న సీతారామశాస్త్రి మిత్రుడు, శిష్యుడు ఉరిమి జగన్నాధం సంగీతరావుని నాగయ్యకు పరిచయం చేసాడు. అప్పుడు సంగీతరావు సముద్రాల రాఘవాచార్యులు, నాగయ్య దగ్గర పాటలు పద్యాలు పాడాడు. కానీ అవి నగరాల మీద బాంబులు పడుతున్న యుద్ధపు రోజులు. తండ్రి ఒత్తిడి మేరకు తిరిగి విజయనగరం వెళ్లిపోయాడు సంగీతరావు.

1948 లో చిత్రసీమలో ప్రవేశించి స్థిరపడ్డాక గురువు సీతారామశాస్త్రిని చూడడం కోసం మారెళ్ళ రంగారావుతో కలిసి ఘంటసాల విజయనగరం వెళ్ళాడు. కానీ అప్పుడు గురువు - సీతారామశాస్త్రి పెద్దకుమారుడు సంగీతరావు దగ్గర కలివరంలో ఉన్నాడు. విజయనగరం నుండి కలివరం వెళ్ళి గురువుని కలిసాడు ఘంటసాల. తెలుగు చిత్రసీమలో అవకాశాలు చాలా ఉన్నాయని, తనతో మద్రాసు రమ్మని ఎంతగానో పిలిచాడు. కానీ సంగీతరావుకి అప్పుడు చలనచిత్ర పరిశ్రమ పట్ల ఆసక్తి లేక ఆయనతో వెళ్ళలేదు.

1952 లో తన మిత్రుడు ద్వివేదుల నరసింగరావు (రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి భర్త) బలవంతం మీద, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో, జీవితంలో నిలదొక్కుకోవాలని విజయనగరం నుంచి మరొకసారి మద్రాసు వచ్చారు సంగీతరావు. చిన్ననాటి మిత్రుడిని కలవడానికి ఘంటసాల నివాసానికి వెళ్ళాడు. ఆ రోజులకి ఘంటసాల లక్ష్మమ్మ కథతో మంచి గాయకుడిగానే కాక మేటి సంగీత దర్శకునిగా కూడా స్థిరపడి ఉన్నాడు. స్వంతంగా పరోపకారం చిత్రం నిర్మిస్తున్నాడు. ఘంటసాల పల్లెటూరు, పరోపకారం చిత్రాలలో సంగీతరావుతో కొన్ని కోరస్ పాటలు కూడా పాడించాడు. కానీ సినీ రంగంలోని వ్యక్తులకు సంగీతజ్ఞులపై గల చిన్నచూపును, నిర్లక్ష్యాన్ని సహించలేకపోయాడు సంగీతరావు. సినిమా రంగానికి దూరంగా ఉండే ఉద్దేశంతో తిరిగి కలివరం వెళ్ళిపోయాడు.

మరికొంతకాలానికి 1954లో కలివరం నాయుడు కుటుంబంతో కలిసి సంగీతరావు కూడా తిరుపతి యాత్రకి బయలుదేరాడు. స్వామి దర్శనం అయ్యాక యాత్రలో భాగంగా మద్రాసు వచ్చాడు. చిన్ననాటి స్నేహితుడిని పలకరించి పోవడానికి వచ్చిన సంగీతరావుని ఘంటసాల తిరిగి వెనక్కి వెళ్ళనివ్వలేదు. గాయకుడిగానే కాక సంగీత దర్శకత్వం కూడా చేస్తూ ఉన్న ఘంటసాల తనకు చేతినిండా పని ఉందని, సహాయకుల అవసరం ఉందని, ఉండిపొమ్మని కోరి, స్టేషనుకి వెళ్లి కలివరం నాయుడుకి సంగీతరావు విజయనగరం రారని చెప్పేరుట.

