Jump to content

ఘనపురం ఖిల్లా

వికీపీడియా నుండి
ఘనపురం కోట గుళ్ళు

ఘనపురం ఖిల్లా అను చారిత్రత్మక ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, వనపర్తి పట్టణాలకు మధ్యలో 25 కిలోమీటర్ల సమదూరంలో ఉంది[1]. ఈ ప్రదేశం హైదరాబాద్ నగరానికి దక్షిణాన 111 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వనపర్తి జిల్లాలోని గిరిదుర్గాలలో ఒకటి. ఇది ఘన్‌పూర్ మండలం, ఘన్‌పూర్ గ్రామంలో ఉంది. కాకతీయుల సామంతులు నిర్మించిన ఈ కోట ఎత్తైన రెండు కొండల మీద నిర్మించబడి చూపరులను ఆకట్టుకుంటుంది.

కోట చరిత్ర

[మార్చు]

ఘనపూర్ ప్రాంతాన్ని ఇప్పటికి 800 ఏళ్ళ క్రితం కాకతీయుల సామంతులు పాలించినట్లు తెలుస్తుంది. వారిలో గోన బుద్దారెడ్డి కుమారుడు గోన గణపరెడ్డి ఒకరు. ఇతను ఘనపురం గ్రామంలో గణపతీశ్వరాలయం నిర్మించాడు. ఇక్కడ గణపతీశ్వరాలయం ఉండటం, ఈ ప్రాంతాన్ని గణపరెడ్డి పాలించడం వలన ఈ గ్రామానికి గణపురం అని పేరు వచ్చింది[2]. ఇతను నాగర్‌కర్నూల్ తాలుకాలోని వర్ధమానపురం నుండి కాకతీ కందూర్ వరకు ఉన్న ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈ ప్రాంతానికి కేంద్రంగా ఉండాలన్న ఉద్దేశంతో గణపురం గ్రామంలో కోటను నిర్మించాడు. ఇక్కడి నుండి పాలన సాగించాడు. ఈ కోట కారణంగా గణపురానికి ఖిల్లాఘనపురం అను పేరు స్థిరపడిపోయింది.

ఖిల్లా గణపురాన్ని రేచర్ల పద్మనాయకులు, మాల్యాల, గోన వంశస్థులు 13వ శతాబ్దంలో పరిపాలించారు.వీరు కాకతీయుల ప్రభువుల వద్ద సామంత రాజులు.కాకతీయుల కాలం నాటి కోట, ఒక చెరువు (గణపసముద్రంగా ప్రసిద్ధి) ఈ ప్రదేశంలో గలదు.రాణి రుద్రమదేవి కాలంలో గణపసముద్రాన్ని ఇక్కడి సామంత రాజు మాల్యల గుండదండధీశుడు కట్టించారు. ఇతను మాల్యాల గుండన్న అను పేరుతో మిక్కిలి ప్రసిద్ధి.[3] రంగనాథ రామయణం రచించిన ప్రముఖ తెలుగు కవి, రాజు అయినట్టి గోన బుద్ధారెడ్డి కుమార్తెను ఇతను వివాహామాడినారు.

గోన, మాల్యాల రాజులు కాకతీయ ప్రభువులకు కట్టుబడి ఉండేవారు.వర్ధమానపురం రాజు గోనా బుద్ధారెడ్డికి నలుగురు సంతానం (ముగ్గురు పుత్రులు, ఒక పుత్రిక).పుత్రులు గోన గణపరెడ్డి (ఇతను గోన గన్నారెడ్డిగా ప్రసిద్ధి), కాచ రెడ్డి, విఠలనాథుడు. పుత్రిక కుప్పాంబిక. మాల్యాల వంశ రాజు గుండన్నను కుప్పంబిక వివాహామాడినారు. కాచ రెడ్డి, విఠలనాథులిద్దరు కవులు. వీరు రంగనాథ రామాయణం ఉత్తర కాండను పూర్తి చేసారు.

గోన బుద్ధారెడ్డి మరణానంతరం అతని సోదరుడు గోన లకుమారెడ్డి రాజ్యం ఏలా సాగాడు.బుద్ధారెడ్డి మరణించినప్పుడు అతని కుమారులు పిన్న వయస్కులు. లకుమా రెడ్డి కాకతీయ ప్రభులవులకు కట్టుబడి ఉండేవాడు కాదు. ఇది గమనించిన గోన గన్నారెడ్డి తన చిన్నాన్నపై తిరుగుబాటు చేసి తిరిగి వర్ధమానపురాన్ని ఏలినాడు.ఈ తిరుగుబాటు క్రమంలో చాలా యేండ్లు అజ్ఞాతంలో ఉన్నాడు.పలు యుద్ధాల్లో కాకతీయ ప్రభువులకు అండగా ఉన్నాడు.[4] గోన గన్నారెడ్డి అనంతరం అతడి బావ మాల్యాల గుండన్న వర్ధమానపురాన్ని పరిపాలించాడు.కాకతీయుల కాలంలో పలు గొలుసుకట్టు చెఱువులను మాల్యల గుండన్న కట్టించాడు.ఈ గణపురంలో ఉన్న గణపసముద్రం గుండన్న కాలం నాటిదే.

