అగ్నిపర్వతం

వికీపీడియా నుండి
(అగ్నిపర్వతాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అగ్నిపర్వతం అంటే, గ్రహం లాంటి పెద్ద ద్రవ్యరాశి గల ఖగోళ వస్తువు పైపెంకులో (పై పొర -క్రస్టు) ఏర్పడే చీలిక. ఉపరితలం క్రింద, శిలాద్రవం ఉండే గది నుండి ఈ చీలిక ద్వారా వేడి లావా, అగ్నిపర్వత బూడిద, వాయువులూ వత్తిడితో బయటికి చిమ్ముతాయి.

భూమిపై అగ్నిపర్వతాలు ఎందుకు ఉంటాయంటే దాని పెంకు 17 ప్రధాన, దృఢమైన టెక్టోనిక్ పలకలుగా విభజించబడి ఉంది. ఈ పలకలు దలుతూంటాయి. [1] అందువల్ల, టెక్టోనిక్ ప్లేట్లు కదులుతూ ఒకదాన్నుండొకటి దూరంగా జరుగుతూ, ఒకదానికొకటి దగ్గరౌతూ ఉన్నచోట్ల అగ్నిపర్వతాలు కనిపిస్తాయి. చాలావరకు ఇవి సముద్రాల లోపల ఉంటాయి. ఉదాహరణకు, మిడ్-అట్లాంటిక్ రిడ్జ్ (అట్లాంటిక్ సముద్రం లోపల ఉన్న శిఖరాలు) వద్ద విడిపోతున్న టెక్టోనిక్ ప్లేట్ల వల్ల సంభవించే అగ్నిపర్వతాలున్నాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో దగ్గరౌతున్న టెక్టోనిక్ ప్లేట్ల వల్ల ఏర్పడే అగ్నిపర్వతాలు ఉన్నాయి. పెంకు లోని పలకలు సాగుతూ, సన్నబడుతూ ఉన్న చోట్ల కూడా అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ఉదా., తూర్పు ఆఫ్రికా రిఫ్ట్, వెల్స్ గ్రే-క్లియర్‌వాటర్ అగ్నిపర్వత క్షేత్రం, ఉత్తర అమెరికా లోని రియో గ్రాండే రిఫ్ట్. ఈ రకమైన అగ్నిపర్వతం "ప్లేట్ హైపోథీసిస్" అగ్నిపర్వతం అనే నిర్వచనం కిందకు వస్తుంది. [2] పలకల సరిహద్దులకు దూరంగా ఉన్న అగ్నిపర్వతాలను మాంటిల్ ప్లూమ్స్ అని అంటారు. "హాట్‌స్పాట్‌" అనే ఇలాంటి అగ్నిపర్వతాలకు ఉదాహరణలు హవాయిలో ఉన్నాయి. భూమిలో 3,000 కి.మీ. లోతున ఉన్న కోర్-మాంటిల్ సరిహద్దు నుండి పైకి ఉబికి వచ్చే శిలాద్రవంతో ఇవి ఏర్పడతాయి. రెండు టెక్టోనిక్ పలకలు ఒకదానికొకటి రాసుకుంటూ జరిగిపోయే చోట్ల అగ్నిపర్వతాలు సాధారణంగా ఏర్పడవు.

సబన్కాయ అగ్నిపర్వతం, 2017 లో పెరూ
ఎల్ సాల్వడార్‌లోని కార్డిల్లెరా డి అపానెకా అగ్నిపర్వత శ్రేణి. దేశం 170 అగ్నిపర్వతాలకు నిలయంగా ఉంది, 23 చురుకుగా ఉన్నాయి, వీటిలో రెండు కాల్డెరాస్ ఉన్నాయి, ఒకటి సూపర్వోల్కానో . ఎల్ సాల్వడార్ లా టియెర్రా డి సోబెర్బియోస్ అగ్నిపర్వతాలు, (ది ల్యాండ్ ఆఫ్ మాగ్నిఫిసెంట్ అగ్నిపర్వతాలు) అనే పేరును సంపాదించింది.
అలస్కాలోని అలూటియన్ దీవులలోని క్లీవ్‌ల్యాండ్ అగ్నిపర్వతం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి 2006 మేలో తీసిన ఫోటో

విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతాలు విస్ఫోటనం జరిగిన చోట మాత్రమే కాకుండా దూరాన కూడా అనేక ప్రమాదాలను కలిగిస్తాయి. అలాంటి ఒక ప్రమాదం ఏమిటంటే, అగ్నిపర్వత బూడిద విమానాలకు, ప్రత్యేకించి జెట్ ఇంజన్లు ఉన్న వాటికి, ముప్పు కలిగిస్తుంది. ఈ ఇంజన్లు పనిచేసే అధిక ఉష్ణోగ్రత వలన బూడిద కణాలు కరుగుతాయి; కరిగిన బూడిద టర్బైన్ బ్లేడ్‌లకు అంటుకుపోయి, వాటి ఆకారాన్ని మారుస్తాయి. దీనివలన, టర్బైన్ పనికి అంతరాయం కలుగుతుంది. పెద్ద విస్ఫోటనాల్లో వెలువడే బూడిద, సల్ఫ్యూరిక్ ఆమ్లం మొదలైనవి సూర్యకాంతికి అడ్డం పడి, భూమి దిగువ వాతావరణాన్ని (లేదా ట్రోపోస్పియర్ ) చల్లబరుస్తాయి. అయితే, అవి భూమి నుండి వెలువడే వేడిని కూడా గ్రహిస్తాయి, తద్వారా ఎగువ వాతావరణం (లేదా స్ట్రాటోస్ఫియరు ) వేడెక్కుతుంది. అగ్నిపర్వత శీతాకాలాలు ఏర్పడి మహా విపత్కారక కరువులు ఏర్పడిన సంఘటనలు చరిత్రలో ఉన్నాయి.

పినాటుబో పర్వతం 1991 జూన్ 12 న దాని అంతిమ విస్ఫోటనం జరగడానికి మూడు రోజుల ముందు
హవాయి, 1983 లో అగ్నిపర్వత శంకువు నుండి విస్ఫోటనం చెందుతున్న లావా ఫౌంటెన్
1995 లో విస్ఫోటనం సమయంలో అండమాన్ దీవుల లోని బ్యారెన్ ఐలాండ్ దృశ్యం. ఇది దక్షిణ ఆసియాలో ఉన్న ఏకైక చురుకైన అగ్నిపర్వతం.
కాలిఫోర్నియాలోని శాస్తా పర్వతం ఉపగ్రహ చిత్రం, 2014 జనవరి

ప్లేట్ టెక్టోనిక్స్

[మార్చు]
దూరమౌతున్న పలకల సరిహద్దులు చూపించే మ్యాపు (వ్యాప్తి చెందుతున్న మహాసముద్ర చీలికలు). ఇటీవలి జలాంతర్గత అగ్నిపర్వతాలను

దూరమయ్యే ఫలకాల సరిహద్దులు

[మార్చు]

సముద్రం అడుగున ఉండే శిఖరాల వద్ద రెండు టెక్టోనిక్ ప్లేట్ల మధ్య శిలాద్రవం చల్లబడి ఘనీభవిస్తూ కొత్త శిఖరాలు ఏర్పడుతూ ఉండడం వలన అవి ఒకదానికొకటి దూరంగా జరుగుతూంటాయి. ఈ శిఖరాల వద్ద పెంకు (క్రస్టు) చాలా పల్చగా ఉంటుంది కాబట్టి, టెక్టోనిక్ ప్లేట్లు లాగడం వల్ల పీడనం విడుదలవడంతో అడయబాటిక్ వ్యాకోచం (ఉష్ణం, పదార్థం బదిలీ కాకుండా) జరుగుతుంది. అలాగే మాంటిల్ పాక్షికంగా కరిగి, అగ్నిపర్వతం ఉద్భవించి కొత్త సముద్రంతర్గత క్రస్టు ఏర్పడుతుంది. విడిపోయే ఫలకాల సరిహద్దులు చాలావరకు మహాసముద్రాల దిగువనే ఉన్నాయి; అందువల్ల, భూమిపై జరిగే అగ్నిపర్వత కార్యకలాపాలు చాలావరకు సముద్రాల అడుగునే జరుగుతాయి. ఈ క్రమంలో కొత్త సముద్ర గర్భం ఏర్పడుతూంటుంది. నల్లటి పొగ ఊదే బిలాలు (లోతైన సముద్రపు లోతుల్లోని రంధ్రాలు) ఈ రకమైన అగ్నిపర్వత కార్యకలాపాలకు నిదర్శనం. సముద్ర శిఖరాలు సముద్ర మట్టానికి పైన ఉన్న చోట్ల, అగ్నిపర్వత ద్వీపాలు ఏర్పడతాయి. ఉదాహరణకు, ఐస్‌లాండ్ .