1954 - అప్పుడు ఘంటసాల కన్యాశుల్కం, మాయాబజారు, మొదలయిన చిత్రాలకు సంగీత దర్శకత్వం చేస్తున్న రోజులు. ఘంటసాల సంగీతం సమకూర్చిన చిత్రాలలో ఘంటసాలకు సహాయకుడిగా ఉన్నాడు సంగీతరావు. ఘంటసాల స్వరపరుస్తూన్నప్పుడు వాటికి నోట్స్ రాసి ఇవ్వడం, ఆర్కెష్ట్రాకి సూచనలు ఇవ్వడం చేసేవాడు సంగీతరావు.

1955లో ఘంటసాల స్వంత ఆర్కెష్ట్రాని ప్రారంభించాడు. అప్పటినుండి ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు అన్నిటిలోనూ సంగీతరావు తనవంతు సహకారం అందించాడు. ఘంటసాల ప్రైవేటుగా ఇచ్చిన రికార్డులలో పాపాయి పద్యాలు మొదలైనవాటిలో సంగీతరావు హార్మోనియం మనం వినగలం. చిత్రంలో "లలిత భావనిలయా" పాటని స్వరపల్లవిగా కూర్చడంలో సంగీతరావు సహకారం ఉంది.

కంచి పరమాచార్యులవారికి జరిగిన ఉత్సవాలలో హైదరాబాద్లో ఘంటసాల తను స్వరపరచిన రహస్యం చలనచిత్రంలోని మల్లాది రామకృష్ణశాస్త్రి గిరిజా కల్యాణం రచనను గానం చేసిన సందర్భంలో సంగీతరావు ఘంటసాలతో పాటు స్వరం కలిపాడు. సంగీతాభిమానులను ఈ ప్రైవేటు రికార్డు అలరిస్తుంది. అలాగే శ్రీ ఘంటసాల గానంచేసి, ఆంధ్రదేశం యావత్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలకించే శ్రీ వేంకటేశ్వర ప్రభాతప్రార్థన, భగవద్గీత రికార్డులో కూడా సంగీతరావు హార్మోనియం సహకారం మనకు వినిపిస్తుంది.

ఘంటసాల విద్యార్థి దశనుంచి ఆయన జీవితకాల పర్యంతం అనేక దశలలో సంగీతరావు ఆయన మిత్రుడిగా, సహచరుడిగా మెలిగాడు. సీతారామశాస్త్రి తన ఆఖరి కుమారుడు ప్రభాకరరావు విషయంలో ఘంటసాల సహాయం కోరినా, కాకతాళీయంగా సంగీతరావు, ఘంటసాల కోరిక మేరకు ఆయన సినీజీవిత స్వర సహచరుడయ్యాడు. అటువంటి తన గురుపుత్రుడుగా సంగీతరావుని ఘంటసాల తన జీవితాంతం కూడా ఎంతో ఆదరాభిమానాలు కనపరిచి గౌరవించాడు.

ఘంటసాల గారితో

[మార్చు]

ఘంటసాల స్వర సహాయకుడిగా 1974 వరకు సుమారు పాతిక సంవత్సరాల పాటు తెలుగు సినిమాతో సంగీతరావు జీవితం ముడిపడివుంది.

భావస్ఫోరకంగా, రసానుగుణ్యంగా సంగీత రచన చేసిన సందర్భాలలో, భగవద్గీతకి సంగీత రచన చేసిన సమయంలో తాను గురుపుత్రులుగా గౌరవించే సంగీతరావు అపారమైన శాస్త్రీయ సంగీత పరిజ్ఞానాన్ని, హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలలో ఆయనకు గల ప్రామాణికతను ఘంటసాల సమయోచితంగా ఉపయోగించుకున్నాడు. భగవద్గీత ప్రైవేటు రికార్డులో ఘంటసాల ప్రయోగించిన రాగాలు, వాటి సార్థకత గురించి ఇటీవల సంగీతరావు తన వ్యాఖ్యానంతో భగవద్గీత రాగరసస్ఫూర్తి అనే చక్కని రికార్డు వెలువరించాడు. నూకల ప్రభాకర్ దీనిని రికార్డుచేయడంలో సహకరించాడు.