బుద్ధాపురం (ప్రస్తుత భూత్పూర్), వర్ధమానపురం (నంది వడ్డేమాన్, బిజినపల్లి) ప్రాంతాల్ని మాల్యాల రాజులు ఏలినారు[5]. గణపతిదేవుడు, రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుని కాలంలో మాల్యాల రాజులు పలు యుద్ధాల్లో కాకతీయుల పక్షాన పోరాడినారు. మాల్యాల గుండన్న మరణానంతరం అతని భార్య కుప్పాంబిక భూత్పూర్లో బుద్ధేశ్వర ఆలయాన్ని నిర్మించింది.

కోట నిర్మాణం

[మార్చు]

ఘణపురం గ్రామం చుట్టు ప్రక్కల తొమ్మిది గుట్టలు ఉన్నాయి. వాటికి దేవుని గుట్ట, మనిషి కొండయ్య గుట్ట, వీరన్నగుట్ట, బంగారు గూడు, వెంకయ్యగుట్ట, చౌడమ్మగుట్ట, చంద్రగుట్ట, ముర్రయ్యగుట్ట, దుర్గంగుట్ట అని పేర్లు ఉన్నాయి. వీటిలో గ్రామానికి ఈశాన్యంలో ఉన్న ముర్రయ్యగుట్ట, దుర్గంగుట్టలు ఎత్తుగా ఉన్నాయి. ఈ రెండు గుట్టలను కలుపుతూనే గణపరెడ్డి కోటను నిర్మింపచేశాడు. ఈ కోటలో రాజమందిరం, మంత్రుల నివాసాలు, సైనికుల స్థావరాలు ఉన్నట్లు అక్కడి ఆధారాల ద్వారా తెలుస్తుంది. కోటలోకి ప్రవేశించడానికి వరుసగా మూడు ముఖద్వారాలు ఉన్నాయి. ప్రతి ముఖద్వారం దగ్గర కాపలా కాసే సైనికులకు గదులు నిర్మించారు. అక్కడే అతిథులు ఎవరైనా వస్తే విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి గదులు ఉండేవని తెలుస్తుంది.

ఘనపురంలో రెండు పర్వతాలను కలుపుతు కట్టిన గిరిదుర్గం ఉంది.ఈ గిరిదుర్గాన్ని సా.శ.13వ శతాబ్దంలో మల్యాల కమ్మ రాజులు కట్టించారు.బహమనీలు, విజయనగర సామ్రాజ్యపు రాజులు, బీజపూర్ రాజులు, కుతుబ్ షాహీ రాజుల మధ్య ఎన్నో యుద్ధలకు సాక్షిభూతంగాగా నిలించింది ఈ ఘనపురం ఖిల్లా[6]. ఆ కాలం నాటి ఫిరంగులు ఇప్పటికి ఈ గిరిదుర్గం పై దర్శనం ఇస్తాయి. ఈ కోట గోడ శిథిలాలు, రాజమహల్ ఆనవాళ్ళూ శతాబ్దాలు గడిచినా ఆ కోటపై మిగిలిపోయాయి.

ఈ గిరిదుర్గం నుండి రెండు రహస్య సొరంగమార్గాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఒక సొరంగ మార్గం పర్వతం క్రిందనున్న గ్రామానికి కలుపుతూ ఉండగా రెండో సొరంగ మార్గం పానుగల్లు కోటకు కలుపుతుందని సమాచారం.

ఈ గ్రామానికి కాకతీయ ప్రభువు గణపతిదేవుడి పేరు, తన పేరు కలిసొచ్చేటట్టుగా ఇక్కడి రాజు గోన గణపరెడ్డి "గణపురం" అని నామకరణం చేసారు. అది కాలక్రమేణా ఘనపురం, ఘణపురంగా రూపాంతరం చెందింది.ఇక్కడ ఖిల్లా ఉన్నందువల్ల ఖిల్లా ఘనపురంగా మిక్కిలి ప్రసిద్ధి చెందినది. గణపురం కన్నా ముందు ఇక్కడ నాగినెనిపల్లి అనే చిన్నగ్రామం ఉండేది.