దగ్గరయ్యే ఫలకాల సరిహద్దులు

[మార్చు]

సబ్డక్షన్ జోన్లు రెండు ప్లేట్లు, సాధారణంగా ఒక సముద్ర ఫలకం ఒక ఖండపు ఫలకం డీకొనే ప్రదేశాల్లో సబ్డక్షన్ జోన్లు ఏర్పడతాయి. ఇలాంటి చోట్ల సముద్ర ఫలకం ఖండాంతర ఫలకం కిందికి చొచ్చుకుపోతుంది. దీనివలన సముద్రలో తీరానికి దగ్గర్లో లోతైన కందకం ఏర్పడుతుంది. చొచ్చుకుపోయే ఫలకం నుండి విడుదలైన నీరు, మాంటిల్ చీలిక యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఈ ప్రక్రియను ఫ్లక్స్ మెల్టింగ్ అంటారు. తద్వారా శిలాద్రవం (మాగ్మా) ఏర్పడుతుంది . ఈ శిలాద్రవంలో అధిక శాతంలో ఉన్న సిలికా కారణంగా ఇది చాలా చిక్కగా ఉంటుంది. అందుచేత ఇది సముద్ర ఉపరితలం పైదాకా రాకుండా, లోతులోనే చల్లబడి, ఘనీభవిస్తుంది. ఒకవేళ ఇది ఉపరితలం చేరుకుంటే, అగ్నిపర్వత రూపం తీసుకుంటుంది. మౌంట్ ఎట్నా, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లోని అగ్నిపర్వతాలు దీనికి ఉదాహరణలు.

హాట్‌స్పాట్‌లు

[మార్చు]

హాట్‌స్పాట్‌లు అగ్నిపర్వత ప్రాంతాలు. కోర్-మాంటిల్ సరిహద్దు పైకి ఉబికి వచ్చే వేడి పదార్థపు స్తంభాల వంటి మాంటిల్ ప్లూమ్‌ల వలన ఇవి ఏర్పడతాయి. టెక్టోనిక్ ఫలకాలు వాటి గుండా కదులుతూ ఉంటాయి కాబట్టి, అగ్నిపర్వతాలు నిద్రాణమై పోతాయి. చివరికి, ఫలకం ఈ ప్లూమ్ మీదుగా ముందుకు పోయే కొద్దీ, అవి తిరిగి ఏర్పడతాయి. హవాయి దీవులు ఈ పద్ధతిలో ఏర్పడినట్లు చెబుతారు; స్నేక్ రివర్ ప్లెయిన్ కూడా ఇలాగే ఏర్పడింది. ఎల్లోస్టోన్ కాల్డెరా హాట్ స్పాట్ పైన ఉన్న ఉత్తర అమెరికా ప్లేట్‌లో భాగం. అయితే ఈ సిద్ధాంతం సందేహాస్పదంగా ఉంది. [2]

సర్చెవ్ శిఖరం విస్ఫోటనం, మాటువా ద్వీపం, వాలుగా ఉన్న ఉపగ్రహ వీక్షణ

అగ్నిపర్వత లక్షణాలు

[మార్చు]
1783–84 లో ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పులకు మూలమైన ఐస్లాండ్‌లోని లకాగిగర్ ఫిషర్ బిలం, దాని పొడవునా వరుసగా అగ్నిపర్వత శంకువులున్నాయి.
షీజల్డ్‌బ్రేయూర్, షీల్డ్ అగ్నిపర్వతం, దీని పేరు "విస్తృత కవచం"

అగ్నిపర్వతం అనగానే, ఒక శంఖాకార పర్వతం, దాని శిఖరం వద్ద ఒక బిలం నుండి లావా, విష వాయువులను చిమ్మడం - ఇదే మామూలుగా మదిలో మెదిలే చిత్రం. అయితే, ఇది అనేక రకాల అగ్నిపర్వతాలలో ఒకటి మాత్రమే. అగ్నిపర్వతాల లక్షణాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. వాటి నిర్మాణం, ప్రవర్తన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని అగ్నిపర్వతాలకు శిఖరమూ, బిలమూ కాకుండా లావా గోపురాలతో ఏర్పడిన కఠినమైన శిఖరాలుంటాయి. మరికొన్నిటికి భారీ పీఠభూములు ఉంటాయి. లావా, బూడిద వంటి అగ్నిపర్వత పదార్థాలను, వాయువులనూ వెలువరించే ముఖ ద్వారాలు ఎక్కడైనా ఏర్పడవచ్చు. ఇతర రకాల అగ్నిపర్వతాలలో క్రయోవోల్కానోస్ (లేదా మంచు అగ్నిపర్వతాలు) ఉన్నాయి. ఇవి ముఖ్యంగా బృహస్పతి, శని, నెప్ట్యూన్ ల ఉపగ్రహాలపై ఉంటాయి. మట్టి అగ్నిపర్వతాలు, వీటికి మామూలు మాగ్మాటిక్ కార్యకలాపాలతో సంబంధం ఉండదు. చురుకైన మట్టి అగ్నిపర్వతాల్లో మామూలు మంట అగ్నిపర్వతాల కంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, మట్టి అగ్నిపర్వతం ఓ అగ్నిపర్వత బిలం అయితే తప్ప.

పగుళ్ళు

[మార్చు]

అగ్నిపర్వత పగుళ్ళు బల్లపరుపుగా, సరళ రేఖలో ఉండే పగుళ్లు. వీటి గుండా లావా ఉబికి వస్తుంది.

షీల్డ్ అగ్నిపర్వతాలు

[మార్చు]

తక్కువ విస్కోసిటీతో ఉండే లావా విస్ఫోటనం చెందినపుడు షీల్డ్ అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ఈ లావా బిలం నుండి చాలా దూరం ప్రవహిస్తుంది. అవి సాధారణంగా విపత్తులాగా పేలవు. తక్కువ చిక్కదనం ఉండే శిలాద్రవంలో సిలికా సాధారణంగా తక్కువగా ఉంటుంది కాబట్టి, షీల్డ్ అగ్నిపర్వతాలు ఖండాంలపై కంటే సముద్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. హవాయి అగ్నిపర్వత గొలుసు షీల్డ్ శంకువుల శ్రేణి. ఐస్లాండ్‌లో కూడా ఇవి ఉంటాయి.

లావా గోపురాలు

[మార్చు]

అధిక చిక్కదనం (విస్కోసిటీ) ఉండే లావా నెమ్మదిగా విస్ఫోటనం చెందినపుడు లావా గోపురాలు ఏర్పడతాయి. మౌంట్ సెయింట్ హెలెన్స్ మాదిరిగా ఇవి మునుపటి అగ్నిపర్వత విస్ఫోటనపు బిలం లోపల ఏర్పడవచ్చు. లాసెన్ పీక్ వలె స్వతంత్రంగా కూడా ఏర్పడవచ్చు. స్ట్రాటోవోల్కానోస్ మాదిరిగా, అవి భయంకరమైన, విస్ఫోటనాలను ఉత్పత్తి చేయగలవు. కాని వాటి లావా ఉద్భవించే బిలం నుండి ఎక్కువ దూరం ప్రవహించదు.

