సింహాచలం
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
సింహాచలము విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నది.
ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ద తదియ నాడు (మే నెలలో) వస్తుంది.
విషయ సూచిక |
[మార్చు] స్థలపురాణం
సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం వరకు కనిపిస్తున్నది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తి గా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు 'విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్థంభంలో ఉన్నాడా? చూపించు'మని స్థంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.
స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన[యాదవుడు] పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి భూమిలో కప్పబడి ఉన్న నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి ప్రతీరోజు చందనం తో పూత పూస్తుంటారు. నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్ర లో (ఆసనంలో) సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.
[మార్చు] శాసన సమృద్ధి
- క్రీ.శ.1087 : సింహగిరి స్వామి నరసింహదేవరగా ప్రఖ్యాతుడు. స్వామి వారి ప్రసూనాల కోసం తిరునందనవనం కల్పించే శాసనం. ఇప్పటి నుండి ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయం కనబడుతుంది.
- క్రీ.శ.1198 : "వాయు స్ఫటికామలాభవపుషే సింహాచలస్థాయినే" = సింహాద్రి నాధుని స్పాటికామలాభ వపువు గా వర్ణించబడినది.
- క్రీ.శ.1266 : గాంగ నరసింహ చక్రవర్తి స్వామి సన్నిధిలో సంకీర్తనం కోసం నూరుగురు స్త్రీలను స్వామివారికి సమర్పిస్తాడు.
- క్రీ.శ.1268 : ఒక శాసనం ఈనాటికీ వ్యవహారంలో ఉన్న అడవివరాన్ని పేర్కొన్నది.
- క్రీ.శ.1286 :
- క్రీ.శ.1201 మరియు 1291 : రెండు శాసనాలు దేవాలయంలో వేద పఠన, అధ్యయన వైభవాన్ని తెలియజేస్తున్నాయి.
- క్రీ.శ.1293 : అక్షయ తృతీయనాడు చందన కర్పూరాలు చాదడానికి ఒక నిబంధన చేస్తూ, ఆనాడే పాయసము, అప్పాలు మొదలైన పణ్యారాల ఆరగింపు కోసం నిబంధన కనబడుతుంది.
- క్రీ.శ.1342 : స్వామికి ఒక మహారాణి అనంత లక్ష్మీదేవి అనేక ఆభరణాలు సమర్పించింది. అందులో బంగారు పొగడపూల మాల మరియు సంపెంగ మాల లున్నాయి.
- క్రీ.శ.1350 : వీరనరసింహదేవుల రాణి గంగా మహాదేవి దేవునికి అనేక సమర్పణలు కావిస్తూ వేయించిన శాసనం.
- క్రీ.శ. 1371 : సింహాచలం అన్న పేరు సింహికారోగిరిః నుండి వచ్చినట్లు చెబుతోంది.
- క్రీ.శ. 1394 : సింహగిరి నరహరిని అహోబల దేవరగా పేర్కొనటం జరిగింది.
[మార్చు] ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులు - వారు సమర్పించిన కానుకలు
- విశిష్టాద్వైతము నకు ఆద్యుడైన శ్రీ రామానుజస్వామి ఇక్కడ ఉండే పురాతన శివలింగాన్ని వరాహ నరసింహుని రూపముగా (ప్రస్తుతం గర్భగుడిలో ఉండే విగ్రహం) మార్చారని ఇక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతుంటారు. ఇది కామదహన ఉత్సవాన్ని (మన్మథుడిని శివుడు తన మూడో కంటితో భస్మం చేసిన సందర్భం) తెలియజేస్తుంది.
- క్రీ.శ.1098 నాటి చోళరాజు కులోత్తుంగ చోళుడు వేయించిన శాసనం ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో ఆయన పాత్ర ఉన్నట్టు విశదమవుతుంది. మరికొన్ని శాసనముల ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో 11వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు, 13వ శతాబ్దంలో తూర్పు గంగా సామ్రాజ్యాధిపతి మొదటి నరసింహుడు పాలు పంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంతంలోనున్న దాదాపు 252 శాసనాలు సింహాచలం ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి.
- శ్రీ కృష్ణదేవరాయలు గజపతి ప్రతాప రుద్రుడుని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండు సార్లు (క్రీ.శ.1516 మరియు క్రీ.శ.1519లో) దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేసాడు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణములను సమర్పించాడు. ఇప్పటికీ ఒక పచ్చల హారం ఆలయంలో ఉంది.
- 14-15 శతాబ్దములలో [1428] కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకొని, సింహాద్రి నాథుని దర్శించి నిర్మించిన శ్రీ కృష్ణదేవరాయల విజయ ధ్వజము శిలా శాసనము కలదు. ఇదేకాక, క్షేత్ర పరిసరాలలో క్రీ.శ.1098 తరువాత చెక్కిన దాదాపు ఐదు వందల శిలా శాసనాలు కలవు.
- గత రెండు శతాబ్దాలుగా విజయనగర రాజుల కుటుంబ సభ్యులు ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
[మార్చు] ఆలయ విశేషాలు
- గాలి గోపురము-సింహ ద్వారం
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 30 మెట్లు ఉంటాయి.