శ్రీ ఘంటసాల ఆర్కెష్ట్రా అనే పేరుతో ఘంటసాల తమ బృందంతో కలిసి అనేక కచేరీలు చేసాడు. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సంగీతరావు హార్మోనియంతో సహకరించేవాడు. ఘంటసాల 1970-71 ప్రాంతాలలో అమెరికా, జర్మనీ దేశాలలో సాంస్కృతిక పర్యటన జరిపి అనేక దేశాలలో కచేరీలు చేసాడు. ఘంటసాల తొలి, ఆఖరి విదేశీ పర్యటన అదే. ఆ పర్యటన దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమాలలోనే కాదు ఘంటసాల జీవించి ఉన్నంత కాలం ఆయన జీవనయానంలో తోడునీడగా మసిలాడు సంగీతరావు.

1974 సంవత్సరానికి ఘంటసాలగారి అనారోగ్యం, చిత్రసీమలో సంగీత దర్శకుడిగా ఆయన చిత్రాల సంఖ్య తగ్గిపోవడం వలన సంగీతరావు కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అప్పటికే చిత్రసీమలో వెంపటి చినసత్యంతో ఏర్పడిన పరిచయం సంగీతరావు జీవితాన్ని మలుపు తిప్పింది.

మద్రాసు కూచిపూడి అకాడెమి

[మార్చు]

వెంపటి చినసత్యం మద్రాసు నగరంలో స్ధాపించిన మద్రాసు కూచిపూడి అకాడెమీతో అనుబంధం ఏర్పడడం సంగీతరావు జీవితంలో మలి మజిలీ.

మద్రాసులో వెంపటి చిన సత్యం చలనచిత్రాలలో నృత్య దర్శకుడిగా ఉండేవాడు. అంతే కాక కూచిపూడి ఆర్ట్ అకాడెమీ అనే సంస్థను స్థాపించి అనేకమంది విద్యార్థులకు నృత్య శిక్షణ ఇస్తూ ఉన్నాడు. ఘంటసాలకు సహాయకుడిగా ఉన్న సంగీతరావుకి, సత్యంకి మొదటిసారిగా పరిచయం ఏర్పడి క్రమంగా అది స్నేహంగా మారింది.

సంగీతరావుని ఆర్థికంగా ఆదుకొనే ఉద్దేశంతో తమ సంస్థలో విద్యార్థులకు సంగీత శిక్షణ ఇవ్వవలసినదిగా ఆహ్వానించాడు సత్యం. సంగీతరావు అంగీకరించి కూచిపూడి అకాడెమీలో విద్యార్థులకు సంగీతం చెప్పేవాడు. అప్పుడే ఢిల్లీలో జరగనున్న తమ కార్యక్రమంలో సంగీతరావుని పాటలు పాడవలసినదిగా కోరాడు సత్యం. కచేరీలు చేసిన రోజులు దాటి ఘంటసాలకి సంగీత దర్శకత్వంలో సహాయకుడిగా మాత్రమే ఉంటూ ఉన్న సంగీతరావుకి మళ్ళీ గాయకుడిగా కొత్త అనుభవం కలిగింది. ఢిల్లీ కార్యక్రమంలో సంగీతరావు గానం విన్న సుబ్బుడు వంటి విమర్శకుడు ఆయనను ప్రశంసిస్తూ హిందూ పత్రికలో వ్రాసాడు. అలా అయిదారు సంవత్సరాలు కూచిపూడి అకాడెమీలో పాటలు పాడాడు సంగీతరావు.