క్రిప్టోడోమ్‌లు

[మార్చు]

చిక్కటి లావా పైకి ఎగదన్నినపుడు, ఉపరితలం ఉబ్బి, క్రిప్టోడోమ్స్ ఏర్పడతాయి. సెయింట్ హెలెన్స్ పర్వతం 1980 లో విస్ఫోటనం చెందడం దీనికొక ఉదాహరణ; పర్వతం అడుగున ఉన్న లావా, ఒక ఉబ్బరాన్ని సృష్టించింది. ఇది పర్వతానికి ఉత్తరం వైపుకు జారిపోయింది.

అగ్నిపర్వత శంకువులు (సిండర్ శంకువులు)

[మార్చు]
ఇజాల్కో అగ్నిపర్వతం, ఎల్ సాల్వడార్‌లోని అతి తక్కువ వయసున్న అగ్నిపర్వతం. ఇజాల్కో 1770 నుండి (అది ఏర్పడినప్పుడు) 1958 వరకు దాదాపుగా విస్ఫోటనం చెందుతూనే ఉంది, దీనికి "లైట్హౌస్ ఆఫ్ ది పసిఫిక్" అనే పేరు వచ్చింది.

స్కోరియా, పైరోక్లాస్టిక్‌ల ముక్కలు ఎగజిమ్మినపుడు అగ్నిపర్వత శంకువులు లేదా సిండర్ శంకువులు ఏర్పడతాయి (రెండూ సిండర్‌లను పోలి ఉంటాయి, అందువల్ల ఈ పేరు వచ్చింది). ఇవి సాపేక్షంగా స్వల్పకాలిక విస్ఫోటనాలు కావచ్చు, ఇవి 30 నుండి 400 మీటర్ల ఎత్తులో శంకువు ఆకారంలో ఉన్న కొండను ఏర్పరుస్తాయి. చాలా సిండర్ శంకువులు ఒక్కసారి మాత్రమే విస్ఫోటనం చెందుతాయి. సిండర్ శంకువులు పెద్ద అగ్నిపర్వతాలపై పార్శ్వ బిలాల్లాగా ఏర్పడవచ్చు. విడిగానూ ఏర్పడవచ్చు. మెక్సికోలోని పారాకుటిన్, అరిజోనాలోని సన్‌సెట్ క్రేటర్ సిండర్ శంకువులకు ఉదాహరణలు. న్యూ మెక్సికోలో, కాజా డెల్ రియో 60 కి పైగా సిండర్ శంకువులున్న అగ్నిపర్వత క్షేత్రం .

సౌర వ్యవస్థలోని అంగారకుడు, చంద్రుడు వంటి ఇతర రాతి వస్తువులపై కూడా సిండర్ శంకువులు ఏర్పడవచ్చని ఉపగ్రహ చిత్రాలు సూచించాయి. [3] [4] [5] [6]

స్ట్రాటోవోల్కానోస్ (మిశ్రమ అగ్నిపర్వతాలు)

[మార్చు]
స్ట్రాటోవోల్కానో అడ్డుకోత :
  1. పెద్ద మాగ్మా చాంబరు
  2. బెడ్‌రాక్
  3. గొట్టం
  4. పాదం
  5. సిల్
  6. డైక్
  7. అగ్నిపర్వతం విరజిమ్మిన బూడిద పొరలు
  8. పక్క
  9. అగ్నిపర్వతం విరజిమ్మిన లావా పొరలు
  10. గొంతు
  11. పారాసైటిక్ కోన్
  12. లావా ప్రవాహం
  13. వెంట్
  14. బిలం
  15. బూడిద మేఘం

స్ట్రాటోవోల్కానోస్ లేదా మిశ్రమ అగ్నిపర్వతాలు పొడవైన శంఖాకార పర్వతాలు. లావా ప్రవాహాలు, ఇతర పదార్థాలు పొరలు పొరలుగా పేరుకుపోతే ఏర్పడిన పర్వతాలివి. అవి వివిధ రకాల విస్ఫోటనాల సమయంలో వెలువడ్డ బహుళ నిర్మాణాల నుండి ఏర్పడతాయి కాబట్టి, వీటిని మిశ్రమ అగ్నిపర్వతాలు అని కూడా పిలుస్తారు. స్ట్రాటో / మిశ్రమ అగ్నిపర్వతాలు సిండర్లు, బూడిద, లావాతో ఏర్పడతాయి. సిండర్లు, బూడిద గుట్టలు ఒకదానిపై ఒకటి పరుచుకుంటాయి. ఈ బూడిద పైన లావా ప్రవహించి, చల్లబడి, ఘనీభవిస్తుంది. అనంతర విస్ఫోటనాల్లో ఇదే ప్రక్రియ పునరావృతమవుతుంది. జపాన్‌లోని మౌంట్ ఫుజి, ఫిలిప్పీన్స్‌లోని మాయన్ అగ్నిపర్వతం, ఇటలీలోని వెసూవియస్, స్ట్రోంబోలి పర్వతాలు దీనికి ఉదాహరణలు.

చరిత్రలో, స్ట్రాటోవోల్కానోస్ విస్ఫోటనాల్లో విరజిమ్మినన బూడిద మానవ నాగరికతలకు అత్యంత పెను విపత్తులను కలిగించాయి. షీల్డ్ అగ్నిపర్వతాల కంటే స్ట్రాటోవోల్కానోల్లో లావా ప్రవాహం చాలా ఎక్కువ పీడననాన్ని కలిగి ఉండటమే కాకుండా, వాటి పగుళ్ళు మోనోజెనెటిక్ అగ్నిపర్వత క్షేత్రాలు (అగ్నిపర్వత శంకువులు) కూడా మరింత శక్తివంతంగా విరజిమ్ముతాయి. షీల్డ్ అగ్నిపర్వతాల కన్నా నిటారుగా ఉంటాయి. సాధారణంగా షీల్డ్ అగ్నిపర్వతాల వాలు 5-10 డిగ్రీల ఉంటే, వీటికి 30-35 డిగ్రీల వాలు ఉంటుంది. వాటిలో వదులుగా ఉండే టెఫ్రా ప్రమాదకరమైన లాహర్‌లకు కారణమౌతుంది. [7] టెఫ్రాలో ఉండే పెద్ద ముక్కలను అగ్నిపర్వత బాంబులు అంటారు. పెద్ద బాంబులు 1.2 మీటర్ల కంటే ఎక్కువ పరిమాణంతో, అనేక టన్నుల బరువు ఉంటాయి. [8]

మహా అగ్నిపర్వతాలు

[మార్చు]

మహా అగ్నిపర్వతాలకు సాధారణంగా పెద్ద కాల్డెరా ఉంటుంది. ఇవి అపారమైన స్థాయిలో వినాశనాన్ని కలిగిస్తాయి. కొన్నిసార్లు ఖండాంతర స్థాయిలో ఈ వినాశనం ఉంటుంది. ఇటువంటి అగ్నిపర్వతాలు భారీ పరిమాణంలో సల్ఫర్, బూడిద వాతావరణంలోకి వెదజల్లడంతో, విస్ఫోటనం తరువాత చాలా సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతలను బాగా చల్లబరుస్తాయి. ఇవి అగ్నిపర్వతాల్లో కెల్లా అత్యంత ప్రమాదకరమైన రకం. ఉదాహరణలు: ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ లోని యెల్లోస్టోన్ కాల్డెరా, న్యూ మెక్సికోలోని వల్లెస్ కాల్డెరా (ఈ రెండూ పశ్చిమ అమెరికా లోనివి); న్యూజిలాండ్‌లోని టౌపో సరస్సు; ఇండోనేషియా, సుమత్రాలోని టోబా సరస్సు, టాంజానియాలోని న్గోరోంగోరో క్రేటర్. విస్ఫోటనంలో విరజిమ్మిన పదార్థాలు విస్తారమైన ప్రాంతంలో వ్యాపించి ఉండటాన, విస్ఫోటనం జరిగిన శతాబ్దాల తరువాత కూడా అగ్నిపర్వత స్థానాన్ని గుర్తించడం కష్టం. అదేవిధంగా, పెద్ద మొత్తంలో బసాల్ట్ లావాను విరజిమ్మే (లావా ప్రవాహం పేలుడు కానిది అయినప్పటికీ) పెద్ద ఇగ్నియస్ ప్రావిన్సులను కూడా మహా అగ్నిపర్వతాలుగానే పరిగణిస్తారు.