- కప్ప స్తంభం
దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉన్నది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్టితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.
- జల ధారలు
సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార లు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉన్నది. స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉన్నది.
- భైరవ వాక
సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉన్నది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురం గా ప్రాముఖ్యత పొందినది.
- వరాహ పుష్కరిణి
వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉన్నది.
- మాధవధార
- మాధవస్వామి దేవాలయం ఉంది. గిరిప్రదక్షిణం సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.
[మార్చు] పండుగలు
సంవత్సరంపొడుగునా సింహాచలేశునికి ఉత్సవాలు పండుగలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని:
- పంచాంగ శ్రవణం: చైత్ర శుద్ధ పాడ్యమి
- కల్యాణ మహోత్సవాలు: చైత్ర శుద్ధ దశమి నుండి చైత్ర బహుళ పాడ్యమి వరకు
- రథోత్సవం: చైత్ర శుద్ధ ఏకాదశి
- చందనోత్తరణం: వైశాఖ శుద్ధ విదియ నాటి రాత్రి స్వామివారి విగ్రహం మీది చందనాన్ని తీసివేస్తారు. దీనిని చందనోత్తరణం అంటారు.
- చందనోత్సవం : వైశాఖ శుద్ధ తదియ నాడు పగటి పూట నిజరూప దర్శనం, చందనోత్సవం తో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తదియనాటి రాత్రి చందన సమర్పణ. ఈ రోజు పగలు స్వామివారి నిజరూప దృష్టి పడటంవలన సింహాచలప్రాంతమంతా ఎండవేడితో సెగలు, భుగలు గా ఉంటుందంటారు. (అక్షయ తదియ కి లక్షల జనం వస్తారు. ఆనాడు నరసింహస్వామికి (అప్పన్న)పూసిన గంధం ఒలిచి, నిజరూప దర్శనం చూపిస్తారు).
- వైశాఖ పూర్ణిమ : ఈ రోజున స్వామివారికి రెండవ విడత చందన సమర్పణం చేస్తారు.
- జ్యేష్ఠ పూర్ణిమ : స్వామివారికి మూడవ విడత చందన సమర్పణం
- శయనోత్సవం: ఆషాఢ శుద్ధ ఏకాదశి
- ఆషాఢ పూర్ణిమ : స్వామి వారికి నాలుగవ సారి చందన సమర్పణం
- గిరి ప్రదక్షిణ : ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి, కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొండపైన స్వామిని దర్శించడం. ఆషాడ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమి ని సింహాద్రి అప్పన్న ఉత్సవం గా చేస్తారు. కొండ దిగువన వున్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 క్.మీ వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు, మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు , ఆలయంలోనే ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసే రోజున భక్తులకు ఆ గిరి ప్రదక్షిణం జరిగే బాటలో వున్న గ్రామాల వారు, స్వచ్చంద సంస్థల వారు భక్తులకు, నీరు, మజ్జిగ, పులిహార పొట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు.సింహాచలం అప్పన్న గిరిప్రదక్షిణ సందర్భంగా ఎన్.ఎ.డ్. గోపాలపట్నం పరిసరాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సింహాచలంలో 24 జూలై 2010 శనివారం సాయంత్రం అప్పన్న రధం ప్రారంభం నుంచి ఆదివారం ఉదయం వరకు గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు రక్షణ కల్పించి అవసరమైన్ సహాయం అండెంచేలా సిబ్బందిని నియమించారు. కంచరపాలెం నుంచి సింహాచలం వరకు 15 పాయింట్నలు గుర్తించారు. ప్రతి పాయింటు వద్ద ఇద్దరు పోలీసు సిబ్బంది పహరా కాస్తారు. అత్యధికంగా స్త్రీలు గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నందున భద్రతను పెంచారు. ఎన్.ఎ.డి, గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు 50మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది పనిచేస్తారు. మరో రెండు మొబైలు బృందాలు ప్రతీ క్షణం పహరా తిరుగుతుంటాయి. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 12 గంటలవరకు సింహాచలం నుంచి హనుమంతవాక వరకు ఒక బృందం, హనుమంతవాక నుంచి కంచరపాలెం, మాధవధఅర, ఎన్.ఎ.డి మీదుగా గోపాలపట్నం, సింహాచలం వరకు ఒక బృందం ప్రతీక్షణం గస్తీ తిరుగుతుంది. కొందరు భక్తులు సింహాచలం తొలిపావంచా నుంచి బయలుదేరి హనుమంతవాక మీదుగా అప్పుఘర్ చేరుకుని, సముద్రస్నానాలు చేసి మాధవధఅరలోని మాధవస్వామిని చేరడానికి రారి 2.30 నిమిషములకు బయలు దేరుతారు. వీరు పోర్టు వెనుక నుంచి కైలాసపురం నివాసప్రాంతాల మీదుగా ఎన్.ఎ.డి చేరుకుంటారు. వీరందరికి ప్రత్యేక భద్రతకు ఒక పోలీసు టీము తిరుగు తుంది. రథంతో పాటు ఒక ఇన్‌ఛార్జి అధికారి ఆధ్వర్యంలో పోలీసు భద్రతా దళం ఉంటుంది. ప్రతినిమిషము అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలు. 5వ పట్టణ పోలీసులు ప్రత్యేక బృందంగా తిరుగుతారు. భక్తుల సౌకర్యార్ధం సింహాచలం దేవస్థానం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. రెండు మూడు కి.మీ. కు ఒక శిబిరం ఏర్పాటు చేసింది. భక్తులు విశ్రాంతి తీసుకోవటానికి, మంచినీరు తీసుకోవటానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్.ఏ.డి కూడలి, గోపాలపట్నం పెట్రోలు బంకు వద్ద సహాయం చేసే శిబిరాలను దేవస్థానం వారు ఏర్వాటు చేసారు.
