ఎస్సీ వర్గీకరణ
షెడ్యూల్డ్ కులాల కోటాను కులాల వారీగా వర్గీకరించడాన్ని ఎస్సీ వర్గీకరణగా పేర్కొంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంది)లో ఎస్సీ వర్గీకరణ అంశం సంవత్సరాలుగా నలిగింది. రాష్ట్రం విడిపోయాకా సమస్య రెండు రాష్ట్రాల్లోనూ తెరపైకి వస్తూనేవుంది. షెడ్యూల్డ్ కులాల కోటాలో ఉద్యోగాలు, అవకాశాలు మాల కులస్తులకే ఎక్కువగా లభిస్తున్నాయని, సమన్యాయం కోసం షెడ్యూల్డ్ కులాల కోటాను దామాషా ప్రకారం వర్గీకరించాలని మాదిగ కులస్తులు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం సామాజికంగానే కాక న్యాయపరంగానూ, రాజకీయంగానూ కూడా నలిగిన అంశం.
నేపథ్యం
[మార్చు]ప్రధాన వ్యాసం:షెడ్యూల్డ్ కులాలు
భారత రాజ్యాంగం దళితులను, ఆదివాసీలను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించి సమాన అవకాశాలు అందించే లక్ష్యంతో రిజర్వేషన్లను ఏర్పరిచింది. మాల,మాదిగ సహా దాదాపుగా 61 మంది కులాలు, ఉపకులాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల్లో (అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) షెడ్యూల్డ్ కులాల్లో సంఖ్యాపరంగా మాల కులస్తులు, మాదిగ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. 2001 భారత ప్రభుత్వం నిర్వహించిన జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని షెడ్యూల్డ్ కులస్తుల్లో 49.2 శాతం మంది మాదిగ కులస్తులు, 41.6 శాతం మాల కులస్తులు ఉన్నారు.[1] ప్రధానమైన పై రెండు సామాజిక వర్గాలూ సామాజికంగా తీవ్రమైన అణచివేతను అనుభవించాయి. భారత రాజ్యాంగంలో సామాజికమైన గౌరవాన్ని కల్పించడానికి, విద్య, ఉద్యోగం, అధికారం అవసరమని భావించిన రాజ్యాంగ నిర్మాతలు ఆ అవకాశం కల్పించేందుకు రిజర్వేషన్లను ఏర్పరిచారు. షెడ్యూల్డ్ కులాల్లో మాల కులస్తులకే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు, అవకాశాలు లభిస్తున్నాయని ఇతర షెడ్యూల్డ్ కులాల వారు, ప్రధానంగా మాదిగ కులస్తులు ఆరోపించారు. అందరికీ సమానంగా అవకాశాలు లభించాలంటే షెడ్యూల్డ్ కులాల కోటాను కులాల వారిగా వర్గీకరించి ఎవరి కోటాను వారికే కేటాయించాలని ఆందోళన ప్రారంభించారు.[2]
ఉద్యమం
[మార్చు]ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం షెడ్యూల్డ్ కులాలకున్న 15 శాతం రిజర్వేషన్ ను వర్గీకరించి అప్పటి 59 కులాలకు దామాషా ప్రకారం పంచిపెట్టాలన్నది ఎస్సీ వర్గీకరణ డిమాండ్. దీన్ని 1972 నుంచి మాదిగ కులస్తులు ఏదోక రూపంలో చేస్తూవచ్చారు. పలువురు మాదిగ కులస్తులైన ప్రజాప్రతినిధులు అప్పటి ముఖ్యమంత్రులకు విజ్ఞప్తులు, వినతులు అందించారు. 1994లో ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా జులై 7 న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం.ఆర్.పి.ఎస్.) ఏర్పడింది. రాడికల్ గా పూర్వజీవితం గడిపిన మంద కృష్ణ మాదిగ దీని వ్యవస్థాపక అధ్యక్షులు, వామపక్ష ఉద్యమాలతో సంబంధం ఉన్న కృపాకర్ కార్యదర్శిగా వ్యవహరించారు. 1990 దశకంలో ఉద్యమం ప్రాచుర్యాన్ని సాధించుకుంది. లక్ష్యం తేలికగా వివరించేదిగా ఉండడం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయా కులస్తులు నివసిస్తూండడం, సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నా ఒకేసారి ఉద్యమరూపం దాల్చడం వంటివి దీనికి అనుకూలతలయ్యాయని మానవహక్కుల ఉద్యమకారుడు కె.బాలగోపాల్ పేర్కొన్నారు. ఐతే సరళంగా వివరించగల ఉద్యమ లక్ష్యాన్ని ప్రజలకు చేరవేయడంలో సంక్లిష్టమైన పద్ధతులు పాటించడం కొంత ఇబ్బందికరమైందని ఆయన భావించారు.[2]
వ్యతిరేకత
