Jump to content

స్వర్గారోహణ పర్వము

వికీపీడియా నుండి


మహాభారత కథను వింటున్న జనమేజయుడు వైశంపాయనుడితో " మునివర్యా ! మాతాతలైన పాండవులు స్వర్గారోహణ చేసిన తరువాత. ఏలోకాలకు వెళ్ళారు ఎక్కడ ఉన్నారు తెలియజేయండి " అని అడిగాడు.

స్వర్గములో సుయోధనుడిని చూసి ధర్మరాజు కలత చెందుట

[మార్చు]

వైశంపాయనుడు " తన బంధువులను చూడవలెనని పట్టుబట్టిన ధర్మరాజు కోరికను ఇంద్రుడు మన్నించాడు. వెంటనే ఒక దూతను పిలిచి " ఈయన ధర్మరాజు. ఈయనకు తన వారిని చూడాలని కోరికగా ఉంది. నీవు ఈయనను తీసుకు వెళ్ళి ఆయన బంధువులను అందరినీ చూపించు. ఆ దేవదూత ధర్మరాజును తన వెంట తీసుకువెళ్ళాడు. ధర్మరాజు వెంట నారదుడు, దేవఋషులు కూడా వెళ్ళారు. ముందుగా వారు పెద్ద సింహాసనము మీద కూర్చున్న సుయోధనుడు కనిపించాడు. ఆయన చుట్టూ దేవకాంతలు సేవలు చేస్తున్నారు. సుయోధనుడు అంతులేని సుఖాలు అనుభవిస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ధర్మరాజు దేవమునులతో " దేవమునులారా ! ఈ సుయోధనుడు పరమ లోభి. ఇతడికి ముందు చూపు లేదు. అనేక దేశములు ఏలే రాజులను యుద్ధముకు పిలిపించి వారి రధ, గజ, తురంగ, కాల్బలములతో సహా మరణించేలా చేసాడు. రాజసూయ యాగము చేసి పవిత్రురాలైన ద్రౌపదిని నిండు కొలువుకు ఈడ్చుకు వచ్చి ఘోరముగా అవమానించాడు. అలాంటి వాడు స్వర్గసుఖాలు అనుభవిస్తునాడు. వీడితో చేరి నేను స్వర్గసుఖాలు అనుభవించాలా ! వీలులేదు నన్ను నా తమ్ములు భీమార్జున నకుల సహదేవులు ఉన్నచోటికి తీసుకు వెళ్ళండి " అని వెనకకు తిరిగాడు.

నారదుడు ధర్మరాజును సమాధానపరచుట

[మార్చు]

అప్పుడు నారదుడు నవ్వి " ధర్మరాజా ! సుయోధనుడు లోపభూయిష్టమైన ఈ శరీరమును వదిలి పెట్టాడు. ఇప్పుడు దివ్యదేహముతో ప్రకాశిస్తునాడు. అందు వలన దేవతల చేత గౌరవించబడుతున్నాడు. ఇతడు యుద్ధములో మరణించాడు. యుద్ధములో రాజులను చంపాడు. అది పాపము ఎలా ఔతుంది. భూలోకములో చేసిన పాపములు ఇక్కడ ఎందుకు తలచడము. ఇది పుణ్యలోకము. ఇక్కడ ఏ పాపము అంటదు. ధర్మరాజా ! నీవు స్వర్గలోకానికి వచ్చి కూడ మానవ సహజమైన ఈర్ష్యా ద్వేషాలను వదలక ఉన్నావు. ఇక్కడ వాటికి తావు లేదు. కనుక నీలోని కోపతాపములను, ఈర్ష్యా ద్వేషములను వదిలి సమత్వమును పొందుము. నీవు ఆడిన జూదము దాని వలన కలిగిన దుఃఖమును మరచి ప్రశాంత చిత్తుడవై ఉండు " అన్నాడు. ధర్మరాజు " మహర్షీ ! పుణ్యము చెసిన వారికి స్వర్గము పాపులకు నరకము ప్రాప్తిస్తుంది అని అంటారు కదా ! ఈ సుయోధనుడు పాపి. ఇతడు ఇతరులకు అపకారము తప్ప ఉపకారము ఎన్నడూ చేయ లేదు. ఇతడు కురువంశ వినాశకుడు. రాజులందరిలో అధముడు. వీడు స్వర్గములో ఉండడమా ! ఇతడు దేవతలకు పూజనీయుడా ! పోనీలే అది మీ స్వర్గవాసుల ఇష్టము. అతడు స్వర్గ సుఖములు అనుభవించనీ. నన్ను నా తమ్ములు, నా భార్య, నా కుమారుల వద్దకు తీసుకు వెళ్ళండి. నేను వారిని చూడాలి.

