కౌలాస్ కోట
Kaulas Fort | |
---|---|
Telangana లో భాగం | |
Kowlas Near Kamareddy in India | |
భౌగోళిక స్థితి | 18°19′26″N 77°41′51″E / 18.32386°N 77.69757°E |
స్థల చరిత్ర | |
కట్టిన సంవత్సరం | 9th century CE |
కట్టించింది | Rashtrakutas |
కౌలస్ కోట, హైదరాబాదు నుండి 180 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి - నాందేడ్ రహదారిపై ఉంది.
కైలాస గిరిదుర్గాన్ని 12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. 1323లో యువరాజు అలాఫ్ ఖాన్ (తర్వాత కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్గా రాజయ్యాడు) ఈ కోటను జయించిన ప్రస్తావన ఉంది. ఆయన తండ్రి ఘాజీ బేగ్ తుగ్లక్ ఇటీవలే రాజ్యంలో చేరిన వరంగల్ ప్రాంతంలో తిరుగుబాట్లు అణచివేయటానికి పంపించాడు. సేనలలో కలరా వ్యాపించడంతో తొలి ప్రయత్నం సఫలం కాలేదు. మలి ప్రయత్నంలో బీదరు,.కౌలాస్లను ఆ తర్వాత వరంగల్లును చేజిక్కించుకున్నాడు. బహుమనీల పాలనలో కౌలాస్ కోట సరిహద్దు కోటగా, గట్టి బలగంలో రక్షింపబడుతూ ప్రముఖ పాత్ర పోషించింది.[1] పాక్షిక ద్రావిడ శైలిలో నిర్మించిన ఈ కోట నైఋతి బాలాఘాట్ కొండల్లో వెయ్యి అడుగుల ఎత్తులో కౌలాన్‌నాలా ఒదిగిన ఒక కొండపై ఉంది. చుట్టూ దట్టమైన అడవి, క్రింద నది ఉండటంతో ఇక్కడి ప్రకృతిదృశ్యం అమెజాన్ అడవిని తలపిస్తుంది. కౌలాస్ కోటకు 57 బురుజులున్నాయి. కోట లోపల అనేక ఆలయాలు, దర్గాలు ఉన్నాయి. కోట ద్వారాలపై చెక్కిన అలంకరణలు, హృద్యంగా చెక్కబడిన హిందూ దేవతాశిల్పాలు కోట యొక్క ఆకర్షణలు.కోటకు రెండు ప్రవేశాలున్నాయి. రెండింటికీ స్వాగతతోరణాలున్నాయి. వీటిపై గండభేరుండం వంటి కాకతీయ రాజచిహ్నాలను చూడవచ్చు. 1687లో ఔరంగబేజు, అబుల్ హసన్ తానీషాను ఓడించి, గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకొన్నప్పుడు, కౌలాస్ కోట బాధ్యతను ఇక్లాస్ ఖాన్, ఖూనీ ఖాన్ అనే ఇద్దరు ఖిల్లాదార్లకు అప్పగించాడు. వీరిద్దరు ఇక్కడ తమ పేర్లతో పెద్ద మసీదులను కట్టించారు.[2]
అండాకారంలో ఉన్న కోటకు మూడు ప్రకారాలతో మూడంచెల రక్షణ వ్యవస్థ ఉంది. కోట బురుజులలో మల్లికా, హుస్సేన్, నవ్‌గజీ, కడీ కా బుర్జ్ ముఖ్యమైనవి. ఇక్కడి నుండి సుదూరదృశ్య వీక్షణం వీలౌతుంది. కోటలోని ఆలయాల్లో 1813లో రాణీ సోనేకువార్ బాయి కట్టించిన రాజపుఠానా శైలి రామమందిరం కూడా ఉంది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని పోలి రాజపుత్ర రాజులు కట్టించిన కాశీకుండ్ ఆలయంలో సహజసిద్ధమైన నీటి ఊట ఉంది. కోటలో ఇవేకాకుండా మరో మూడు (రామ, హనుమ, బాలాజీ) ఆలయాలున్నాయి. కోట వెనుక భాగంలో అష్టభుజి మాత లేదా జగదాంబ ఆలయం ఉంది. రాజపుత్ర రాజులకు యుద్ధానికి వెళ్ళేముందు ఇక్కడ ప్రార్థించేవారు. కోటలో 16-17వ శతాబ్దానికి చెందిన రెండు మసీదులు (ఇక్లాస్ ఖాన్ మసీదు, ఖూనీ ఖాన్ మసీదు), ఒక దర్గా (షా జియా-ఉల్-హఖ్ దర్గా), బెహ్లూల్ షా వలీ సమాధి మందిరం కూడా ఉన్నాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో కోటలో పది ఫిరంగులుండేవి. అయితే వాటిని నాందేడ్, మద్నూర్, బిచ్కుంద పోలీసు స్టేషన్లకు తరలించబడినవి. మిగిలిన నాలుగు ఫిరంగుల్లో, 27 అడుగుల పొడవున్న నవగజీ తోప్ అద్భుతమైన లోహనైపుణ్యానికి ప్రతీక. 500 మీటర్ల మేరకు విస్తరించి ఉన్న తామరపూల చెరువు మరో ఆకర్షణ.