కూచిపూడివారి పద్మావతీ శ్రీనివాసం నాటకానికి ద్వారం భావనారాయణ సంగీత దర్శకత్వం వహిస్తుండగా సంగీతరావు ఆయనకి అసిస్టెంట్ గా ఉన్నాడు. సంగీతరావు చేసిన సందర్భోచితమైన సంగీతం కూచిపూడివారికి నచ్చి మొత్తం నాటకానికి సంగీతరావే సంగీతం చేయాలని కోరాడు. అది మొదలుగా మద్రాసు కూచిపూడి నాటక అకాడెమీ సంగీతరావు జీవితంలో ప్రధాన భాగం అయింది. 1974 తర్వాత సుమారు ముఫ్ఫై సంవత్సర కాలంలో కూచిపూడి నాటక అకాడమీ ఆధ్వర్యంలో తయారైన దాదాపు 15 నృత్యనాటికలకు సంగీతరావు సంగీతం నిర్వహించాడు. భుజంగరాయ శర్మ సాహిత్యానికి సంగీరావు సంగీతం తోడై కూచిపూడి నాటకాలు అత్యంత జనాదరణ పొందాయి. ఈ నృత్య కార్యక్రమాలలో సంగీత దర్శకుడిగానే కాక ఆర్కెష్ట్రాలో ఉండి తన వీణా వాదనతో వాద్యసహకారాన్ని కూడా అందించాడు. వీరి కలయికలోని మొదటి నాటకం పద్మావతి శ్రీనివాసం. కూచిపూడివారి బృందంతో పాటు దేశవిదేశాలు ఖండాంతరాలు పర్యటించాడు సంగీతరావు. తన సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. 1974లో చేసిన పద్మావతి శ్రీనివాసం మొదలు శ్రీపద పారిజాతం, హరవిలాసం, కల్యాణ రుక్మిణి, శివధనుర్భంగం (రామాయణం), అర్థనారీశ్వరం, ఇటీవల 2000 సం. గోపీకృష్ణ వంటి కూచిపూడి నృత్యనాటకాల వరకు సంగీతరావు కూచిపూడి ఆర్ట్ అకాడెమీ రూపొందించిన నృత్య రూపకాలకు సంగీత దర్శకత్వం వహించి సంగీతాభిమానులకు వీనుల విందు చేసాడు.

కేవలం సంగీతరంగంలోనే కాదు, సాహితీ రంగంలోనూ ఎంతో ప్రతిభను కనపరిచాడు సంగీతరావు. సంగీత, సాహిత్యరంగాలలో ప్రముఖుల గురించి, వారి విద్వత్తును గురించి ఎంతో ప్రామాణికమైన వ్యాసాలు వ్రాసాడు. ఆంధ్రప్రభ పత్రికలో ఆయన వ్రాసిన వ్యాస పరంపర ప్రచురించబడింది. అంతేకాక మారుపేర్లతో ఎన్నో కథలను ప్రచురించాడు. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్, ఆమె భర్త ఎన్నార్ చందూర్ ఆయనలోని రచయితను ప్రోత్సహించారు. తెలుగు స్వతంత్ర, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, జగతి, ఆంధ్ర మహిళ వంటి ప్రముఖ పత్రికలలో సంగీత రావు రచనలు ప్రచురించబడ్డాయి.

చలం, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, దాశరథి, శ్రీశ్రీ వంటి ప్రముఖులతో సంగీతరావుకి చక్కని స్నేహం ఉంది. చలం అరుణాచలంలో ఉన్న చివరిదశలో సంగీతరావు ఆయనను చూసి వస్తుండేవాడు. ఆరుద్ర కూడా సంగీతరావుకి మంచి మిత్రుడు. సంగీత పరమైన అంశాలలో ఆరుద్ర సంగీతరావుతో చర్చిస్తూ ఉండేవాడు. తద్వారా పరస్పరం సందేహ నివృత్తి చేసుకునేవారు. ఆరుద్ర కోరగా అన్నమయ్య గీతాలను కొన్నింటిని సంగీతరావు స్వరపరిచాడు కూడా.