ధర్మరాజు కర్ణుడిని చూడడానికి తహతహలాడుట

[మార్చు]

ధర్మరాజు తిరిగి " మహాఋషులారా ! నేను తిలతర్పణము ఇస్తున్న సమయములో మా తల్లి కుంతీదేవి నా వద్దకు వచ్చి కర్ణుడు తన కుమారుడు అని తెలిపింది. అతడి జన్మరహస్యము కూడా చెప్పింది. అప్పటి నుండి నాకు కర్ణుడిని చూడాలన్న కుతూహలము కలుగుతుంది. ఆ పరాక్రమవంతుడు మేము కలసిన మమ్ము ఇంద్రుడు కూడా జయించ లేడు కదా ! కర్ణుడు మా అన్న అని తెలియక నేను కర్ణుడిని చంపమని అర్జునుడికి చెప్పి పాపము చేసాను. ఆ పాపము నన్ను ఇంకా వెన్నంటి వేధిస్తుంది. కర్ణుడిని చూడడానికి నా మనసు తహతహలాడుతుంది. దయచేసి నన్ను మా అన్న కర్ణుడి వద్దకు తీసుకు వెళ్ళండి. అది కాక నాకు ద్రుపదుడు, యుధామన్యుడు, విరాటుడు, శంఖుడు మొదలగు వారిని చూడాలని ఉంది. నేను మొదటి నుండి నా తమ్ములను, నా భార్యను చూడాలని అడుగుతున్నాను. ఒక వేళ వారు స్వర్గములో లేకుంటే వారులేని స్వర్గములో నేను ఉండలేను. వారికి లేని స్వర్గసుఖములు నాకు అవసరము లేదు. వారు ఎక్కడ ఉంటే అక్కడే నాకు స్వర్గము. నన్ను త్వరగా అక్కడకు తీసుకువెళ్ళండి " అన్నాడు.

ధర్మరాజు నరకములో ప్రవేశించుట

[మార్చు]

ధర్మరాజు కోరిక విన్న దేవదూత " మహాత్మా ! నీ మనసులో ఏ కోరిక పుడుతుందో దానిని నెరవేర్చమని దేవేంద్రుడు నాకు ఆనతి ఇచ్చాడు. నేను అలాగే చేస్తాను. మీరు నాతో రండి " అన్నాడు. ధర్మరాజును దేవదూత తీసుకువెడుతున్న దారి అంతా దుర్గంధభూయిష్టముగా ఉంది. దారిలో వెండ్రుకలు, ఎముకలు కుప్పలుగా పడి ఉన్నాయి. దోమలు, ఈగలు ముసురుతూ ఉన్నాయి. శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఆ శవాల కొరకు కాకులు తిరుగుతున్నాయి. శవాల మీది నుండి వచ్చే దుర్గంధము ముక్కులను బద్దలు కొడుతుంది. వారు వైతరణీ నదిని సమీపించారు. నదిలోని నీరు సలసలా కాగుతున్నది. నది ఒడ్డున సూదులవలె, కత్తుల వలె ఉన్న ఆకులు ఉన్న మొక్కలు ఉన్నాయి. అక్కడ నానావిధములైన పాపములకు శిక్షను అనుభవిస్తున్న పాపులను చూసి ధర్మరాజు " ఇంకా ఎంతదూరము వెళ్ళలి " అని అడిగాడు. దేవదూత " ఇదంతా దేవతల ఆధీనములో ఉంది. మనము రావలసిన ప్రదేశముకు వచ్చాము " అన్నాడు. కాని ధర్మరాజుకు పాపులు అక్కడ పడుతున్న అవస్థ చూస్తూ ఉండడానికి మనస్కరించ లేదు. అందుకని అక్కడ నుండి వెళ్ళి పోవాలని అనుకున్నాడు. అప్పుడు ధర్మరాజుకు కొన్ని గొంతులు ఇలా వినిపించాయి. " ఓ పుణ్యచరితా ! నీ రాకవలన మా పాపములు అన్నీ పోయాయి. నీ శరీరము నుండి వచ్చే పరిమళము వలన మా బాధలు ఉపశమించాయి. మాకు ఇక్కడ హాయిగా సుఖముగా ఉంది. నిన్ను చూడడము వలన మా బాధలు దూరము అయ్యాయి. నీవు కాసేపు ఇక్కడే ఉండి మాకు సంతోషము కలిగించు " అన్న మాటలు వినిపించాయి. అప్పుడు ధర్మరాజు " ఆహా ! వీరు ఇక్కడ ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో కదా ! " అనుకుని అక్కడే నిలబడ్డాడు. ధర్మరాజు పెద్దగా " మీరు ఎవరు ఎందుకు ఈ బాధలు అనుభవిస్తున్నారు? " అని అడిగాడు. వారు " మేము ఎవరమో కాదు. నీ అన్నదమ్ములము కర్ణుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులము. మేమంతా ఇక్కడ నరకబాధలు అనుభవిస్తున్నాము " అని వినిపించింది. మరొకపక్క నుండి " మహారాజా ! నేను ద్రౌపదిని, నేను ధృష్టద్యుమ్నుడిని, మేము ద్రౌపది పుత్రులము " అన్న మాటలు వినిపించాయి.