- కరాళ చందనం : శ్రావణ పూర్ణిమ నాడు స్వామి వారికి చందనమలదడం. ఇది కరాళ చందన సమర్పణ
- పవిత్రోత్సవం :భాద్రపద శుద్ధ దశమి నుండి చతుర్దశి వరకు. స్వామివారి నిత్యనైమిత్తికాలలో తెలిసిగాని, తెలియకగాని జరిగిన దోషనివారణకోసం జరిపే ఉత్సవం.
- శరన్నవ రాత్రులు: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుగుతాయి.
- విజయదశమి, శమీపూజ: ఆశ్వయుజ శుద్ధ దశమి. స్వామి వారు కొండ క్రింది పుష్పక వనానికి వచ్చి, జమ్మి వేట సాగిస్తారు.
- క్షీరాబ్ధి ద్వాదశి : కార్తీక శుద్ధ ద్వాదశి.
- గోదా కళ్యాణం : ధనుర్మాసం చివర భోగినాడు జరుగుతుంది.
- మకరి వేట : మకర సంక్రాంతి వెళ్లిన మరునాడు కనుమ రోజున స్వామివారు కొండ క్రింద పుష్పకవనంలోని జలాశయంలో మొసలి బారి నుంచి గజేంద్రుని రక్షించడం.
- తెప్పోత్సవం : పుష్య బహుళ అమావాస్య. కొండ క్రింది వరాహ పుష్కరిణిలో స్వామి వారు తెప్పతిరునాళ్లు జరుపుకోవడం.
- డోలోత్సవం : ఫాల్గుణ పూర్ణిమ. కొండ క్రింది ఉద్యానవనంలో స్వామివారు ఉయ్యాల ఊగుతారు.
- నరసింహ జయంతి : సౌర మాన వృషభ మాసం లో శుద్ధ చతుర్దశి.
[మార్చు] స్వామి కైంకర్యాలు-దర్శన వేళలు
దేవాలయంలో దర్శనవేళలు-ఉదయం 7 నుండిసాయంత్రం 4 వరకూ మరియు సాయంత్రం 6 నుండిరాత్రి 9 వరకూ. వసతి కొరకు-ఎ.పి.టి.డి.సి., చందన టూరిస్టు రెస్ట్ హౌస్, దేవాలయ సత్రములు, తిరుమల దేవస్థాన సత్రములు కలవు.
[మార్చు] చేరుకొనే విధానము
విశాఖపట్టణం వరకు బస్సు, రైలు, విమాన మార్గాలలో రావచ్చును. అక్కడ నుండి సింహాచలం కొండ క్రిందికి (అడవివరం) సుమారు 15 కి.మీ. లోపు దూరం ఉంటుంది. అక్కడికి సిటీబస్సు, ఆటో, టాక్సీలలో చేరవచ్చును. సింహాచలం కొండ క్రింది నుండి పైకి దేవాలయం వరకు మెట్లమీదుగా (సుమారు వెయ్యి మెట్లు) గాని, దేవస్థానంవారి ఘాట్ రోడ్డు మీదుగా దేవస్థానం బస్సులోగాని, టాక్సీలోగాని చేరవచ్చును.
[మార్చు] సింహాచలం దేవస్థానం భూములు క్రమబద్ధీకరణ సమస్య
- సింహాచలం దేవస్థానం భూముల క్రమబద్ధీకరణకు చెందిన 578 జీవో నిలిచిపోయినప్పటికి దానిపై అధికారులు జిల్లా కలెక్టరు ఆదేశాలమేరకు అయిదు గ్రామాల్లో ప్రజాభిప్రయ నసేకరణ్ ప్రారంభించారు 6 జూలై 2010 నుంచి గతంలో దేవస్థానం స్థలాల్లో గృహనిర్మాణాలు చేపట్టిన వారిలో చాలామంది ఈ జీ.ఓ. ప్రకారం ఎందుకు క్రమబద్ధీకరణ చేసుకోలేదో తెలుసుకోవడానికి ఈ సేకరణ చేస్తున్నారు.
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
[మార్చు] వనరులు-మూలాలు
- సింహాచలం దేవస్థానం వారు ఇచ్చిన కరపత్రం