నీటి అడుగున అగ్నిపర్వతాలు

[మార్చు]

జలాంతర్గత అగ్నిపర్వతాలు సముద్రపు అడుగుభాగంలో ఉండడం మామూలే. తక్కువ లోతున్న చోట, చురుకైన అగ్నిపర్వతాలు సముద్రపు ఉపరితలం పైకి బాగా ఎత్తు లోకి ఆవిరి, రాతి శకలాలను విరజిమ్మడంతో వాటి ఉనికి తెలుస్తూంటుంది. బాగా లోతుల్లో ఉన్న అగ్నిపర్వతాలు, వాటికి పైన ఉన్న నీటి విపరీతమైన బరువు కారణంగా ఆవిరి, వాయువులు ఉపరితలానికి రావు; అయితే, హైడ్రోఫోన్లు ద్వారా, అగ్నిపర్వత వాయువుల కారణంగా నీటి రంగు పాలిపోవటం ద్వారానూ వాటిని గుర్తించవచ్చు. దిండు లావా అనేది జలాంతర్గత అగ్నిపర్వతాల విస్ఫోటనంలో ఏర్పడుతుంది. నీటి కింద ఏర్పడే మందపాటి దిండు ఆకారపు ద్రవ్యరాశిని దిండు లావా అంటారు. త్వరగా చల్లబడడం కారణంగా పెద్ద జలాంతర్గత విస్ఫోటనాలు కూడా సముద్రపు ఉపరితలంపై ఏ సంచలనాన్నీ కలిగించకపోవచ్చు. నీటికి వస్తువులను తేల్చే గుణం కారణంగా, సముద్రపు అడుగుభాగంలో అగ్నిపర్వత బిలాల పైన నిటారుగా ఉండే స్తంభాలు ఏర్పడతాయి. ఈ అగ్నిపర్వతాల దగ్గర హైడ్రోథర్మల్ వెంట్స్ ఉంటాయి. కొన్ని కరిగిన ఖనిజాల ఆధారంగా కొన్నిరకాల పర్యావరణ వ్యవస్థలకు ఇవి మద్దతు ఇస్తాయి . కాలక్రమేణా, జలాంతర్గత అగ్నిపర్వతాలు సృష్టించిన నిర్మాణాలు చాలా పెద్దవిగా మారి, అవి సముద్రపు ఉపరితలాన్ని చీల్చుకుని పైకి వచ్చి, కొత్త ద్వీపాలు లేదా తేలియాడే ప్యూమిస్ తెప్పలుగా ఏర్పడతాయి.

2018 మే జూన్‌లలో, ప్రపంచవ్యాప్తంగా భూకంప పర్యవేక్షణ సంస్థలు భూకంప సంకేతాలను కనుగొన్నాయి. అవి ఓ విచిత్రమైన హమ్మింగ్ ధ్వనిని సృష్టించాయి. ఆ సంవత్సరం నవంబరులో కనుగొన్న కొన్ని సిగ్నళ్ళు 20 నిమిషాల పాటు సాగాయి. 2019 మేలో నిర్వహించిన ఒక సాగర శాస్త్ర అధ్యయనంలో మాయోట్టి తీరంలో నీటి అడుగున అగ్నిపర్వతం ఏర్పడడం వల్ల శబ్దాలు వచ్చాయని తేలింది. [9]

హిమానీనదాల అడుగున అగ్నిపర్వతాలు

[మార్చు]

హిమానీ నదాంతర్గత అగ్నిపర్వతాలు మంచుటోపీల కింద ఏర్పడుతాయి . ఇవి విస్తృతమైన దిండు లావాలు, పాలగోనైట్‌ల పైన బల్లపరుపుగా లావా ప్రవహించడంతో ఏర్పడతాయి. మంచుటోపీ (ఐస్‌క్యాప్) కరిగినప్పుడు, పైన ఉన్న లావా కూలిపోయి, ఒక బల్లపరుపుగా ఉండే పర్వతం బయటపడుతుంది. ఈ అగ్నిపర్వతాలను టేబుల్ పర్వతాలు, తూయాస్ లేదా (అప్పుడప్పుడూ) మోబెర్గ్స్ అని కూడా పిలుస్తారు. ఈ రకమైన అగ్నిపర్వతాలకు ఉదాహరణలు ఐస్లాండ్‌లో చూడవచ్చు. అయితే, బ్రిటిష్ కొలంబియాలో కూడా తుయాస్ ఉన్నాయి. ఈ పదానికి మూలం తుయా బుట్టే నుండి వచ్చింది. ఉత్తర బ్రిటిష్ కొలంబియాలోని తూయా నది, తుయా రేంజ్ ప్రాంతంలోని అనేక తుయాలలో ఇది ఒకటి. తుయా బుట్టే అటువంటి నేలరూపాన్ని విశ్లేషించిన మొట్టమొదటిది కావడం వల్ల ఈ రకమైన అగ్నిపర్వత నిర్మాణాలకు ఆ పేరు వచ్చింది. ఈ అసాధారణ ప్రకృతి దృశ్యాన్ని పరిరక్షించడానికి తుయా పర్వతాల ప్రావిన్షియల్ పార్కును స్థాపించారు, ఇది తుయా సరస్సుకి ఉత్తరాన, జెన్నింగ్స్ నదికి దక్షిణాన యుకాన్ భూభాగపు సరిహద్దు వద్ద ఉంది.

బురద అగ్నిపర్వతాలు

[మార్చు]

బురద అగ్నిపర్వతాలు లేదా మట్టి గోపురాలు భూమి విసర్జించిన ద్రవాలు, వాయువుల నుండి తయారవుతాయి. అయితే, వీటి ఏర్పాటుకు కారణమయ్యే ఇతర ప్రక్రియలు కూడా ఉన్నాయి. బురద అగ్నిపర్వతాల్లో అతిపెద్ద నిర్మాణాలు 10 కిలోమీటర్ల వ్యాసం, 700 మీటర్ల ఎత్తు వరకూ ఉంటాయి.

అగ్నిపర్వత కార్యకలాపాలు

[మార్చు]
పోంపీ లోని హౌస్ ఆఫ్ ది సెంటెనరీలో చూసినట్లుగా బాకస్, అగాథోడెమోన్, వెనుక విసూవియస్ పర్వతం.

అగ్నిపర్వతాల (అశాస్త్రీయ) వర్గీకరణ

[మార్చు]

మాగ్మాటిక్ అగ్నిపర్వతాలను వర్గీకరించడంలో వాటి విస్ఫోటన తరచుదనాన్ని బట్టి చెయ్యడం ఒక పద్ధతి. ఒక క్రమ కాలికంగా విస్ఫోటనం చెందుతూ ఉండేవాటిని చేతనంగా ఉన్నవి అని, చారిత్రక కాలంలో విస్ఫోటనం చెంది ప్రస్తుతం నిద్రాణంగా లేదా నిష్క్రియంగా ఉన్నవాటిని అచేతనంగా ఉన్నవి అని, చారిత్రక కాలంలో అసలే విస్ఫోటనం చెందని వాటిని అంతరించిపోయినవి అనీ వర్గీకరిస్తారు. అయితే, ఈ వర్గీకరణలు -ముఖ్యంగా అంతరించిపోయినవి- శాస్త్రవేత్తలకు పనికొచ్చేవి కావు, అర్థరహితమైనవి. అగ్నిపర్వతపు నిర్మాణం, విస్ఫోటన ప్రక్రియ, తరువాత ఏర్పడే ఆకృతులను బట్టి శాస్త్రవేత్తలు వర్గీకరిస్తారు.