ధర్మరాజు తనవారిని నరకములో చూసి కలత చెందుట

[మార్చు]
ధర్మరాజు తనవారిని నరకములో చూసి కలత చెందుట

ఆ మాటలు విన్న ధర్మరాజు ఒక్కసారిగా నిశ్చేష్టుడై " అయ్యో భగవంతుడా ! మా తమ్ములకు, ద్రౌపదికి ఈ దుర్గతి పట్టడము ఏమిటి ? వారు ఏపాపము చేసారని ఇటువంటి నరకయాతనలు అనుభవిస్తున్నారు. ఇంద్రుడు దేవతలు పరమనీచులు కాకపోతే నా తమ్ములకు, ద్రౌపదికి ఇలాంటి నరకబాధలు అనుభవించ వలసిన అగత్యము ఏమిటి. ఇక్కడ ధర్మము లేదు, న్యాయము లేదు. లేకున్న నా తమ్ములు, ద్రౌపది సామాన్యమైన వారా ! వారు పరమ నిష్ఠాగరిష్ఠులు, సత్యము, దయ కలిగిన వారు, దానశీలురు, యజ్ఞయాగములు చేసిన వారు. అటువంటి వారికి ఈ దుర్గతి పట్టడము ఏమిటి ? కనీసము జీవితములో ఒక్కరికి కూడా మేలు చేయని సుయోధనుడికి స్వర్గసుఖాలా ! అతడి చుట్టూ అంతమంది దేవకాంతలా ! అంతులేని భోగాలా ! కనిసము వీసమెత్తైనా పాపము చెయ్యని నా వారికి నరకయాతనలా ! దైవము న్యాయము, ధర్మము మరచినట్లు ఉంది " అని చింతించసాగాడు. తిరిగి " ఇదంతా నిజమా ! లేక దేవతల మాయా ! నా భ్రాంతియా ! లేక నేను కలగంటున్నానా ! " అని పరిపరి విధముల చింతించసాగాడు. ధర్మరాజుకు ఇంద్రుడి మీద చాలా కోపము వచ్చింది. పక్కనే ఉన్న దేవదూతను చూసి " ఓ దేవదూతా ! ఇక నాకు నీ సాయము అవసరము లేదు. నిన్ను ఎవరు పంపారో వారి వద్దకు తిరిగి వెళ్ళు. నా తమ్ములు, నా భార్య నరక బాధలు అనుభవిస్తున్నప్పుడు నాకు స్వర్గసుఖాలతో పని లేదు. వారు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నా మాటలు యధాతధంగా ఇంద్రుడికి చెప్పు " అని అన్నాడు.