సంగీతరావు వ్రాసిన కొన్ని కథలు శ్రీరామశాస్త్రి పేరుతో ప్రచురించబడ్డాయి. సంగీతరావు గురించి శ్రీరామ శాస్త్రి పద్యాలు కూడా అల్లారు. ప్రముఖ కథ, నవలా రచయిత మంథా రమణారావుతో సంగీతరావుకి గాఢమైన స్నేహం ఉండేది.

సంగీతరావుకి ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి మెండు. ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక గ్రంథాలను ఆయన చదవడంతో పాటు నిర్మాణాత్మకమైన చర్చలు కూడా సాగిస్తూ ఉంటాడు. సాహిత్య పఠనంతో పాటు వ్రాయడంలో కూడా ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తాడు సంగీతరావు. ఘంటసాల ఆర్కెష్ట్రాలో ఉండగాను, కూచిపూడి వారి ప్రదర్శనలో భాగం గాను తాను చేసిన విదేశీ యాత్రలను గ్రంథస్థం చేసాడు. కూచిపూడి నాట్యం గురించి, నాట్య ప్రక్రియల గురించి ఎన్నో వ్యాసాలు రచించాడు.

మద్రాసు ఆకాశవాణి కేంద్రం ద్వారా ఎన్నో విలువైన ప్రసంగాలను రికార్డు చేసాడు. కర్ణాటక, హిందుస్తానీ సంగీతాలలో తన పరిచయాన్ని, పాండిత్యాన్ని వినియోగించుకునేలా ఎందరో విద్యార్థులకు, పరిశోధకులకు మార్గదర్శకం చేసాడు. మద్రాసు మ్యూజిక్ అకాడెమీలో హరికథల గురించి జరిగిన సెమినార్ లో ఆదిభట్ల నారాయణదాసు మొదలైన గొప్ప హరికథకులు చేసిన రాగాలను వాటి గొప్పతనాన్ని ప్రదర్శించే లెక్చర్ డిమాన్స్ట్రేషన్స్ ని తమ కుమార్తె పద్మావతితో కలిసి చేసి ప్రముఖ సంగీతజ్ఞుల మెప్పులు పొందాడు.

వాగ్గేయకారులచే అరుదుగా ప్రయోగింపబడి ప్రస్తుతం కచేరి సర్కిట్ లో లేని ఆందోళిక, శుద్ధబంగళా, మంగళకైశిక, సైంధవి, సుప్రదీపం, సూత్రధారి వంటి రాగాలతో భావరస స్ఫూర్తితో సందర్భోచితంగా ఈ నాటకాలకు ఆయన చేసిన సంగీత రచన శాస్త్రీయసంగీత విద్వాంసుల, రసికుల మన్ననలను పొందింది. రస నిర్ణయానికి స్వరం, రాగం ఇవే కాక నడక కూడా ప్రధానం. నడకకి తగినట్టుగా స్వర,రాగాలను కూర్చాలి. కూచిపూడి నాటకాలలో సాహిత్యానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది.

నవరసాలకు సంబంధించి సంగీతం కూర్చవలసి వచ్చినప్పుడు ఏ భావానికి ఎటువంటి రాగం ప్రయోగించాలన్న విషయంలో కూచిపూడి నాటకాలకు సంబంధించి మనకు నమూనాలు లేవు. తనకు గల అపారమైన సంగీతానుభవంతో సంగీతరావు చేసిన నూతన ప్రయోగాలన్నీ కూచిపూడి నాటకాలకు అద్భుత విజయాలను అందించాయి.

ఘంటసాలతో స్వర సాహచర్యం చేసిన కాలం కన్నా, కర్నాటక సంగీతజ్ఞుడిగా తనలోని ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలిగిన ముఫ్ఫై సంవత్సరాల కాలాన్ని, తన జీవితంలోని అత్యంత సంతృప్తికరమైనదిగా సంగీతరావు భావిస్తాడు. కూచిపూడివారికి సంగీతాన్ని అందించడంలోనే తన నిజమైన వ్యక్తిత్వం ఆవిష్కృతమైందని సంగీతరావు విశ్వాసం.