ఈ కోట ఎత్తైన కొండలపై దాదాపు 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగియున్నది.ఇక్కడ వీరభద్ర ఆలయం, నరసింహ ఆలయం, చౌడేశ్వరిదేవి ఆలయాలు ఉన్నాయి.[7]

కోట రహస్య మార్గాలు

[మార్చు]

విపత్కర పరిస్థితులలో కోటపై శత్రువులు దాడి చేస్తే, ఎదుర్కోలేని పరిస్థితులు దాపురించినపుడు తప్పించుకోవడానికి కోటలో రెండు రహస్య మార్గాలు నిర్మించినట్లు తెలుస్తుంది. ఒకటి కోట నుండి సమీప ఘనపుర్ గ్రామంలోని ఓ చేదుడు బావికి చేరుకుంటుందని, మరొకటి పాన్‌గల్ కోట వరకు నిర్మించబడిందని ప్రచారంలో ఉంది.

కోట ఫిరంగి

[మార్చు]

శత్రువులపై దాడికి ఈ కోటలో అత్యంత ఎత్తులో ఫిరంగిని ఏర్పాటుచేశారు. దీని కొరకు ప్రత్యేకంగా సైనిక విభాగం ఉండినట్లు తెలుస్తుంది.

కోటలో ఇతర నిర్మాణాలు

[మార్చు]

కోటలోపల దొరసాని మాలె, సమావేశ మందిరాలు, దొంగల బాట, నిత్యం నీటితో ఉండే రెండు చెరువులు, తాగునీటి కొరకు పాలగుండం, నేతిగుండం అనే నీటి తొట్టెలు, మబ్బు చెలిమ మొదలగు నిర్మాణాలు నేటికీ కనిపిస్తాయి. మబ్బు చెలిమలోకి వెళ్లాలంటే 10 అడుగుల వరకు చిమ్మచీకటిలో వెళ్ళవలసి ఉంటుంది, అనంతరం సూర్యకిరణాలు కనిపిస్తాయి. అక్కడి నుండి రెండు వందల అడుగుల వరకు దిగవలసి ఉంటుంది.

అనుబంధ కోటలు

[మార్చు]

గణపురంలోని గుట్టలకు అనుసంధానంగా కాకతీయ సామంతరాజులు మట్టితో గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏడు కోటలు నిర్మించారు. వాటికి మేడికోట, బండకోట, వీరన్నకోట, ఆగారంకోట, తక్కిళ్ళకోట, వావిళ్ళకోట, బర్వనికోట అని పేర్లు ఉన్నాయి. శత్రువులు కోటలలోకి ప్రవేశించకుండా వాటి చుట్టు కందకాలు తవ్వింఛారు. వాటిని నిత్యం నీటితో నింపి వాటిలో మొసళ్ళను పెంచేవారని తెలుస్తుంది.

గణ సముద్రం

[మార్చు]

గ్రామానికి సంబంధించిన కోటలకు సమీపాన నాటి రాజులు ఒక పెద్ద చెరువును నిర్మించారు. దీనికే గణసముద్రం అని పేరు.

చారిత్రక సంఘటనలకు సాక్షి

[మార్చు]

కాకతీయ వీరవనిత రాణి రుద్రమదేవి పాలనానంతరం కాకతీయ సింహాసనాన్ని ప్రతాపరుద్రుడు అధిష్టించాడు. ఇతను ఘనపురం రాజైన గణపరెడ్డి కుమారుడు గోన గన్నారెడ్డిని భూత్‌పూర్ యుద్ధంలో ఓడించి, అతని కుమారైను ఈ కోటలోనే వివాహామాడినట్లు చరిత్ర చెబుతుంది. ఈ వివరాలు వరంగల్లో వెయ్యి స్తంభాల గుడిలోని ఓ శిలాశాసనంలో పేర్కొనబడినవని చెబుతారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యం కూడా కోటకు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి[8].

విహారయాత్ర,కోట , సరస్సులు

[మార్చు]

ఈ కోటలో చిన్న చిన్న సరస్సులు, మబ్బు చెలిమలు ఉన్నాయి. కాలినడకన వచ్చి చేసే విహారయాత్రలకు ఇది చాలా అనుకూలమైన ప్రదేశం.

ప్రసిద్ధికెక్కిన వ్యక్తులు

[మార్చు]
  • మాల్యాల గుండదండధీశుడు - పదమూడవ శతాబ్దం
  • గోన గన్నారెడ్డి - పదమూడవ శతాబ్దం
  • కవయిత్రి కుప్పాంబిక - పదమూడవ శతాబ్దం

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://templesinindiainfo.com/khilla-ghanpur-fort-in-mahabubnagar/
  2. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 57
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-05-21. Retrieved 2018-06-22.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-05. Retrieved 2018-06-22.
  5. http://www.indiamapia.com/Mahbubnagar/Vaddeman.html
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-01-29. Retrieved 2022-01-29.
  7. Namasthe Telangana (28 August 2021). "పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఖిల్లా ఘనపురం కోట". Archived from the original on 28 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.
  8. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 58

వెలుపలి లంకెలు

[మార్చు]