ఇంద్రాదులు ధర్మరాజు వద్దకు వచ్చుట

[మార్చు]

దేవదూత ఇంద్రుడి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పాడు. వెంటనే దేవేంద్రుడు దిక్పాలకులను, దేవఋషులను తీసుకుని ధర్మరాజు వద్దకు వచ్చాడు. యమధర్మరాజు కూడా తన కుమారుడిని అనునయించడానికి వారితో వచ్చాడు. వారి రాకతో అక్కడ ఉన్న వాతావరణము అంతా మారి పోయింది. నరకయాతనలు లేవు, దుర్గంధము లేదు. శవాలగుట్టలు మాయమయ్యాయి. ఎముకల పోగులు లేవు. పాపుల ఆక్రందనలు ఆగిపోయాయి. పైన తిరుగుతున్న కాకులు గద్దలు లేవు. వైతరుణీనది జాడలులేవు. పిల్లతెమ్మెరలు వీచసాగాయి. అహ్లాదకరమైన చల్లని వాతావరణముతో అంతటా మనోహరమైన పరిస్థితి నెలకొన్నది. ఆ సమయములో ధర్మరాజు వద్దకు రుద్రులు, గంధర్వులు, వసువులు, ఆదిత్యులు, నాగులు, సిద్ధులు ఆనందముగా వచ్చారు. అప్పుడు ఇంద్రుడు ధర్మరాజుతో " నీవు నరకములో ఉండడము ఏమిటి ? నిన్ను తీసుకు పోవడానికి దేవతలు అందరూ ఇక్కడకు వచ్చారు. నీకు శాశ్వతబ్రహ్మలోక పదవి లభించింది. నీలోని వికారములు అన్నీ నశించాయి. నీకు సద్భుద్ది కలిగింది. ధర్మనందనా ! ఒక్కమాట. రాజ్యంతే నరకం ధ్రువం అని వేదములు చెప్తున్నాయి. అంటే రాజ్యము చేసిన వాడికి నరకము తప్పదు. అందుకే నీకు నరకద్వార దర్శనము అయ్యింది. ధర్మనందనా ! పుణ్యము, పాపము ఒక దానిని వెన్నంటి ఒకటి ఉంటాయి. పుణ్యము చేసుకున్న వారికి స్వర్గము, పాపము చేసుకున్న వారికి నరకము ప్రాప్తిస్తుంది. కొద్దిగా పుణ్యము చేసుకున్న వాడు తాను చేసుకున్న పుణ్యముకు సరిపడా స్వర్గసుఖములను ముందుగా అనుభవించి తరువాత దీర్ఘకాలము నరకవాసము చెయ్యాలి. కొద్దిగా పాపము చేసిన వారు ముందుగా నరకయాతన అనుభవించి తరువాత స్వర్గసుఖాలను దీర్ఘకాలము అనుభవించాలి. ఇది ఇక్కడి నియమము. నీవు చెసిన కొద్ది పాపముకు నీకు నరకద్వార దర్శనము అయింది. ఇక నీవు దీర్ఘకాల స్వర్గమును అనుభవిస్తావు. నీకు కలిగిన మనస్థాపము వలన నీకు ఇది చెప్పవలసి వచ్చింది. నీ అన్న కర్ణుడికి ఉత్తమ లోక ప్రాప్తి కలిగింది. నీ తమ్ములు భీమార్జున నకులసహదేవులకు ఉత్తమ లోకప్రాప్తి కలిగింది. వారందరూ తమతమ ఉత్తమ స్థానాలలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు. నీవు వారిని అందరిని చూసి సంతోషించు. నీవు చేసిన స్వల్ప పాపముకు నీకు నరకద్వార దర్శనము నీవు చేసిన రాజసూయయాగము, అశ్వమేధయాగము, యజ్ఞములు, దానములు, ధర్మములు, వ్రతములకు నీకు ఉత్తమలోకప్రాప్తి కలిగింది. నీ పూర్వీకులు అయిన మాంధాత, నలుడు, హరిశ్చంద్రుడు, దుష్యంతుడు, భరతుడు ఎటువంటి ఉత్తమలోకాలు పొందారో అటువంటి ఉత్తమలోకాలు నీకు ప్రాప్తించాయి. నిన్ను అభినందించడానికి సిద్ధులు, సాధ్యులు, గరుదులు, గంధర్వులు, నాగులు వచ్చారు అని వారిని అందరిని చూపాడు. ధర్మరాజు వారందరికి వినయముగా నమస్కరించాడు. ఇంద్రుడు తిరిగి " ధర్మరాజా ! ఇది ఆకాశగంగ. పుణ్యమే ఇలా ఆకృతి దాల్చింది. నీవు ఇందులో స్నానము చేసి దివ్యదేహముతో ప్రకాశించు " అన్నాడు.