చేతనంగా ఉన్నవి

[మార్చు]

"క్రియాశీల" అగ్నిపర్వతాన్ని ఎలా నిర్వచించాలనే దానిపై అగ్నిపర్వత శాస్త్రవేత్తలలో ఏకాభిప్రాయం లేదు. అగ్నిపర్వతాల ఆయుర్దాయం కొన్ని నెలల నుండి అనేక మిలియన్ సంవత్సరాల వరకు ఉండవచ్చు. మానవుల జీవితకాలంతో, ఆ మాటకొస్తే, నాగరికతలతోటి పోల్చినప్పుడు ఇటువంటి వర్గీకరణ కొన్నిసార్లు అర్థరహితం అవుతుంది. ఉదాహరణకు, భూమి పైనున్న అనేక అగ్నిపర్వతాలు గత కొన్ని వేల సంవత్సరాలలో డజన్ల కొద్దీ విస్ఫోటనం చెందాయి, కాని ప్రస్తుతం అవి విస్ఫోటనం సంకేతాలను చూపించలేదు. అటువంటి అగ్నిపర్వతాల దీర్ఘ ఆయుర్దాయం చూస్తే, అవి చాలా చురుకుగా ఉన్నట్లే. మానవ జీవితకాలాల ప్రకారం, అవి చేతనంగా ఉన్నట్లు కాదు.

చారిత్రక సమయం (అంటే నమోదైన చరిత్ర) క్రియాశీలతకు మరొక కాలపరిమితి . [10] [11] ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వోల్కనాలజీ ప్రచురించిన కాటలాగ్ ఆఫ్ ది యాక్టివ్ వొల్కానోస్లో ఈ నిర్వచనాన్ని ఉపయోగించారు. దీని ప్రకారం 500 కంటే ఎక్కువ క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. [10] అయితే, రికార్డ్ చేయబడిన చరిత్ర కాలావధి ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉంటుంది. చైనా, మధ్యధరాల్లో, ఇది దాదాపు 3,000 సంవత్సరాలు. కాని అమెరికా, కెనడా ల వాయవ్య ప్రాంతంలో, ఇది 300 సంవత్సరాల కన్నా తక్కువే. హవాయి, న్యూజిలాండ్లలో, ఇది కేవలం 200 సంవత్సరాలే. [10]

కిలావే నుండి వెలువడ్డ లావా సముద్రం లోకి ప్రవేశిస్తుంది
ఐస్లాండ్, హోలుహ్రాన్ వద్ద లావా ప్రవహిస్తుంది 2014 సెప్టెంబరు

2013 నాటికి, భూమ్మీది అత్యంత చురుకైన అగ్నిపర్వతాలు కిందివి: [12]

  • కిలావే, ప్రసిద్ధ హవాయి అగ్నిపర్వతం. 1983 నుండి 2018 వరకు దాదాపు నిరంతరాయంగా పేలుతూనే ఉంది. లావా నెమ్మదిగా నేల మీదికి ప్రవహిస్తూ ఉంది. అత్యంత పొడవైన లావా సరస్సు ఉంది.
  • ఎట్నా పర్వతం, సమీపంలోని స్ట్రోంబోలి. ఈ రెండు మధ్యధరా అగ్నిపర్వతాలు ప్రాచీన కాలం నుండి "దాదాపు నిరంతర విస్ఫోటనం"లో ఉన్నాయి
  • రీయూనియన్‌లోని పిటాన్ డి లా ఫోర్‌నైస్ తరచుగా విస్ఫోటనం చెందుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

2010 నాటికి, చిరకాలంగా (నిరంతరాయంగా ఉండాలని ఏమీ లేదు) విస్ఫోటనం చెందుతూ ఉన్న అగ్నిపర్వతాలు:[13]

  • మౌంట్ యాసూర్, 111 సంవత్సరాలు
  • ఎట్నా పర్వతం, 109 సంవత్సరాలు
  • స్ట్రోంబోలి, 108 సంవత్సరాలు
  • శాంటా మారియా, 101 సంవత్సరాలు
  • సంగే, 94 సంవత్సరాలు

ఇతర చురుకైన అగ్నిపర్వతాలు:

  • నైరాగోంగో పర్వతం, దాని పొరుగున ఉన్న న్యామురాగిరా ఆఫ్రికా యొక్క అత్యంత చురుకైన అగ్నిపర్వతాలు
    నైరాగోంగో లావా సరస్సు
    .
  • అఫర్ త్రికోణం లోని ఎర్టా ఆలే, కనీసం 1906 నుండి లావా సరస్సును ఏర్పరుస్తోంది.
  • అంటార్కిటికాలోని ఎరేబస్ పర్వతం కనీసం 1972 నుండి లావా సరస్సును ఏర్పరుస్తోంది.
  • మెరాపి పర్వతం
  • వాకారి / వైట్ ఐలాండ్, 1769 లో యూరోపియన్ పరిశీలనకు ముందు నుండి అగ్నిపర్వత వాయువును విడుదల చేసే స్థితిలో ఉంది.
  • ఓల్ డొనియో లాంగై
  • ఏంబ్రిమ్
  • అరేనల్ అగ్నిపర్వతం
  • పకాయా
  • క్లూచెవ్స్కాయ సోప్కా
  • షెవెలక్

అంతరించినవి

[మార్చు]
10,000 సంవత్సరాలకు పైగా అంతరించిపోయినట్లు భావించిన అలస్కాలోని ఫోర్పీక్డ్ అగ్నిపర్వతం
1994 మౌంట్ రింజాని విస్ఫోటనం. లామ్బాక్, ఇండోనేషియా

శిలాద్రవం అయిపోయినందున ఇకపై విస్ఫోటనం చెందదని శాస్త్రవేత్తలు భావించిన వాటిని అంతరించిపోయిన అగ్నిపర్వతాలు అంటారు. వీటికి ఉదాహరణలుగా పసిఫిక్ మహాసముద్రంలో ఎంపరర్ సీమౌంట్ చెయిన్ లో అనేక అగ్ని పర్వతాలు (గొలుసు తూర్పు చివరన కొన్ని అగ్నిపర్వతాలు చురుకుగా ఉన్నప్పటికీ), జర్మనీలో హోహెన్‌ట్వీల్, న్యూ మెక్సికోలో షిప్‌రాక్, నెదర్లాండ్స్లో జుద్వల్, ఇటలీలో మోంటే వల్చర్ వంటి అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ కోట అంతరించిపోయిన అగ్నిపర్వతం పైన ఉంది.