బిరుదులు - సత్కా రాలు

[మార్చు]
  • సంగీతరావు పదహారు సంవత్సరాల వయసులోనే శ్రీ భారతీ తీర్థ వారి ప్రతిష్ఠాత్మక సంగీత భూషణ బిరుదాన్నందుకున్నాడు.
  • 1994 లో నృత్యనాటక సంగీతానికి ఆయన చేసిన విశేష కృషిని గుర్తించి తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదునిచ్చి సత్కరించింది.
  • ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల విగ్రహాన్ని హైదరాబాదులో ఆవిష్కరించిన సందర్భంగా సంగీతరావుని ఘంటసాల ఆత్మీయుడుగా సత్కరించారు.
  • మద్రాసు తెలుగు అకాడమీ వారు 2003 లో సమైక్య భారతి స్వర్ణ పురస్కారాన్ని లక్ష రూపాయల నగదు బహుమతిగా అందచేసారు.
  • 2004 లోకూచిపూడి నాట్యానికి సంగీతరావు అందజేసిన విశిష్ట సేవలకుగాను వేదాంతం లక్ష్మీనారాయణ పేరిట నెలకొల్పిన జీవితకాల పురస్కారాన్ని అందుకున్నాడు.
  • 2006 లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంస్ధ ఘంటసాల 84వ జన్మదిన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి డా.రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా అతి ఘనంగా సత్కరించింది.
  • 2007 లో విశాఖపట్టణానికి చెందిన సనాతన ధర్మ ఛారిటి సంస్ధ శ్రీరామనవమి సందర్భంగా సంగీతరావుని ఘనంగా సత్కరించింది.

92 సంవత్సరాల వయసులో సంగీతరావుగారిలోని కళాతపస్వికి లభించబోతున్న మరొక గౌరవం" టాగూర్ పురస్కారం." కూచిపూడి అకాడెమీ రూపొందించిన పద్మావతీ శ్రీనివాసం, హరవిలాసం, రుక్మిణీ కల్యాణం, హరధనుర్భంగం (రామాయణం), శ్రీ పదపారిజాతం (అన్నమయ్య) మొదలైన దాదాపు పదిహేను నృత్యనాటకాలకు సంగీత సహకారాన్ని అందించిన పట్రాయని సంగీతరావుగారి విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర సంగీత నాటక అకాడెమీ – “అకాడెమీ టాగూర్ పురస్కార్ 2011 “ అనే అవార్డుతో సత్కరించనున్నట్టు ప్రకటించింది

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సంగీతరావుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, ఎనిమిది మంది మనవలు, ఇద్దరు ముని మనవలు.

నిరంతరం మనసుని, వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచుకుంటూ, ఆహ్లాదభరితమైన చతుర సంభాషణలతో జీవితాన్ని ఉత్సాహంగా గడపడం ఆయనకి నాటికీ నేటికీ కొనసాగుతున్న అలవాటు. ఇంటికి వచ్చి పలకరించేవారినయినా, మద్రాసు నుంచి ఫోన్లు చేస్తూ సందేహాలు నివృత్తి చేసుకునేవారయినా అందరినీ ఆప్యాయంగా అమ్మా, బాబూ అంటూ నోరారా ఆత్మీయంగా సంభాషించడం ఆయన తత్వం. భగవంతుడిచ్చిన చెక్కుచెదరని జ్ఞాపకశక్తితో ఏకాలం నాటివో అయిన జ్ఞాపకాలను, వ్యక్తుల పేర్లను తలచుకుంటూ ఆయన చెప్పే విశేషాలు వినడం ఆయనతో సంభాషించిన వారికి ఒక మధురమైన ఆత్మీయ జ్ఞాపకం.

మూలాలు

[మార్చు]
  1. "ప్రముఖ సంగీత విద్వాంసుడు పట్రాయని అస్తమయం". andhrajyothy. Retrieved 2021-11-15.
  2. పట్రాయని వంశవృక్షం