యమధర్మరాజు ధర్మరాజుతో మాటాడుట

[మార్చు]

తరువాత యమధర్మరాజు ధర్మరాజు వద్దకు వచ్చి " కుమారా ! నేను నిన్ను మొదటిసారిగా ద్వైతవనంలో, రెండవసారి మేరుపర్వతములో కుక్క రూపములోమూడోసారి ఇక్కడా నిన్ను పరీక్షించాను. నీ మనసుచలించ లేదు. నీ మనసులో శమము, దమము మొదలగు గుణములు పుష్కలముగా ఉన్నాయి. నీవు జితేంద్రియుడవు. నీకు పెట్టబడిన పరీక్షలు పూర్తి అయ్యాయి. నీవు గెలిచావు. ఇక నీవు స్వర్గసుఖములు అనుభవించ వచ్చు. రాజులకు నరకము తప్పదు అని వేదోక్తి కనుక నేను ఇంద్రుడు కలసి నీకు నరకద్వార దర్శనము కలిగించాము. నీవు విన్న కర్ణ, భీమ, అర్జున, నకుల, సహదేవ, ద్రౌపది ఆక్రందనలు అన్నీ మేము కల్పించినవి. నీ తమ్ములు, కర్ణుడు, ద్రౌపది పుణ్యలోకాలు చేరుకున్నారు. ఇంద్రుడు చెప్పినట్లు నీవు ఆకాశగంగలో మునుగు. నీకు ఈ సంసారభావము నేను, నీవు అన్న భేదభావము నశిస్తాయి. మానవసహజమైన రాగముద్వేషము, సుఖముదుఃఖము నశిస్తాయి. దైవత్వము సిద్ధిస్తుంది. తరువాత స్వర్గసుఖములు అనుభవిస్తున్న నీ సోదరులను, నీ భార్యను ఆనందంగా చూడు. ఆలస్యము ఎందుకు ఆకాశగంగలో స్నానము చెయ్యి " అని చెప్పాడు. తరువాత యమధర్మరాజు ధర్మరాజును ఆకాశగంగ వద్దకు తీసుకుని వెళ్ళాడు. ధర్మరాజు ఆకాశగంగలో పుణ్యస్నానము చేసాడు. వెంటనే తన మానుష శరీరమును వదిలి దివ్యశరీరము ధరించాడు. ఎప్పుడైతే ధర్మరాజు దివ్యకాంతితో కూడిన శరీరము ధరించాడో అతడిలోని వైరము, మాత్సర్యము, స్నేహము, చంచల స్వభావము, గర్వము, దుఃఖము అన్నీ సమసి పోయాయి. ధర్మరాజు సాక్షాత్తు అగ్ని వలె ప్రకాశించ సాగాడు. ఎదురుగా ఉన్న ఇంద్రుడిని, యమధర్మరాజును స్తుతించి వారితో కలసి ముందుకు సాగాడు.

ధర్మరాజు స్వర్గలోకములొ

[మార్చు]