నిద్రాణంగా ఉండి, తిరిగి క్రియాశీలమైనవి

[మార్చు]
భారతదేశంలోని నర్కొండం ద్వీపాన్ని నిద్రాణమైన అగ్నిపర్వతం అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వర్గీకరించింది

అగ్నిపర్వతం అంతరించిపోయిందా, నిద్రాణమై ఉందా అని చెప్పడం కష్టం. నిద్రాణమైన అగ్నిపర్వతాలంటే వేలాది సంవత్సరాలుగా విస్ఫోటనం చెందనివి. కానీ భవిష్యత్తులో ఇవి మళ్లీ విస్ఫోటనం చెందే అవకాశం ఉంది. [14][15] అగ్నిపర్వతాల కార్యకలాపాల గురించి వ్రాతపూర్వక రికార్డులు లేకపోతే అవి అంతరించిపోయినవని భావిస్తూంటారు. ఏదేమైనప్పటికీ, అగ్నిపర్వతాలు ఎక్కువ కాలం నిద్రాణమై ఉండవచ్చు. ఉదాహరణకు, ఎల్లోస్టోన్‌కు 7,00,000 సంవత్సరాల రీఛార్జ్ వ్యవధి ఉంది. టోబాకు సుమారు 3,80,000 సంవత్సరాలు ఉంది. [16] సా.పూ 79 లో విస్ఫోటనం చెంది, హెర్క్యులేనియం, పాంపీ పట్టణాలను నాశనం చేసే ముందు వెసూవియస్‌ అగ్నిపర్వతాన్ని తోటలు, ద్రాక్షతోటలూ కప్పేసి ఉండేవని రోమన్ రచయితలు వర్ణించారు. పినాటుబో అగ్నిపర్వతానికి, 1991 లో వినాశనకరంగా విస్ఫోటనం చెందే ముందు వరకు, పెద్దగా గుర్తింపు లేదు. పరిసర ప్రాంతాల ప్రజల్లోనే చాలా మందికి దీని గురించి తెలియదు. మోంట్‌సెరాట్ ద్వీపంలో దీర్ఘకాలంగా నిద్రాణమైన సౌఫ్రియర్ హిల్స్ అగ్నిపర్వతం, 1995 లో తిరిగి క్రియాశీలమయ్యేవరకు, అంతరించిపోయిందనే భావించారు. అలాస్కాలోని ఫోర్‌పీక్డ్ పర్వతం, 2006 సెప్టెంబరులో విస్ఫోటనం చెందడానికి ముందు, క్రీ.పూ 8000 ముందు నుండి విస్ఫోటనం చెందనేలేదు. అది అంతరించిపోయినట్లు గానే భావించారు.

దశాబ్ది అగ్నిపర్వతాలు

[మార్చు]
తూర్పు[permanent dead link] తూర్పు రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్-కామ్‌చాట్స్కీపై కొరియాక్స్కీ అగ్నిపర్వతం

ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వోల్కనాలజీ, అండ్ కెమిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ ఇంటీరియర్ (IAVCEI) గుర్తించిన 16 అగ్నిపర్వతాలు, వాటి చరిత్ర, పెద్ద, విధ్వంసక విస్ఫోటనాలు, జనావాసాల సామీప్యత దృష్ట్యా ప్రత్యేక అధ్యయనానికి అర్హమైనవి. ఐక్యరాజ్యసమితి ప్రాయోజిత అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దం (1990 లు) లో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినందున వాటికి దశాబ్ది అగ్నిపర్వతాలు అని పేరు పెట్టారు. 16 దశాబ్ది అగ్నిపర్వతాలు ఇవి:

  • అవాచిన్‌స్కీ-కొర్యాక్‌స్కీ (కలిపి), కమ్‌చాట్‌కా, రష్యా
  • వెనాడో డి కొలీమా, జాలిస్కో అండ్ కొలీమా, మెక్సికో
  • మౌంట్ ఎట్నా, సిసిలీ, ఇటలీ
  • గలేరాస్, నరీన్యో, కొలంబియా
  • మౌనా లోవా, హవాయి, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • మౌంట్ మెరాపి, మధ్య జావా, ఇండోనేషియా
  • మౌంట్ న్యిరాగోంగో, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో
  • మౌంట్ రెయినియర్, వాషింగ్టన్, అమెరికా
  • సకురాజిమా, కగోషిమా ప్రిఫెక్చర్, జపాన్
  • శాంటా మేరియా/శాంటియాక్విటో, గ్వాటెమాలా
  • శాంటోరినీ, సైక్లేడ్స్, గ్రీస్
  • తాల్ వొల్కానో, లుజాన్, ఫిలిప్పీన్స్
  • టీడె,క్యానరీ ఐలాండ్స్, స్పెయిన్
  • ఉలావున్, న్యూ బ్రిటన్, పాపువా న్యూ గినీ
  • మౌంట్ ఉంజెన్, నాగసాకి ప్రిఫెక్చర్, జపాన్
  • వెసూవియస్, నేపుల్స్, ఇటలీ

అగ్నిపర్వతాల ప్రభావాలు

[మార్చు]
అగ్నిపర్వతం ఏరోసోల్స్‌ను, వాయువులనూ వెదజల్లడం
సౌర వికిరణ గ్రాఫ్ 1958-2008, పెద్ద విస్ఫోటనాల తరువాత సౌర వికిరణం ఎలా తగ్గుతుందో చూపిస్తుంది
2005 అక్టోబరులో విస్ఫోటనం సమయంలో గాలాపాగోస్ దీవులలోని సియెర్రా నెగ్రా అగ్నిపర్వతం మీద సల్ఫర్ డయాక్సైడ్ గాఢత

అగ్నిపర్వత విస్ఫోటనాల్లో అనేక రకాలున్నాయి. అవి: ఫ్రియాటిక్ విస్ఫోటనాలు (ఆవిరి ఉత్పత్తయ్యే విస్ఫోటనాలు), హై - సిలికా లావా వెదజల్లే విస్ఫోటనం (ఉదా., రియోలైట్ ), తక్కువ-సిలికా లావా (ఉదా., బసాల్ట్ ), పైరోక్లాస్టిక్ ప్రవాహాలు, లాహర్స్ (శిథిలాల ప్రవాహం), కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు. ఇవన్నీ మానవులకు ప్రమాదం కలిగిస్తాయి. భూకంపాలు, వేడి నీటి బుగ్గలు, ఫ్యూమరోల్స్, బురద చెరువులు, వేడి నీటి బుగ్గలు తరచుగా అగ్నిపర్వత కార్యకలాపాలతో పెనవేసుకుని ఉంటాయి.

అగ్నిపర్వత వాయువులు

[మార్చు]

వివిధ అగ్నిపర్వత వాయువుల సాంద్రతలు ఒక అగ్నిపర్వతం నుండి మరొకదానికి గణనీయంగా మారవచ్చు. అగ్నిపర్వత వాయువుల్లో సాధారణంగా పెద్ద మొత్తంలో ఉండేది నీటి ఆవిరి. తరువాత కార్బన్ డయాక్సైడ్,[17] సల్ఫర్ డయాక్సైడ్ లుంటాయి. ఇతర ప్రధాన అగ్నిపర్వత వాయువులలో హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఉన్నాయి. కొద్దిపరిమాణంలో ఉండే వాయువులు కూడా అనేకం కనిపిస్తాయి, ఉదాహరణకు హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, హేలోకార్బన్లు, సేంద్రీయ సమ్మేళనాలు, అస్థిర లోహ క్లోరైడ్లు.

పెను విస్ఫోటనాలు విరజిమ్మే నీటి ఆవిరి (H2O), కార్బన్ డయాక్సైడ్ (CO2), సల్ఫర్ డయాక్సైడ్ (SO2), హైడ్రోజన్ క్లోరైడ్ (HCl), హైడ్రోజన్ ఫ్లోరైడ్ (HF), బూడిద (పల్వరైజ్డ్ రాక్ అండ్ ప్యూమిస్) ను భూమి నుండి 16–32 కిలోమీటర్ల ఎత్తుకు, స్ట్రాటో ఆవరణంలోకి పోతాయి. వీటి వలన కలిగే ముఖ్యమైన ప్రభావాల్లో సల్ఫర్ డయాక్సైడ్‌, సల్ఫ్యూరిక్ ఆమ్లం (H2SO4) గా మారి, స్ట్రాటో ఆవరణంలో వేగంగా ఘనీభవించి, సన్నటి సల్ఫేట్ ఏరోసోల్‌లు ఏర్పడతాయి. రెండు వేర్వేరు విస్ఫోటనాలు శీతోష్ణస్థితిపై చూపగల ప్రభావాలను పోల్చేందుకు ఆ విస్ఫోటనాల్లో వెలువడ్డ SO2 ఉద్గారాలను మాత్రమే పోల్చినా సరిపోతుంది. [18] ఏరోసోల్స్ వలన భూమి ఆల్బెడో పెరుగుతుంది -ఇది సూర్యుడి నుండి వచ్చే వికిరణాన్ని తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబించి, తద్వారా భూమి పైని దిగువ వాతావరణాన్ని లేదా ట్రోపోస్పియర్‌ను చల్లబరుస్తుంది. అయితే, అవి భూమి నుండి వెలువడే వేడిని కూడా గ్రహిస్తాయి, తద్వారా స్ట్రాటోస్ఫియరు వేడెక్కుతుంది. గత శతాబ్దంలో జరిగిన అనేక విస్ఫోటనాల వలన ఒకటి నుండి మూడు సంవత్సరాల కాలం పాటు, భూమి ఉపరితల ఉష్ణోగ్రత అర డిగ్రీ ఫారెన్‌హీట్ తగ్గేది. 1601-1603 లో రష్యాలో ఏర్పడ్డ కరువుకు కారణం, హుయెనాపుటినా విస్ఫోటనంలో వెలువడ్డ సల్ఫర్ డయాక్సైడు యి ఉండవచ్చు.

