గొంతెమ్మ గుట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొంతెమ్మ గుట్ట

గొంతెమ్మ గుట్ట జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం ప్రతాపగిరి, చిద్నేపల్లి గ్రామాల సరిహద్దులో ఉన్న గుట్ట.[1] ఇది ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యమున్న ప్రదేశం.

గొంతెమ్మ గుట్ట కోట గోడలు

స్థల చరిత్ర[మార్చు]

ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, కుంతీదేవి ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించారని, వరాలు పొందడంకోసం కుంతీ ఇక్కడ తపస్సు చేసినదని చరిత్ర చెబుతుంది. గుట్టపై ఉన్న కోట గోడలకు కొద్దిదూరంలో ఒక గుహలాంటి ప్రదేశం ఉంది. అందులో ఉన్న శివలింగాన్ని పాండవుల తల్లి కుంతీదేవి పూజించినట్లు స్థానికులు చెబుతున్నారు. శివలింగం ఎదురుగా రెండు పాద ముద్రలు ఉన్నాయి. వీటిని శ్రీ కృష్ణుడి పాదముద్రలుగా పిలుస్తుంటారు.

కోట నిర్మాణాలు[మార్చు]

14వ శతాబ్దంలో మొఘల్ సైన్యాల దండయాత్రలతో పోరాటం చేసేందుకుగాను కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ గుట్టను తన సైనిక స్థావరంగా ఉపయోగించుకున్నాడు. దానికి ఆనవాలుగా ఈ గుట్టమీద ఒకటిన్నర కిలోమీటర్ల పొడవులో పెద్దపెద్ద రాళ్లతో మూడంచెల కోట గోడల నిర్మాణాలు ఉన్నాయి. ఈ గుట్టకు సమీపంలోని ప్రతాపగిరి గుట్టపైన కూడా కోటలాంటి నిర్మాణాలు ఉన్నాయి.

మూడంచెలలో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ అత్యంత పటిష్టమైన రాతికోట గోడలు, సైనికులు పహారా కాసేందుకు నలువైపులా బురుజుల వంటి నిర్మాణాలను చూస్తే శత్రువుల దండయాత్రల నుంచి రక్షణ కోసం శత్రు దుర్భేద్యమైన రక్షణా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తున్నది. అలాగే కొండ పైభాగంలో ఒకటవ కోటగోడకి, రెండవ కోటగోడకి మధ్యభాగంలో నీటి నిల్వకోసం చెక్ డ్యాం వంటి నిర్మాణం ఉంది. కొండ పైభాగం నుంచి జాలు వారే వాన నీరు వృథా కాకుండా నిల్వ చేయడానికి ఈ నిర్మాణం చేసినట్లు తెలుస్తుంది.

కుంతీదేవి కొలను[మార్చు]

కొండ పైభాగంలో ఉన్న కొలనును కుంతీదేవి కొలను అంటారు. ఇందులో అన్ని కాలాల్లో నీరు ఉంటుంది. ఈ నీటిని తీసుకొని వెళ్లి పంటలపై చల్లితే పంటలకు తెగుళ్లు సోకకుండా మంచి పంట దిగుబడి వస్తున్నదని సమీప గ్రామాల రైతుల నమ్మకం. ప్రతీ సంవత్సరం కొలనులోని నీటిని తీసుకొని వెళ్లి పంటలపై చల్లుతారు.

ప్రయాణ మార్గాలు[మార్చు]

దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశానికి వెళ్లడానికి ముందుగా భూపాలపల్లికి వెళ్లి, అక్కడినుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాటారం మీదుగా 8 కిలోమీటర్లు ప్రయాణించి మహదేవ్‌పూర్ వెళ్లాలి. అక్కడ్నుంచి నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే ప్రతాపగిరి, దానికి మరో 4 కిలోమీటర్ల దూరంలో గొంతెమ్మ గుట్ట ఉంటుంది.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (18 February 2018). "కుంతీదేవి విడిది చేసిన.. గొంతెమ్మ గుట్ట!". అరవింద్ ఆర్య పకిడే. Archived from the original on 13 సెప్టెంబర్ 2018. Retrieved 23 February 2018. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)