స్వర్గములో అర్జునుడు చతుర్భుజములు, శంఖచక్రములు, గదాయుధములతో ప్రకాశిస్తున్న శ్రీమహావిష్ణువును సేవిస్తునాడు. ద్వాదశాదితుల పక్కన పదమూడవ ఆదిత్యుడిగా ప్రకాశిస్తున్న కర్ణుడిని, మరుత్తులలో ఒకడుగా ప్రకాశిస్తున్న భీమసేనుడిని, అశ్వినీదేవతల వలె ప్రకాశిస్తున్న నకులసహదేవులను చూసాడు. కొంచెము దూరములో మహారాణిలా దివ్యకాంతితో వెలిగి పోతున్న ఒక స్త్రీమూర్తిని చూసి ఇంద్రుడితో " దేవా ! ఈమె ఎవ్వరు ? " అని అడిగాడు. ఇంద్రుడు " ధర్మనందనా ! ఈమె మహాలక్ష్మి ద్రుపదుడికి కుమార్తెగా అయోనిజగా జన్మించింది. మహేశ్వరుడి ఆజ్ఞను అనుసరించి ఈమె మానవకాంతగా అవతరంచింది. ఆ పక్కన ఉన్న గంధర్వులు ఆమె కుమారులు ఉపపాండవులు. ఆ పక్కన ఉన్న వాడు గంధర్వరాజైన ధృతరాష్ట్రుడు. ఇతడు మీ పెదనాన ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. తరువాత అయా అంశలతో యాదవవీరులైన సాత్యకి, కృతవర్మ అక్కడ స్వర్గ సుఖములు అనుభవిస్తున్నారు అదిగో చూడు. ధర్మనందనా ! సుభద్ర గర్భమున చంద్రాంశతో జన్మించిన వాడు అభిమన్యుడు రెండవ చంద్రుడివలె ప్రకాశిస్తునాడు చూడు " అని చెప్పాడు. ఇంతలో అటుగా వస్తున్న ఒక విమానము చూపి ఇంద్రుడు " ధర్మనందనా ! అటు చూడు మీ తండ్రి పాండురాజుతన భార్యలైన కుంతి, మాద్రిలతో ఇటు వస్తునాడు " అని చూపించాడు. తరువాత అష్టవసువులలో ఒకడైన భీష్ముడిని, బృహస్పతి పక్కన కూర్చుని ఉన్న ద్రోణుడిని చూసాడు. తరువాత గంధర్వ, యక్ష, గుహ్యక గణములతో కలసి ఉన ద్రుపదుడిని, విరాటుడిని, వారి అన్నదమ్ములను, కుమారులను, బంధువులను, కేకయ, పాండ్యరాజులను నానాదేశముల నుండి వచ్చి మహాభారతయుద్ధములో ప్రాణములు విడిచిన రాజులను చూపించి " వీరంతా ఉత్తమ లోకాలు పొందారు " అని వివరించి చెప్పాడు.

వైశంపాయనుడు చెప్పిన దేవ రహస్యము

[మార్చు]