గణనీయమైన పరిణామాలు

[మార్చు]
19, 20 వ శతాబ్దాలలో జరిగిన పెద్ద అగ్నిపర్వత విస్ఫోటనాలను చరిత్ర పూర్వం అమెరికాలో జరిగిన మహా విస్ఫోటనాలతో ( VEI 7, VEI 8 ) పోలిక చూపే చిత్రం. ఎడమ నుండి కుడికి: ఎల్లోస్టోన్ 2.1 మా, ఎల్లోస్టోన్ 13 లసంక్రి, లాంగ్ వ్యాలీ 62.6 లసంక్రి, ఎల్లోస్టోన్ 6.4 లసంక్రి. (లసంక్రి: లక్షల సంవత్సరాల క్రితం) 19 వ శతాబ్దపు విస్ఫోటనాలు: టాంబోరా 1815, క్రాకటోవా 1883. 20 వ శతాబ్దపు విస్ఫోటనాలు: నోవరుప్తా 1912, సెయింట్ హెలెన్స్ 1980, పినాటుబో 1991.

చరిత్ర పూర్వం

[మార్చు]

70,000 సంవత్సరాల క్రితం ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో టోబా అగ్నిపర్వతం పేలిన తరువాత అగ్నిపర్వత శీతాకాలం ఏర్పడిందని భావిస్తున్నారు. కొంతమంది మానవ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు నమ్ముతున్న టోబా విపత్తు సిద్ధాంతం ప్రకారం, ఇది ప్రపంచ వ్యాప్తంగా విపరిణామాలను కలిగించింది. [19] ఆనాటి మానవులను చాలావరకు మరణించి, జనాభా బాటిల్‌నెక్ ఏర్పడింది. అది ఈనాటి మానవులందరి జన్యు వారసత్వాన్ని ప్రభావితం చేసింది. [20]

అంత్య-ఆర్డోవిషియన్, పెర్మియన్-ట్రయాసిక్, లేట్ డెవోనియన్ సామూహిక జీవ విలుప్తతలకూ బహుశా ఇతర విలుప్తి ఘటనలకూ అగ్నిపర్వత కార్యకలాపాలు కారణమని, లేదా ఆ ఘటనలకు దోహద పడ్డాయని భావిస్తున్నారు. గత 50 కోట్ల సంవత్సరాల్లో జరిగిన అతిపెద్ద అగ్నిపర్వత సంఘటనలలో ఒకటి, సైబీరియన్ ట్రాప్స్ భూభాగం ఏర్పడిన భారీ విస్ఫోటన సంఘటన. సుమారు 250 మిలియన్ సంవత్సరాల క్రితం "మహా విలుప్తికి" ఇది కారణమైందని భావిస్తారు, ఆ సమయంలో ఉన్న జీవజాతుల్లో 90% వరకూ అంతరించిపోయినట్లు అంచనా. [21]

చారిత్రికంగా

[మార్చు]

1815 లో టాంబోరా పర్వతం విస్ఫోటనం ప్రపంచ వ్యాప్తంగా శీతోష్ణస్థితిలో వైపరీత్యాలను కలిగించింది. ఇది ఉత్తర అమెరికా, ఐరోపా శీతోష్ణస్థితిపై చూపించిన ప్రభావానికి గాను, ఆ సంవత్సరాన్ని "వేసవి లేని సంవత్సరం " అని పిలుస్తారు. [22] పంటలు దెబ్బతిన్నాయి. ఉత్తరార్ధగోళంలో పశువులు చనిపోయాయి. దీని ఫలితంగా ఏర్పడిన కరువు 19 వ శతాబ్దంలోనే అత్యంత దుర్భరమైనది. [23]

1740–41 నాటి గడ్డకట్టించే శీతాకాలం ఉత్తర ఐరోపాలో విస్తృతమైన కరువుకు దారితీసింది. దానికు కూడా కారణం అగ్నిపర్వత విస్ఫోటనమే అయి ఉండవచ్చు. [24]

ఆమ్ల వర్షం

[మార్చు]
2010 ఏప్రిల్ 17, న ఐజాఫ్జల్లాజాకుల్ నుండి వెలువడుతున్న బూడిద మేఘాలు

సల్ఫేట్ ఏరోసోల్స్ స్ట్రాటో ఆవరణలోని క్లోరిన్, నత్రజని లను రసాయనికంగా మార్చే సంక్లిష్ట ప్రతిచర్యలను ప్రోత్సహిస్తాయి. ఇది, క్లోరోఫ్లోరోకార్బన్ కాలుష్యం వలన పెరిగిన స్ట్రాటో ఆవరణ క్లోరిన్ స్థాయిలతో కలిసి, క్లోరిన్ మోనాక్సైడ్ (ClO) ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఓజోన్ (O3) ను నాశనం చేస్తుంది. ఏరోసోల్స్ పెరుగుతున్నప్పుడు, గడ్డకట్టేటప్పుడు, అవి ఎగువ ట్రోపోస్పియర్‌లో స్థిరపడతాయి, అక్కడ అవి సిరస్ మేఘాలకు కేంద్రకాలుగా పనిచేసి, భూమి రేడియేషన్ సమతుల్యతను మరింత మారుస్తాయి.. హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ ఫ్లోరైడ్లు విస్ఫోటనం మేఘంలోని నీటి బిందువులలో కరిగి, ఆమ్ల వర్షంగా నేలమీద పడతాయి. విరజిమ్మిన బూడిద కూడా స్ట్రాటోస్ఫియరు నుండి వేగంగా కిందకు పడుతుంది; ఈ బూడిదలో చాలా వరకు కొన్ని రోజుల నుండి కొన్ని వారాల లోపు తొలగిపోతుంది. చివరగా, అగ్నిపర్వత విస్ఫోటనాలు గ్రీన్‌హౌస్ గ్యాస్ అయిన కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. తద్వారా జీవ రసాయన చక్రాలకు అవసరమైన కార్బన్ను అందిస్తుంది. [25]

అగ్నిపర్వతాల నుండి వచ్చే వాయు ఉద్గారాలు ఆమ్ల వర్షానికి సహజంగా సహాయపడతాయి. అగ్నిపర్వత కార్యకలాపాలు ప్రతి సంవత్సరం 130 నుండి 230 టెరాగ్రాముల (145 మిలియన్ నుండి 255 మిలియన్ టన్నులు ) కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. [26] అగ్నిపర్వత విస్ఫోటనాలు భూ వాతావరణంలోకి ఏరోసోల్‌లను వెదజల్లుతాయి. అవి అసాధారణమైన రంగురంగుల సూర్యాస్తమయాలకు కారణం కావచ్చు. ప్రధానంగా ప్రపంచ వాతావరణాన్ని చల్లబరుస్తాయి. అగ్నిపర్వత విస్ఫోటనాలు అగ్నిపర్వత శిలలను శిథిలం చేసి, తద్వారా మట్టికి పోషకాలను చేరుస్తాయి. ఈ సారవంతమైన నేలలు మొక్కలు, వివిధ పంటల పెరుగుదలకు సహాయపడతాయి. అగ్నిపర్వత విస్ఫోటనాలు కొత్త ద్వీపాలను సృష్టించగలవు కూడా. ఎందుకంటే శిలాద్రవం నీటిని తాకగానే చల్లబడి ఘనీభవిస్తుంది.