[మార్చు]ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మాల మహానాడు కౌంటర్ ఉద్యమం ప్రారంభించింది. ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న పి.వి.రావు మాల మహానాడును ప్రారంభించారు. వ్యతిరేకిస్తూ చేసిన వాదన ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని షెడ్యూల్డ్ కులాల అసమానత కులపరమైనది కాక ప్రాంతపరమైనదని పేర్కొన్నారు. ప్రధానంగా మాల కులస్తులు కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగానూ, రాయలసీమ, తెలంగాణాల్లో మాదిగ కులస్తులు ఎక్కువమందీ ఉండడం దీనికి ప్రధానకారణమని, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని ఆర్థికాభివృద్ధి వల్ల ఆ ప్రాంతపు కులస్తులకు అవకాశాలు ఎక్కువ లభించినాయని దీనికి వర్గీకరణ సరైన పరిష్కారం కాదని ప్రధానమైన వాదన. దీనికి సమర్థనగా రెండు సామాజిక వర్గాల కన్నా వెనుకబడిన రెల్లి కులస్తులు ప్రధానంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లో జీవిస్తూండడం, పారిశ్రామిక నగరమైన విశాఖపట్టణంలో వారి ఉనికి తక్కువే కావడం కూడా చూపించారు. అలానే కులపరంగా షెడ్యూల్డ్ కులాల మధ్య సామాజిక అంతరాలున్నాయన్న వాదననూ తోసిపుచ్చారు.[2]
రామచంద్రరాజు కమిషన్
[మార్చు]ఎస్సీ వర్గీకరణ అనుకూల ఉద్యమకారులు పలు పార్టీల నాయకులను కలిసి వారికి దీన్ని గురించి వివరించారు. అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ డిమాండుకు అనుకూలంగా తీర్మానం జరిగింది. వీటి నేపథ్యంలో ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల నడుమ సామాజిక అసమానతలను విచారించేందుకు రామచంద్రరాజు కమిషన్ అన్న జ్యుడీషియల్ కమిషనన్ ను సెప్టెంబరు 10, 1996న ఏర్పాటుచేసింది. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ కు అనుకూలంగా మే 1997లో రామచంద్రరాజు కమిషన్ తన నివేదికను సమర్పించింది. జూన్ 6, 1997న ప్రభుత్వం జీవో ద్వారా షెడ్యూల్డ్ కులాల కోటాను వర్గీకరించింది. ఈ వర్గీకరణలో భాగంగా ఎస్సీలను ఎ,బి,సి,డి గ్రూపులుగా వర్గీకరించారు. ఎ గ్రూపులో రెల్లి సహా 12 కులాలు ఉంటాయి. వీరికి ఒక శాతం రిజర్వేషన్ ను, రోస్టర్ స్లాట్లలో ముందుగా అవకాశాన్ని ఇచ్చారు. బి గ్రూపులో మాదిగ, సంబంధిత 18 కులాలు చేర్చారు. సి గ్రూపులో మాల కులస్తులతో పాటుగా మరో 24 కులాలను చేర్చారు, డి గ్రూపులో ఆది ఆంధ్ర వగైరా కులాలు ఉంటాయి.[2]
1997 హైకోర్టు తీర్పు
[మార్చు]మాల మహానాడు ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు వేసింది. సెప్టెంబర్ 18, 1997న ఆంధ్రప్రదశ్ హైకోర్టు ఫుల్ బెంచీ ఈ జీవో ప్రభుత్వ పరిధికి మించినదనీ, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ జీవోను నిలుపుదల చేస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వం జీవో విషయంలో కేంద్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను సంప్రదించకపోవడం, షెడ్యూల్డ్ కులాల్లో వెనుకబడ్డవి, అత్యంత వెనుకబడ్డవి వగైరా విభజన చేశారనీ, షెడ్యూల్డ్ కులాల్లో మార్పుచేర్పులు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరమనీ పలు కారణాలను పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పు తదనంతరం ఇరు సామాజిక వర్గాల మధ్య భౌతిక దాడులతో కూడిన గొడవలు కొన్నిచోట్ల జరిగాయి. అక్టోబరు 1997 మొదటివారంలో ప్రధానంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఈ గొడవల్లో చింతలచెరువు గ్రామంలో ఒక యువకుడు మరణించగా, మిగిలిన కొట్లాటలు ప్రాణాంతకమైనవి కావు. ఐతే అదృష్టవశాత్తూ భౌతిక దాడులు కొద్దిరోజుల్లో ఆగిపోయి శాంతిభద్రతలు నెలకొన్నాయి.[2]
హైకోర్టు తీర్పు తదనంతర పరిణామాలు
[మార్చు]హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేసింది. ఐతే జీవో జారీచేయడానికి ముందుగా కేంద్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సలహా తీసుకోలేదన్న అభ్యంతరాన్ని తొలగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ సలహా కోరింది. అంశం అత్యున్నత న్యాయస్థానం పరిశీలనలో ఉన్నందున తాము సలహా ఇవ్వలేమని కమిషన్ నిరాకరించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో వేసిన కేసు ఉపసంహరించుకుని, కమిషన్ సలహా కోసం అభ్యర్థించింది. ఈ సారి కమిషన్ ఈ విషయమై సలహా ఇచ్చేందుకు మరికొంత సమాచారం కావాలన్నది.
మూలాలు
[మార్చు]- ↑ "Tables on Individual Scheduled Castes (SC) and Scheduled Tribes (ST),2001" (PDF).
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 బాలగోపాల్, కె. (1 January 2000). "A Tangled Web: Subdivision of SC Reservations in AP". Economic and Political Weekly. 35 (13): 1075–1081. Retrieved 22 May 2016.