స్వర్గములో కురుక్షేత్ర సమరములో మరణించిన రాజులను చూపించిన విషయము విన్న జనమేజయుడు వైశంపాయనుడిని " మునివర్యా ! తమరు అందరి విషయములు చెప్పారు. వీరందరూ ఉత్తమ లోకాలు పొందారు అని చెప్పారు. వీరందరూ ఎంత కాలము స్వర్గములో ఉంటారు ? శాశ్వతముగా స్వర్గములోనే ఉండిపోతారా ! లేక కొంతకాలము మాత్రము ఉండి తరువాత మానవజన్మ ఎత్తుతారా ! వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " మహారాజా ! అది దేవరహస్యము. దానిని వేదవ్యాస మహర్షి నా మీద దయ ఉంచి నాకు చెప్పాడు. అది మీకు చెప్తాను. ప్రద్యుమ్నుడు సనత్కుమారుడిలో కలిసాడు. ధృతరాష్ట్రుడు, గాంధారీ కుబేరలోకములోకి చేరారు. పాండురాజు కుంతీ, మాద్రిలతో కలసి స్వర్గములో ఉన్నాడు. అభిమన్యుడు చంద్రుడిలో కలసి పోయాడు. ద్రోణాచార్యుడు బృహస్పతిలో కలసి పోయాడు. శకుని ద్వాపరుడిలో కలసి పోయాడు. సుయోధనుడు కొంత కాలము స్వర్గములో స్వర్గ సుఖములు అనుభవించిన తరువాత నరకలోకములో తాను చేసిన పాపములకు తగిన శిక్షలు అనుభవించి తిరిగి కలిపురుషుడిలో కలసిపోయాడు. మిగిలిన కౌరవులందరూ తాము చేసిన పుణ్యకార్యములకు తగినంత స్వర్గసుఖములు, పాపకార్యములకు తగినంత నరకయాతనలు అనుభవించి తరువాత రాక్షస గణములలో ఐక్యము అయ్యారు. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడిలో కలసి పోయాడు. భీష్ముడు అష్టవసువులలో చివరి వాడు అయి వసువులలో చేరాడు. ద్రుపదుడు, విరాటుడు, ధృష్టకేతువు, భూరిశ్రవుడు, శల్యుడు, శంఖుడు, ఉత్తరుడు వీరందరూ అశ్వదేవతలలో కలసి పోయారు. ధృష్టద్యుమ్నుడు అగ్నిలో కలసి పోయాడు. అప్పటికే ధర్మరాజు శరీరములో కలసి పోయిన విదురుడు ధర్మరాజుతో చేరి యమధర్మరాజుతో కలసి పోయాడు. బ్రహ్మదేవుడి ఆదేశానుసారము బలరాముడు అనంతుడిలో కలసి పోయాడు. శ్రీకృష్ణుడితో రాసలీలలు సలిపిన 16 వేల గోపికలు సరస్వతీ నదిలో స్నానము చేసి అప్సరసలుగా మారి మహావిష్ణువును సేవిస్తునారు. శ్రీకృష్ణుడితో సహగమనము చేసిన రుక్మిణీదేవి లక్ష్మీదేవిలో కలసి పోయింది. శ్రీకృష్ణుడి మిగిలిన భార్యలు లక్ష్మీదేవిలో కలసి పోయారు. జనమేజయ మహారాజా ! మహాభారత యుద్ధములో చనిపొయిన వారు నేను చెప్పిన వారు చెప్పని వారు అందరూ వారి వారి అంశలు అయిన దేవతా, రాక్షస, యక్ష, గుహ్యక, గంధర్వ బృందములో కలసి పోయారు. జనమేజయ మహారాజా ! కురుపాండవుల విషయములతో కూడిన ఈ భారత కథను ఉపకథా సహితముగా నీకు వివరించాను. సర్పయాగ సందర్భములో భగవానుడైన వేదవ్యాస మహర్షి అనుమతితో నేను చెప్పిన ఈ భారత కథను నీవు శ్రద్ధతో విని జ్ఞానము సముపార్జించావు " అని అన్నాడు వైశంపాయనుడు.

భారతకథ

[మార్చు]