గండాలు

[మార్చు]

విస్ఫోటనంలో గాలిలోకి విరజిమ్మబడిన బూడిద ముఖ్యంగా జెట్ విమానాలకు ప్రమాదం కలిగించగలదు. జెట్ ఇంజన్లు పనిచేసే అధిక ఉష్ణోగ్రతల వలన బూడిద కణాలు కరిగి, అవి టర్బైన్ బ్లేడ్‌లకు అతుక్కుని, ఆ బ్లేళ్ళ ఆకారం మారిపోతుంది. టర్బైన్ ఆపరేషన్‌కు అంతరాయం కలుగుతుంది. 1982 లో ఇండోనేషియాలో గలుంగ్‌గుంగ్ విస్ఫోటనం తరువాత, 1989 లో అలస్కాలో మౌంట్ రెడౌబ్ట్ విస్ఫోటనం తరువాత, జరిగిన ప్రమాదకరమైన అనుభవాలతో ఈ దృగ్విషయం గురించి అవగాహన పెరిగింది. బూడిద మేఘాలను పర్యవేక్షించడానికి, తదనుగుణంగా పైలట్లకు సలహా ఇవ్వడానికి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ తొమ్మిది అగ్నిపర్వత యాష్ సలహా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 2010 లో ఐజాఫ్జల్లాజాకుల్ విస్ఫోటనం చెందినపుడు ఐరోపాలో విమాన ప్రయాణానికి పెద్ద అంతరాయం కలిగింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. NSTA Press / Archive.Org (2007). "Earthquakes, Volcanoes, and Tsunamis" (PDF). Resources for Environmental Literacy. Archived from the original (PDF) on 2012-09-13. Retrieved April 22, 2014.
  2. 2.0 2.1 Foulger, Gillian R. (2010). Plates vs. Plumes: A Geological Controversy. Wiley-Blackwell. ISBN 978-1-4051-6148-0.
  3. Wood, C.A. (1979). "Cindercones on Earth, Moon and Mars". Lunar and Planetary Science. X: 1370–1372. Bibcode:1979LPI....10.1370W.
  4. Meresse, S.; Costard, F.O.; Mangold, N.; Masson, P.; Neukum, G. (2008). "Formation and evolution of the chaotic terrains by subsidence and magmatism: Hydraotes Chaos, Mars". Icarus. 194 (2): 487. Bibcode:2008Icar..194..487M. doi:10.1016/j.icarus.2007.10.023.
  5. Brož, P.; Hauber, E. (2012). "A unique volcanic field in Tharsis, Mars: Pyroclastic cones as evidence for explosive eruptions". Icarus. 218 (1): 88. Bibcode:2012Icar..218...88B. doi:10.1016/j.icarus.2011.11.030.
  6. Lawrence, S.J.; Stopar, J.D.; Hawke, B.R.; Greenhagen, B.T.; Cahill, J.T.S.; Bandfield, J.L.; Jolliff, B.L.; Denevi, B.W.; Robinson, M.S. (2013). "LRO observations of morphology and surface roughness of volcanic cones and lobate lava flows in the Marius Hills". Journal of Geophysical Research: Planets. 118 (4): 615. Bibcode:2013JGRE..118..615L. doi:10.1002/jgre.20060.
  7. Lockwood, John P.; Hazlett, Richard W. (2010). Volcanoes: Global Perspectives. p. 552. ISBN 978-1-4051-6250-0.
  8. Berger, Melvin, Gilda Berger, and Higgins Bond. "Volcanoes-why and how ." Why do volcanoes blow their tops?: Questions and answers about volcanoes and earthquakes. New York: Scholastic, 1999. 7. Print.
  9. Ashley Strickland (10 Jan 2020). "Origin of mystery humming noises heard around the world, uncovered" (in ఇంగ్లీష్).
  10. 10.0 10.1 10.2 Decker, Robert Wayne; Decker, Barbara (1991). Mountains of Fire: The Nature of Volcanoes. Cambridge University Press. p. 7. ISBN 978-0-521-31290-5.
  11. Tilling, Robert I. (1997). "Volcano environments". Volcanoes. Denver, Colorado: U.S. Department of the Interior, U.S. Geological Survey. Retrieved August 16, 2012. There are more than 500 active volcanoes (those that have erupted at least once within recorded history) in the world
  12. "The most active volcanoes in the world". VolcanoDiscovery.com. Retrieved August 3, 2013.
  13. "The World's Five Most Active Volcanoes". livescience.com. Retrieved August 4, 2013.
  14. Nelson, Stephen A. (4 October 2016). "Volcanic Hazards & Prediction of Volcanic Eruptions". Tulane University. Retrieved 5 September 2018.
  15. "How is a volcano defined as being active, dormant, or extinct?". Volcano World. Oregon State University. Archived from the original on January 12, 2013. Retrieved September 5, 2018.
  16. Chesner, C.A.; Rose, J.A.; Deino, W.I.; Drake, R.; Westgate, A. (March 1991). "Eruptive History of Earth's Largest Quaternary caldera (Toba, Indonesia) Clarified" (PDF). Geology. 19 (3): 200–203. Bibcode:1991Geo....19..200C. doi:10.1130/0091-7613(1991)019<0200:EHOESL>2.3.CO;2. Archived from the original (PDF) on 2017-03-29. Retrieved January 20, 2010.
  17. Pedone, M.; Aiuppa, A.; Giudice, G.; Grassa, F.; Francofonte, V.; Bergsson, B.; Ilyinskaya, E. (2014). "Tunable diode laser measurements of hydrothermal/volcanic CO2 and implications for the global CO2 budget". Solid Earth. 5 (2): 1209–1221. Bibcode:2014SolE....5.1209P. doi:10.5194/se-5-1209-2014.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  18. Miles, M.G.; Grainger, R.G.; Highwood, E.J. (2004). "The significance of volcanic eruption strength and frequency for climate" (PDF). Quarterly Journal of the Royal Meteorological Society. 130 (602): 2361–2376. Bibcode:2004QJRMS.130.2361M. doi:10.1256/qj.03.60.
  19. "The new batch – 150,000 years ago". BBC. Archived from the original on 2006-03-26.
  20. "When humans faced extinction". BBC. June 9, 2003. Retrieved January 5, 2007.
  21. Benton, Michael J. (2005). When Life Nearly Died: The Greatest Mass Extinction of All Time. Thames & Hudson. ISBN 978-0-500-28573-2.
  22. Volcanoes in human history: the far-reaching effects of major eruptions. Jelle Zeilinga de Boer, Donald Theodore Sanders (2002). Princeton University Press. p. 155. ISBN 0-691-05081-3
  23. Oppenheimer, Clive (2003). "Climatic, environmental and human consequences of the largest known historic eruption: Tambora volcano (Indonesia) 1815". Progress in Physical Geography. 27 (2): 230–259. doi:10.1191/0309133303pp379ra.
  24. "Famine: A Short History". Princeton University Press. February 6, 2009. Archived from the original on 2016-01-12. Retrieved 2020-02-21.
  25. "Impacts of Volcanic Gases on Climate, the Environment, and People". United States Geological Survey. May 1997.  This article incorporates text from this source, which is in the public domain.
  26. "Volcanic Gases and Their Effects". U.S. Geological Survey. Archived from the original on 2013-08-01. Retrieved June 16, 2007.