జనమేజయుడు చేసిన సర్పయాగములో వేదవ్యాస మహర్షి ఆదేశానుసారము వైశంపాయనుడు ఈ మహాభారతకథను జనమేజయుడికి వివరించాడు. ఆ సమయములో అక్కడ ఉన్న వ్యాసమహర్షి శిష్యుడు ఉగ్రశ్రవసుడు ఈ భారత కథను ఆమూలాగ్రము విన్నాడు. నైమిశారణ్యములో శౌనకమహర్షి తలపెట్టిన సత్రయాగ సందర్భములో శౌనకాది మహర్షులు ఉగ్రశ్రవసుడిని పుణ్యకథను వినిపించమని కోరడముతో ఉగ్రసవసుడు తాను విన్న మహాభారతకథను రసవత్తరంగా వారికి వినిపించాడు. తరువాత వారితో " మహామునులారా ! నేను జనమేజయుడు సర్పయాగము చేసిన సందర్భములో వైశంపాయన మహర్షి ఈ భారత కథను వినిపించగా దానిని ఆమూలాగ్రము విన్నాను. ఆ కథను నేను మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. సత్రయాగము ఆస్థీకుని ప్రయత్నము వలన ఆగిపోయింది. సర్పయాగమును ఆపి సర్పములను రక్షించిన ఆస్తీకుడిని జనమెజయుడు పూజించి తగు విధముగా సత్కరించాడు. ఋత్విక్కులకు కానుకలను ఇచ్చాడు. తరువాత వేదవ్యాస మహర్షుని, వైశంపాయనుడిని వేదోక్తముగా సత్కరించిన తరువాత జనమేజయుడు హస్థినాపురము ప్రవేశించాడు. ఋషులారా ! ఈ భారతకథను రచించిన వేదవ్యాస మహర్షి ఋషులలో అగ్రగణ్యుడు సత్యము గ్రహించిన వాడు, వేదములే రూపుగా ధరించిన వాడు, విజ్ఞానఖని, బ్రహ్మజ్ఞాని, శౌచము, శాంతి, క్షమ, దాంతి, తపోనిష్ట కల వాడు. ధర్మములను ఉపదేశించడములో దిట్ట. పాండవుల కీర్తి ప్రతిష్తలను లోకముకు చెప్పడానికి, అనేకమంది రాజుల గురించి సామాన్య జనులకు తెలియ పరచడానికి, దేవదేవుడైన వాసుదేవుడి లీలా విశేషములను వివరించడనికి, సర్వ దేవజాతులు ఎలా పుట్టారు ఎలా లీనము అయ్యారు అన్న విషయము సామాన్యులకు అందించడనికి, సకల విధమైన ధర్మములను లోకానికి అందించడానికి పంచమ వేదముగా పేరు తెచ్చుకున్న ఈ భారతకథను రచించాడు. ఈ ఇతిహాసమును వ్యాసుడు మూడు సంవత్సరముల కాలము రచించాడు. ధర్మ, అర్ధము, కామము, మోక్షము అను పురుషార్ధములలో చెప్పబడిన ధర్మసూక్ష్మములు ఈ మహాభారత కథలో సమూలముగా చెప్పబడ్డాయి. ఈ మహాభారతకథలో చెప్పబడిన ధర్మాలు లోకములో ఎక్కడైనా చెప్పబడి ఉండ వచ్చు కాని ఈ కథలో చెప్పని ధర్మాలు లోకములో చెప్పలేదని వ్యాసుడు స్వయముగా చెప్పాడు. సర్పయాగ సందర్భములో వ్యాసుడి ఆదేశానుసారము వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన ఈ భారత కథను ఆమూలాగ్రము విని నేను ధన్యుడిని అయ్యాను. ఆ వేదవ్యాసుడి కరుణ వలన మీ అందరి ఆదరాభిమానాలతో నేను మీకు వినిపించాను.

ఫలములు

[మార్చు]

ఈ పుణ్యకథను మొదటి నుండి చివరి వరకు పర్వదినములలో ఎవరు భక్తిశ్రద్ధలతో వింటారో వారికి పాపములు నశించిపోయి స్వర్గలోక సుఖములు అనుభవించి చివరకు మోక్షము పొందుతారు. వారు చేసిన బ్రహ్మహత్యా మొదలగు ఘోరపాపములు సహితము నశిస్తాయి. దైవకార్యములు, పితృకార్యములు జరిగే సమయములో ఈ మహాభారతకథను ఎవరు బ్రాహ్మణులకు వినిపిస్తారో వారికి ఆయా పుణ్యకార్యములు చేసిన ఫలితము దక్కుతుంది. ఈ మహాభారతకథను పూర్తిగా వినకున్నా ఏ కొంచెము అయినా చెవిసోకినా వారి సమస్త పాపములు నశిస్తాయి. మునులారా ! ముందు ఈ భారతకథను జయ అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. అందుకని క్షత్రియులు ఈ ఇతిహాసమును వింటే వారికి సదా జయము కలుగుతుంది. కన్యలు వింటే మంచి వరుడు దొరుకుతాడు. మునులారా ఈ భారత ఇతిహాసములో అత్యంత ముఖ్యుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడి మీద అచంచలమైన భక్తి విశ్వాసములతో ఈ మహాభారత ఇతిహాసమును వింటారో వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. వ్యాసమహర్షి కరుణతో ఎవరికి ఈ ఇతిహాస అర్ధము స్పురిస్తుందో అట్టి వాడికి వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, సకలశాస్త్రములు అవగతమౌతాయి. జనులు అతడిని కీర్తిస్తారు. అతడికి బ్రహ్మజ్ఞానము అలవడుతుంది " అని సుతుడైన ఉగ్రశ్రవసుడు శౌనకాది మునులకు తృప్తికలిగేలా మహాభారతకథను చెప్పాడు. అది విన్న శౌనకాది మునులు పరమానందము చెంది ఉగ్రశ్రవసుడిని ఘనముగా సత్కరించారు.

బయటి లంకెలు

[మార్చు]